కృష్ణపట్నం పోర్టులో పచ్చదనం భేష్
-
కేంద్ర మంత్రి జితేంద్రసింగ్
ముత్తుకూరు:
పర్యావరణానికి మారుపేరుగా కృష్ణపట్నంపోర్టు పచ్చదనంతో పరిఢవిల్లుతోందని ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి, సెంట్రల్ అటమిక్ ఎనర్జీ–స్సేస్ మినిస్టర్ జితేంద్రసింగ్ పేర్కొన్నారు. కృష్ణపట్నంపోర్టును ఆదివారం కేంద్రమంత్రి సందర్శించారు. పోర్టులో జరుగుతున్న అభివృద్ధి పనులు, ఎగుమతి–దిగుమతి కార్యకలాపాలను పరిశీలించారు. జరుగుతున్న ప్రగతిని పోర్టు అధినేత చింతా శశిధర్, సీఈఓ అనీల్ ఎండ్లూరి వివరించారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి మాట్లాడుతూ దేశంలో త్వరతగతిన అభివృద్ధి చెందుతున్న ఓడరేవుల్లో కృష్ణపట్నంపోర్టు ఒకటిగా నిలిచిందన్నారు. కాలుష్య నివారణకు,పర్యావరణ పరిరక్షణకు తీసుకుంటున్న చర్యలు, స్వచ్ఛభారత్ అమలు సంతృప్తికరంగా ఉన్నాయన్నారు. ఎగుమతి, దిగుమతుల్లో పురోగతి ద్వారా ఆర్ధికాభివృద్ధి సాధించడం సంతోషంగా ఉందన్నారు. వాణిజ్యవేత్తలు, పారిశ్రామికవేత్తలకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించడం పోర్టులో కల్పించారన్నారు. అనంతరం గోపాలపురంలోని కేఎస్‌ఎస్‌పీఎల్ సెక్యూరిటీ కేంద్రాన్ని సందర్శించారు. సెక్యూరిటీ గార్డుల గౌరవవందనం స్వీకరించారు. వనం–మనం కింద మొక్కలు నాటారు. సీవీఆర్ స్కూల్ విద్యార్థులతో ముచ్చటించారు. ఆస్పత్రి, వంటశాల, మొక్కల పెంపకం, స్కిల్ డెవలప్‌మెంట్ తరగతులు, ఇతర సౌకర్యాలను పరిశీలించారు. పోర్టు అభివృద్ధిపై రూపొందించిన బ్రోచర్‌ను ఆవిష్కరించారు. ప్రిన్సిపల్ రాజేంద్రప్రసాద్, పీఆర్వో వేణుగోపాల్ పాల్గొన్నారు.