మార్కెట్ల ట్రెండ్ నిర్దేశానికి చాన్స్
ఇకపై స్టాక్ మార్కెట్ల దిశను నిర్దేశించే పలు కీ లక పరిణామాలు ఈ వారం చోటుచేసుకోనున్నట్లు నిపుణులు తెలిపారు. సామాన్యుడి దగ్గర్నుంచీ సంపన్నుల వరకూ, ఇటు రిటైల్ ఇన్వెస్టర్ల దగ్గర్నుంచి అటు మార్కెట్ వర్గాల వరకూ అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న కేంద్ర వార్షిక బడ్జెట్ గురువారం(10న) వెలువడనుంది. అంతకుముందే మోడీ ప్రభుత్వం లోక్‌సభలో మంగళవారం(8న) రైల్వే బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది.
ఆపై బుధవారం(9న) ఆర్థిక సర్వే వెల్లడికానుంది. ఇవికాకుండా శుక్రవారం సాఫ్ట్వేర్ దిగ్గజం ఇన్ఫోసిస్ ఈ ఏడాది తొలి క్వార్టర్(2013-14, ఏప్రిల్-జూన్) ఆర్థిక ఫలితాలను ప్రకటించనుంది. ఇదే రోజున మే నెలకుగాను పారిశ్రామికోత్పత్తి గణాంకాలు సైతం వెలువడనున్నాయి. ఇలాంటి పలు అంశాల నేపథ్యంలో ఈ వారం దేశీ స్టాక్ మార్కెట్లకు అత్యంత కీలకంగా నిలవనున్నదని విశ్లేషకులు పేర్కొన్నారు.
ఫలితాల సీజన్ షురూ!
ఇన్ఫోసిస్ ఫలితాలతో ఈ ఆర్థిక సంవత్సరం(2014-15) క్యూ1 ఫలితాల సీజన్ మొదలుకానుంది. కార్పొరేట్ల ఫలితాలు కూడా సెంటిమెంట్‌పై ప్రభావాన్ని చూపనున్నప్పటికీ గురువారం వెలువడనున్న సాధారణ బ డ్జెట్పైనే దేశ, విదేశీ ఇన్వెస్టర్లు ప్రధానంగా దృష్టిసారించినట్లు నిపుణులు పేర్కొన్నారు. ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టనున్న బడ్జెట్లో ఆర్థిక వ్యవస్థ పురోగతికి సహాయపడే చర్యలుంటాయని భావిస్తున్నట్లు రెలిగేర్ సెక్యూరిటీస్ రిటైల్ పంపిణీ ప్రెసిడెంట్ జయంత్ మాంగ్లిక్ చెప్పారు. దీంతో మార్కెట్లు పటిష్టంగా ట్రేడయ్యే అవకాశముందని అంచనా వేశారు. అయితే పలు గణాంకాలు వెల్లడికానున్న నేపథ్యంలో ఈ వారం మార్కెట్లలో భారీ హెచ్చుతగ్గులకు అవకాశంలేకపోలేదని వ్యాఖ్యానించారు. ఇన్వెస్టర్లు రిస్క్‌మేనేజ్‌మెంట్ నిబంధనలను అనుసరించడం మేలు చేకూరుస్తుందని సలహా ఇచ్చారు.
ర్యాలీ కొనసాగుతుంది...
ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న తొలి బడ్జెట్‌పై మార్కెట్ వర్గాలలో గరిష్టస్థాయిలో అంచనాలున్నాయని, దీంతో గడిచిన వారంలో కనిపించిన ర్యాలీ మరింత జోరందుకోవచ్చునని అత్యధిక శాతంమంది నిపుణులు అంచనా వేశారు. వృద్ధి, సంస్కరణలపై మోడీ ప్రభుత్వం చూపుతున్న ఆసక్తి ఇందుకు దోహదపడుతుందని తెలిపారు. మార్కెట్లలో నెలకొన్న భారీ అంచనాల నేపథ్యంలో బడ్జెట్ తరువాత కూడా ర్యాలీ కొనసాగేందుకు అవకాశముందని యాంప్లస్ కన్సల్టింగ్ ఎండీ ప్రవీణ్ నిగమ్ అభిప్రాయపడ్డారు. ప్రధానంగా హెల్త్‌కేర్, ఇన్ఫ్రా, రక్షణ రంగాలు వెలుగులో నిలిచే వీలుందని పేర్కొన్నారు.
రుతుపవనాల ఎఫెక్ట్
బడ్జెట్, ఫలితాలు, ఐఐపీ గణాంకాలకుతోడు రుతుపవనాల గమనం కూడా సెంటిమెంట్‌పై ప్రభావాన్ని చూపుతుందని నిపుణులు వివరించారు. కాగా, సోమవారం(7) నుంచీ మార్కెట్లు మరింత పుంజుకుంటాయని జయంత్ అంచనా వేశారు. గడిచిన వారం మార్కెట్లు 3.5% ర్యాలీ చేయడం ద్వారా కొత్త రికార్డులను నమోదు చేశాయి. మార్కెట్ల ప్రామాణిక సూచీ సెన్సెక్స్ 862 పాయింట్లు లాభపడి కొత్త గరిష్టం 25,962 వద్ద నిలవగా, ఎన్ఎస్ఈ ప్రధాన సూచీ నిఫ్టీ సైతం 243 పాయింట్లు పురోగమించి 7,752 వద్ద స్థిరపడిన సంగతి తెలిసిందే.
ఫండ్స్ పెట్టుబడులు 3,300 కోట్లు
ఈక్విటీలలో దేశీ మ్యూచువల్ ఫండ్స్ జూన్ నెలలో రూ. 3,300 కోట్లను ఇన్వెస్ట్ చేశాయి. తద్వారా మార్కెట్లలో కనిపిస్తున్న పటిష్ట ర్యాలీ నేపథ్యంలో వరుసగా రెండో నెలలోనూ నికర పెట్టుబడిదారులుగా నిలిచాయి. అంతక్రితం మే నెలలో నికరంగా ఈక్విటీలలో రూ. 105 కోట్లను ఇన్వెస్ట్ చేశాయి. మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ వెల్లడించిన తాజా గణాంకాలివి. కాగా, మరోవైపు డెట్ మార్కెట్లో ఫండ్స్ మరింత అధికంగా ఇన్వెస్ట్చేయడం గమనార్హం. గడిచిన నెలలో ఫండ్స్ నికరంగా రూ. 68,000 కోట్ల విలువైన రుణ సెక్యూరిటీలను కొనుగోలు చేశాయి. నిజానికి దేశీ మ్యూచువల్ ఫండ్స్ గతేడాది సెప్టెంబర్ నుంచీ ఈక్విటీలలో నికర అమ్మకందారులుగా నిలుస్తూ వచ్చాయి. తొలిసారి ఈ బాటను వీడి మే నెలలో నికర కొనుగోలుదారులుగా నిలవడం విశేషం.
కొనసాగుతున్న ఎఫ్ఐఐల జోరు..
దేశీ క్యాపిటల్ మార్కెట్లో ఈ క్యాలెండర్ ఏడాది తొలి అర్ధభాగంలో విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల(ఎఫ్ఐఐలు) పెట్టుబడులు 20.4 బిలియన్ డాలర్లకు(రూ. 1.23 లక్షల కోట్లు) చేరాయి. జనవరి-జూన్ కాలంలో ఎఫ్ఐఐలు నికరంగా ఈక్విటీలలో 9.96 బిలియన్ డాలర్లను(రూ. 59,795 కోట్లు), డెట్ మార్కెట్లో 10.42 బిలియన్ డాలర్లను(రూ. 62,834 కోట్లు) ఇన్వెస్ట్ చేశారు. మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ వెల్లడించిన తాజా గణాంకాలివి. నరేంద్ర మోడీ అధ్యక్షతన కేంద్రంలో సుస్థిర ప్రభుత్వం ఏర్పడటం, సంస్కరణలు, వృద్ధిపై కొత్త ప్రభుత్వం దృష్టిపెట్టడం వంటి అంశాలు విదేశీ పెట్టుబడులకు కారణంగా నిలుస్తున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో తొలి ఆరు నెలల్లో మార్కెట్ల ప్రామాణిక సూచీ సెన్సెక్స్ 20% దూసుకెళ్లింది.