
ప్రముఖ ఫిన్‌టెక్ కంపెనీ పేటీఎం మాతృ సంస్థ వన్ 97 కమ్యూనికేషన్ లిమిటెడ్ కీలక నిర్ణయం తీసుకుంది. పేటీఎం జనరల్ ఇన్సూరెన్స్ లిమిటెడ్ (పీజీఐఎల్) సంస్థ జనరల్ ఇన్సూరెన్స్ లైసెన్స్ అప్లికేషన్‌ను విత్ డ్రా చేసుకుంటున్నట్లు స్టాక్ ఎక్ఛేంజ్ ఫైలింగ్‌లో తెలిపింది.
దీంతో ఇకపై పీజీఐఎల్ ఇన్సూరెన్స్ నేరుగా తన కస్టమర్లకు ఇన్సూరెన్స్ పాలసీలను అమ్మేందుకు వీలు లేదు. థర్డ్ పార్టీ కార్యకలాపాల్లో పాల్గొనవచ్చు. అంటే ఇతర ఇన్సూరెన్స్ పాలసీల నిర్వహణ, అమ్మకాలు చేయొచ్చు.
జనరల్ ఇన్సూరెన్స్ లైసెన్సు కోసం దరఖాస్తును ఉపసంహరించుకోవడం ద్వారా మాతృ సంస్థ రూ. 950 కోట్ల నగదును ఆదా చేసుకునేందుకు వీలు అవుతుందని పేటీఎం తెలిపింది. ఆ మొత్తాన్ని పీజీఐఎల్‌లో పెట్టుబడి పెట్టేందుకు కేటాయిస్తున్నట్లు వెల్లడించింది.
మరో అనుబంధ సంస్థ పేటీఎం ఇన్సూరెన్స్ బ్రోకింగ్ ప్రైవేట్ లిమిటెడ్, పేటీఎం వినియోగదారులకు, చిరు వ్యాపారులకు ఇతర పరిశ్రమలకు ఇన్సూరెన్స్ సేవల్ని అందించడంపై దృష‍్టి సారిస్తామని తెలిపింది.