కుటుంబానికి ధీమా | family floater health insurance plan for complete safety ... | Sakshi
Sakshi News home page

కుటుంబానికి ధీమా

Published Sun, Apr 13 2014 1:24 AM | Last Updated on Sat, Sep 2 2017 5:56 AM

కుటుంబానికి ధీమా

కుటుంబానికి ధీమా

35 ఏళ్లలోపు వ్యక్తి రెండు లక్షలకు వైద్య బీమా పాలసీ తీసుకుంటే ఏడాదికి సుమారుగా రూ. 2,500 ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. అదే కుటుంబంలోని నలుగురు సభ్యులకు విడివిడిగా పాలసీ తీసుకుంటే రూ. 10,000 వరకు చెల్లించాల్సి ఉంటుంది. అదే ఇలా వ్యక్తిగతంగానాలుగు పాలసీలు కాకుండా కుటుంబ సభ్యులందరికీ కలిపి 4 లక్షలకు వైద్య బీమా పాలసీ తీసుకుంటే రూ. 7,000 చెల్లిస్తే చాలు. అదే ఫ్యామిలీ ఫ్లోటర్ పాలసీ ప్రత్యేకత.

తక్కువ ప్రీమియంతో రెట్టింపు బీమా రక్షణ లభిస్తుండటంతో వైద్య బీమా రంగంలో ఫ్యామిలీ ఫ్లోటర్ పాలసీలకు డిమాండ్ పెరుగుతోంది. అసలు ఫ్యామిలీ ఫ్లోటర్ పాలసీలంటే ఏమిటి? అవి ఎలా పని చేస్తాయి? వాటి ప్రయోజనాలపై అవగాహన పెంచేదే ప్రాఫిట్ ముఖ్య కథనం.

ఆరోగ్య బీమాపై ప్రజల్లో అవగాహన పెరుగుతోంది. కేవలం సంపాదించే వ్యక్తే కాకుండా కుటుంబ సభ్యులందరికీ వైద్య బీమా ఉండే విధంగా చూసుకుంటున్నారు. ఇండివిడ్యువల్ హెల్త్ పాలసీల అమ్మకాలు తగ్గి ఫ్యామిలీ ఫ్లోటర్ పాలసీల అమ్మకాలు పెరుగుతుండటమే దీనికి ప్రత్యక్ష నిదర్శనం. దీంతో బీమా కంపెనీలు అత్యధికంగా ఫ్యామిలీ ఫ్లోటర్ పాలసీలపై దృష్టిసారిస్తున్నాయి. పెరుగుతున్న వైద్య చికిత్స వ్యయం కూడా ఈ పాలసీలకు ఆదరణ పెంచుతోంది. మన దేశంలో వైద్య ఖర్చులు ఏటా 20% చొప్పున పెరుగుతున్నట్లు (హెల్త్ ఇన్‌ఫ్లేషన్) గణాంకాలు పేర్కొంటున్నాయి. ఇలా వ్యయం పెరుగుతుండంటంతో అందరూ వైద్య బీమా పాలసీలపై ఆసక్తి చూపిస్తున్నారు.

ఫ్యామిలీ ఫ్లోటర్ అంటే...
వ్యక్తిగతంగా అంటే ఒక వ్యక్తి పేరు మీద తీసుకునే పాలసీలను ఇండివిడ్యువల్ పాలసీలుగాను, అదే కొందరు వ్యక్తులు, సంఘాలు కలిపి తీసుకునే వాటిని గ్రూపు పాలసీలుగా పరిగణిస్తారు. ఈ రెండు కాకుండా కేవలం దగ్గరి రక్తసంబంధీకులు ఒక సమూహంగా ఏర్పడి తీసుకునే వాటిని ఫ్యామిలీ ఫ్లోటర్ పాలసీలంటారు. సాధారణంగా ఫ్యామిలీ ఫ్లోట ర్‌లో భార్య, భర్త, వారి పిల్లలు ఉంటారు.

కానీ ఇప్పుడు కొన్ని కంపెనీలు కుటుంబంతో పాటు తల్లిదండ్రులు, అత్తమామలకు కలిపి కూడా పాలసీలను అందిస్తున్నాయి. చాలా బీమా కంపెనీలు ఆరుగురు కుటుంబ సభ్యులకు మించి ఈ ఫ్యామిలీ ఫ్లోటర్ పాలసీని ఇవ్వడం లేదు. అదే మాక్స్‌బూపా వం టి ఒకటి రెండు కంపెనీలు మాత్రం 13 మంది రక్తసంబంధీకుల వరకు పాలసీలను అందిస్తున్నాయి.

 ప్రయోజనం ఏమిటి?..
కేవలం సంపాదిస్తున్న వ్యక్తికే కాకుండా కుటుంబంలోని ప్రతి ఒక్కరికి ఆరోగ్య బీమా పాలసీ కలిగి ఉండాల్సిందే. ఇలా విడివిడిగా ఒక్కొక్కరి పేరుమీద పాలసీ తీసుకోవడం చాలా వ్యయంతో కూడుకున్నది. ఉదాహరణకు రమేష్ తన పేరు మీద రూ.2 లక్షలు, భార్య పేరు మీద రూ.లక్ష, కూతురు, కొడుకు పేరు మీద చెరో రూ.50,000కి పాలసీ చొప్పున మొత్తం నాలుగు పాలసీలు తీసుకున్నాడనుకుందాం. కానీ అనుకోకుండా కొడుక్కి అనారోగ్యం రావడంతో ఆసుపత్రి బిల్లు రూ.1.30 లక్షలు అయింది.

కొడుకు పేరు మీద రూ.50,000 బీమా రక్షణ ఉండటంతో మిగిలిన రూ.80,000 జేబులోంచి పెట్టుకోవాల్సి వచ్చింది. అదే ఇలా విడివిడిగా కాకుండా కుటుంబంలోని అందరికీ వర్తించే విధంగా నాలుగు లక్షలకు వైద్య బీమా తీసుకుంటే ఈ ఇబ్బంది వచ్చేది కాదు. అంతేకాదు, ప్రీమియం భారం కూడా తగ్గుతుంది. 18 నుంచి 35 ఏళ్లలోపు ఉన్న వ్యక్తులకు 5 లక్షల వైద్య బీమాకు రూ.5,355 చెల్లించాలి. కేవలం భార్యాభర్తలకే అనుకున్నా ఇద్దరికీ విడివిడిగా తీసుకుంటే రూ.10,710 చెల్లించాలి. కానీ అదే బీమా కంపెనీ ఫ్యామిలీ ఫ్లోటర్‌ను రూ.7,321కే అందిస్తోంది. అంటే అదే బీమా రక్షణ లభించడమే కాకుండా ప్రీమియం రూ.3,389 తగ్గింది.

ఎందుకు తక్కువ?
బీమా కంపెనీల పాలసీ రూపకల్పన, ప్రీమియం లెక్కింపు వంటి అంశాల్లో యాక్చువేరియల్‌దే కీలకపాత్ర. వీరి అంచనాల ప్రకారం ఏడాదిలో ఒక కుటుంబం నుంచి ఇద్దరు వ్యక్తులు అనారోగ్యం పాలయ్యే అవకాశాలు చాలా తక్కువ. సాధారణంగా ఫ్యామిలీ ఫ్లోటర్ పాలసీల్లో నలుగురు సభ్యులు ఉంటున్నారు. అంటే నలుగురులో ఏదైనా జరిగినా ఒకరికంటే ఎక్కువ క్లెయిమ్‌లు రాకపోవచ్చని అంచనా. ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకొనే ఫ్యామిలీ ఫ్లోటర్ పాలసీల ప్రీమియంలు తగ్గిస్తున్నాయి.

 కొత్త పాలసీలు
వ్యక్తిగత పాలసీల విక్రయం తగ్గి ఫ్యామిలీ ఫ్లోటర్‌కి డిమాండ్ పెరుగుతుండటంతో కంపెనీలు ఈ దిశగా కొత్త పథకాలను ప్రవేశ పెడుతున్నాయి. ఈ మధ్యనే న్యూ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ విడుదల చేసిన కొత్త పథకానికి మంచి స్పందన వస్తోంది. దీంతో యునెటైడ్ ఇండియా కూడా ఈ రకమైన పథకాన్ని ప్రారంభించడానికి ఐఆర్‌డీఏకి దాఖలు చేసింది. ఇవికాకుండా అపోలో మ్యూనిక్, మాక్స్ బూపా, ఐసీఐసీఐ లాంబార్డ్, హెచ్‌డీఎఫ్‌సీఎర్గో వంటి కంపెనీలన్నీ ఫ్యామిలీ ఫ్లోటర్లను అందిస్తున్నాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement