న్యూఢిల్లీ: డైవర్సిఫైడ్ దిగ్గజం ఐటీసీ లిమిటెడ్ ప్రస్తుత ఆరి్థక సంవత్సరం(2023–24) తొలి త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన ఏప్రిల్–జూన్(క్యూ1)లో నికర లాభం 16% ఎగసి రూ. 5,180 కోట్లను అధిగమించింది. గతేడాది(2022–23) ఇదే కాలంలో రూ. 4,462 కోట్లు ఆర్జించింది. నిర్వహణ ఆదాయం మాత్రం రూ. 19,831 కోట్ల నుంచి రూ. 18,639 కోట్లకు తగ్గింది. ఇది 6% క్షీణతకాగా.. మొత్తం వ్యయాలు సైతం 13% తగ్గి రూ. 12,422 కోట్లకు పరిమితమయ్యాయి. ఇక మొత్తం టర్నోవర్ 4% నీరసించి రూ. 19,362 కోట్లుగా నమోదైంది.
విభాగాలవారీగా..: తాజా క్యూ1లో ఐటీసీ.. ఎఫ్‌ఎంసీజీ విభాగం 13 శాతంపైగా వృద్ధితో రూ. 13,528 కోట్ల ఆదాయాన్ని సాధించింది. దీనిలో సిగరెట్ల బిజినెస్ నుంచి 12 శాతం అధికంగా రూ. 8,356 కోట్లు అందుకుంది. హోటళ్ల బిజినెస్ 8% బలపడి రూ. 625 కోట్ల ఆదాయం అందుకుంది.
‘హోటల్’ షేర్ల జారీ తీరిదీ..: ఐటీసీ హోటల్స్ పేరుతో ఆతిథ్య రంగ బిజినెస్‌ను ప్రత్యేక కంపెనీగా ఐటీసీ విడదీస్తున్న సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా కంపెనీ బోర్డు 1:10 నిష్పత్తిలో షేర్ల జారీకి ఆమోదముద్ర వేసినట్లు ఐటీసీ పేర్కొంది. వాటాదారులకు ఐటీసీలోగల ప్రతీ 10 షేర్లకుగాను 1 ఐటీసీ హోటల్ షేరును కేటాయించనుంది. షేర్ల జారీ తదుపరి ఐటీసీ హోటల్స్‌లో 60% వాటాను ఐటీసీ వాటాదారులు పొందనుండగా.. ఐటీసీ 40% వాటాను కలిగి ఉండనుంది. హోటల్ షేర్లు త్వరలో బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలో లిస్ట్‌కానున్నాయి. ఐటీసీ హోటల్స్‌ను ప్రత్యేక కంపెనీగా విడదీసి స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్ట్ చేసేందుకు సుమారు 15 నెలలు పట్టవచ్చని ఐటీసీ తాజాగా అంచనాలు ప్రకటించింది.
ఫలితాల నేపథ్యంలో ఐటీసీ షేరు బీఎస్‌ఈలో నామమాత్ర లాభంతో రూ. 449 వద్ద ముగిసింది.
ఐటీసీ లాభం జూమ్
Published Tue, Aug 15 2023 4:55 AM | Last Updated on Tue, Aug 15 2023 5:03 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment