బెంగళూరు: దేశంలో రెండో అతిపెద్ద ఐటీ సేవల సంస్థ ఇన్ఫోసిస్... అంచనాలకు అనుగుణంగానే ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. ఈ ఏడాది మూడో త్రైమాసికంలో (2017–18, క్యూ3) అనుబంధ సంస్థలన్నిటితో కలిపి కంపెనీ కన్సాలిడేటెడ్ నికర లాభం 38.3% ఎగబాకి రూ.5,129 కోట్లకు దూసుకెళ్లింది. క్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ.3,708 కోట్లుగా ఉంది. కాగా, క్యూ3లో కంపెనీ మొత్తం ఆదాయం 3% వృద్ధి చెంది రూ.17,273 కోట్ల నుంచి రూ.17,794 కోట్లకు చేరింది.
ఈ జోరుకు కారణమేంటంటే...
ప్రధానంగా ఈ మూడో త్రైమాసికంలో తాము అమెరికాతో కుదుర్చుకున్న అడ్వాన్స్‌డ్ ప్రైసింగ్ ఒప్పందం కారణంగా చెల్లించాల్సిన పన్నులు వెనక్కి రావడం లాభాలు ఈ స్థాయిలో పెరిగేందుకు దోహదం చేసినట్లు ఇన్ఫోసిస్ తెలియజేసింది. అమెరికా కార్యకలాపాలకు సంబంధించి దాదాపు రూ.1,432 కోట్ల ఆదాయపు పన్ను వెనక్కి వచ్చిందని తెలిపింది. సెప్టెంబర్ క్వార్టర్‌లో రూ.1,471 కోట్ల పన్ను వ్యయాలు ఉండగా.. డిసెంబర్ త్రైమాసికంలో ఇది రూ.144 కోట్లకు తగ్గినట్లు ఇన్ఫీ వివరించింది. తాజాగా ఐటీ అగ్రగామి టీసీఎస్ కూడా మెరుగైన ఆర్థిక ఫలితాలను ప్రకటించిన సంగతి తెలిసిందే.
సీక్వెన్షియల్‌గా చూస్తే...
ఈ ఏడాది క్యూ2 (జూలై–సెప్టెంబర్) క్వార్టర్‌లో ఇన్ఫోసిస్ నికర లాభం రూ.3,726 కోట్లుగా నమోదైంది. దీంతో పోలిస్తే... క్యూ3లో లాభం 37.6 శాతం వృద్ధి చెందింది. పన్ను ప్రయోజనాలను తీసేసి చూస్తే... సీక్వెన్షియల్ ప్రాతిపదికన (క్యూ2తో పోలిస్తే) డిసెంబర్ క్వార్టర్‌లో లాభం కొద్దిగా తగ్గినట్లు లెక్క.
ఇక ఆదాయం కూడా సీక్వెన్షియల్‌గా 1.3 శాతం (క్యూ2లో రూ.17,567 కోట్లు) పెరిగింది. మార్కెట్ విశ్లేషకులు ఇన్ఫోసిస్ క్యూ3లో రూ.3,609 కోట్ల నికర లాభాన్ని, రూ.17,823 కోట్ల ఆదాయాన్ని ఆర్జించవచ్చని అంచనా వేశారు. ఈ స్థాయిలోనే ఫలితాలు నమోదయ్యాయి. డాలర్ల రూపంలో ఇన్ఫీ నికర లాభం క్యూ3లో 796 మిలియన్లకు చేరింది. ఆదాయం 2.7 బిలియన్ డాలర్లుగా నమోదైంది.
స్థిరంగా గైడెన్స్...
గత రెండు త్రైమాసికాలుగా ఆదాయ వృద్ధి అంచనాలను (గైడెన్స్) తగ్గించుకుంటూ వచ్చిన ఇన్ఫోసిస్.. క్యూ3లో దీన్ని స్థిరంగానే ఉంచడం గమనార్హం. ప్రస్తుత 2017–18 పూర్తి ఏడాదికి ఆదాయంలో 5.5–6.5 శాతం వృద్ధి ఉండొచ్చని (స్థిర కరెన్సీ) ఫలితాల సందర్భంగా పేర్కొంది. డాలర్ ఆదాయంలో 6.5–7.5% వృద్ధిని అంచనా వేసింది.
కంపెనీ కొత్త సీఈఓ సలీల్ పరేఖ్ నేతృత్వంలో తొలి త్రైమాసిక ఆర్థిక ఫలితాలివి. ప్రమోటర్లతో పాలనాపరమైన విభేదాల కారణంగా విశాల్ సిక్కా గతేడాది ఆగస్టులో అర్ధంతరంగా సీఈఓ పదవి నుంచి వైదొలగడంతో పరేఖ్‌ను కంపెనీ కొత్త సీఈఓ, ఎండీగా నియమించిన సంగతి తెలిసిందే.
ఫలితాల్లో ఇతర ముఖ్యాంశాలివీ...
♦ క్యూ3లో 100 మిలియన్ డాలర్ల విభాగంలో ఇన్ఫీ ఒక క్లయింట్‌ను దక్కించుకుంది. 75 మిలియన్ డాలర్ల విలువైన 3 కాంట్రాక్టులు, 50 మిలియన్ డాలర్ల విలువైన ఒక కాంట్రాక్టు లభించాయి. మొత్తంమీద డిసెంబర్ ఆఖరుకి ఇన్ఫీ క్లయింట్ల సంఖ్య (కాంట్రాక్టులు కొనసాగుతున్నవి) 1,191కి పెరిగింది. సెప్టెంబర్ చివరికి ఈ సంఖ్య 1,173.
♦ ప్రాంతాలవారీగా చూస్తే... డిసెంబర్ క్వార్టర్‌లో అమెరికా, యూరప్ వ్యాపారం మెరుగైన రీతిలోనే కొనసాగింది. భారత్, మిగతా దేశాలకు సంబంధించిన వ్యాపారం మాత్రం కాస్త నిరుత్సాహకరంగా ఉంది.
♦ క్యూ3లో నికరంగా 3,251 మంది ఉద్యోగులను కంపెనీ నియమించుకుంది. 2017 డిసెంబర్ చివరినాటికి మొత్తం ఉద్యోగుల సంఖ్య 2.01 లక్షలుకు చేరింది.
♦క్యూ3లో ఇన్ఫీ మొత్తం ఉద్యోగుల వలసల(అట్రిషన్) రేటు 18.7%కి తగ్గింది. క్యూ2లో ఇది 21.4%.
♦ కంపెనీ ప్రెసిడెంట్ రాజేష్ మూర్తి వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేసినట్లు ఇన్ఫీ పేర్కొంది.
షేరు జోరు...!
ఇన్ఫోసిస్ షేరు శుక్రవారం స్వల్పంగా 0.26 శాతం లాభపడి రూ.1,078 వద్ద ముగిసింది. స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ ముగిసిన తర్వాత ఆర్థిక ఫలితాలు వెలువడ్డాయి. మెరుగైన ఫలితాలు, స్థిరమైన గైడెన్స్ నేపథ్యంలో సోమవారం (15న) షేరుపై సానుకూల ప్రభావం ఉండొచ్చని మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కాగా, అక్టోబర్–డిసెంబర్ కాలంలో ఇన్ఫీ షేరు 15.6 శాతం పెరిగింది. ఇదే కాలంలో నిఫ్టీ 7.6 శాతం, నిఫ్టీ ఐటీ సూచీ 11.4 శాతం చొప్పున పెరగడం గమనార్హం.
ఏప్రిల్‌లో భవిష్యత్తు కార్యాచరణ...
క్యూ3లో మేం పటిష్టమైన పనితీరును సాధించాం. స్థిరమైన వృద్ధి బాటలో పయనిస్తున్నాం. క్లయింట్లకు మెరుగైన సేవలతోపాటు, కొత్త పరిజ్ఞానాలు, వ్యాపార విభాగాల్లో డిమాండ్‌ను అందిపుచ్చుకోవడంపై మరింత దృష్టిసారిస్తున్నాం. ఇక కంపెనీ వ్యూహాత్మక ప్రాధాన్యాలు, భవిష్యత్తు కార్యాచరణను (రోడ్‌మ్యాప్) ఏప్రిల్‌లో ప్రకటిస్తాం.
కంపెనీ చైర్మన్ నందన్ నీలేకని ప్రారంభించిన వ్యూహాల ఆధారంగా ఇది ఉంటుంది. దీనిపైనే ఇప్పుడు కసరత్తు జరుగుతోంది. సీఈఓగా బాధ్యతలు చేపట్టాక ప్రస్తుతం నా తక్షణ ప్రాధాన్యం... క్లయింట్లు, ఉద్యోగులతో సంబంధాలను బలోపేతం చేసుకోవడం భవిష్యత్తు రోడ్‌మ్యాప్‌ను సిద్ధం చేయడమే. క్లయింట్లు డిజిటల్ పరిజ్ఞానం వైపు మరలుతుండటంతో మాకు ఇది కొత్త అవకాశాలను సృష్టిస్తోంది.
– సలీల్ పరేఖ్, ఇన్ఫీ ఎండీ–సీఈఓ
వాటాదారులతో విస్తృతంగా చర్చించాం: నీలేకని
కంపెనీ పనితీరు మెరుగుదల, ప్రస్తుతం ఏవిధంగా రాణిస్తోంది అన్న అంశాలపై వాటాదారులతో విస్తృత స్థాయిలో చర్చలు జరిపి, వారినుంచి అభిప్రాయాలను తీసుకున్నామని ఇన్ఫీ చైర్మన్ నందన్ నీలేకని చెప్పారు. కొత్తగా మరింత మంది డైరెక్టర్లను తీసుకోవటంపై తగిన సమయంలో నిర్ణయం తీసుకుంటామన్నారు.
కాగా, ఎన్నాళ్లు చైర్మన్‌గా కొనసాగుతారన్న ప్రశ్నకు... ‘కంపెనీకి నా అవసరం ఉన్నన్నాళ్లు సేవలందిస్తా. ఆ తర్వాత ఒక్కరోజు కూడా ఈ పదవిలో ఉండను’ అని సమాధానమిచ్చారు. కొత్త సీఈఓ పరేఖ్ ఇన్ఫీని చక్కదిద్దేవిషయంలో పురోగతిని సాధించారన్నారు.
Comments
Please login to add a commentAdd a comment