పాలసీ ఉన్నా... కవరేజీ ఉండదు! | Restrictions in Medical insurance policy | Sakshi
Sakshi News home page

పాలసీ ఉన్నా... కవరేజీ ఉండదు!

Published Mon, Sep 17 2018 12:41 AM | Last Updated on Mon, Sep 17 2018 9:11 AM

Restrictions in Medical insurance policy - Sakshi

వైద్య బీమా ప్రాధాన్యం  ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇపుడు దీని పట్ల అవగాహన కూడా విస్తృతమవుతోంది. దీంతో వైద్య బీమా పాలసీలను తీసుకునే వారి సంఖ్య కూడా పెరుగుతోంది. భారీగా పెరిగిపోతున్న వైద్య ఖర్చులే పాలసీ వైపు అడుగులు వేయిస్తున్నాయి. అయితే పాలసీ తీసుకున్నంత మాత్రాన ప్రతి అనారోగ్యానికీ, చికిత్సా వ్యయాలకు బీమా రక్షణ ఉంటుందనుకోవద్దు. రక్షణ లేనివీ కొన్ని ఉన్నాయి. అందుకోసం పాలసీ డాక్యుమెంట్‌ను పూర్తిగా పరిశీలించాలి.  ఇందులో నియమ, నిబంధనలు ఉంటాయి. వీటిని పైపైన చదివేసి పాలసీ తీసుకుంటే తర్వాత బాధపడాల్సి వస్తుంది.

ఉప పరిమితులు, ముందు నుంచి ఉన్న వ్యాధులు, ఇతర మినహాయింపులపై అవగాహన పెరుగుతున్నప్పటికీ... క్లెయిమ్స్‌ తిరస్కరణ లేదా తగ్గించి చెల్లింపులు చేస్తున్న ఘటనలు పాలసీదారులను షాక్‌కు గురిచేసేవే. ఏకరూపత కోసం మినహాయింపులను ప్రామాణీకరించేందుకు బీమా నియంత్రణ, అభివృద్ధి సంస్థ (ఐఆర్‌డీఏ) ఓ నిపుణుల కమిటీని 2012లో నియమించింది. 199 అంశాలను ఐఆర్‌డీఏ పేర్కొంది. వీటి ప్రకారం తాను తీసుకుంటున్న పాలసీ వేటికి కవరేజీ ఇవ్వదో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.   

సాంకేతిక పరిజ్ఞానాలు, చికిత్సా ప్రక్రియలు మారుతున్నాయి. బీమా కంపెనీలు వాటిని అమల్లోకి తీసుకొచ్చేందుకు సమయం తీసుకుంటున్నాయి. నిరూపితం కాని లేదా ప్రయోగాత్మక చికిత్సలు అయితే, అవి వైద్యపరంగా ఆచరణీయమైనవి కావు. ఇటువంటివి చాలా పాలసీల్లో కవర్‌ కావు. ‘‘ఎన్నో రకాల సర్జరీలకు సంబంధించిన క్లెయిమ్‌లను మేం గౌరవిస్తాం. ఒకవేళ ఆస్పత్రి రోబోటిక్‌ సర్జరీ లేదా సైబర్‌ నైఫ్‌కు సిఫారసు చేస్తే ఇవి పాలసీ ఒప్పందం పరిధిలోకి రావు.

ఫలితంగా వారి క్లెయిమ్‌ కవర్‌ కాదు. దీంతో అవి మినహాయింపుల కిందకు వస్తాయి’’ అని సిగ్నా టీటీకే హెల్త్‌ ఇన్సూరెన్స్‌ సీవోవో జ్యోతి పుంజా తెలిపారు. అలాగే, స్టెమ్‌ సెల్‌ థెరపీలు (మూల కణాలతో చేసే చికిత్సలు) కూడా కవర్‌ కావు. అయితే, చికిత్స తర్వాత మంచి ఫలితం ఉంటుందని డాక్టర్లు సూచిస్తే రోగులు వాటిని ఎంచుకోవచ్చు’’ అని ఇన్సూరెన్స్‌ బ్రోకింగ్‌ సంస్థ ‘సెక్యూర్‌ నౌ’ ఎండీ మెహతా సూచించారు. వైద్యులు సూచిస్తున్న అత్యాధునిక చికిత్సా విధానం పాలసీలో కవర్‌ అవుతుందా అన్నది ముందే చూసుకోవాలి.  

రెసిడెంట్‌ డాక్టర్ల చార్జీలు
రూమ్‌ రెంట్, రెసిడెంట్‌ డాక్టర్‌ చార్జీలను బిల్లులో ఆస్పత్రి వేర్వేరుగా చూపిస్తే... బీమా సంస్థ వాటిని చెల్లించకపోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ‘‘సాంకేతికంగా రెసిడెంట్‌ డాక్టర్‌ చార్జీలు రూమ్‌రెంట్‌లో కలిసే ఉంటాయి. దీంతో అవి రెసిడెంట్‌ డాక్టర్ల చార్జీలను ప్రత్యేకంగా చెల్లించవు’’ అని రాయల్‌ సుందరం జనరల్‌ ఇన్సూరెన్స్‌ చీఫ్‌ ప్రొడక్ట్‌ ఆఫీసర్‌ నిఖిల్‌ ఆప్టే తెలిపారు. ఈ సందర్భాల్లో పరిష్కారంగా బీమా కంపెనీ నెట్‌వర్క్‌ ఆస్పత్రుల్లో ఒక దానిని ఎంచుకోవాలన్నది నిపుణుల సూచన.

‘‘నెట్‌వర్క్‌ ఆస్పత్రులు అన్నవి బీమా విధానాలకు అనుగుణంగా నడుచుకుంటాయి. దీంతో బిల్లులో వేసిన చార్జీలను చెల్లించకపోవడానికి అవకాశాలు తక్కువగా ఉంటాయి’’ అని ఆప్టే పేర్కొన్నారు. ఇక రోగిని చేర్చుకునే సమయంలో రిజిస్ట్రేషన్‌ చార్జీలంటూ బిల్లులో ఆస్పత్రులు వేసే వాటిని కూడా బీమా కంపెనీలు ఆమోదించవు. ఎందుకంటే అడ్మిషన్‌ డిపాజిట్‌ కవర్‌ కాదు. షాంపూ, పౌడర్, ఇతర నాన్‌ మెడికల్‌ వస్తువులకు చెల్లింపులు చేయవు. ఇవన్నీ నిబంధనల మేరకు చెల్లింపులకు అవకాశం లేనివిగా హెచ్‌డీఎఫ్‌సీ ఎర్గో జనరల్‌ ఇన్సూరెన్స్‌కు చెందిన అనురాగ్‌ రస్తోగి తెలిపారు.

స్పెషలిస్టు డాక్టర్ల చార్జీలు
స్పెషలిస్టు డాక్టర్ల ఫీజులు కవర్‌ కావొచ్చు, కాకపోవచ్చు. ‘‘స్పెషలిస్టు డాక్టర్ల విజిట్‌ చార్జీలను మేం చెల్లిస్తున్నాం. కొన్ని పాలసీలు స్పెషలిస్టు వైద్య నిపుణులు ఒకే రోజు ఒకటికి మించిన పరిశీలనలకు చార్జీలు చెల్లించడం లేదు’’ అని ఆప్టే తెలిపారు. గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్, న్యూరాలజిస్ట్, నెఫ్రాలజిస్ట్‌ నిపుణులు రోగిని పరిశీలించినట్టయితే వారి చార్జీలను చెల్లిస్తున్నాయి. కానీ, ఒకే వైద్య నిపుణుడు రోజులో ఒకటికి మించిన సార్లు విజిట్‌ చేస్తే చార్జీలను చెల్లించవని తెలుసుకోవాలి.

కొన్ని రకాల ఔషధాలక్కూడా...
తీవ్ర అనారోగ్య సమస్యల్లో అన్ని రకాల చికిత్సా వ్యయాలను బీమా సంస్థలు గుడ్డిగా అనుమతించవు. ‘‘కొన్ని రకాల క్యాన్సర్‌ ఔషధాలను కొన్ని బీమా సంస్థలు మినహాయించాయి. ఉదాహరణకు కీమోథెరపీ ఔషధాలను ఇంట్రావీనస్‌ రూపంలో ఇస్తే కవరేజీ అవుతాయి. అలా కాకుండా నోటి ద్వారా తీసుకుంటే వాటికి కవరేజీ అవకాశాలు తక్కువ. అలాగే, ఇమ్యూనోథెరపీ కిందకు వచ్చే ఔషధాల్లో చాలా వరకు కవర్‌ కానివే’’ అని మెహతా తెలిపారు. కొన్ని పాలసీలు ఇంట్రా ఆర్టిక్యులర్‌ లేదా ఇంట్రాలెజనల్‌ ఇంజెక్షన్లకు చెల్లింపులు చేయడం లేదని, వీటికి అదనంగా సప్లిమెంటరీ మెడికేషన్లకూ కవరేజీ ఉండటం లేదని చెప్పారు.

తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ అది ఆల్కహాల్‌ అలవాటు వల్ల లేదా అధికంగా పొగతాగడం వల్ల వచ్చిందని తేలితే అందుకు అయ్యే వ్యయాలను పాలసీదారుడు తన ప్యాకెట్‌ నుంచే భరించాల్సి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఈ కారణాలతో క్లెయిమ్‌లను బీమా సంస్థలు తిరస్కరిస్తుంటాయి. అయితే, ఈ విషయంలో అభ్యంతరం ఉంటే పాలసీదారుడు ప్రశ్నించొచ్చు. ఈ సందర్భాల్లో తిరస్కరణకు కారణాలను రుజువు చేయాల్సి ఉంటుందని హెల్త్‌       ఇన్సూరెన్స్‌ సేవల స్టార్టప్‌ మెక్స్‌ట్రా సీఈవో ఏఎస్‌ నారాయణన్‌ పేర్కొన్నారు.  

ఇంట్లో చికిత్సలు
కొన్ని బీమా సంస్థలు ఆస్పత్రిలో చేరకుండా ఇంట్లోనే ఉండి తీసుకునే చికిత్సలకు చెల్లింపులు చేయడం లేదు. ఆస్పత్రిలో చేరాల్సిన వ్యాధులకు ఇంటి       వద్దే ఉండి చికిత్స తీసకుంటే బీమా మొత్తంలో పరిహారాన్ని 10 శాతానికే పరిమితం చేస్తున్నాయి. అయితే, ఆస్తమా, బ్రాంకైటిస్, మరికొన్ని చికిత్సలకు అసలుకే చెల్లింపులు చేయడం లేదని నిపుణులు పేర్కొంటున్నారు.


ఐఆర్‌డీఏ ప్యానెల్‌ పరిశీలనలో ఉన్నవి
ఒక్కో వ్యాధికి సంబంధించి ప్రత్యేకంగా శాశ్వత మినహాయింపులను అనుమతించడం. తద్వారా ఇలా మినహాయింపు ఉన్న అనారోగ్యాలకు సంబంధం లేని వ్యాధులకు కవరేజీ అందేలా చూడటం.
   మినహాయింపులను పరిమితం చేయడం ద్వారా హెల్త్‌ కవరేజీని విస్తృతం చేయడం.
♦  నూతన టెక్నాలజీ ఆధారిత అత్యాధునిక చికిత్సా విధానాలను అనుమతించని మినహాయింపులను హేతుబద్ధీకరించడం.  
 తొలగించతగ్గ మినహాయింపుల గుర్తింపు.
 పాలసీ పత్రాల్లో పదజాలాన్ని మరింత సులభంగా, ప్రామాణికంగా మార్చడం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement