మెప్పించిన ఇన్ఫీ! | Infosys Q1 net profit beats Street estimates, revenue guidance raised | Sakshi
Sakshi News home page

మెప్పించిన ఇన్ఫీ!

Published Sat, Jul 15 2017 12:31 AM | Last Updated on Tue, Sep 5 2017 4:02 PM

మెప్పించిన ఇన్ఫీ!

మెప్పించిన ఇన్ఫీ!

అంచనాలు మించిన నికర లాభం
క్యూ1లో రూ.3,483 కోట్లు; 1.3 శాతం వృద్ధి
ఆదాయం రూ.17,078 కోట్లు; 1.7 శాతం అప్‌
అమెరికా, యూరప్‌లలో కీలక కాంట్రాక్టుల ఆసరా...
డాలరు ఆదాయ అంచనాలు పెంపు...  


బెంగళూరు: దేశంలో రెండో అతిపెద్ద ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్‌... అంచనాలను మించిన ఫలితాలతో ఆకట్టుకుంది. ఈ ఏడాది జూన్‌తో ముగిసిన తొలి త్రైమాసికం(2017–18, క్యూ1)లో కంపెనీ రూ.3,483 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. క్రితం ఏడాది క్వార్టర్‌లో లాభం రూ.3,436 కోట్లతో పోలిస్తే... 1.3 శాతం వృద్ధి చెందింది. ఇక మొత్తం ఆదాయం కూడా 1.7 శాతం పెరిగి రూ.17,078 కోట్లకు చేరింది. గతేడాది క్యూ1లో ఆదాయం రూ.16,782 కోట్లుగా నమోదైంది. ప్రధానంగా ఉత్తర అమెరికా, యూరప్‌లలో కీలకమైన క్లయింట్లను చేజిక్కించుకోవడం ఇన్ఫీ లాభాలకు దన్నుగా నిలిచింది. మరోపక్క, డాలరు రూపంలో ఈ ఏడాది ఆదాయ అంచనాలను(గైడెన్స్‌) పెంచడం గమనార్హం. దేశీ ఐటీ అగ్రగామి టీసీఎస్‌ నిరుత్సాహకరమైన ఫలితాలను ప్రకటించిన మర్నాడే... ఇన్ఫోసిస్‌ సానుకూల పనితీరుతో ఇన్వెస్టర్లలో ఉత్సాహం నింపడం విశేషం.

సీక్వెన్షియల్‌గా ఇలా...
క్రితం ఏడాది చివరి త్రైమాసికంలో నమోదైన రూ.3,603 కోట్ల నికర లాభంతో పోలిస్తే సీక్వెన్షియల్‌ ప్రాతిపదికన ఈ ఏడాది క్యూ1లో లాభం 3.3 శాతం దిగజారింది. ఆదాయం కూడా రూ.17,120 కోట్లతో పోలిస్తే స్వల్పంగా 0.2 శాతం తగ్గింది. పరిశ్రమ విశ్లేషకులు ఇన్ఫోసిస్‌ సగటున క్యూ1లో రూ.3,426 కోట్ల నికర లాభాన్ని, రూ.17,014 కోట్ల ఆదాయాన్ని నమోదు చేయొచ్చని అంచనా వేశారు. దీనికంటే కాస్త మెరుగ్గానే ఫలితాలు వెలువడ్డాయి. ఇక డాలరు రూపంలో కంపెనీ ఆదాయం క్యూ1లో 3.2 శాతం వృద్ధి చెంది 2,651 మిలియన్‌లకు చేరింది.

సానుకూల గైడెన్స్‌...
గత కొంతకాలంగా ఆదాయ వృద్ధి అంచనా(గైడెన్స్‌)ను తగ్గించుకుంటూ వస్తున్న ఇన్ఫోసిస్‌.. ఆశ్చర్యకరమైన రీతిలో దీన్ని ఈసారి పెంచింది. ఈ ఏడాది మొత్తానికి చూస్తే డాలరు ఆదాయాల్లో 7.1–9.1 శాతం వృద్ధి ఉండొచ్చని క్యూ1 ఫలితాల సందర్భంగా ప్రకటించింది. గతంలో ఈ గైడెన్స్‌ 6.1–8.1 శాతంగా ఉంది. ఇక స్థిర కరెన్సీ ప్రాతిపదికన గైడెన్స్‌ను గతంలో ప్రకటించిన మాదిరిగానే 6.5–8.5 శాతంగా కొనసాగిస్తున్నట్లు ఇన్ఫీ వెల్లడించింది. కార్పొరేట్‌ గవర్నెన్స్‌ విషయంలో(టాప్‌ ఎగ్జిక్యూటివ్‌ వేతనాల పెంపు ఇతరత్రా) నారాయణ మూర్తితో పాటు ఇతర కంపెనీ వ్యవస్థాపకులతో కంపెనీ బోర్డు సభ్యులకు ఇటీవలి కాలంలో విభేదాలు బయటపడిన సంగతి తెలిసిందే. దీనికితోడు అమెరికాతో పాటు మరికొన్ని దేశాలు వీసా నిబంధనలను కఠినతరం చేయడం, కరెన్సీ హెచ్చుతగ్గులు ఇతరత్రా సమస్యలు కూడా ఐటీ రంగాన్ని వెంటాడుతున్నాయి.

ఇతర ముఖ్యాంశాలివీ...
కంపెనీ వద్ద నగదు నిల్వలు ఈ ఏడాది జూన్‌ చివరి నాటికి 1.9 శాతం పెరిగి 6,091 మిలియన్‌ డాలర్లకు(దాదాపు రూ.39,335 కోట్లు) చేరాయి.

ఏప్రిల్‌–జూన్‌ కాలంతో కంపెనీ కొత్తగా 59 క్లయింట్లను జత చేసుకుంది. ఇందులో 100 మిలియన్‌ డాలర్ల కేటగిరీలో 8 క్లయింట్లు, 25 మిలియన్‌ డాలర్ల కేటగిరీలో 6 క్లయింట్లు, 10 మిలియన్‌ కేటగిరీలో 1 క్లయింట్, మిలియన్‌ డాలర్ల కేటగిరీలో 8 క్లయింట్లు కొత్తగా లభించారు.

కంపెనీ మొత్తం ఆదాయంలో అత్యధిక వాటా (61.1%) కలిగిన ఉత్తర అమెరికా ప్రాంతం వ్యాపారంలో సీక్వెన్షియల్‌గా (క్యూ4తో పోలిస్తే) 1.3 శాతం వృద్ధి నమోదైంది. యూరప్‌ వ్యాపారం(ఆదాయంలో 22.4 శాతం వాటా) 4.7 శాతం ఎగబాకింది. ఇక భారత్‌కు సంబంధించి వ్యాపారంలో 14.2 శాతం వృద్ధి నమోదు కావడం గమనార్హం.

తాము కొత్తగా అనుసరించనున్న నిధుల కేటాయింపు పాలసీకి కొన్ని అనుమతుల కోసం వేచిచూస్తున్నామని కంపెనీ సీఎఫ్‌ఓ ఎం.డి.రంగనాథ్‌ చెప్పారు. ఒక క్రమపద్ధతిలో దీన్ని అమలు చేసేందుకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. ఈ పాలసీ ప్రకారం ప్రస్తుత 2017–18 ఆర్థిక సంవత్సరంలో డివిడెండ్‌/షేర్ల బైబ్యాక్‌ల కోసం రూ.13,000 కోట్ల మేర నిధులను ఖర్చుచేయాలని కంపెనీ నిర్ణయించిన సంగతి తెలిసిందే.

ఫలితాల నేపథ్యంలో ఇన్ఫీ షేరు బీఎస్‌ఈలో 3% పైగా ఎగబాకి రూ.1,007ను తాకింది. చివర్లో అమ్మకాలు చోటచేసుకోవడంతో స్వల్ప నష్టం(0.4%)తో రూ.972 వద్ద ముగిసింది.

ఆరు నెలల్లో 10 వేల జాబ్స్‌...
రానున్న రెండేళ్లలో అమెరికాలో తాము అక్కడి స్థానికులకు 10 వేల ఉద్యోగాలను కల్పించనున్నామని.. అయితే, వచ్చే ఆరు నెలల్లోపే భారత్‌లోకూడా అంతే మొత్తంలో కొత్త కొలువులు ఇవ్వనున్నట్లు కంపెనీ సీఈఓ విశాల్‌ సిక్కా పేర్కొన్నారు. అమెరికాలో ఉద్యోగ కల్పన ప్రభావం ఇక్కడి నియామకాలపై ఉండబోదని, హైరింగ్‌ను తగ్గించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఇప్పటికే కంపెనీ ఈ ఏడాది 19,000 క్యాంపస్‌ ఆఫర్లను ప్రకటించినట్లు కంపెనీ చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌(సీఓఓ) యూబీ ప్రవీణ్‌ రావు పేర్కొన్నారు. ఇందులో 12,000–13,000 మంది కంపెనీలో చేరుతారని అంచనా వేస్తున్నట్లు వివరించారు.

గడిచిన క్వార్టర్‌లో(ఏప్రిల్‌–జూన్‌) 1,000 మందికిపైగా కొత్తగా చేరారని ఆయన తెలిపారు. ఆటోమేషన్, కఠిన వీసా నిబంధనల కారణంగా ఐటీ రంగంలో ఇటీవలి కాలంలో భారీగా ఉద్యోగాల కోతలకు దారీతీస్తున్నట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. కాగా, క్యూ1లో నికరంగా 1,811 మంది ఉద్యోగాలు కంపెనీలో తగ్గాయి. దీంతో జూన్‌ చివరి నాటికి ఇన్ఫీ మొత్తం సిబ్బంది(అనుబంధ సంస్థలతో కలిపి) సంఖ్య 1,98,553కు చేరింది. జూన్‌ క్వార్టర్‌లో ఉద్యోగుల వలసల రేటు(అట్రిషన్‌) 21 శాతానికి ఎగబాకింది. మార్చి క్వార్టర్‌లో ఇది 17.1 శాతంగా ఉంది.

డ్రైవర్‌లెస్‌ కార్ట్‌లో సిక్కా ఎంట్రీ...
ఆర్థిక ఫలితాల ప్రకటన సందర్భంగా మీడియాతో మాట్లాడేందుకు ఇన్ఫీ సీఈఓ విశాల్‌ సిక్కా వినూత్న రీతిలో ఒక డ్రైవర్‌లెస్‌ వాహనం(గోల్ఫ్‌ కార్ట్‌)లో ఎంట్రీ ఇవ్వడం హైలైట్‌గా నిలిచింది. ఈ వాహనాన్ని ఇన్ఫోసిస్‌ మైసూర్‌ సెంటర్‌లోనే సొంతంగా తయారు చేయడం విశేషం. కృత్రిమ మేధస్సు ఇతరత్రా నవతరం సాంకేతిక పరిజ్ఞానాలపై తమ ఉద్యోగులకు శిక్షణ ఇవ్వడం కోసమే ఈ స్వయంచోదిత(అటానమస్‌) వాహనాన్ని అభివృద్ధి చేయడంపై తాము దృష్టిపెట్టామని ఆయన పేర్కొన్నారు. ‘అధునాతన, భవిష్యత్‌ టెక్నాలజీలను మనం ఆవిష్కరించలేమని ఎవరు చెప్పారు.

ఇప్పుడు నేను, ప్రవీణ్‌(సీఓఓ) వచ్చిన ఈ అటానమస్‌ వెహికల్‌(టెస్టింగ్‌ అవసరాలకు) స్వయంగా మైసూర్‌లోని ఇన్ఫోసిస్‌ ఇంజనీరింగ్‌ సర్వీసెస్‌ సెంటర్‌లో అభివృద్ధి చేసిందే’ అని సిక్కా ట్వీట్‌ చేశారు. కొత్త సేవలు, సాఫ్ట్‌వేర్‌లపై కంపెనీ నిరంతరం మరింతగా దృష్టి కేంద్రీకరిస్తుందనేదానికి ఇలాంటి ఆవిష్కణలే నిదర్శనం అని కూడా ఆయన పేర్కొన్నారు. కాగా, గూగుల్, ఉబెర్‌ వంటి దిగ్గజాలు ఇప్పటికే డ్రైవర్‌లెస్‌ వాహనాలను తీసుకొచ్చేందుకు ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే.

‘మార్జిన్లపై ఒత్తిడి, పలు సమస్యలు వెంటాడినప్పటికీ... విభిన్న రంగాలు, ప్రాంతాల నుంచి కూ1 ఆదాయంలో విస్తృత స్థాయి వృద్ధి సాధించగలిగాం. మొత్తంమీద కంపెనీ పనితీరు మెరుగైన రీతిలోనే కొనసా గుతోంది. గడిచిన ఆరు క్వార్టర్ల నుంచి వరుసగా ఉద్యోగుల ఉత్పాదకత సామర్థ్యం(రెవెన్యూ పర్‌ ఎంప్లాయీ) పుంజుకుంటుండటం ఉత్సాహకరమైన అంశం.   – విశాల్‌ సిక్కా, ఇన్ఫోసిస్‌ సీఈఓ, ఎండీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement