న్యూఢిల్లీ: భారత్ బ్రహ్మాండమైన దేశమని... ఈ రెండు రోజుల పర్యటన ఎప్పటికీ గుర్తుండిపోయేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. భారత ప్రజలు గతంలో కంటే ఇప్పుడు తమను మరింత ఎక్కువగా ఇష్టపడుతున్నారనుకుంటున్నానని పేర్కొన్నారు. భారత్- పాకిస్తాన్ ప్రధానులతో తనకు సత్సంబంధాలు ఉన్నాయని... వారు కోరితే కశ్మీర్ అంశంపై చర్చించడానికి తాను సిద్ధంగా ఉన్నానని పునరుద్ఘాటించారు. భారత్‌తో 3 బిలియన్ డాలర్ల ఒప్పందం చేసుకున్నామని... భారత్‌కు మరిన్ని ఆయుధాలు అమ్మేందుకు సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. రెండు రోజుల పర్యటన ముగిసిన సందర్భంగా ఢిల్లీలో విలేకరులతో ట్రంప్ మాట్లాడారు. వివిధ అంశాలపై విలేకరులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. (భారత పర్యటన విజయవంతం: ట్రంప్)
ఉగ్రవాదంపై తాను పోరాడినంతగా ఎవరూ పోరాడలేదని.. ఐసిస్ చీఫ్ బాగ్దాదీని తాము అంతమొందించామని ట్రంప్ పేర్కొన్నారు. ఇస్లామిక్ ఉగ్రవాదాన్ని రూపుమాపేందుకు కృషి చేస్తున్నామని.. అమాయక ప్రజలను చంపితే ఊరుకోబోమని హెచ్చరించారు. అయితే అమెరికా ప్రపంచానికి పోలీసు కాదని.. ఉగ్రవాదంపై అందరూ మరింత పోరాటం చేయాల్సి ఉందని పేర్కొన్నారు. తాలిబన్లతో శాంతి ఒప్పందం భారత్‌కు ప్రయోజనకరమని ట్రంప్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ విషయం గురించి తాను ప్రధాని నరేంద్ర మోదీతో చర్చించానని తెలిపారు. కశ్మీర్ అంశం భారత్- పాక్‌లకు ముల్లు వంటిదని.. ఈ విషయంలో తాను ఇరు దేశాధినేతలతో చర్చించడానికి సిద్ధమని తెలిపారు. (భారత్‌తో ఒప్పందం కుదిరింది: ట్రంప్)
అత్యధిక టారిఫ్‌లు విధిస్తున్నారు..
ఇక భారత్‌తో వాణిజ్యం గురించి మాట్లాడుతూ.. ‘‘భారతీయ మార్కెట్ ఎంతో పెద్దది. చాలా విస్తృతమైనది. భారతీయ సీఈఓలతో భేటీ ఆసక్తికరంగా సాగింది. అమెరికాలో పెట్టుబడులు పెట్టేందుకు భారతీయులు ఆసక్తిగా ఉన్నారు. అయితే టారిఫ్‌ల విషయంలో మాత్రం భారత్ వైఖరి అలాగే ఉంది. అమెరికాకు అత్యధిక టారిఫ్‌లు విధిస్తున్నారు. భారత్‌తో ఒప్పందం అంటే అధిక టారిఫ్‌లు చెల్లించాల్సి ఉంటుంది. ఇండియాకు మోటారు సైకిళ్లు పంపినపుడు హార్లేడేవిడ్‌సన్ ఎక్కువ మొత్తం చెల్లించాల్సి వస్తుంది. అదే సమయంలో భారత ఎగుమతులకు మాత్రం ఎటువంటి టారిఫ్‌లు విధించడం లేదు’’ అని ట్రంప్ పేర్కొన్నారు. అయితే హెచ్-1బీ వీసాల గురించి సంధించిన ప్రశ్నలకు మాత్రం ఆయన సమాధానం దాటవేశారు.
Comments
Please login to add a commentAdd a comment