merger and acquisition
-
సోనీలో జీ ఎంటర్టైన్మెంట్ విలీనానికి ఓకే
న్యూఢిల్లీ: సోనీ పిక్చర్స్ నెట్వర్క్స్ ఇండియాలో జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్ (జీల్) విలీన ప్రతిపాదనకు బీఎస్ఈ, ఎన్ఎస్ఈ నుంచి ఆమోదం లభించింది. ఈ విషయాన్ని జీల్ ప్రకటించింది. స్టాక్ ఎక్సే్చంజ్‌ల నుంచి ఆమోదం లభించడం బలమైన, సానుకూల ముందడుగుగా జీల్ పేర్కొంది. దీనివల్ల విలీనానికి సంబంధించి తదుపరి చర్యలు చేపట్టేందుకు వీలుంటుందని వివరించింది. అయితే, ఈ ప్రతిపాదిత విలీనం అన్నది ఇంకా నియంత్రణ సంస్థల అనుమతులకు లోబడి ఉంటుందని స్పష్టం చేసింది. సెబీ, ఎన్‌సీఎల్‌టీల, సీసీఐ నుంచి అనుమతులు పొందాల్సి ఉంటుంది. గతేడాది డిసెంబర్లో ఈ రెండు మీడియా సంస్థలు తప్పనిసరి విలీనానికి ఒప్పందం చేసుకోవడం గమనార్హం. నాడు ప్రకటించిన మేరకు విలీనానంతర సంస్థలో కల్వర్ మ్యాక్స్ ఎంటర్టైన్మెంట్ ప్రైవేటు లిమిటెడ్‌కు 52.03% వాటా ఉంటే, జీ వాటాదారులకు 47.07% వాటా లభించనుంది. జీల్ ఎండీ, సీఈవోగా ఉన్న పునీత్ గోయెంకా.. విలీనం తర్వా త సంస్థకు ఎండీ, సీఈవోగా కొనసాగనున్నారు. -
ఎంఅండ్ఏ డీల్స్ జోరు
ముంబై: ఈ క్యాలండర్ ఏడాది క్యూ1(జనవరి–మార్చి)లో దేశీయంగా విలీనాలు, కొనుగోళ్ల(ఎంఅండ్ఏ) విభాగం జోరందుకుంది. తొలి క్వార్టర్లో 30.3 బిలియన్ డాలర్ల విలువైన ఎంఅండ్ఏ లావాదేవీలు జరిగాయి. ఇవి గత నాలుగేళ్లలోనే అత్యధికంకాగా.. పరిమాణం రీత్యా 29.6 శాతం జంప్‌చేశాయి. వెరసి 2018లో నమోదైన 31.1 బిలియన్ డాలర్లను అధిగమించాయి. ప్రపంచవ్యాప్తంగా ఎంఅండ్ఏ డీల్స్ క్షీణించగా.. దేశీ మార్కెట్లో ఊపందుకోవడం గమనార్హం! గతేడాది(2021) క్యూ1తో పోలిస్తే డీల్స్ విలువ 5.6 శాతం పుంజుకోగా.. పరిమాణం రీత్యా తొలి క్వార్టర్‌కు కొత్త రికార్డ్ నెలకొల్పాయి. ప్రపంచంలోనే ఫైనాన్షియల్ మార్కెట్లు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ గణాంకాలు అందించడంలో టాప్ ర్యాంకులో ఉన్న ఎల్ఎస్ఈజీ బిజినెస్(రెఫినిటివ్) రూపొందించిన గణాంకాలివి. దేశీ కంపెనీలు ఎంఅండ్ఏ లావాదేవీలలో దేశీ కంపెనీల డీల్స్ 8.3 శాతం తగ్గి 23.7 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. దేశీ ఎంఅండ్ఏలు 24.5 శాతం క్షీణించి 12.1 బిలియన్ డాలర్లకు చేరాయి. ఇన్‌బౌండ్(దేశంలోకి) డీల్స్ 18 శాతం ఎగసి 11.6 బిలియన్ డాలర్లను తాకాయి. 2017 తొలి క్వార్టర్ తదుపరి ఇవే అత్యధికం. విదేశాలలో 8.2 బిలియన్ డాలర్ల విలువైన డీల్స్‌తో యూఎస్ అగ్రపథాన నిలవగా.. 39 శాతం జంప్‌చేశాయి. ఇన్‌బౌండ్ డీల్స్‌లో వీటి వాటా 70 శాతం! ఔట్‌బౌండ్(దేశం వెలుపలకు) డీల్స్ రెట్టింపునకుపైగా పెరిగి 5 బిలియన్ డాలర్లకు చేరాయి. 2010 తదుపరి ఇవి గరిష్టంకాగా.. 3.9 బిలియన్ డాలర్ల విలువైన 21 డీల్స్‌తో యూఎస్ టాప్‌లో నిలిచింది. ఇది 77 శాతం మార్కెట్ వాటాకు సమానం. బయోకాన్ డీల్ యూఎస్ సంస్థ వియాట్రిస్ ఇంక్‌కు చెందిన బయోసిమిలర్స్ బిజినెస్‌ను దేశీ కంపెనీ బయోకాన్ 3.335 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసింది. ఈ ఏడాది ఇది అతిపెద్ద డీల్‌కాగా, యూఎస్ హెల్త్‌కేర్ విభాగంలోని ఔట్‌బౌండ్ డీల్స్‌లో సరికొత్త రికార్డుకావడం విశేషం! హైటెక్నాలజీ రంగంలో మెజారిటీ డీల్స్ జరిగాయి. వీటి మొత్తం విలువ 6.6 బిలియన్ డాలర్లు. గతేడాది క్యూ1తో పోలిస్తే రెట్టింపయ్యాయి. వీటి మార్కెట్ వాటా 21.8 శాతానికి సమానం. ఈ బాటలో హెల్త్‌కేర్ 4.7 బిలియన్ డాలర్ల విలువైన డీల్స్‌తో 15.5 శాతం మార్కెట్ వాటాను సాధించింది. తదుపరి ఫైనాన్షియల్స్ 4.1 బిలియన్ డాలర్లతో 13.5 శాతం వాటాను పొందాయి. అయితే డీల్స్ విలువ 41 శాతానికిపైగా క్షీణించింది. 2020 నుంచి ప్రపంచవ్యాప్తంగా డీల్స్ కనిష్ట స్థాయికి చేరగా.. దేశీయంగా జోరందుకోవడం ప్రస్తావించదగ్గ అంశమని రెఫినిటివ్ సీనియర్ విశ్లేషకులు ఎలయిన్ ట్యాన్ పేర్కొన్నారు. పీఈ పెట్టుబడులు, నగదు నిల్వలు, చరిత్రాత్మక కనిష్టంలోని వడ్డీ రేట్లు వంటి కీలక అంశాలు ప్రభావం చూపినట్లు వివరించారు. పీఈ డీల్స్ పీఈ డీల్స్ భారీగా పెరిగి 9.8 బిలియన్ డాలర్లకు చేరాయి. దీంతో హైటెక్నాలజీ విభాగం 28.7 శాతం మార్కెట్ వాటాను కైవసం చేసుకుంది. అయితే ఈక్విటీ క్యాపిటల్ మార్కెట్(ఈసీఎం) లావాదేవీలు 64 శాతంపైగా పడిపోయాయి. 2019 తదుపరి ఇవి కనిష్టంకాగా.. ఈసీఎం ఆఫరింగ్స్ 23.3 శాతం నీరసించాయి. దేశీయంగా ఐపీవో యాక్టివిటీ 57 శాతం తిరోగమించింది. వీటి సంఖ్య సైతం దాదాపు 15 శాతం తగ్గింది. క్యూ1లో ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ పీజు 33.5 శాతం వెనకడుగుతో 179.7 మిలియన్ డాలర్లకు పరిమితమైంది. 2016 తరువాత ఇది కనిష్టంకాగా.. అండర్‌రైటింగ్ 43 శాతంపైగా క్షీణించి 40.9 మిలియన్ డాలర్లను తాకింది. డెట్ క్యాపిటల్ మార్కెట్ అండర్‌రైటింగ్ పీజు 24 శాతం బలహీనపడి 2016 తరువాత కనిష్టంగా 49.1 బిలియన్ డాలర్లుగా నమోదైంది. -
సాధారణ బీమా రంగంలోకి కొటక్ గ్రూప్
ముంబై: కొటక్ మహీంద్రా బ్యాంక్ మంగళవారం సాధారణ బీమా రంగంలోకి ప్రవేశించింది. ఈ రంగంలో సంస్థ రూ. 100 కోట్లు పెట్టుబడులుగా పెట్టనుందని బ్యాంక్ ప్రెసిడెంట్ (అసెట్ మేనేజ్మెంట్, ఇన్సూరెన్స్, ఇంటర్నేషనల్ మేనేజ్మెంట్) గౌరంగ్ షా ఇక్కడ తెలిపారు. ‘‘సాధారణ బీమా రంగంలోకి ప్రవేశించడానికి ఇప్పటికే రెగ్యులేటర్ ఐఆర్డీఏ నుంచి అనుమతి పొందాము. ఇందుకు సంబంధించి అనుబంధ సంస్థ ఏర్పాటుకు రిజర్వ్ బ్యాంక్ నుంచి తాజాగా అనుమతి లభించింది. వచ్చే ఆర్థిక సంవత్సరం రెండవ త్రైమాసికం నుంచీ సంస్థ సాధారణ బీమా సేవలు ప్రారంభమవుతాయని భావిస్తున్నాం’’ అని ఆయన తెలిపారు. కొటక్ ప్రవేశంతో సార్వత్రిక బీమా రంగంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న సంస్థల సంఖ్య 27కు చేరింది. ప్రస్తుతం వెంచర్లో విదేశీ భాగస్వామ్యం కోసం చూడబోమని, భవిష్యత్తులో అవసరమైతే ఆలోచిస్తామని ఈ సందర్భంగా గౌరంగ్ అన్నారు.తాజా అనుబంధ విభాగం ద్వారా మొదటి ఐదేళ్లలో రూ.900 కోట్ల ప్రీమియంలు సమీకరించాలన్నది లక్ష్యమని షా తెలిపారు. కాగా 250 మంది సిబ్బందిని కొత్త వెంచర్ కార్యకలాపాల కోసం ఎంపిక చేసుకోనున్నట్లు జనరల్ ఇన్సూరెన్స్ వెంచర్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ మహేశ్ బాలసుబ్రమణియన్ ఈ సందర్భంగా తెలిపారు.