Medical insurance policy
-
ప్రీమియం ఏడాదికే... కవరేజీ రెండేళ్లు!
హైదరాబాద్: ఎడెల్వీజ్ జనరల్ ఇన్సూరెన్స్ ఓ వినూత్నమైన యాడ్ ఆన్ ఫీచర్ ‘హెల్త్ 241’ని ప్రవేశపెట్టింది. కంపెనీ నుంచి కొత్తగా వైద్య బీమా పాలసీ తీసుకునే వారు, ఈ యాడ్ ఆన్‌ను జోడించుకోవచ్చు. దీని వల్ల మొదటి ఏడాది పాలసీ కాల వ్యవధిలో ఎటువంటి క్లెయిమ్ లేకపోతే మరుసటి ఏడాది రెన్యువల్‌కు ప్రీమియం చెల్లించక్కర్లేదు. రెండో ఏడాది పూర్తి ఉచితంగా వైద్య బీమా కవరేజీ లభిస్తుందని కంపెనీ తెలిపింది. దేశంలో ఈ తరహా సదుపాయాన్ని తీసుకొచ్చిన తొలి బీమా సంస్థ ఇదే. ‘‘మన దేశంలో బీమాను ఇప్పటికీ అదనపు వ్యయంగానే చూస్తున్నారు. యుక్త వయసులో ఉన్న వారు తాము ఆరోగ్యవంతులమని, క్లెయిమ్ అవసరం పడదు కనుక బీమా పాలసీ అక్కర్లేదనే భావనలో ఉన్నారు. ఈ తరహా కస్టమర్లకు హెల్త్ 241 యాడ్ ఆన్ విలువను అందిస్తుంది. మొదటి ఏడాదిలో ఎటువంటి క్లెయిమ్ లేకపోతే, రెండో ఏడాది కూడా మాతోనే కొనసాగుతారు’’అని ఎడెల్వీజ్ జనరల్ ఇన్సూరెన్స్ సీఈవో అనూప్ తెలిపారు. ఇక రీస్టోరేషన్, క్లెయిమ్ లేకపోతే తదుపరి ఏడాది బీమా మొత్తాన్ని 100 శాతం వరకు పెంచుకునే ఆప్షన్లు కూడా ఉన్నాయి. -
పాలసీ ఉన్నా... కవరేజీ ఉండదు!
వైద్య బీమా ప్రాధాన్యం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇపుడు దీని పట్ల అవగాహన కూడా విస్తృతమవుతోంది. దీంతో వైద్య బీమా పాలసీలను తీసుకునే వారి సంఖ్య కూడా పెరుగుతోంది. భారీగా పెరిగిపోతున్న వైద్య ఖర్చులే పాలసీ వైపు అడుగులు వేయిస్తున్నాయి. అయితే పాలసీ తీసుకున్నంత మాత్రాన ప్రతి అనారోగ్యానికీ, చికిత్సా వ్యయాలకు బీమా రక్షణ ఉంటుందనుకోవద్దు. రక్షణ లేనివీ కొన్ని ఉన్నాయి. అందుకోసం పాలసీ డాక్యుమెంట్‌ను పూర్తిగా పరిశీలించాలి. ఇందులో నియమ, నిబంధనలు ఉంటాయి. వీటిని పైపైన చదివేసి పాలసీ తీసుకుంటే తర్వాత బాధపడాల్సి వస్తుంది. ఉప పరిమితులు, ముందు నుంచి ఉన్న వ్యాధులు, ఇతర మినహాయింపులపై అవగాహన పెరుగుతున్నప్పటికీ... క్లెయిమ్స్ తిరస్కరణ లేదా తగ్గించి చెల్లింపులు చేస్తున్న ఘటనలు పాలసీదారులను షాక్‌కు గురిచేసేవే. ఏకరూపత కోసం మినహాయింపులను ప్రామాణీకరించేందుకు బీమా నియంత్రణ, అభివృద్ధి సంస్థ (ఐఆర్డీఏ) ఓ నిపుణుల కమిటీని 2012లో నియమించింది. 199 అంశాలను ఐఆర్డీఏ పేర్కొంది. వీటి ప్రకారం తాను తీసుకుంటున్న పాలసీ వేటికి కవరేజీ ఇవ్వదో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. సాంకేతిక పరిజ్ఞానాలు, చికిత్సా ప్రక్రియలు మారుతున్నాయి. బీమా కంపెనీలు వాటిని అమల్లోకి తీసుకొచ్చేందుకు సమయం తీసుకుంటున్నాయి. నిరూపితం కాని లేదా ప్రయోగాత్మక చికిత్సలు అయితే, అవి వైద్యపరంగా ఆచరణీయమైనవి కావు. ఇటువంటివి చాలా పాలసీల్లో కవర్ కావు. ‘‘ఎన్నో రకాల సర్జరీలకు సంబంధించిన క్లెయిమ్‌లను మేం గౌరవిస్తాం. ఒకవేళ ఆస్పత్రి రోబోటిక్ సర్జరీ లేదా సైబర్ నైఫ్‌కు సిఫారసు చేస్తే ఇవి పాలసీ ఒప్పందం పరిధిలోకి రావు. ఫలితంగా వారి క్లెయిమ్ కవర్ కాదు. దీంతో అవి మినహాయింపుల కిందకు వస్తాయి’’ అని సిగ్నా టీటీకే హెల్త్ ఇన్సూరెన్స్ సీవోవో జ్యోతి పుంజా తెలిపారు. అలాగే, స్టెమ్ సెల్ థెరపీలు (మూల కణాలతో చేసే చికిత్సలు) కూడా కవర్ కావు. అయితే, చికిత్స తర్వాత మంచి ఫలితం ఉంటుందని డాక్టర్లు సూచిస్తే రోగులు వాటిని ఎంచుకోవచ్చు’’ అని ఇన్సూరెన్స్ బ్రోకింగ్ సంస్థ ‘సెక్యూర్ నౌ’ ఎండీ మెహతా సూచించారు. వైద్యులు సూచిస్తున్న అత్యాధునిక చికిత్సా విధానం పాలసీలో కవర్ అవుతుందా అన్నది ముందే చూసుకోవాలి. రెసిడెంట్ డాక్టర్ల చార్జీలు రూమ్ రెంట్, రెసిడెంట్ డాక్టర్ చార్జీలను బిల్లులో ఆస్పత్రి వేర్వేరుగా చూపిస్తే... బీమా సంస్థ వాటిని చెల్లించకపోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ‘‘సాంకేతికంగా రెసిడెంట్ డాక్టర్ చార్జీలు రూమ్రెంట్లో కలిసే ఉంటాయి. దీంతో అవి రెసిడెంట్ డాక్టర్ల చార్జీలను ప్రత్యేకంగా చెల్లించవు’’ అని రాయల్ సుందరం జనరల్ ఇన్సూరెన్స్ చీఫ్ ప్రొడక్ట్ ఆఫీసర్ నిఖిల్ ఆప్టే తెలిపారు. ఈ సందర్భాల్లో పరిష్కారంగా బీమా కంపెనీ నెట్వర్క్ ఆస్పత్రుల్లో ఒక దానిని ఎంచుకోవాలన్నది నిపుణుల సూచన. ‘‘నెట్వర్క్ ఆస్పత్రులు అన్నవి బీమా విధానాలకు అనుగుణంగా నడుచుకుంటాయి. దీంతో బిల్లులో వేసిన చార్జీలను చెల్లించకపోవడానికి అవకాశాలు తక్కువగా ఉంటాయి’’ అని ఆప్టే పేర్కొన్నారు. ఇక రోగిని చేర్చుకునే సమయంలో రిజిస్ట్రేషన్ చార్జీలంటూ బిల్లులో ఆస్పత్రులు వేసే వాటిని కూడా బీమా కంపెనీలు ఆమోదించవు. ఎందుకంటే అడ్మిషన్ డిపాజిట్ కవర్ కాదు. షాంపూ, పౌడర్, ఇతర నాన్ మెడికల్ వస్తువులకు చెల్లింపులు చేయవు. ఇవన్నీ నిబంధనల మేరకు చెల్లింపులకు అవకాశం లేనివిగా హెచ్డీఎఫ్సీ ఎర్గో జనరల్ ఇన్సూరెన్స్‌కు చెందిన అనురాగ్ రస్తోగి తెలిపారు. స్పెషలిస్టు డాక్టర్ల చార్జీలు స్పెషలిస్టు డాక్టర్ల ఫీజులు కవర్ కావొచ్చు, కాకపోవచ్చు. ‘‘స్పెషలిస్టు డాక్టర్ల విజిట్ చార్జీలను మేం చెల్లిస్తున్నాం. కొన్ని పాలసీలు స్పెషలిస్టు వైద్య నిపుణులు ఒకే రోజు ఒకటికి మించిన పరిశీలనలకు చార్జీలు చెల్లించడం లేదు’’ అని ఆప్టే తెలిపారు. గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్, న్యూరాలజిస్ట్, నెఫ్రాలజిస్ట్ నిపుణులు రోగిని పరిశీలించినట్టయితే వారి చార్జీలను చెల్లిస్తున్నాయి. కానీ, ఒకే వైద్య నిపుణుడు రోజులో ఒకటికి మించిన సార్లు విజిట్ చేస్తే చార్జీలను చెల్లించవని తెలుసుకోవాలి. కొన్ని రకాల ఔషధాలక్కూడా... తీవ్ర అనారోగ్య సమస్యల్లో అన్ని రకాల చికిత్సా వ్యయాలను బీమా సంస్థలు గుడ్డిగా అనుమతించవు. ‘‘కొన్ని రకాల క్యాన్సర్ ఔషధాలను కొన్ని బీమా సంస్థలు మినహాయించాయి. ఉదాహరణకు కీమోథెరపీ ఔషధాలను ఇంట్రావీనస్ రూపంలో ఇస్తే కవరేజీ అవుతాయి. అలా కాకుండా నోటి ద్వారా తీసుకుంటే వాటికి కవరేజీ అవకాశాలు తక్కువ. అలాగే, ఇమ్యూనోథెరపీ కిందకు వచ్చే ఔషధాల్లో చాలా వరకు కవర్ కానివే’’ అని మెహతా తెలిపారు. కొన్ని పాలసీలు ఇంట్రా ఆర్టిక్యులర్ లేదా ఇంట్రాలెజనల్ ఇంజెక్షన్లకు చెల్లింపులు చేయడం లేదని, వీటికి అదనంగా సప్లిమెంటరీ మెడికేషన్లకూ కవరేజీ ఉండటం లేదని చెప్పారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ అది ఆల్కహాల్ అలవాటు వల్ల లేదా అధికంగా పొగతాగడం వల్ల వచ్చిందని తేలితే అందుకు అయ్యే వ్యయాలను పాలసీదారుడు తన ప్యాకెట్ నుంచే భరించాల్సి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఈ కారణాలతో క్లెయిమ్‌లను బీమా సంస్థలు తిరస్కరిస్తుంటాయి. అయితే, ఈ విషయంలో అభ్యంతరం ఉంటే పాలసీదారుడు ప్రశ్నించొచ్చు. ఈ సందర్భాల్లో తిరస్కరణకు కారణాలను రుజువు చేయాల్సి ఉంటుందని హెల్త్ ఇన్సూరెన్స్ సేవల స్టార్టప్ మెక్స్ట్రా సీఈవో ఏఎస్ నారాయణన్ పేర్కొన్నారు. ఇంట్లో చికిత్సలు కొన్ని బీమా సంస్థలు ఆస్పత్రిలో చేరకుండా ఇంట్లోనే ఉండి తీసుకునే చికిత్సలకు చెల్లింపులు చేయడం లేదు. ఆస్పత్రిలో చేరాల్సిన వ్యాధులకు ఇంటి వద్దే ఉండి చికిత్స తీసకుంటే బీమా మొత్తంలో పరిహారాన్ని 10 శాతానికే పరిమితం చేస్తున్నాయి. అయితే, ఆస్తమా, బ్రాంకైటిస్, మరికొన్ని చికిత్సలకు అసలుకే చెల్లింపులు చేయడం లేదని నిపుణులు పేర్కొంటున్నారు. ఐఆర్డీఏ ప్యానెల్ పరిశీలనలో ఉన్నవి ♦ ఒక్కో వ్యాధికి సంబంధించి ప్రత్యేకంగా శాశ్వత మినహాయింపులను అనుమతించడం. తద్వారా ఇలా మినహాయింపు ఉన్న అనారోగ్యాలకు సంబంధం లేని వ్యాధులకు కవరేజీ అందేలా చూడటం. ♦ మినహాయింపులను పరిమితం చేయడం ద్వారా హెల్త్ కవరేజీని విస్తృతం చేయడం. ♦ నూతన టెక్నాలజీ ఆధారిత అత్యాధునిక చికిత్సా విధానాలను అనుమతించని మినహాయింపులను హేతుబద్ధీకరించడం. ♦ తొలగించతగ్గ మినహాయింపుల గుర్తింపు. ♦ పాలసీ పత్రాల్లో పదజాలాన్ని మరింత సులభంగా, ప్రామాణికంగా మార్చడం. -
ఆరోగ్యానికి ‘టాపప్’ బూస్ట్
శ్రీనివాసరావు వయసు 50. ఓ ప్రయివేటు కంపెనీలో పనిచేసి ఈ మధ్యనే వ్యక్తిగత కారణాల రీత్యా మానేశాడు. కంపెనీలో పనిచేసినంత కాలం కంపెనీ ఇచ్చిన ఆరోగ్య బీమా పాలసీ ఉండేది. కంపెనీది ఉంది కదా... అని సొంత ఆరోగ్య బీమా పాలసీ తీసుకోలేదు. ఇప్పుడేమో కంపెనీలో మానేశాడు. సరే! ఆరోగ్య బీమా పాలసీ ఒక్కటైనా ఉండాలి కదా అని ఆలోచించి... కొన్ని పాలసీలు చూశాడు. అన్నీ బావున్నాయి. కానీ బీమా ప్రీమియం మాత్రం కాస్తంత ఎక్కువగానే ఉంది. అదేంటని సదరు బీమా సిబ్బందిని అడిగాడు శ్రీనివాసరావు. ‘‘మీ వయసును బట్టి చూస్తే మీకు రిస్కు ఎక్కువ కదండీ! అందుకే ప్రీమియం ఎక్కువ. ఒకవేళ ఇంకో ఏడాది రెండేళ్లు పోయాక తీసుకుంటే ప్రీమియం మరింత పెరుగుతుంది’’ అని చెప్పారా సిబ్బంది. అప్పుడు తెలిసొచ్చింది శ్రీనివాసరావుకు!! చిన్న వయసు నుంచే ఆరోగ్య బీమా పాలసీని కొనసాగించటం ఎంత మంచిదో...! – సాక్షి, బిజినెస్ విభాగం నిజమే! వైద్య బీమా పాలసీని చిన్న వయసులోనే తీసుకోవడం... అప్పటి నుంచి దాన్ని కొనసాగించటం ఆరోగ్యానికే కాదు. జేబుకు కూడా చాలా మంచిది. ఉద్యోగంలో చేరిన లేదా ఆర్జన మొదలైన వెంటనే పాలసీ తీసుకోవడం శ్రేయస్కరం. ఒకవేళ ఎప్పుడో తీసుకుని ఉంటే అది నేటి వైద్య అవసరాలకు అనుగుణంగా సరిపోతుందా? లేదా అన్న సమీక్ష కూడా అవసరమే. దేశంలో కొన్నేళ్లుగా వైద్య ద్రవ్యోల్బణం ఏటా 10 శాతం మేర పెరుగుతూ పోతోంది. 2018లో ఇది 11.3 శాతం మేర ఉంటుందని అడ్వైజరీ సంస్థ విల్లిస్ టవర్ వాట్సన్ నివేదిక స్పష్టం చేసింది. ఇక బీమా సంస్థలయితే వైద్య ఖర్చులు ఏటేటా 15 శాతం మేర భారం అవుతాయని అంచనా వేస్తున్నాయి. కనుక ఓ కుటుంబానికి ఎంత లేదన్నా రూ.10–15 లక్షల ఫ్యామిలీ ఫ్లోటర్ పాలసీ అవసరం. ఒకవేళ తక్కువ మొత్తానికే పాలసీ తీసుకుని ఉంటే అటువంటి వారు చేయాల్సింది తక్షణం మరో పాలసీ తీసుకోవడం... లేదా టాపప్ వేసుకోవడం. మరో పాలసీ అంటే ప్రీమియం ఎక్కువగా ఉంటుంది. కనుక టాపప్ లేదా సూపర్ టాపప్ పాలసీని తక్కువ ప్రీమియానికే ప్రస్తుత పాలసీకి కొనసాగింపుగా తీసుకోవచ్చు. టాపప్‌తో ఖర్చు తక్కువ... టాపప్ పాలసీ తీసుకోవడం ద్వారా వైద్య బీమా కవరేజీ పెంచుకోవటమన్నది తక్కువ ఖర్చులో అయిపోయే వ్యవహారం. అపోలో మ్యునిక్, ఐసీఐసీఐ లాంబార్డ్, యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్, హెచ్డీఎఫ్సీ ఎర్గో, బజాజ్ అలియంజ్ తదితర సంస్థలు ఈ తరహా టాపప్ పాలసీలను అందిస్తున్నాయి. 35 ఏళ్ల వయసున్న వ్యక్తి రూ.5 లక్షల కవరేజీతో హెల్త్ పాలసీ తీసుకోవాలంటే ప్రీమియం రూ.8,500 నుంచి 13,500 వరకు అవుతుంది. భార్యా, భర్త, వారి ఇద్దరు పిల్లలకు కవరేజీ లభిస్తుంది. దీనికి అదనంగా టాపప్ పాలసీని రూ.10 లక్షల కవరేజీతో తీసుకుంటే ప్రీమియం మరో రూ.4,300 –6,330 మేర చెల్లిస్తే చాలు. కొన్ని పరిమితులున్నాయి... టాపప్ పాలసీలకు కొన్ని పరిమితులుంటాయని తెలుసుకోవాలి. వీటిలో ముఖ్యమైనది ఆరంభ పరిమితి (త్రెషోల్డ్) లేదా మినహాయింపు (డిడక్టబుల్). ఉదాహరణకు బేసిక్ పాలసీ (మొదట తీసుకున్నది) రూ.3 లక్షలకు ఉందనుకోండి. దానికి అదనంగా రూ.10 లక్షలకు టాపప్ తీసుకున్నారనుకోండి. అప్పుడు హెల్త్ క్లెయిమ్ రూ.3 లక్షలు దాటితేనే టాపప్ అమల్లోకి వస్తుంది. దీని ప్రకారం వైద్య బిల్లు రూ.7 లక్షలు వచ్చిందనుకుందాం. అప్పుడు బేసిక్ పాలసీ రూ.3 లక్షలు చెల్లించగా, టాపప్ ప్లాన్ నుంచి రూ.4 లక్షల చెల్లింపు జరుగుతుంది. అలాగే, బేసిక్ పాలసీ రూ.5 లక్షలకు ఉండి, టాపప్ పాలసీ రూ.10 లక్షలకు తీసుకున్నారనుకోండి. అప్పుడు రూ.5 లక్షలు డిడక్టబుల్ అవుతుంది. దీని ప్రకారం ఆస్పత్రిలో బిల్లు రూ.3 లక్షల చొప్పున ఒక ఏడాదిలో రెండు క్లెయిమ్‌లు వచ్చాయనుకోండి. సాధారణంగా బేసిక్ పాలసీ కవరేజీ రూ.5 లక్షల వరకే ఉంది కనుక రూ.లక్షను జేబులో నుంచి పెట్టుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఒక్కో బిల్లు రూ.3 లక్షలుగానే ఉంది. అది బేసిక్ లిమిట్‌ను దాటలేదు. ఒకే బిల్లు బేసిక్ కవరేజీని దాటి ఉంటేనే టాపప్ అక్కరకు వస్తుందన్న విషయాన్ని అర్థం చేసుకోవాలి. సూపర్ టాపప్ టాపప్ పాలసీల్లో ఉన్న పరిమితులు ఇబ్బందిగా భావించే వారికి సూపర్ టాపప్ పాలసీలున్నాయి. హెచ్డీఎఫ్సీ ఎర్గో, అపోలో మ్యునిక్, యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ తదితర కంపెనీలు వీటిని ఆఫర్ చేస్తున్నాయి. ఉదాహరణకు మీకు బేసిక్ హెల్త్ పాలసీ రూ.3 లక్షలకు ఉండి రూ.12 లక్షల కవరేజీని సూపప్ టాపప్‌గా తీసుకున్నారనుకుంటే... అప్పుడు రూ.3 లక్షలు డిడక్టబుల్ అవుతుంది. అంటే రూ.4 లక్షలు చొప్పున ఒకే ఏడాదిలో రెండు క్లెయిమ్స్ వచ్చాయనుకోండి. అప్పుడు మొదటి క్లెయిమ్‌లో బేసిక్ పాలసీ నుంచి రూ.3 లక్షలు, టాపప్ నుంచి రూ.లక్ష పరిహారంగా అందుతుంది. రెండో క్లెయిమ్‌లో రూ.4 లక్షలు టాపప్ పాలసీ నుంచే చెల్లింపులు జరుగుతాయి. సూపర్ టాపప్ పాలసీలు రూ.15 లక్షలపైన కవరేజీలను కూడా అందిస్తున్నాయి. హెచ్డీఎఫ్సీ ఎర్గో నుంచి రూ.20 లక్షల సమ్ అష్యూర్డ్‌తో రూ.5 లక్షల డిడక్టబుల్‌తో సూపర్ టాపప్ తీసుకోవాలనుకుంటే ప్రీమియం రూ.3,850 మాత్రమే. ఇది 35 ఏళ్ల వయసున్న ఓ వ్యక్తి కుటుంబానికి (దంపతులు, ఇద్దరు పిల్లలు) సంబంధించిన అంచనా. చూడాల్సిన ఇతర అంశాలివీ... ♦ నెట్వర్క్ ఆసుపత్రుల్లో చికిత్స పొందేటట్లయితే టాపప్ పాలసీల్లో నగదు రహిత చెల్లింపులు జరిగిపోతాయి. ♦ ముందుగా అనుకుని పొందే చికిత్స అయితే 48 గంటల ముందుగా బీమా కంపెనీకి తెలియజేస్తే సరిపోతుంది. లేదా అత్యవసరం అయి ఆస్పత్రిలో చేరాల్సి వస్తే చేరిన తర్వాత 24 గంటల్లోపు తెలియజేసి అప్రూవల్ తీసుకోవాలి. ♦ రెండూ కాకపోతే చికిత్సకు సొంతగా చెల్లింపులు చేసి తర్వాత రీయింబర్స్మెంట్ పొందొచ్చు. ♦ రెగ్యులర్ పాలసీ అయితే ముందు నుంచి ఉన్న వ్యాధులకు కవరేజీ కోసం కనీస కాలం (వెయిటింగ్ పిరియడ్) వేచి ఉండాలి. అలాగే, కొన్ని వ్యాధులకు చికిత్సా మినహాయింపులు కూడా ఉంటాయి. ♦ ప్రత్యేకంగా కొన్ని వ్యాధులకు కవరేజీ పరిమితులు కూడా ఉండొచ్చు. ♦ రెగ్యులర్ పాలసీ, టాపప్ పాలసీని వేర్వేరు బీమా సంస్థల నుంచి తీసుకుని ఉంటే క్లెయిమ్ కోసం రెండు కంపెనీలకు సమాచారం తెలియజేయడం ఇబ్బందిగా అనిపించొచ్చు. ఒకవేళ వేర్వేరు సంస్థల నుంచి తీసుకున్నప్పటికీ రెండింటితోనూ టైఅప్ ఉన్న నెట్వర్క్ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటే ఇబ్బందేమీ ఉండదు. ♦ టాపప్ ప్లాన్లపై నో క్లెయిమ్ బోనస్ రాదు. వీటి లో ప్రవేశ వయసు గరిష్టంగా 65–80 వరకే. ఒకవేళ తల్లిదండ్రులు బేసిక్ ప్లాన్‌లో లేకపోతే, టాపప్ ప్లాన్లలో యాడ్ చేసుకోవచ్చు. ♦ ఇక చివరి అంశం... రెగ్యులర్ పాలసీ లేకపోయినా కానీ టాపప్ ప్లాన్లను తీసుకునే సదుపాయం ఉంది. -
30 రోజుల్లో పరిష్కరించాలి
♦ గడువు దాటితే వడ్డీ చెల్లించాలి ♦ హెల్త్ పాలసీ క్లెయిమ్ పరిష్కారంపై ఐఆర్డీఏ ఆదేశం న్యూఢిల్లీ: వైద్య బీమా పాలసీల్లో పరిహారం కోరుతూ వచ్చే క్లెయిమ్ దరఖాస్తులను 30 రోజుల్లోగా పరిష్కరించాలని బీమా నియంత్రణ ప్రాధికార సంస్థ (ఐఆర్డీఏ) బీమా కంపెనీలను ఆదేశించింది. జాప్యం చేస్తే క్లెయిమ్ మొత్తంపై బ్యాంకు వడ్డీ రేటుకు అదనంగా 2 శాతం కలిపి చెల్లించాల్సి ఉంటుందని తాజాగా జారీ చేసిన ఆదేశాల్లో స్పష్టం చేసింది. పాలసీదారుల ప్రయోజనాల పరిరక్షణ చట్టం కింద ఐఆర్డీఏ ఈ చర్య తీసుకుంది. ‘‘తమకు దరఖాస్తు అందిన (అవసరమైన ప్రతీ పత్రం) చివరి తేదీ నుంచి 30 రోజుల్లోగా బీమా కంపెనీ పరిష్కరించాలి. పరిహారం చెల్లింపులో ఆలస్యం జరిగితే... పాలసీదారుడి నుంచి అవసరమైన అన్ని పత్రాలు తమకు అందిన చివరి తేదీ నుంచి చెల్లింపు జరిగే తేదీ వరకు బ్యాంకు వడ్డీ రేటుపై 2 శాతం ఎక్కువ కలిపి చెల్లించాలి’’ అని ఐఆర్డీఏ తన నోటిఫికేషన్లో పేర్కొంది. ఒకవేళ క్లెయిమ్ దరఖాస్తుల విషయమై తమవైపు నుంచి విచారణ అవసరమైన కేసుల్లో పరిహారాన్ని 45 రోజుల్లోగా పరిష్కరించాలని ఆదేశించింది. ఆలస్యం అయితే దరఖాస్తు, రుజువులు అందిన చివరి తేదీ నుంచి చెల్లించే వరకు ఉన్న గడువుకు గాను బ్యాంకు వడ్డీ రేటుకు అదనంగా 2 శాతం కలిపి చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. పాలసీ దారుల ఫిర్యాదులను వేగంగా, సమర్థవంతంగా పరిష్కరించేందుకు ఓ విధానాన్ని ఆచరణలో పెట్టాలని... పాలసీ పత్రాల్లో ప్రయోజనాలు, బీమా కవరేజీ, రైడర్లు, యాడాన్ కవర్ల గురించి స్పష్టంగా తెలియజేయాలని కోరింది. ‘‘హెల్త్ లేదా క్రిటికల్ ఇల్నెస్కు సంబంధించిన రైడర్ల ప్రీమియం బేసిక్ పాలసీ ప్రీమియంలో 100 శాతం మించకూడదు. ఇతర జీవిత బీమాయేతర పాలసీలలో రైడర్ల ప్రీమియం బేసిక్ పాలసీ ప్రీమియంలో 30 శాతం దాటరాదు’’ అని ఐఆర్డీఏ తన నోటిఫికేషన్లో స్పష్టం చేసింది. -
తగ్గనున్న ఆరోగ్య బీమా ప్రీమియంలు!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఆరోగ్య బీమా పాలసీదారులకు శుభవార్త. వచ్చే ఏడాది నుంచి వైద్య బీమా పాలసీల ప్రీమియంలు గణనీయంగా తగ్గే అవకాశాలున్నాయి. ఇన్సూరెన్స్ ఇన్ఫర్మేషన్ బ్యూరో(ఐఐబీ) విడుదల చేసిన తాజా నివేదిక గణాంకాలు ఇదే అంశాన్ని సూచిస్తున్నాయి. మూడేళ్ల క్రితం వరకు భారీ నష్టాలను మూట కట్టుకున్న ఈ రంగం ఇప్పుడు లాభాల బాట పట్టింది. మూడేళ్ల క్రితం మొత్తం వసూలు చేసిన ప్రీమియంల్లో 99 శాతం క్లెయిమ్‌లు ఉంటే అది 2012-13 నాటికి 68 శాతానికి తగ్గినట్లు ఐఐబీ నివేదిక తెలిపింది. ఈ ఐఐబీ నివేదిక ఆధారంగానే బీమా పాలసీల ప్రీమియాలను పెంచాలా లేక తగ్గించాలా అని ఐఆర్డీఏ నిర్ణయం తీసుకుంటుంది. దీని ప్రకారం చూసే వచ్చే ఏడాది వైద్య బీమా పాలసీల ప్రీమియంలు తగ్గే అవకాశం ఉందని బీమా రంగ నిపుణులు పేర్కొంటున్నారు. 2008, 2009 సంవత్సరాల్లో వసూలు చేసిన ప్రీమియం కంటే క్లెయిమ్‌ల మొత్తం అధికంగా ఉండటంతో ఆరోగ్య బీమా భారీ నష్టాలను మూటకట్టుకునేది. కానీ ఇప్పుడు వసూలైన ప్రీమియంలో క్లెయిమ్‌లు 68 శాతానికి పరిమితం కావడంతో ఈ కంపెనీలకు లాభాలు బాట పట్టాయి. వేగంగా వృద్ధి దేశీయ ఆరోగ్య బీమా రంగం వేగంగా విస్తరిస్తోంది. గడిచిన మూడేళ్ల కాలంలో పాలసీ అమ్మకాల్లో 21 శాతం వృద్ధి నమోదైనట్లు ఐఐబీ పేర్కొంది. 2010-11లో 77.42 లక్షల ఆరోగ్య పాలసీల అమ్మకాలు జరగ్గా, అది 2012-13 నాటికి 94.10 లక్షలకు చేరింది. ఇదే సమయంలో క్లెయిమ్‌ల సంఖ్య 38.43 లక్షల నుంచి 35.17 లక్షలకు తగ్గింది. ఈ సమీక్షా కాలంలో ప్రీమియం ఆదాయం 18 శాతం వృద్ధితో రూ.10,932 కోట్ల నుంచి రూ. 12,941 కోట్లకు చేరింది. క్లెయిమ్ నిష్పత్తి గణనీయంగా తగ్గడం, ప్రజల్లో ఆరోగ్య బీమాపై అవగాహన పెరగుతుండటంతో పలు కంపెనీలు ఈ రంగంలోకి ప్రవేశించడానికి ఆసక్తి చూపిస్తున్నాయి. మహిళల్లో క్లెయిమ్స్ తక్కువ పురుషులతో పోలిస్తే మహిళల్లో క్లెయిమ్‌లు తక్కువగా ఉన్నట్లు ఐఐబీ తన నివేదికలో పేర్కొంది. 2012-13 క్లెయిమ్‌లను పరిశీలిస్తే వ్యక్తిగత పాలసీల్లో మహిళల కంటే పురుషులు 29 శాతం అధికంగా క్లెయిమ్ చేస్తే గ్రూపు పాలసీల్లో ఇది 31 శాతం ఉంది. మొత్తం క్లెయిమ్స్‌లో 66 శాతం పురుషులవి ఉంటే మహిళ వాట కేవలం 34 శాతమే. అలాగే సగటు పురుషుల క్లెయిమ్ మొత్తం రూ. 29,688గా ఉంటే స్త్రీలది రూ.26,688గా ఉంది. లింగ భేదం లేకుండే చూస్తే 36-45 వయస్సు వారిలో అత్యధికంగా క్లెయిమ్‌లు నమోదవుతున్నాయి. అదే 16-35 వయస్సు మధ్యలో పురుషుల కంటే స్త్రీలలో క్లెయిమ్‌లు ఎక్కువగా ఉన్నాయని, దీనికి ప్రసూతి కేసులే కారణమని ఐఐబీ పేర్కొంది. అదే పురుషుల్లో 26-35 ఏళ్ల వారి క్లెయిమ్‌లు అధికంగా ఉన్నాయి. హైదరాబాదీలే బెస్ట్ ప్రధాన మెట్రో నగరాల్లో పోలిస్తే హైదరాబాద్‌లో సగటు క్లెయిమ్ విలువ తక్కువగా ఉంది. సగటు క్లెయిమ్ విలువ రూ. 46,806తో ముంబై మొదటి స్థానంలో ఉంటే, రూ. 40,179తో ఢిల్లీ రెండో స్థానంలో ఉంది. రూ.33,192తో హైదరాబాద్ చివరి స్థానంలో ఉంది. అదే దేశ వ్యాప్తంగా చూస్తే క్లెయిమ్‌ల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏడో స్థానంలో నిలిచింది. క్లెయిమ్‌ల సంఖ్య పరంగా మహారాష్ట్ర, గుజరాత్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు వరుసగా మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయి. 2012-13లో 81,091 క్లెయిమ్‌లతో ఉమ్మడి ఆంధ్రపద్రేశ్ ఏడో స్థానంలో నిలిచింది. -
కుటుంబానికి ధీమా
35 ఏళ్లలోపు వ్యక్తి రెండు లక్షలకు వైద్య బీమా పాలసీ తీసుకుంటే ఏడాదికి సుమారుగా రూ. 2,500 ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. అదే కుటుంబంలోని నలుగురు సభ్యులకు విడివిడిగా పాలసీ తీసుకుంటే రూ. 10,000 వరకు చెల్లించాల్సి ఉంటుంది. అదే ఇలా వ్యక్తిగతంగానాలుగు పాలసీలు కాకుండా కుటుంబ సభ్యులందరికీ కలిపి 4 లక్షలకు వైద్య బీమా పాలసీ తీసుకుంటే రూ. 7,000 చెల్లిస్తే చాలు. అదే ఫ్యామిలీ ఫ్లోటర్ పాలసీ ప్రత్యేకత. తక్కువ ప్రీమియంతో రెట్టింపు బీమా రక్షణ లభిస్తుండటంతో వైద్య బీమా రంగంలో ఫ్యామిలీ ఫ్లోటర్ పాలసీలకు డిమాండ్ పెరుగుతోంది. అసలు ఫ్యామిలీ ఫ్లోటర్ పాలసీలంటే ఏమిటి? అవి ఎలా పని చేస్తాయి? వాటి ప్రయోజనాలపై అవగాహన పెంచేదే ప్రాఫిట్ ముఖ్య కథనం. ఆరోగ్య బీమాపై ప్రజల్లో అవగాహన పెరుగుతోంది. కేవలం సంపాదించే వ్యక్తే కాకుండా కుటుంబ సభ్యులందరికీ వైద్య బీమా ఉండే విధంగా చూసుకుంటున్నారు. ఇండివిడ్యువల్ హెల్త్ పాలసీల అమ్మకాలు తగ్గి ఫ్యామిలీ ఫ్లోటర్ పాలసీల అమ్మకాలు పెరుగుతుండటమే దీనికి ప్రత్యక్ష నిదర్శనం. దీంతో బీమా కంపెనీలు అత్యధికంగా ఫ్యామిలీ ఫ్లోటర్ పాలసీలపై దృష్టిసారిస్తున్నాయి. పెరుగుతున్న వైద్య చికిత్స వ్యయం కూడా ఈ పాలసీలకు ఆదరణ పెంచుతోంది. మన దేశంలో వైద్య ఖర్చులు ఏటా 20% చొప్పున పెరుగుతున్నట్లు (హెల్త్ ఇన్ఫ్లేషన్) గణాంకాలు పేర్కొంటున్నాయి. ఇలా వ్యయం పెరుగుతుండంటంతో అందరూ వైద్య బీమా పాలసీలపై ఆసక్తి చూపిస్తున్నారు. ఫ్యామిలీ ఫ్లోటర్ అంటే... వ్యక్తిగతంగా అంటే ఒక వ్యక్తి పేరు మీద తీసుకునే పాలసీలను ఇండివిడ్యువల్ పాలసీలుగాను, అదే కొందరు వ్యక్తులు, సంఘాలు కలిపి తీసుకునే వాటిని గ్రూపు పాలసీలుగా పరిగణిస్తారు. ఈ రెండు కాకుండా కేవలం దగ్గరి రక్తసంబంధీకులు ఒక సమూహంగా ఏర్పడి తీసుకునే వాటిని ఫ్యామిలీ ఫ్లోటర్ పాలసీలంటారు. సాధారణంగా ఫ్యామిలీ ఫ్లోట ర్లో భార్య, భర్త, వారి పిల్లలు ఉంటారు. కానీ ఇప్పుడు కొన్ని కంపెనీలు కుటుంబంతో పాటు తల్లిదండ్రులు, అత్తమామలకు కలిపి కూడా పాలసీలను అందిస్తున్నాయి. చాలా బీమా కంపెనీలు ఆరుగురు కుటుంబ సభ్యులకు మించి ఈ ఫ్యామిలీ ఫ్లోటర్ పాలసీని ఇవ్వడం లేదు. అదే మాక్స్‌బూపా వం టి ఒకటి రెండు కంపెనీలు మాత్రం 13 మంది రక్తసంబంధీకుల వరకు పాలసీలను అందిస్తున్నాయి. ప్రయోజనం ఏమిటి?.. కేవలం సంపాదిస్తున్న వ్యక్తికే కాకుండా కుటుంబంలోని ప్రతి ఒక్కరికి ఆరోగ్య బీమా పాలసీ కలిగి ఉండాల్సిందే. ఇలా విడివిడిగా ఒక్కొక్కరి పేరుమీద పాలసీ తీసుకోవడం చాలా వ్యయంతో కూడుకున్నది. ఉదాహరణకు రమేష్ తన పేరు మీద రూ.2 లక్షలు, భార్య పేరు మీద రూ.లక్ష, కూతురు, కొడుకు పేరు మీద చెరో రూ.50,000కి పాలసీ చొప్పున మొత్తం నాలుగు పాలసీలు తీసుకున్నాడనుకుందాం. కానీ అనుకోకుండా కొడుక్కి అనారోగ్యం రావడంతో ఆసుపత్రి బిల్లు రూ.1.30 లక్షలు అయింది. కొడుకు పేరు మీద రూ.50,000 బీమా రక్షణ ఉండటంతో మిగిలిన రూ.80,000 జేబులోంచి పెట్టుకోవాల్సి వచ్చింది. అదే ఇలా విడివిడిగా కాకుండా కుటుంబంలోని అందరికీ వర్తించే విధంగా నాలుగు లక్షలకు వైద్య బీమా తీసుకుంటే ఈ ఇబ్బంది వచ్చేది కాదు. అంతేకాదు, ప్రీమియం భారం కూడా తగ్గుతుంది. 18 నుంచి 35 ఏళ్లలోపు ఉన్న వ్యక్తులకు 5 లక్షల వైద్య బీమాకు రూ.5,355 చెల్లించాలి. కేవలం భార్యాభర్తలకే అనుకున్నా ఇద్దరికీ విడివిడిగా తీసుకుంటే రూ.10,710 చెల్లించాలి. కానీ అదే బీమా కంపెనీ ఫ్యామిలీ ఫ్లోటర్‌ను రూ.7,321కే అందిస్తోంది. అంటే అదే బీమా రక్షణ లభించడమే కాకుండా ప్రీమియం రూ.3,389 తగ్గింది. ఎందుకు తక్కువ? బీమా కంపెనీల పాలసీ రూపకల్పన, ప్రీమియం లెక్కింపు వంటి అంశాల్లో యాక్చువేరియల్దే కీలకపాత్ర. వీరి అంచనాల ప్రకారం ఏడాదిలో ఒక కుటుంబం నుంచి ఇద్దరు వ్యక్తులు అనారోగ్యం పాలయ్యే అవకాశాలు చాలా తక్కువ. సాధారణంగా ఫ్యామిలీ ఫ్లోటర్ పాలసీల్లో నలుగురు సభ్యులు ఉంటున్నారు. అంటే నలుగురులో ఏదైనా జరిగినా ఒకరికంటే ఎక్కువ క్లెయిమ్‌లు రాకపోవచ్చని అంచనా. ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకొనే ఫ్యామిలీ ఫ్లోటర్ పాలసీల ప్రీమియంలు తగ్గిస్తున్నాయి. కొత్త పాలసీలు వ్యక్తిగత పాలసీల విక్రయం తగ్గి ఫ్యామిలీ ఫ్లోటర్‌కి డిమాండ్ పెరుగుతుండటంతో కంపెనీలు ఈ దిశగా కొత్త పథకాలను ప్రవేశ పెడుతున్నాయి. ఈ మధ్యనే న్యూ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ విడుదల చేసిన కొత్త పథకానికి మంచి స్పందన వస్తోంది. దీంతో యునెటైడ్ ఇండియా కూడా ఈ రకమైన పథకాన్ని ప్రారంభించడానికి ఐఆర్డీఏకి దాఖలు చేసింది. ఇవికాకుండా అపోలో మ్యూనిక్, మాక్స్ బూపా, ఐసీఐసీఐ లాంబార్డ్, హెచ్డీఎఫ్సీఎర్గో వంటి కంపెనీలన్నీ ఫ్యామిలీ ఫ్లోటర్లను అందిస్తున్నాయి.