Minister Jitendra Singh
-
వాళ్లు మానసికంగా భారతీయులు కారు
సాక్షి, ఢిల్లీ : నరేంద్ర మోదీ భారతదేశానికి తండ్రిలాంటి వారని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలకు ప్రతీ భారతీయుడు గర్వపడాలని కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ బుధవారం వ్యాఖ్యానించారు. ఒకవేళ ఎవరికైనా గర్వంగా అనిపించకపోతే వారు మానసికంగా భారతీయులు కానట్టే లెక్క అని తేల్చి చెప్పారు. మంగళవారం న్యూయార్క్‌లో భారత్, అమెరికా దేశాధినేతల మధ్య ద్వైపాక్షిక చర్చల అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో ట్రంప్ ఓ ప్రశ్నకు జవాబిస్తూ.. అన్ని వర్గాలనూ ఏకం చేసిన నాయకుడిగా, భారతదేశానికి ఒక తండ్రిగా నరేంద్రమోదీని మేం గుర్తిస్తున్నామని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అగ్రదేశ అధ్యక్షుడి నోటి వెంట వచ్చిన మాటలకు ఎంతో విలువుందని జితేందర్ సింగ్ అభిప్రాయపడ్డారు. ఒక దేశ ప్రధాని గురించి అమెరికా అధ్యక్షుడు ఇలా మాట్లాడడం ఇంతవరకు చరిత్రలో ఎప్పుడూ జరగలేదన్న విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. ఇది మన దేశానికి దక్కిన గౌరవమని ఆయన పేర్కొన్నారు. మరోవైపు ఉగ్రవాదం విషయంలో ఇంతకు ముందు కొన్ని దేశాలు మన మాటలను అంతగా పట్టించుకునేవి కావనీ, కానీ ఇప్పుడు ఇస్లామిక్ దేశాలు సహా ప్రపంచంలోని ఏ దేశం కూడా పాకిస్తాన్‌కు మద్దతునివ్వడంలేదన్న విషయం గమనించాలన్నారు. ఇది కేవలం ప్రధాని నరేంద్రమోదీ వల్లే సాధ్యమైందని కొనియాడారు. -
కృష్ణపట్నం పోర్టులో పచ్చదనం భేష్
కేంద్ర మంత్రి జితేంద్రసింగ్ ముత్తుకూరు: పర్యావరణానికి మారుపేరుగా కృష్ణపట్నంపోర్టు పచ్చదనంతో పరిఢవిల్లుతోందని ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి, సెంట్రల్ అటమిక్ ఎనర్జీ–స్సేస్ మినిస్టర్ జితేంద్రసింగ్ పేర్కొన్నారు. కృష్ణపట్నంపోర్టును ఆదివారం కేంద్రమంత్రి సందర్శించారు. పోర్టులో జరుగుతున్న అభివృద్ధి పనులు, ఎగుమతి–దిగుమతి కార్యకలాపాలను పరిశీలించారు. జరుగుతున్న ప్రగతిని పోర్టు అధినేత చింతా శశిధర్, సీఈఓ అనీల్ ఎండ్లూరి వివరించారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి మాట్లాడుతూ దేశంలో త్వరతగతిన అభివృద్ధి చెందుతున్న ఓడరేవుల్లో కృష్ణపట్నంపోర్టు ఒకటిగా నిలిచిందన్నారు. కాలుష్య నివారణకు,పర్యావరణ పరిరక్షణకు తీసుకుంటున్న చర్యలు, స్వచ్ఛభారత్ అమలు సంతృప్తికరంగా ఉన్నాయన్నారు. ఎగుమతి, దిగుమతుల్లో పురోగతి ద్వారా ఆర్ధికాభివృద్ధి సాధించడం సంతోషంగా ఉందన్నారు. వాణిజ్యవేత్తలు, పారిశ్రామికవేత్తలకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించడం పోర్టులో కల్పించారన్నారు. అనంతరం గోపాలపురంలోని కేఎస్ఎస్పీఎల్ సెక్యూరిటీ కేంద్రాన్ని సందర్శించారు. సెక్యూరిటీ గార్డుల గౌరవవందనం స్వీకరించారు. వనం–మనం కింద మొక్కలు నాటారు. సీవీఆర్ స్కూల్ విద్యార్థులతో ముచ్చటించారు. ఆస్పత్రి, వంటశాల, మొక్కల పెంపకం, స్కిల్ డెవలప్మెంట్ తరగతులు, ఇతర సౌకర్యాలను పరిశీలించారు. పోర్టు అభివృద్ధిపై రూపొందించిన బ్రోచర్‌ను ఆవిష్కరించారు. ప్రిన్సిపల్ రాజేంద్రప్రసాద్, పీఆర్వో వేణుగోపాల్ పాల్గొన్నారు. -
‘ట్రస్టు చట్ట సవరణ’కు లోక్‌సభ ఆమోదం
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ నిరసనల మధ్యే లోక్‌సభ బుధవారం ‘భారతీయ ట్రస్టుల చట్టం (1882) సవరణ 2015’కు ఆమోదముద్ర వేసింది. ఈ చట్టం వల్ల ట్రస్టులకు స్వయం ప్రతిపత్తి ఇవ్వటంతోపాటు.. వీటి నిధులను సెక్యూరిటీస్‌లో పెట్టుబడిపెట్టేందుకు వీలుంటుంది. 2014 డిసెంబర్లో ఈ బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ► వస్తు సేవల పన్ను (జీఎస్టీ) బిల్లు అమలుకు విపక్ష కాంగ్రెస్ సహకరించాలని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి వెంకయ్య కోరారు. ప్రస్తుత పరిస్థితుల్లో జీఎస్టీ అమలు దేశానికి చాలా కీలకమన్నారు. ► త్వరలో రష్యాలో పర్యటించనున్న ప్రధాని అణుబంధ విస్తృతిపైనే ప్రధానంగా చర్చిస్తారని పీఎంవో సహాయ మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. ► మొబైల్ వినియోగదారులకు ఎస్టీడీ చార్జీల తొలగింపుపై ఎలాంటి ప్రతిపాదన లేదని టెలికాం మంత్రి రవిశంకర్ లోక్‌సభకు తెలిపారు. ► సిబ్బంది శిక్షణ విభాగం(డీవోపీటీ) అనుమతి తీసుకున్నాకే గ్రూప్-బీ నాన్‌గెజిటెడ్, గ్రూప్-సీ ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు నిర్వహించుకోవాలని వివిధ ప్రభుత్వ విభాగాలకు కేంద్రం స్పష్టం చేసింది. ► వచ్చే ఏడాది దేశవ్యాప్తంగా మహారాణా ప్రతాప్ 475వ జయంతిని ఘనంగా నిర్వహిస్తామని కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి మహేశ్ శర్మ తెలిపారు. ► ‘జాతీయ నేత’గా ఎవరిని ప్రకటించాలనే విషయంలో నిబంధనలేమీలేవని కాంగ్రెస్ ఎంపీ పాల్వాయి గోవర్ధన్ రెడ్డి ప్రశ్నకు ప్రభుత్వం జవాబిచ్చింది. -
1,500 కోట్లతో అణు ప్రమాద నిధి
జనరల్ ఇన్సూరెన్స్ సహా 12 సంస్థలతో ఏర్పాటు కేంద్ర మంత్రి జితేంద్రసింగ్ వెల్లడి విదేశీ అణు సంస్థలకు నష్టపరిహారం బాధ్యత లేనట్లే! {పమాదం జరిగితే ఈ నిధి నుంచే పరిహారం న్యూఢిల్లీ: దేశంలో అణు విద్యుత్ కేంద్రాలను నిర్మించే అంతర్జాతీయ అణు సంస్థలకు ప్రయోజనం కలిగించేలా... రూ.1,500 కోట్లతో అణు ప్రమాద బీమా నిధిని కేంద్రం ఏర్పాటు చేసింది. ఒకవేళ ఆయా అణు విద్యుత్ కేంద్రాల్లో ఏదైనా ప్రమాదం జరిగినట్లయితే ఈ నిధి నుంచే నష్టపరిహారాన్ని చెల్లిస్తారు. తద్వారా విదేశీ అణు సంస్థలు నష్టపరిహారం చెల్లించాల్సిన బాధ్యత నుంచి తప్పించుకున్నట్లే! ఈ విషయాన్ని అణు ఇంధన శాఖ సహాయ మంత్రి జితేంద్రసింగ్ శనివారం ఢిల్లీలో వెల్లడించారు. అణు ప్రమాద పరిహారం అంశం కారణంగానే ‘గోరఖ్‌పూర్ హరియాణా అణువిద్యుత్ పరియోజన’ వంటి పలు ప్రాజెక్టుల నిర్మాణాలు నిలిచిపోయాయని.. ఇప్పుడు ఆ ప్రాజెక్టుల పనులన్నీ తిరిగి ప్రారంభమవుతాయని చెప్పారు. అంతేగాకుండా దేశంలో కొత్త అణు విద్యుత్ కేంద్రాల ఏర్పాటుకు అంతర్జాతీయ సంస్థలు ముందుకు వస్తాయన్నారు. ఐదేళ్లలో విద్యుదుత్పత్తిని మూడింతలు చేయాలన్న ప్రధాని మోదీ లక్ష్యాన్ని సాధించేందుకు ఇది తోడ్పతుందని పేర్కొన్నారు. కాగా అణుశక్తిపై అపోహలను తొలగించేందుకు, అవగాహన కల్పించేందుకు ఢిల్లీలోని జాతీయ సైన్స్ సెంటర్లో ఒక ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ప్రమాదాల బాధ్యత నుంచి అణు రియాక్టర్లు, పరికరాల సరఫరాదారులకు ఉపశమనం కోసమే ఈ నిధిని ఏర్పాటు చేశారని అణుశక్తి విభాగం కార్యదర్శి ఆర్కే సిన్హా చెప్పారు. 12 సంస్థల ఆధ్వర్యంలో.. జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (జీఐసీ)తో పాటు న్యూ ఇండియా, ఓరియంటల్ ఇన్సూరెన్స్, నేషనల్ ఇన్సూరెన్స్, యునెటైడ్ ఇండియా ఇన్సూరెన్స్ తదితర 11 ఇతర జీవితబీమాయేతర సంస్థల ఆధ్వర్యంలో అణు ప్రమాద బీమా నిధిని ఏర్పాటు చేశారు. దీనికి కింద ‘న్యూక్లియర్ ఆపరేటర్స్ లయబిలిటీ ఇన్సూరెన్స్ పాలసీ’, ‘న్యూక్లియర్ సప్లయర్స్ స్పెషల్ కంటింజెన్సీ పాలసీ’లను అందిస్తారు. అయితే ఈ కంపెనీలన్నీ కలసినా ఇంకా రూ.600 కోట్లు తగ్గాయని.. అందులో వంద కోట్లను ఒక దేశీయ బీమా కంపెనీ, మిగతా రూ.500 కోట్లను బ్రిటిష్ అణు బీమా నిధితో భర్తీ చేస్తారని జీఐసీ జనరల్ మేనేజర్ వై.రాములు చెప్పారు. ట ఎందుకీ ఏర్పాటు..? యూపీఏ హయాంలో తెచ్చిన అణు ప్రమాదాల జవాబుదారీ చట్టం (సీఎల్‌ఎన్‌డీ) ప్రకారం... అణు విద్యుత్ కేంద్రాల్లో ఏదైనా ప్రమాదం జరిగితే ఆ అణు రియాక్టర్లను సరఫరా చేసిన సంస్థల నుంచి నష్టపరిహారాన్ని పొందవచ్చు. ఈ నష్టపరిహారం అత్యంత భారీగా ఉండే నేపథ్యంలో విదేశీ సంస్థలు అణు రియాక్టర్ల సరఫరా, విద్యుత్ కేంద్రాల నిర్మాణంపై వెనుకడుగు వేశాయి. దీంతో ఒకవేళ అణు విద్యుత్ కేంద్రాల్లో ప్రమాదాలు జరిగితే బాధితులకు నష్టపరిహారం చెల్లించేందుకు ప్రత్యేకంగా ఒక బీమా నిధిని ఏర్పాటు చేస్తామని, కంపెనీలకు బాధ్యత లేకుండా చేస్తామని కేంద్ర ప్రభుత్వం అంతర్జాతీయ అణు సంస్థలకు హామీ ఇచ్చింది. అందులో భాగంగా ఎన్డీయే ప్రభుత్వం రూ.1,500 కోట్లతో ‘అణు ప్రమాద బీమా నిధి’ని ఏర్పాటు చేసింది. -
‘ద్రోణాచార్య’కు మరో ఐదుగురు
న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక ‘ద్రోణాచార్య జీవితకాల సాఫల్య పురస్కారం’ కోసం మరో ఐదుగురి పేర్లను సిఫారసు చేశారు. సుదీర్ఘ కాలంగా సేవలందిస్తున్న ఆర్చరీ కోచ్ పూర్ణిమా మహతో, మహిళా హాకీ కోచ్ నరేంద్ర సింగ్ సైనీలతో పాటు రాజ్ సింగ్ (రెజ్లింగ్), కేపీ థామస్ (అథ్లెటిక్స్), మహావీర్ సింగ్ (బాక్సింగ్)లను ఈ అవార్డు కోసం ప్రతిపాదించారు. ప్రస్తుతం ఈ జాబితాను కేంద్ర క్రీడల మంత్రి జితేంద్ర సింగ్ ఆమోదం కోసం పంపారు. ఈనెల మధ్యలో దీనిపై అధికారిక ప్రకటన వెలువడొచ్చు. సునీల్ గవాస్కర్ (క్రికెట్), విజయ్ అమృత్‌రాజ్ (టెన్నిస్)ల పేర్లను కూడా ఈ పురస్కారం కోసం ప్రతిపాదించినా వీళ్లకు దక్కే అవకాశం లేదు. ఎందుకంటే నిబంధనల ప్రకారం ‘అర్జున’ అవార్డును తీసుకున్న క్రీడాకారులను ‘ధ్యాన్‌చంద్’కు పరిగణనలోకి తీసుకోరు.