1,500 కోట్లతో అణు ప్రమాద నిధి
జనరల్ ఇన్సూరెన్స్ సహా 12 సంస్థలతో ఏర్పాటు
కేంద్ర మంత్రి జితేంద్రసింగ్ వెల్లడి
విదేశీ అణు సంస్థలకు నష్టపరిహారం బాధ్యత లేనట్లే!
{పమాదం జరిగితే ఈ నిధి నుంచే పరిహారం
న్యూఢిల్లీ: దేశంలో అణు విద్యుత్ కేంద్రాలను నిర్మించే అంతర్జాతీయ అణు సంస్థలకు ప్రయోజనం కలిగించేలా... రూ.1,500 కోట్లతో అణు ప్రమాద బీమా నిధిని కేంద్రం ఏర్పాటు చేసింది. ఒకవేళ ఆయా అణు విద్యుత్ కేంద్రాల్లో ఏదైనా ప్రమాదం జరిగినట్లయితే ఈ నిధి నుంచే నష్టపరిహారాన్ని చెల్లిస్తారు. తద్వారా విదేశీ అణు సంస్థలు నష్టపరిహారం చెల్లించాల్సిన బాధ్యత నుంచి తప్పించుకున్నట్లే! ఈ విషయాన్ని అణు ఇంధన శాఖ సహాయ మంత్రి జితేంద్రసింగ్ శనివారం ఢిల్లీలో వెల్లడించారు. అణు ప్రమాద పరిహారం అంశం కారణంగానే ‘గోరఖ్‌పూర్ హరియాణా అణువిద్యుత్ పరియోజన’ వంటి పలు ప్రాజెక్టుల నిర్మాణాలు నిలిచిపోయాయని.. ఇప్పుడు ఆ ప్రాజెక్టుల పనులన్నీ తిరిగి ప్రారంభమవుతాయని చెప్పారు. అంతేగాకుండా దేశంలో కొత్త అణు విద్యుత్ కేంద్రాల ఏర్పాటుకు అంతర్జాతీయ సంస్థలు ముందుకు వస్తాయన్నారు. ఐదేళ్లలో విద్యుదుత్పత్తిని మూడింతలు చేయాలన్న ప్రధాని మోదీ లక్ష్యాన్ని సాధించేందుకు ఇది తోడ్పతుందని పేర్కొన్నారు. కాగా అణుశక్తిపై అపోహలను తొలగించేందుకు, అవగాహన కల్పించేందుకు ఢిల్లీలోని జాతీయ సైన్స్ సెంటర్‌లో ఒక ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ప్రమాదాల బాధ్యత నుంచి అణు రియాక్టర్లు, పరికరాల సరఫరాదారులకు ఉపశమనం కోసమే ఈ నిధిని ఏర్పాటు చేశారని అణుశక్తి విభాగం కార్యదర్శి ఆర్‌కే సిన్హా చెప్పారు.
12 సంస్థల ఆధ్వర్యంలో..
జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (జీఐసీ)తో పాటు న్యూ ఇండియా, ఓరియంటల్ ఇన్సూరెన్స్, నేషనల్ ఇన్సూరెన్స్, యునెటైడ్ ఇండియా ఇన్సూరెన్స్ తదితర 11 ఇతర జీవితబీమాయేతర సంస్థల ఆధ్వర్యంలో అణు ప్రమాద బీమా నిధిని ఏర్పాటు చేశారు. దీనికి కింద ‘న్యూక్లియర్ ఆపరేటర్స్ లయబిలిటీ ఇన్సూరెన్స్ పాలసీ’, ‘న్యూక్లియర్ సప్లయర్స్ స్పెషల్ కంటింజెన్సీ పాలసీ’లను అందిస్తారు. అయితే ఈ కంపెనీలన్నీ కలసినా ఇంకా రూ.600 కోట్లు తగ్గాయని.. అందులో వంద కోట్లను ఒక దేశీయ బీమా కంపెనీ, మిగతా రూ.500 కోట్లను బ్రిటిష్ అణు బీమా నిధితో భర్తీ చేస్తారని జీఐసీ జనరల్ మేనేజర్ వై.రాములు చెప్పారు. ట
ఎందుకీ ఏర్పాటు..?
యూపీఏ హయాంలో తెచ్చిన అణు ప్రమాదాల జవాబుదారీ చట్టం (సీఎల్‌ఎన్‌డీ) ప్రకారం... అణు విద్యుత్ కేంద్రాల్లో ఏదైనా ప్రమాదం జరిగితే ఆ అణు రియాక్టర్లను సరఫరా చేసిన సంస్థల నుంచి నష్టపరిహారాన్ని పొందవచ్చు. ఈ నష్టపరిహారం అత్యంత భారీగా ఉండే నేపథ్యంలో విదేశీ సంస్థలు అణు రియాక్టర్ల సరఫరా, విద్యుత్ కేంద్రాల నిర్మాణంపై వెనుకడుగు వేశాయి. దీంతో ఒకవేళ అణు విద్యుత్ కేంద్రాల్లో ప్రమాదాలు జరిగితే బాధితులకు నష్టపరిహారం చెల్లించేందుకు ప్రత్యేకంగా ఒక బీమా నిధిని ఏర్పాటు చేస్తామని, కంపెనీలకు బాధ్యత లేకుండా చేస్తామని కేంద్ర ప్రభుత్వం అంతర్జాతీయ అణు సంస్థలకు హామీ ఇచ్చింది. అందులో భాగంగా ఎన్డీయే ప్రభుత్వం రూ.1,500 కోట్లతో ‘అణు ప్రమాద బీమా నిధి’ని ఏర్పాటు చేసింది.