ముంబై: ఈ క్యాలండర్ ఏడాది క్యూ1(జనవరి–మార్చి)లో దేశీయంగా విలీనాలు, కొనుగోళ్ల(ఎంఅండ్‌ఏ) విభాగం జోరందుకుంది. తొలి క్వార్టర్‌లో 30.3 బిలియన్ డాలర్ల విలువైన ఎంఅండ్‌ఏ లావాదేవీలు జరిగాయి. ఇవి గత నాలుగేళ్లలోనే అత్యధికంకాగా.. పరిమాణం రీత్యా 29.6 శాతం జంప్‌చేశాయి. వెరసి 2018లో నమోదైన 31.1 బిలియన్ డాలర్లను అధిగమించాయి. ప్రపంచవ్యాప్తంగా ఎంఅండ్‌ఏ డీల్స్ క్షీణించగా.. దేశీ మార్కెట్లో ఊపందుకోవడం గమనార్హం! గతేడాది(2021) క్యూ1తో పోలిస్తే డీల్స్ విలువ 5.6 శాతం పుంజుకోగా.. పరిమాణం రీత్యా తొలి క్వార్టర్‌కు కొత్త రికార్డ్ నెలకొల్పాయి. ప్రపంచంలోనే ఫైనాన్షియల్ మార్కెట్లు, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ గణాంకాలు అందించడంలో టాప్ ర్యాంకులో ఉన్న ఎల్‌ఎస్‌ఈజీ బిజినెస్(రెఫినిటివ్) రూపొందించిన గణాంకాలివి.
దేశీ కంపెనీలు
ఎంఅండ్‌ఏ లావాదేవీలలో దేశీ కంపెనీల డీల్స్ 8.3 శాతం తగ్గి 23.7 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. దేశీ ఎంఅండ్‌ఏలు 24.5 శాతం క్షీణించి 12.1 బిలియన్ డాలర్లకు చేరాయి. ఇన్‌బౌండ్(దేశంలోకి) డీల్స్ 18 శాతం ఎగసి 11.6 బిలియన్ డాలర్లను తాకాయి. 2017 తొలి క్వార్టర్ తదుపరి ఇవే అత్యధికం. విదేశాలలో 8.2 బిలియన్ డాలర్ల విలువైన డీల్స్‌తో యూఎస్ అగ్రపథాన నిలవగా.. 39 శాతం జంప్‌చేశాయి. ఇన్‌బౌండ్ డీల్స్‌లో వీటి వాటా 70 శాతం! ఔట్‌బౌండ్(దేశం వెలుపలకు) డీల్స్ రెట్టింపునకుపైగా పెరిగి 5 బిలియన్ డాలర్లకు చేరాయి. 2010 తదుపరి ఇవి గరిష్టంకాగా.. 3.9 బిలియన్ డాలర్ల విలువైన 21 డీల్స్‌తో యూఎస్ టాప్‌లో నిలిచింది. ఇది 77 శాతం మార్కెట్ వాటాకు సమానం.
బయోకాన్ డీల్
యూఎస్ సంస్థ వియాట్రిస్ ఇంక్‌కు చెందిన బయోసిమిలర్స్ బిజినెస్‌ను దేశీ కంపెనీ బయోకాన్ 3.335 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసింది. ఈ ఏడాది ఇది అతిపెద్ద డీల్‌కాగా, యూఎస్ హెల్త్‌కేర్ విభాగంలోని ఔట్‌బౌండ్ డీల్స్‌లో సరికొత్త రికార్డుకావడం విశేషం! హైటెక్నాలజీ రంగంలో మెజారిటీ డీల్స్ జరిగాయి. వీటి మొత్తం విలువ 6.6 బిలియన్ డాలర్లు. గతేడాది క్యూ1తో పోలిస్తే రెట్టింపయ్యాయి. వీటి మార్కెట్ వాటా 21.8 శాతానికి సమానం. ఈ బాటలో హెల్త్‌కేర్ 4.7 బిలియన్ డాలర్ల విలువైన డీల్స్‌తో 15.5 శాతం మార్కెట్ వాటాను సాధించింది. తదుపరి ఫైనాన్షియల్స్ 4.1 బిలియన్ డాలర్లతో 13.5 శాతం వాటాను పొందాయి. అయితే డీల్స్ విలువ 41 శాతానికిపైగా క్షీణించింది. 2020 నుంచి ప్రపంచవ్యాప్తంగా డీల్స్ కనిష్ట స్థాయికి చేరగా.. దేశీయంగా జోరందుకోవడం ప్రస్తావించదగ్గ అంశమని రెఫినిటివ్ సీనియర్ విశ్లేషకులు ఎలయిన్ ట్యాన్ పేర్కొన్నారు. పీఈ పెట్టుబడులు, నగదు నిల్వలు, చరిత్రాత్మక కనిష్టంలోని వడ్డీ రేట్లు వంటి కీలక అంశాలు ప్రభావం చూపినట్లు వివరించారు.
పీఈ డీల్స్
పీఈ డీల్స్ భారీగా పెరిగి 9.8 బిలియన్ డాలర్లకు చేరాయి. దీంతో హైటెక్నాలజీ విభాగం 28.7 శాతం మార్కెట్ వాటాను కైవసం చేసుకుంది. అయితే ఈక్విటీ క్యాపిటల్ మార్కెట్(ఈసీఎం) లావాదేవీలు 64 శాతంపైగా పడిపోయాయి. 2019 తదుపరి ఇవి కనిష్టంకాగా.. ఈసీఎం ఆఫరింగ్స్ 23.3 శాతం నీరసించాయి. దేశీయంగా ఐపీవో యాక్టివిటీ 57 శాతం తిరోగమించింది. వీటి సంఖ్య సైతం దాదాపు 15 శాతం తగ్గింది. క్యూ1లో ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకింగ్ పీజు 33.5 శాతం వెనకడుగుతో 179.7 మిలియన్ డాలర్లకు పరిమితమైంది. 2016 తరువాత ఇది కనిష్టంకాగా.. అండర్‌రైటింగ్ 43 శాతంపైగా క్షీణించి 40.9 మిలియన్ డాలర్లను తాకింది. డెట్ క్యాపిటల్ మార్కెట్ అండర్‌రైటింగ్ పీజు 24 శాతం బలహీనపడి 2016 తరువాత కనిష్టంగా 49.1 బిలియన్ డాలర్లుగా నమోదైంది.
ఎంఅండ్‌ఏ డీల్స్ జోరు
Published Tue, Apr 12 2022 6:18 AM | Last Updated on Tue, Apr 12 2022 6:18 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment