ప్రకాశం జిల్లా మార్కాపురంలో నిర్వహించిన సామాజిక సాధికార సభకు హాజరైన అశేష జనవాహినిలో ఓ భాగం
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రంలో పేదవర్గాలను సంపన్నులుగా తీర్చిదిద్దేందుకు పలు సంక్షేమ పథకాలు, సంస్కరణలు చేపడుతూ వారి గుండె చప్పుడయ్యారని మంత్రి మేరుగు నాగార్జున చెప్పారు. సీఎం జగన్ అంబేడ్కర్, జ్యోతిరావు పూలే విధానాలను అనుసరిస్తూ పేదల మనసుల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారని తెలిపారు.
సోమవారం సాయంత్రం ఎమ్మెల్యే కేపీ నాగార్జున రెడ్డి అధ్యక్షతన మార్కాపురం పట్టణంలో జరిగిన సామాజిక సాధికార యాత్ర సభలో మంత్రి మాట్లాడారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, మహిళలకు సమాజంలో గౌరవం కల్పించిన నేత వైఎస్ జగన్ అని చెప్పారు. ఈ వర్గాలకు సర్పంచ్ నుంచి డిప్యూటీ సీఎం వరకూ పదవులు ఇవ్వడంతోపాటు ఆ వర్గాలు ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి సాధించేలా చర్యలు చేపట్టి సామాజిక న్యాయాన్ని చేతల్లో చూపిన దేశంలో ఏకైక సీఎం వైఎస్ జగన్ అని తెలిపారు. చంద్రబాబు దళిత, బీసీల వ్యతిరేకి అని చెప్పారు.
దళితులుగా పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా ? హైకోర్టు జడ్జిలుగా బీసీలు వద్దంటూ మాట్లాడిన వ్యక్తి అని తెలిపారు. సీఎం వైఎస్ జగన్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను అక్కున చేర్చుకున్నారని అన్నారు. వైఎస్ జగన్ సీఎం అయ్యాక సామాజిక న్యాయాన్ని నెలకొల్పారని తెలిపారు.
ఎటువంటి సిఫార్సులు, లంచాలు లేకుండానే సంక్షేమ పథకాలు అమలవుతున్నాయన్నారు. మంచి స్కూళ్లు, నాణ్యమైన విద్య, ఆరోగ్య శ్రీలో కార్పొరేట్ వైద్యశాలల్లో ఉచిత వైద్యం అందిస్తున్నారని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు జగన్‌ను గెలిపించాలని కోరారు.
రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు మంత్రి పదవులు సహా అన్ని రంగాల్లో అధిక ప్రాధాన్యతనిస్తూ ఆ వర్గాలు సాధికారత సాధించేలా సీఎం వైఎస్ జగన్ చర్యలు చేపట్టారని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ చెప్పారు. సామాజిక న్యాయం పేరు చెప్పి ఈ వర్గాలను చంద్రబాబు మోసం చేస్తే.., వైఎస్ జగన్ వారిని గుండెల్లో పెట్టుకున్నారని తెలిపారు. మార్కాపురానికి మెడికల్ కాలేజీ ఓ వరమని అన్నారు. డిసెంబరు నాటికి వెలుగొండ ప్రాజెక్టు పూర్తవుతుందన్నారు.
కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ మాట్లాడుతూ ఇక్కడికి వచ్చిన అశేష జన వాహిని మొత్తం జగనన్న సైనికులని చెప్పారు. సంక్షేమ కార్యక్రమాల అమలు ద్వారా ప్రతి ఇంట్లో జగన్ ఫొటో ఉందన్నారు. పేదల పిల్లలకు అంతర్జాతీయ స్థాయి విద్యను అందిస్తూ, వారికి అమ్మఒడి, వసతిదీవెన, విద్యాదీవెన, పుస్తకాలు, బూట్లు, బ్యాగులు ఇస్తున్నారన్నారు. ముస్లింలపై రాజద్రోహం కేసు పెట్టిన చంద్రబాబును ప్రజలు నమ్మరని అన్నారు.
నేడు పేద వర్గాల్లో ఇంటికో ఇంజినీర్, డాక్టర్ ఉన్నారంటే ఆ ఘనత దివంగత సీఎం వైఎస్సార్, ప్రస్తుత సీఎం వైఎస్ జగన్‌దేనని మాజీ మంత్రి, ఎమ్మెల్యే పార్థసారథి చెప్పారు. సీఎం వైఎస్ జగన్ తండ్రిని మించి పేదలను అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని అన్నారు. టీడీపీ ప్రభుత్వంలో సామాజిక న్యాయం లేదని, సీఎం జగన్ ప్రభుత్వంలో అన్ని వర్గాలకు సమాన న్యాయం కల్పించారని తెలిపారు. సీఎం జగన్ 30 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చారని, ఎస్సీలకు కరెంటు సౌకర్యం కల్పించారని చెప్పారు.
రూ.1700 కోట్లతో నియోజకవర్గంలో అభివృద్ధి
వెలిగొండ ప్రాజెక్టుకు వైఎస్ రాజశేఖర్‌రెడ్డి శంకుస్థాపన చేస్తే దానిని పూర్తిచేసే బాధ్యత ఆయన కుమారుడు వైఎస్ జగన్ తీసుకున్నారని ఎమ్మెల్యే కేపీ నాగార్జునరెడ్డి చెప్పారు. నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం రూ.1,700 కోట్లు మంజూరు చేశారన్నారు. పొదిలి పెద్దచెరువు, మార్కాపురానికి సాగర్ నీటి పైపులైన్ల కోసం, చెన్నకేశవస్వామి నాలుగు గోపురాలకు రూ.3 కోట్లు ఇచ్చారని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎంపీ, వైఎస్సార్‌సీపీ రీజినల్ కోఆర్డినేటర్ విజయసాయిరెడ్డి, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, జెడ్పీ చైర్‌పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, ఎమ్మెల్సీ పోతుల సునీత, ఎమ్మెల్యే అన్నా రాంబాబు, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి, ఉడుముల శ్రీనివాసులరెడ్డి, రెడ్డి కార్పొరేషన్ చైర్మన్ చింతలచెరువు సత్యనారాయణ రెడ్డి, రాష్ట్ర మాదిగ కార్పొరేషన్ చైర్మన్ కొమ్మూరి కనకారావు మాదిగ, గ్రంథాలయ సంస్థ చైర్మన్ సుశీల పిచ్చయ్య, లిడ్‌క్యాప్ చైర్మన్ కె.రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment