సాధారణ బీమా రంగంలోకి కొటక్ గ్రూప్
ముంబై: కొటక్ మహీంద్రా బ్యాంక్ మంగళవారం సాధారణ బీమా రంగంలోకి ప్రవేశించింది. ఈ రంగంలో సంస్థ రూ. 100 కోట్లు పెట్టుబడులుగా పెట్టనుందని బ్యాంక్ ప్రెసిడెంట్ (అసెట్ మేనేజ్‌మెంట్, ఇన్సూరెన్స్, ఇంటర్నేషనల్ మేనేజ్‌మెంట్) గౌరంగ్ షా ఇక్కడ తెలిపారు. ‘‘సాధారణ బీమా రంగంలోకి ప్రవేశించడానికి ఇప్పటికే రెగ్యులేటర్ ఐఆర్‌డీఏ నుంచి అనుమతి పొందాము. ఇందుకు సంబంధించి అనుబంధ సంస్థ ఏర్పాటుకు రిజర్వ్ బ్యాంక్ నుంచి తాజాగా అనుమతి లభించింది. వచ్చే ఆర్థిక సంవత్సరం రెండవ త్రైమాసికం నుంచీ సంస్థ సాధారణ బీమా సేవలు ప్రారంభమవుతాయని భావిస్తున్నాం’’ అని ఆయన తెలిపారు. కొటక్ ప్రవేశంతో సార్వత్రిక బీమా రంగంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న సంస్థల సంఖ్య 27కు చేరింది.
ప్రస్తుతం వెంచర్‌లో విదేశీ భాగస్వామ్యం కోసం చూడబోమని, భవిష్యత్తులో అవసరమైతే ఆలోచిస్తామని ఈ సందర్భంగా గౌరంగ్ అన్నారు.తాజా అనుబంధ విభాగం ద్వారా మొదటి ఐదేళ్లలో రూ.900 కోట్ల ప్రీమియంలు సమీకరించాలన్నది లక్ష్యమని షా తెలిపారు. కాగా 250 మంది సిబ్బందిని కొత్త వెంచర్ కార్యకలాపాల కోసం ఎంపిక చేసుకోనున్నట్లు జనరల్ ఇన్సూరెన్స్ వెంచర్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ మహేశ్ బాలసుబ్రమణియన్ ఈ సందర్భంగా తెలిపారు.