న్యూఢిల్లీ: సాఫ్ట్‌వేర్ సేవల దిగ్గజం ఇన్ఫోసిస్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2021–22) తొలి త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన క్యూ1(ఏప్రిల్–జూన్)లో నికర లాభం దాదాపు 23 శాతం ఎగసింది. రూ. 5,195 కోట్లను తాకింది. గతేడాది(2020–21) ఇదే కాలంలో రూ. 4,233 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం 18 శాతం పుంజుకుని రూ. 27,896 కోట్లకు చేరింది. గతంలో రూ. 23,665 కోట్ల టర్నోవర్ సాధించింది. కాగా.. ఈ ఏడాది జూన్ 25న ప్రారంభించిన ఈక్విటీ షేర్ల బైబ్యాక్‌లో భాగంగా 9.8 మిలియన్ షేర్లను కొనుగోలు చేసినట్లు తెలియజేసింది. వీటి విలువ రూ. 1,542 కోట్లుకాగా.. ఒక్కో షేరుకీ రూ. 1,569 సగటు ధరలో బైబ్యాక్ చేసినట్లు వెల్లడించింది. బైబ్యాక్‌కు ప్రకటించిన గరిష్ట బైబ్యాక్ ధర రూ. 1,750.
భారీ డీల్స్
పూర్తి ఏడాదికి ఆదాయ అంచనాలను ఇన్ఫోసిస్ ఎగువముఖంగా సవరించింది. 14–16 శాతం స్థాయిలో వృద్ధి సాధించగలమని తాజాగా అంచనా వేసింది. ఇంతక్రితం 12–14 శాతం పురోగతిని ఊహించిన సంగతి తెలిసిందే. క్యూ1లో 2.6 బిలియన్ డాలర్ల(సుమారు రూ. 19,250 కోట్లు) విలువైన కాంట్రాక్టులను కుదుర్చుకుంది. డిజిటల్ విభాగంలో టాలెంట్‌కు భారీ డిమాండ్ ఉన్నట్లు ఇన్ఫోసిస్ సీవోవో ప్రవీణ్ రావు పేర్కొన్నారు. ఐటీ పరిశ్రమలో పెరుగుతున్న ఉద్యోగ వలస (అట్రిషన్) సమీపకాలంలో సవాళ్లు విసరనున్నట్లు అభిప్రాయపడ్డారు. డిమాండుకు అనుగుణంగా ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా 35,000 మందిని కొత్తగా ఎంపిక చేసుకోనున్నట్లు తెలియజేశారు. అంచనాలకు అనుగుణమైన మార్జిన్లను సాధించగలమని భావిస్తున్నట్లు సీఎఫ్‌వో నీలాంజన్ రాయ్ పేర్కొన్నారు. వ్యయ నియంత్రణ, నిపుణులను నియమించుకోవడం తదితర అంశాలు ఇందుకు సహకరించనున్నట్లు తెలియజేశారు.
ఐటీ పోర్టల్‌కు దన్ను
ఆదాయ పన్ను శాఖ కొత్త పోర్టల్‌లో ఎదురవుతున్న సాంకేతిక సమస్యలను శీఘ్రగతిన పరిష్కరిస్తున్నట్లు క్యూ1 ఫలితాల విడుదల సందర్భంగా ఇన్ఫోసిస్ పేర్కొంది. పోర్టల్‌కు ప్రస్తుతం కంపెనీ అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలియజేసింది. సమస్యల పరిష్కారానికి వేగవంతమైన చర్యలు చేపట్టినట్లు తెలియజేసింది. భారీ సంఖ్యలో రిటర్నులు దాఖలవుతున్నాయని, పోర్టల్‌లోని పలు విభాగాలు ఇప్పటికే సవ్యంగా పనిచేస్తున్నట్లు వివరించింది. ఇప్పటివరకూ 10 లక్షల ఐటీఆర్‌లు దాఖలైనట్లు వెల్లడించింది. ఆధునిక ఆదాయ పన్ను ఫైలింగ్ విధానాల అభివృద్ధి కోసం 2019లో ఇన్ఫోసిస్ కాంట్రాక్టును పొందింది. రిటర్నుల ప్రాసెసింగ్ సమయాన్ని 63 రోజుల నుంచి ఒకేరోజుకి తగ్గించడం, వేగవంత రిఫండ్స్ తదితరాలకు వీలుగా పోర్టల్‌ను అభివృద్ధి చేయవలసి ఉంది. అభివృద్ధి చేసిన పోర్టల్ సర్వీసులు ఈ జూన్‌లో ప్రారంభమయ్యాయి. అయితే కొన్ని సాంకేతిక సమస్యలు ఎదురవుతున్న సంగతి తెలిసిందే.
మార్కెట్లు ముగిశాక ఇన్ఫోసిస్ ఫలితాలు ప్రకటించింది. ఎన్‌ఎస్‌ఈలో ఇన్ఫోసిస్ షేరు 2 శాతం లాభపడి రూ. 1,577 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో రూ. 1,583–1,538 మధ్య ఊగిసలాడింది.
క్యూ1 హైలైట్స్..
► మొత్తం ఆదాయంలో డిజిటల్ విభాగం 54 శాతం వాటాను ఆక్రమిస్తోంది. వార్షిక ప్రాతిపదికన 42 శాతానికిపైగా వృద్ధిని సాధించింది.
► నిర్వహణ లాభ(ఇబిట్) మార్జిన్ 22.7 శాతం నుంచి 23.7 శాతానికి బలపడింది.
► డాలర్ల రూపేణా ఆదాయం 21.2 శాతం ఎగసి 378.2 కోట్ల డాలర్లను చేరింది. త్రైమాసిక ప్రాతిపదికన 4.7 శాతం పుంజుకుంది.
► ఈపీఎస్ దాదాపు 23 శాతం జంప్‌చేసి రూ. 12.24ను తాకింది.
► ఉద్యోగులకు ఈ జనవరిలో ఒకసారి, జూలైలో మరోసారి అదనపు చెల్లింపులు, ప్రమోషన్లు.
► 2,67,953కు కంపెనీ మొత్తం సిబ్బంది సంఖ్య. ఉద్యోగ వలస 13.9 శాతం.
నమ్మకాన్ని పెంచాయ్
ఉద్యోగుల అంకితభావం, క్లయింట్లకున్న విశ్వాసం సహకారంతో గత దశాబ్ద కాలంలోనే వేగవంత వృద్ధిని సాధించగలిగాం. వార్షిక ప్రాతిపదికన 17 శాతం, త్రైమాసికవారీగా దాదాపు 5 శాతం చొప్పున పురోగమించాం. ఫైనాన్షియల్, రిటైల్, తయారీ, లైఫ్ సైన్సెస్ విభాగాల్లో కాంట్రాక్టులకు డిమాండ్ కనిపిస్తోంది. క్యూ1లో భారీ డీల్స్‌ను సంపాదించాం. ఉద్యోగుల నిబద్ధత, పటిష్ట ఫలితాలు వంటి అంశాలు ఆదాయ వృద్ధి అంచనాలను పెంచేందుకు నమ్మకాన్ని కలిగించాయి.
– సలీల్ పరేఖ్, సీఈవో, ఎండీ, ఇన్ఫోసిస్
ఇన్ఫీ.. అంచనాలు అప్
Published Thu, Jul 15 2021 5:31 AM | Last Updated on Thu, Jul 15 2021 5:31 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment