న్యూఢిల్లీ: సాఫ్ట్‌వేర్ సేవలకు దేశంలోనే రెండో ర్యాంకులో నిలుస్తున్న ఇన్ఫోసిస్ ఉద్యోగులకు పనితీరు ఆధారంగా చేపట్టే చెల్లింపుల(వేరియబుల్ పే)లో తాజాగా కోత పెట్టింది. సగటు చెల్లింపులను 70 శాతానికి పరిమితం చేసేందుకు నిర్ణయించింది. మార్జిన్లు మందగించడం, ఉపాధి వ్యయాలు పెరగడం వంటి అంశాల నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) తొలి త్రైమాసికం(ఏప్రిల్–జూన్)లో కంపెనీ వేరియబుల్ పేను కుదించినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.
ఈ అంశాన్ని ఉద్యోగులకు సైతం తెలియజేసినట్లు వెల్లడించాయి. వేరియబుల్ పే విషయంలో ఐటీ సేవల దేశీ దిగ్గజం విప్రో సైతం ఇటీవల వెనకడుగు వేసిన విషయం విదితమే. ప్రధానంగా టెక్నాలజీపై పెరిగిన పెట్టుబడులు, మార్జిన్లపై ఒత్తిడి, నైపుణ్య సరఫరా చైన్ బలహీనపడటం వంటి అంశాలు ప్రభావం చూపాయి. కాగా.. ఐటీ సేవలకు నంబర్‌వన్‌గా కొనసాగుతున్న టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్) కొంతమంది ఉద్యోగులకు త్రైమాసిక వేరియబుల్ పే చెల్లింపుల విషయంలో నెల రోజులపాటు ఆలస్యం చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఫలితాలు డీలా
ఈ ఏడాది ఏప్రిల్–జూన్(క్యూ1) ఫలితాలలో ఇన్ఫోసిస్ నికర లాభం అంచనాలకంటే తక్కువ వృద్ధిని సాధించింది. పెరిగిన వ్యయాల కారణంగా 3.2 శాతానికి పరిమితమైంది. అయితే పూర్తి ఏడాది ఆదాయ అంచనాలను మాత్రం కంపెనీ 14–16 శాతానికి పెంచింది. ఇందుకు పటిష్ట డీల్ పైప్‌లైన్ సహకరించింది. ఇక 21–23 శాతం మార్జిన్లను ఆశిస్తోంది. క్యూ1లో 20 శాతం మార్జిన్లను అందుకుంది. ఉద్యోగలబ్ది, ప్రయాణ ఖర్చులు, సబ్‌కాంట్రాక్టు వ్యయాలు వంటివి ప్రభావం చూపాయి.
దీనికితోడు భారీగా పెరిగిన ఉద్యోగ వలస(అట్రిషన్) దేశీ ఐటీ రంగ లాభదాయకతను దెబ్బతీస్తోంది. అయితే నిపుణులను ఆకట్టుకోవడం, పోటీస్థాయిలో వేతనాల పెంపు వంటివి చేపట్టడం ద్వారా వృద్ధిని కొనసాగించనున్నట్లు ఇన్ఫోసిస్ సీఎఫ్‌వో నీలాంజన్ రాయ్ ఇటీవల పేర్కొనడం గమనార్హం! ఇది స్వల్ప కాలంలో మార్జిన్లను బలహీనపరచినప్పటికీ అట్రిషన్‌ను తగ్గిస్తుందని, భవిష్యత్ వృద్ధికి మద్దతుగా నిలుస్తుందని అభిప్రాయపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment