ఇక బీమా ఐపీవోలు!
⇒ క్యూ కడుతున్న ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు
⇒ త్వరలో ఎస్‌బీఐ, న్యూ ఇండియా, జనరల్ ఇన్సూరెన్స్
⇒ ఐపీవో యత్నాల్లో హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్
న్యూఢిల్లీ: దిగ్గజ బీమా కంపెనీలు ఈ ఏడాది వరసగా పబ్లిక్ ఇష్యూకు రాబోతున్నాయి. జాబితాలో ముందు వరసలో ఎస్‌బీఐ లైఫ్, న్యూ ఇండియా అష్యూరెన్స్, జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, యూటీఐ మ్యూచువల్ ఫండ్ నిలుస్తుండగా... ప్రైవేటు రంగానికి చెందిన మరో ప్రముఖ బీమా కంపెనీ హెచ్‌డీఎఫ్‌సీ స్టాండర్డ్ లైఫ్ సైతం ఐపీవో సన్నాహాలు చేసుకుంటోంది. ఇవి ఐపీవోల ద్వారా రూ.20,000 కోట్ల నిధులను సమీకరించే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇప్పటికే వీటిలో కొన్ని కంపెనీలు ఐపీవో ముసాయిదా పత్రాలను సెబీకి సమర్పించాయి కూడా.
ఐపీవో ద్వారా షేర్ల విక్రయం ఈ ఆర్థిక సంవత్సరంలోనే ఉంటుందని ఎస్‌బీఐ ఇప్పటికే స్పష్టం చేసింది. ఐపీవో ద్వారా ఆఫర్ ఫర్ సేల్ విధానంలో 10 శాతం వాటాకు సమానమైన షేర్లను విక్రయించే ప్రతిపాదనకు ఎస్‌బీఐ బోర్డు ఆమోదం తెలిపింది కూడా. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ గతేడాది రూ.6,000 కోట్లు సమీకరించడం ద్వారా స్టాక్ మార్కెట్లో నమోదైన విషయం తెలిసిందే. ఐపీవోకు వచ్చిన తొలి బీమా కంపెనీ ఇదే. హెచ్‌డీఎఫ్‌సీ స్టాండర్డ్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలో 10 శాతం వాటా విక్రయించనున్నట్టు హెచ్‌డీఎఫ్‌సీ గతేడాది ఏప్రిల్‌లోనే ప్రకటించింది. అయితే మాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్‌ను తనలో విలీనం చేసుకోవడం ద్వారా స్టాక్ మార్కెట్లో నమోదవ్వాలని ఆ తర్వాత భావించింది. కానీ, ఈ ఒప్పందానికి ఐఆర్డీఏ అభ్యంతరాలు చెబుతున్న నేపథ్యంలో ఈ సంస్థ తిరిగి ఐపీవో ఆలోచన చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి.
తొలుత సాధారణ బీమా కంపెనీలే!
ప్రభుత్వ రంగ కంపెనీల్లో పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.72,500 కోట్లు సమీకరించాలన్న లక్ష్యాన్ని కేంద్రం నిర్దేశించుకుంది. ఈ లక్ష్యానికి అనుగుణంగా ప్రభుత్వ రంగంలోని జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీలు ఈ ఆర్థిక సంవత్సరంలోనే ఐపీవోకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. న్యూ ఇండియా అష్యూరెన్స్, జీఐసీలో 25 శాతం చొప్పున వాటాలను ప్రభుత్వం విక్రయించనుంది. ఆకర్షణీయమైన ధరలను నిర్ణయించిన ఐపీవోలకు మంచి స్పందన లభిస్తుందని, లిస్టింగ్ రోజే లాభాలకు అవకాశం ఉంటుందని క్వాంటమ్ ఏఎంసీ డైరెక్టర్ ఐవీ సుబ్రహ్మణ్యం చెప్పారు. అధిక ధరను ఖరారు చేసిన కంపెనీలు ఆకర్షణీయమైన ధరల వద్ద లిస్ట్ కాకపోవచ్చన్నారు.
యూటీఐ ఐపీవో
ఇక యూటీఐ అస్సెట్ మేనేజ్‌మెంట్ కంపెనీ కూడా ఐపీవోకు రావాలని ఎప్పటి నుంచో సన్నాహాల్లో ఉంది. దీన్లో ఎస్‌బీఐ, ఎల్‌ఐసీ, బీవోబీ, పీఎన్‌బీలకు 18.5 శాతం చొప్పున మొత్తం 74 శాతం వాటా ఉంది. తాజా ఐపీవో ద్వారా ఇవి తమ వాటాలో కొంత విక్రయించనున్నాయి. మిగిలిన 26 శాతం వాటా అమెరికాకు చెందిన టీరోవ్ ప్రైస్ సంస్థ చేతిలో ఉంది. ఐపీవోకు రానున్న తొలి మ్యూచువల్ ఫండ్ కంపెనీగా యూటీఐ అస్సెట్ మేనేజ్‌మెంట్ నిలవనుంది.
ఐపీవో మార్కెట్‌లో ఈ ఏడాది సందడి నెలకొననుందని, దాదాపు సగం కంపెనీలు ఇప్పటికే ముసాయిదా పత్రాలను సెబీ వద్ద దాఖలు చేసి, అనుమతి కోసం వేచి ఉన్నాయని మార్కెట్ నిపుణులు తెలిపారు. గతేడాది 26 కంపెనీలు ఐపీవోల ద్వారా రూ.26,000 కోట్ల నిధులన్నీ సమీకరించాయి. గత ఆరు సంవత్సరాల్లో ఇదే రికార్డు.