ముంబై: కీలకం కాని బీమా బిజినెస్‌లలో బ్యాంకింగ్ సంస్థలు నియంత్రిత స్థాయిలో వాటాలను కలిగి ఉండటంపై రిజర్వ్ బ్యాంక్ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. బీమా వెంచర్లకు బ్యాంకింగ్ సంస్థలు అధిక పెట్టుబడులను వెచ్చించాల్సి రావడంతో వాటాలపై పరిమితి విధించే యోచనలో ఆర్‌బీఐ ఉన్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. వెరసి బీమా రంగ సంస్థలలో బ్యాంకుల వాటాను గరిష్టంగా 20 శాతానికి పరిమితం చేయాలని భావిస్తున్నట్లు వెల్లడించాయి. ఈ బాటలోనే ఇటీవల మ్యాక్స్ లైఫ్‌ను కొనుగోలు చేసేందుకు ప్రయివేట్ రంగ దిగ్గజం యాక్సిస్ బ్యాంక్‌ను అనుమతించినట్లు పేర్కొన్నాయి. మ్యాక్స్ లైఫ్‌లో ప్రత్యక్షంగా 10 శాతం వాటాను మాత్రమే కలిగి ఉండేందుకు యాక్సిస్ బ్యాంక్ ప్రతిపాదించింది. అంతేకాకుండా 20 శాతానికి వాటాను పరిమితం చేసుకునేందుకు అంగీకరించినట్లు తెలియజేశాయి.
ప్రస్తుతం 50 శాతం
ప్రస్తుతం బీమా రంగ వెంచర్లలో బ్యాంకులు 50 శాతం వరకూ వాటాను పొందేందుకు నిబంధనలు అనుమతిస్తున్నాయి. ఈ వాటాను 20 శాతానికి పరిమితం చేయాలని కేంద్ర బ్యాంకు భావిస్తున్నట్లు ఒక నివేదిక అభిప్రాయపడింది. ఇది జరిగితే కేవలం మూడు బ్యాంకింగ్ దిగ్గజాలు విక్రయించే వాటా విలువే రూ.1.21 లక్షల కోట్లుగా ఉండగలదని విశ్లేషకులు అంచనా వేశారు. తాజా ప్రతిపాదనల ప్రకారం బీమా అనుబంధ సంస్థలలో పీఎస్‌యూ దిగ్గజం ఎస్‌బీఐ, ప్రయివేట్ రంగ బ్లూచిప్స్ హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ బ్యాంక్ వాటాలను విక్రయించవలసి వస్తే వీటి విలువ లక్షల కోట్లలో ఉంటుందని పేర్కొన్నారు. బీమా వెంచర్లలో వాటాను 20 శాతానికి పరిమితం చేసుకోమంటూ బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలను ఆర్‌బీఐ ఆదేశిస్తే.. ఈక్విటీ ఫ్రీఫ్లోట్ భారీగా పెరుగుతుందని తెలియజేశాయి.
దిగ్గజాల తీరిలా
లిస్టెడ్ కంపెనీలలో హెచ్‌డీఎఫ్‌సీకి బీమా అనుబంధ సంస్థ హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌లో 50 శాతం వాటా ఉంది. తాజా ప్రతిపాదనలకు అనుగుణంగా ఈక్విటీని తగ్గించుకోవలసి వస్తే రూ. 44,100 కోట్ల విలువైన వాటాను విక్రయించవలసి ఉంటుంది. ఇక ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్‌లో 51 శాతం వాటా కలిగిన ఐసీఐసీఐ బ్యాంక్ ప్రస్తుత ధర ప్రకారం రూ.22,100 కోట్ల విలువైన షేర్లను అమ్మకానికి ఉంచవలసి వస్తుంది. ఇదే విధంగా ఐసీఐసీఐ లంబార్డ్‌లోనూ 52 శాతం వాటాను కలిగి ఉంది. ఈ వెంచర్‌లో రూ. 21,700 కోట్ల విలువైన ఈక్విటీని ఆఫ్‌లోడ్ చేయవలసి ఉంటుంది. ఈ బాటలో ఎస్‌బీఐ లైఫ్‌లో 55 శాతం వాటాను సొంతం చేసుకున్న స్టేట్‌బ్యాంక్ అయితే రూ. 32,200 కోట్ల విలువైన వాటాను తగ్గించుకోవలసి వస్తుంది. ఈ నాలుగు దిగ్గజాల వాటాలను పరిగణించినప్పటికీ వీటి విలువ రూ. 1.21 లక్షల కోట్ల వరకూ నమోదు కావచ్చని విశ్లేషకులు మదింపు చేశారు.
పలు సంస్థలు..
అన్ని పీఎస్‌యూ బ్యాంకులతోపాటు.. పలు ప్రయివేట్ రంగ బ్యాంకులు సైతం బీమా రంగంలో అనుబంధ సంస్థలను ఏర్పాటు చేశాయి. అయితే.. కోవిడ్–19 నేపథ్యంలో మొండి రుణాలు తదితర సవాళ్లను ఎదుర్కొనేందుకు వీలుగా బ్యాంకులకు బీమా రంగ వెంచర్లు ఉపయోగపడుతున్నట్లు నివేదిక పేర్కొంది. బీమా రంగ కంపెనీలలో వాటాల విక్రయం ద్వారా సమకూర్చుకున్న నిధులను ప్రొవిజనింగ్ తదితరాలకు బ్యాంకులు వినియోగించుకునేందుకు వీలు చిక్కుతున్నట్లు తెలియజేసింది. ఉదాహరణకు 2016–18 కాలంలో హెచ్‌డీఎఫ్‌సీ ఇలా సమీకరించిన నిధులను 40 శాతం వినియోగించుకోగా.. ఐసీఐసీఐ బ్యాంక్ సైతం ఇదే స్థాయిలో ప్రొవిజన్లకు కేటాయించింది. జీవిత బీమా, సాధారణ బీమా సంస్థలలో వాటాల విక్రయం ద్వారా 2016 నుంచి చూస్తే హెచ్‌డీఎఫ్‌సీ రూ. 10,900 కోట్లు సమకూర్చుకోగా.. ఐసీఐసీఐ బ్యాంక్ రూ. 15,300 కోట్లు, ఎస్‌బీఐ రూ. 12,670 కోట్లు అందుకున్నట్లు నివేదిక తెలియజేసింది.
చదవండి:
Comments
Please login to add a commentAdd a comment