
హైదరాబాద్: ఎడెల్‌వీజ్ జనరల్ ఇన్సూరెన్స్ ఓ వినూత్నమైన యాడ్ ఆన్ ఫీచర్ ‘హెల్త్ 241’ని ప్రవేశపెట్టింది. కంపెనీ నుంచి కొత్తగా వైద్య బీమా పాలసీ తీసుకునే వారు, ఈ యాడ్ ఆన్‌ను జోడించుకోవచ్చు. దీని వల్ల మొదటి ఏడాది పాలసీ కాల వ్యవధిలో ఎటువంటి క్లెయిమ్ లేకపోతే మరుసటి ఏడాది రెన్యువల్‌కు ప్రీమియం చెల్లించక్కర్లేదు. రెండో ఏడాది పూర్తి ఉచితంగా వైద్య బీమా కవరేజీ లభిస్తుందని కంపెనీ తెలిపింది. దేశంలో ఈ తరహా సదుపాయాన్ని తీసుకొచ్చిన తొలి బీమా సంస్థ ఇదే.
‘‘మన దేశంలో బీమాను ఇప్పటికీ అదనపు వ్యయంగానే చూస్తున్నారు. యుక్త వయసులో ఉన్న వారు తాము ఆరోగ్యవంతులమని, క్లెయిమ్ అవసరం పడదు కనుక బీమా పాలసీ అక్కర్లేదనే భావనలో ఉన్నారు. ఈ తరహా కస్టమర్లకు హెల్త్ 241 యాడ్ ఆన్ విలువను అందిస్తుంది. మొదటి ఏడాదిలో ఎటువంటి క్లెయిమ్ లేకపోతే, రెండో ఏడాది కూడా మాతోనే కొనసాగుతారు’’అని ఎడెల్‌వీజ్ జనరల్ ఇన్సూరెన్స్ సీఈవో అనూప్ తెలిపారు. ఇక రీస్టోరేషన్, క్లెయిమ్ లేకపోతే తదుపరి ఏడాది బీమా మొత్తాన్ని 100 శాతం వరకు పెంచుకునే ఆప్షన్లు కూడా ఉన్నాయి.