మాట్లాడుతున్న కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్
సాక్షి, ఢిల్లీ : నరేంద్ర మోదీ భారతదేశానికి తండ్రిలాంటి వారని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలకు ప్రతీ భారతీయుడు గర్వపడాలని కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ బుధవారం వ్యాఖ్యానించారు. ఒకవేళ ఎవరికైనా గర్వంగా అనిపించకపోతే వారు మానసికంగా భారతీయులు కానట్టే లెక్క అని తేల్చి చెప్పారు. మంగళవారం న్యూయార్క్‌లో భారత్, అమెరికా దేశాధినేతల మధ్య ద్వైపాక్షిక చర్చల అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో ట్రంప్ ఓ ప్రశ్నకు జవాబిస్తూ.. అన్ని వర్గాలనూ ఏకం చేసిన నాయకుడిగా, భారతదేశానికి ఒక తండ్రిగా నరేంద్రమోదీని మేం గుర్తిస్తున్నామని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో అగ్రదేశ అధ్యక్షుడి నోటి వెంట వచ్చిన మాటలకు ఎంతో విలువుందని జితేందర్ సింగ్ అభిప్రాయపడ్డారు. ఒక దేశ ప్రధాని గురించి అమెరికా అధ్యక్షుడు ఇలా మాట్లాడడం ఇంతవరకు చరిత్రలో ఎప్పుడూ జరగలేదన్న విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. ఇది మన దేశానికి దక్కిన గౌరవమని ఆయన పేర్కొన్నారు. మరోవైపు ఉగ్రవాదం విషయంలో ఇంతకు ముందు కొన్ని దేశాలు మన మాటలను అంతగా పట్టించుకునేవి కావనీ, కానీ ఇప్పుడు ఇస్లామిక్ దేశాలు సహా ప్రపంచంలోని ఏ దేశం కూడా పాకిస్తాన్‌కు మద్దతునివ్వడంలేదన్న విషయం గమనించాలన్నారు. ఇది కేవలం ప్రధాని నరేంద్రమోదీ వల్లే సాధ్యమైందని కొనియాడారు.
Comments
Please login to add a commentAdd a comment