సమస్యలు విన్నవించిన బాధితులకు సీఎం వైఎస్ జగన్ భరోసా..
అర్జీలు స్వీకరించి పరిష్కారానికి హామీ
ప్రకాశం, పల్నాడు జిల్లాల్లో సోమవారం జరిగిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర సందర్భంగా పలువురు అనారోగ్య బాధితులు, ప్రజలు సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని కలిసేందుకు వచ్చారు. వీరిని చూసి స్వయంగా బస్సు దిగి వచ్చిన సీఎం వారి సమస్యలను సావధానంగా విన్నారు. నేనున్నానని భరోసా ఇచ్చారు. అర్జీలు స్వీకరించి పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. తనను కలిసేందుకు వచ్చిన ప్రజలు, లబ్ధిదారులను ఆత్మీయంగా పలకరించారు. దీంతో వారంతా ముగ్ధులైపోయారు. ఆనందం వ్యక్తం చేశారు. జై జగన్ అంటూ నినదించారు. – కురిచేడు/మాచవరం / పిడుగురాళ్ల రూరల్/ వినుకొండ(నూజెండ్ల)/నరసరావుపేట రూరల్
దివ్యాంగురాలికి సీఎం ఆరోగ్యరక్ష
మా పాప పుట్టిన కొంతకాలానికి మూర్చ వ్యాధి వచ్చింది. సకాలంలో చికిత్స చేయించకపోవడంతో మతిస్థిమితం కోల్పోయింది. ఆ తర్వాత శారీరక వైకల్యమూ శాపంగా మారింది. పాపకు చికిత్స చేయించే స్థోమత లేక ఇబ్బంది పడుతున్నాం. బస్సు యాత్రలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి మా సమస్యను విన్నవించాం. ఆయన పెద్ద మనసు చూపారు. చికిత్స చేయించేందుకు సహాయం చేస్తానని హామీ ఇచ్చారు. మాపాలిట ఆపద్బాంధవుడు సీఎం జగన్. ఆయనకు జీవితాంతం రుణపడి ఉంటాం.
– నాగిశెట్టి రమాదేవి, సత్యనారాయణ, ఎన్‌ఎస్‌పీ కాలనీ, కురిచేడు, ప్రకాశం జిల్లా
అంధురాలి చదువుకు సీఎం అభయం
మా పాప చందన పుట్టుకతోనే అంధురాలు. బిడ్డకు ఇక కళ్లు రావని వైద్యులు చెప్పారు. కనీసం పాపను చదివించేందుకు ప్రభుత్వం తరఫున సాయం అందించాలని బస్సు యాత్రలో సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని కోరాం. వెంటనే స్పందించిన సీఎం పాప చదువుకు అభయమిచ్చారు. ఆయనకు జీవితాంతం రుణపడి ఉంటాం. – చిప్పగిరి పాపయ్య, రమణమ్మ, కురిచేడు, ప్రకాశం జిల్లా
జగనన్న ధైర్యమిచ్చారు
మా పాప నర్రా వర్షిణి ఆరో తరగతి చదువుతోంది. పుట్టిన 9వ నెల నుంచి తలసేమియా వ్యాధితో బాధపడుతోంది. ఇప్పటికే లక్షలాది రూపాయలు చికిత్స కోసం ఖర్చు చేశాం. ఫలితం లేకపోయింది. ప్రతినెలా రక్త మార్పిడికి రూ.10 వేలు, వైద్య పరీక్షలు, మందులకు రూ.10 వేలు మొత్తం రూ.20 వేలు ఖర్చు అవుతోంది. నా భర్త ఆటో డ్రైవర్. నేను చిన్న పాటి హోటల్ నిర్వహిస్తున్నా. మా బాధలను సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకువెళ్లేందుకు వెళ్లగా, ఆయన బస్సు వద్దకు పిలిపించుకుని మా సమస్యను విని నేనున్నానని భరోసా ఇచ్చారు. మీకు ఇబ్బందులు లేకుండా చూస్తానని ధైర్యం చెప్పారు. ఆపరేషన్ చేయించి మీ కుటుంబం సంతోషంగా ఉండేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. – నర్రా శివ లావణ్య, కళ్యాణిపురం, వినుకొండ పట్టణం, పల్నాడు జిల్లా
వెన్నెముక దెబ్బతిన్న యువతికి అభయం
నేను ఎం ఫార్మసీ చదివాను. మా గ్రామంలో ప్రభ విరిగి పడడంతో నా వెన్నెముక దెబ్బతింది. కాళ్లు చచ్చుపడ్డాయి. వీల్‌చైర్‌కే పరిమితమయ్యాను. సీఎం బస్సు యాత్రగా వస్తున్నారని తెలిసి బంధువుల సాయంతో వచ్చాను. రోడ్డుపక్కన వేచి ఉన్న నన్ను చూడగానే సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బస్సు దిగి వచ్చి సమస్య తెలుసుకున్నారు. అండగా ఉంటానని అభయం ఇచ్చారు. తన ముఖ్యకార్యదర్శి హరికృష్ణను కలవాలని సూచించారు. చాలా ఆనందంగా ఉంది. సీఎం స్పందించిన తీరు అద్భుతం. – కొత్త తేజస్వీ, విఠంరాజుపల్లి, వినుకొండ రూరల్, పల్నాడు జిల్లా
చిన్నారి వైద్యసాయానికి భరోసా
మా బిడ్డ రోహిణికి 12 ఏళ్లు. ఐదేళ్ల నుంచి వెన్నెముక సమస్యతో బాధపడుతోంది. ఆరోగ్యశ్రీ వర్తించకపోవడంతో చికిత్స చేయించలేకపోయాం. రూ.ఐదు లక్షలు ఖర్చు అవుతుందని డాక్టర్లు చెప్పారు. బస్సు యాత్ర సందర్భంగా శావల్యాపురంలో సీఎం జగన్‌ను కలిసేందుకు ప్రయత్నించాం. మమ్మలను చూడగానే సీఎం బస్సు దిగి వచ్చి మా సమస్య అడిగి తెలుసుకున్నారు. వెంటనే స్పందించి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఆపరేషన్ చేయిస్తానని భరోసా ఇచ్చారు. – పున్నారావు, ఝాన్సీ దంపతులు, శావల్యాపురం, పల్నాడు జిల్లా
నా భూమిని మాజీ ఎమ్మెల్యే జీవీ అనుచరులు ఆక్రమించారు
నాకు సీతారామపురం గ్రామంలో 2.46 ఎకరాల భూమి ఉంది. మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు అనుచరులు ఆ భూమిని ఆక్రమించుకున్నారు. కేవలం 80 సెంట్లు మాత్రమే ఉన్నట్టు రెవెన్యూ రికార్డుల్లో చూపారు. నేను డాక్టర్‌ను. నడవలేని స్థితిలో ఉన్నా. నా సమస్యను సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి చెబుదామని వచ్చాను. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బస్సు ఆపి నా దగ్గరకు వచ్చి సమస్య తెలుసుకున్నారు. పరిష్కరించి న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. – డాక్టర్ మోదుగుల వెంకటేశ్వరమ్మ, సీతారామపురం, వినుకొండ, పల్నాడు జిల్లా
సాగర్ జలాలకు హామీ
తాగునీటికి ఇబ్బందులు పడుతున్నాం. మా గ్రామ చెరువుకు సాగర్ జలాలు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని బస్సుయాత్రగా గ్రామానికి వచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని కోరాం. గ్రామ సర్పంచ్ వేమా శివ, మాజీ సర్పంచ్ బత్తుల చిన సుబ్బయ్య, నాయకుడు వేమా చిన్న ఆంజనేయులుతో కలిసి వెళ్లి సీఎంకు వినతిపత్రం ఇచ్చాం. పరిశీలించి చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. – బోధనంపాడు గ్రామస్తులు, కురిచేడు మండలం, ప్రకాశం జిల్లా
Comments
Please login to add a commentAdd a comment