మెప్పించిన ఇన్ఫీ! | Infosys Q2 net profit grows 10.3% to Rs 4110 crore | Sakshi
Sakshi News home page

మెప్పించిన ఇన్ఫీ!

Published Tue, Oct 16 2018 11:58 PM | Last Updated on Tue, Oct 16 2018 11:58 PM

Infosys Q2 net profit grows 10.3% to Rs 4110 crore - Sakshi

బెంగళూరు: దేశంలో రెండో అతిపెద్ద ఐటీ సంస్థ ఇన్ఫోసిస్‌ అంచనాలను మించిన ఫలితాలతో ఆకట్టుకుంది. ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో (2018–19, క్యూ2) కంపెనీ కన్సాలిడేటెడ్‌ నికర లాభం రూ.4,110 కోట్లకు దూసుకెళ్లింది. క్రితం ఏడాది ఇదే క్వార్టర్‌లో లాభం రూ.3,726 కోట్లతో పోలిస్తే 10.3 శాతం వృద్ధి చెందింది. కంపెనీ మొత్తం ఆదాయం 17.3 శాతం ఎగబాకి రూ.17,567 కోట్ల నుంచి రూ.20,609 కోట్లకు చేరింది.

డిజిటల్‌ వ్యాపార ఆదాయాలు భారీగా పెరగడం, పటిష్టమైన కాంట్రాక్టుల ఆసరా, డాలరుతో రూపాయి మారకం విలువ క్యూ2లో క్షీణించడం కంపెనీ మెరుగైన పనితీరుకు దోహదం చేసింది. మార్కెట్‌ విశ్లేషకులు క్యూ2లో ఇన్ఫీ రూ.20,292 కోట్ల ఆదాయాన్ని, రూ.4,089 కోట్ల నికర లాభాన్ని ఆర్జించవచ్చని అంచనా వేశారు. కాగా, డాలరు రూపంలో కంపెనీ నికర లాభం స్వల్ప పెరుగుదలతో క్యూ2లో 581 మిలియన్‌ డాలర్లకు చేరింది. ఆదాయం 7.1 శాతం వృద్ధితో 2.92 బిలియన్‌ డాలర్లకు పెరిగింది.

సీక్వెన్షియల్‌గానూ జోరు...
ఈ ఏడాది తొలి త్రైమాసికం (క్యూ1)లో నికర లాభం రూ.3,612 కోట్లతో పోలిస్తే సీక్వెన్షియల్‌గా క్యూ2లో లాభం 13.8 శాతం ఎగబాకింది. అదేవిధంగా మొత్తం ఆదాయం కూడా సీక్వెన్షియల్‌ ప్రాతిపదికన 7.7 శాతం వృద్ధి చెందింది. ఈ ఏడాది క్యూ1లో ఆదాయం రూ.19,128 కోట్లుగా నమోదైంది.  

స్థిరంగా గైడెన్స్‌...
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం పూర్తి కాలానికి ఆదాయ వృద్ధి అంచనా(గైడెన్స్‌)ను ఇన్ఫోసిస్‌ స్థిరంగా కొనసాగించింది. గతంలో అంచనా వేసిన విధంగానే ఆదాయం 6–8 శాతం వృద్ధిని నమోదు చేయొచ్చని పేర్కొంది. నిర్వహణ (ఎబిట్‌) మార్జిన్‌ 22–24 శాతం ఉండొచ్చని అంచనా వేసింది. కాగా, ఈ ఏడాది క్యూ2లో నిర్వహణ మార్జిన్‌ ఇన్ఫీ గత అంచనాల మేరకే 23.7 శాతంగా నమోదైంది.

ఫలితాల్లో ఇతర ముఖ్యాంశాలివీ...
కంపెనీ మొత్తం ఆదాయంలో 31 శాతం వాటా ఉన్న డిజిటల్‌ వ్యాపారం ఆదాయం ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో 905 మిలియన్‌ డాలర్లకు చేరింది. సీక్వెన్షియల్‌గా 13.5 శాతం, క్రితం క్యూ2తో పోలిస్తే 33.5 శాతం వృద్ధి చెందింది.
    కీలకమైన బ్యాంకింగ్, ఫైనాన్షియల్‌ సేవలు–బీమా(బీఎఫ్‌ఎస్‌ఐ) వ్యాపార ఆదాయం 5.8 శాతం వృద్ధిని నమోదు చేసింది. క్యూ1లో ఈ విభాగం ఆదాయం 1.5 శాతం తగ్గడం గమనార్హం. మొత్తం ఆదాయంలో ఈ విభాగం వాటా 32.2 శాతంగా ఉంది.
సెప్టెంబర్‌ క్వార్టర్‌ ఇన్ఫోసిస్‌కు నిర్వహణపరంగానే కాకుండా ఆర్థిక పరంగానూ బ్లాక్‌బస్టర్‌గా నిలుస్తుందని కంపెనీ సీఎఫ్‌ఓ ఎండీ రంగనాథ్‌ వ్యాఖ్యానించారు. డిజిటల్‌ రంగంలో అవకాశాలను మరింతగా చేజిక్కించుకునేందుకు వ్యూహా త్మక పెట్టుబడులను కొనసాగిస్తామని చెప్పారు.
 రూ. 5 ముఖ విలువ గల ఒక్కో షేరుపై కంపెనీ డైరెక్టర్ల బోర్డు రూ.7 చొప్పున మధ్యంతర డివిడెండ్‌ను ప్రకటించింది.
   జూలై–సెప్టెంబర్‌ మూడు నెలల కాలంలో ఇన్ఫోసిస్‌ స్థూలంగా 19,721 మంది ఉద్యోగులను నియమించుకుంది. అయితే, 11,887 మంది కంపెనీ నుంచి వలసవెళ్లడంతో నికరంగా 7,834 నియామకాలు నమోదయ్యాయి. సెప్టెంబర్‌ చివరినాటికి కంపెనీ మొత్తం ఉద్యోగుల సంఖ్య 2,17,739కి చేరింది. క్యూ2లో వలసల(అట్రిషన్‌) రేటు 22.2 శాతంగా ఉంది.
మంగళవారం ఇన్ఫీ షేరు ధర బీఎస్‌ఈలో 0.4 శాతం నష్టంతో రూ.696 వద్ద స్థిరపడింది. మార్కెట్లో ట్రేడింగ్‌ ముగిసిన తర్వాత కంపెనీ ఫలితాలను ప్రకటించింది.

రాజీవ్‌ బన్సల్‌కు రూ.12 కోట్లు చెల్లిస్తాం...
కంపెనీ మాజీ సీఎఫ్‌ఓ రాజీవ్‌ బన్సల్‌కు రూ.12.17 కోట్లను చెల్లించాలన్న ఆర్బిట్రేషన్‌ ఆదేశాలకు కట్టుబడి ఉంటామని ఇన్ఫోసిస్‌ పేర్కొంది. 2015లో ఇన్ఫీకి రాజీనామా చేసిన బన్సల్‌కు వీడ్కోలు ప్యాకేజీ కింద 24 నెలల వేతనాన్ని(దాదాపు రూ.17.38 కోట్లు) ఇచ్చేం దుకు అప్పట్లో కంపెనీ అంగీకరించింది.

అయితే, ఇంత భారీ ప్యాకేజీ విషయంలో ఇన్ఫీ సహ వ్యవస్థాపకుడు ఎన్‌ఆర్‌ నారాయణ మూ ర్తి అభ్యంతరాలు లేవనెత్తడంతో రూ.5 కోట్లను మాత్రమే చెల్లించింది. అయితే, మిగతా 12.17 కోట్లను కూడా చెల్లించాల్సిందేనంటూ బన్సల్‌ ఆర్బిట్రేషన్‌ను ఆశ్రయించారు. రూ. 12.17 కోట్లను అప్పటినుంచి వడ్డీతో సహా బన్సల్‌కు చెల్లించాలంటూ ఆర్బిట్రేషన్‌ న్యాయాధికారి ఈ ఏడాది సెప్టెంబర్‌లో ఆదేశించారు.

‘అన్ని వ్యాపార విభాగాలు, ప్రాంతాల వారీగా కూడా క్యూ2లో విస్తృత స్థాయిలో వృద్ధిని సాధించడం ఆనందంగా ఉంది. క్లయింట్లతో పటిష్టమైన సంబంధాలు, డిజిటల్‌ వ్యాపార సామర్థ్యాలతోనే ఇది సాధ్యమైంది. అమెరికా, యూరప్‌లలో మంచి వ్యాపార మూలాల కారణంగా రానున్న కాలంలో మా సేవలకు బలమైన డిమాండ్‌ ఉంటుందని భావిస్తున్నాం. మరింత మెరుగైన వృద్ధిని సాధించగలమన్న విశ్వాసం ఉంది. క్యూ2లో 2 బిలియన్‌ డాలర్లకుపైగా విలువైన కాంట్రాక్టులను దక్కించుకోవడం క్లయింట్లకు మాపై ఉన్న నమ్మకానికి నిదర్శనం.’ – సలీల్‌ పారిఖ్‌ ఇన్ఫోసిస్‌ సీఈఓ–ఎండీ

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement