Apollo Munich
-
హెచ్డీఎఫ్సీ చేతికి అపోలో మ్యూనిక్ హెల్త్
ముంబై: గృహ రుణాల సంస్థ హెచ్డీఎఫ్సీ తాజాగా అపోలో మ్యూనిక్ హెల్త్ ఇన్సూరెన్స్ సంస్థలో మెజారిటీ వాటాలు దక్కించుకుంది. అపోలో హాస్పిటల్స్ గ్రూప్ నుంచి రూ. 1,347 కోట్లకు ఈ వాటాలు కొనుగోలు చేస్తోంది. ఇకపై దీన్ని సొంత బీమా సంస్థ హెచ్డీఎఫ్సీ ఎర్గో జనరల్ ఇన్సూరెన్స్‌లో విలీనం చేయనుంది. డీల్ ప్రకారం అపోలో హాస్పిటల్స్ నుంచి హెచ్డీఎఫ్సీ రూ. 1,336 కోట్లకు 50.8 శాతం వాటాలు కొనుగోలు చేస్తుంది. మరో 0.4 శాతం వాటాను ఉద్యోగుల నుంచి రూ. 10.84 కోట్లకు కొనుగోలు చేస్తుంది. జాయింట్ వెంచర్ నుంచి వైదొలుగుతున్నందుకు గాను జర్మన్ బీమా సంస్థ మ్యూనిక్ హెల్త్.. అపోలో హాస్పిటల్స్ ఎంటర్ప్రైజ్, అపోలో ఎనర్జీకి రూ. 294 కోట్లు చెల్లించనున్నట్లు అపోలో హాస్పిటల్స్ ఎంటర్ప్రైజ్ వైస్ చైర్పర్సన్ శోభనా కామినేని తెలిపారు. రుణభారం కొంత తగ్గించుకునేందుకు ఈ డీల్ తోడ్పడగలదని వివరించారు. 2006 నుంచి అపోలో మ్యూనిక్ హెల్త్‌లో అపోలో గ్రూప్ దాదాపు 300 కోట్లు ఇన్వెస్ట్ చేసినట్లు వెల్లడించారు. షేరు ఒక్కింటికి రూ. 73 రేటు చొప్పున అపోలో హాస్పిటల్స్ గ్రూప్ ప్రమోటర్లయిన ప్రతాప్ సి రెడ్డి కుటుంబానికి పెట్టుబడిపై దాదాపు నాలుగు రెట్లు అధికం లభించనుంది. రూ. 10వేల కోట్ల మార్కెట్ వాటా.. మరోవైపు విలీన సంస్థకు నాన్–లైఫ్ ఇన్సూరెన్స్ రంగంలో మొత్తం 6.4 శాతం మార్కెట్ వాటా, రూ. 10,807 కోట్ల వ్యాపార పరిమాణం, 308 శాఖలు ఉంటాయి. దేశీయంగా హెచ్డీఎఫ్సీ ఎర్గో రెండో అతి పెద్ద ప్రమాద, వైద్య బీమా సంస్థగా ఆవిర్భవించనుంది. హెచ్డీఎఫ్సీ ఎర్గో, అపోలో మ్యూనిక్ హెల్త్ల కలయిక.. మరింత వినూత్న ఉత్పత్తుల ఆవిష్కరణకు, నెట్‌వర్క్‌ను పెంచుకోవడానికి, సేవలు మెరుగుపర్చుకోవడానికి ఉపయోగపడగలదని హెచ్డీఎఫ్సీ చైర్మన్ దీపక్ పరేఖ్ అభిప్రాయం వ్యక్తం చేశారు. వచ్చే తొమ్మిది నెలల వ్యవధిలో డీల్ పూర్తి కాగలదని చెప్పారు. విలీనానంతరం కూడా ఉద్యోగులందరినీ కొనసాగించనున్నట్లు వివరించారు. హెచ్డీఎఫ్సీ ఎర్గో లిస్టింగ్ దిశగా ఈ కొనుగోలు తోడ్పడగలదని పరేఖ్ పేర్కొన్నారు. -
అపోలో మ్యూనిక్‌కు ప్రమోటర్లు గుడ్‌బై!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రుణభారం తగ్గించుకునే దిశగా ఆరోగ్య బీమా సేవలందించే జాయింట్ వెంచర్ సంస్థ అపోలో మ్యూనిక్ హెల్త్‌లో వాటాలను విక్రయించడంపై అపోలో హాస్పిటల్స్ ప్రమోటర్స్ కసరత్తు చేస్తున్నారు. ఇందులో అపోలో హాస్పిటల్స్ వ్యవస్థాపకుడు ప్రతాప్ సి. రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులకు 41 శాతం వాటాలు ఉన్నాయి. వీటిని సుమారు రూ. 1,200 కోట్లకు విక్రయించే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇప్పటికే నాలుగు కంపెనీలతో చర్చలు జరుగుతున్నాయని, వీటిలో రెండు ఈక్విటీ ఫండ్ సంస్థలు ఉన్నాయని పేర్కొన్నాయి. వచ్చే ఆరు నెలల్లో వాటాల విక్రయం పూర్తి కావొచ్చని అంచనా. ప్రస్తుతం అపోలో హాస్పిటల్స్ రుణభారం సుమారు రూ. 3,430 కోట్లుగా ఉంది. సంస్థలో ప్రమోటర్స్కు 34 శాతం వాటాలు ఉండగా గతేడాది డిసెంబర్ ఆఖరు నాటికి ఇందులో దాదాపు 74 శాతం వాటాలు తనఖాలో ఉన్నట్లు తెలుస్తోంది. రుణభారాన్ని తగ్గించుకునేందుకు అపోలో ప్రమోటర్స్ ఈ నిధులను వినియోగించారు. రుణాలు తీర్చేందుకు తనఖా ఉంచిన షేర్ల పరిమాణం ఈ మధ్య కాలంలో కొంత పెరిగిందన్న అపోలో ఎండీ సునీతా రెడ్డి.. వచ్చే ఆరు నెలల వ్యవధిలో దాన్ని 50 శాతానికి తగ్గించుకునే ప్రయత్నాల్లో ఉన్నట్లు ఇటీవల తెలిపారు. అయితే, బీమా వెంచర్లో వాటాల విక్రయానికి సంబంధించిన వార్తలపై మాత్రం స్పందించలేదు. గతంలోనే కొంత వాటా విక్రయం.. 2007లో ప్రారంభమైన అపోలో మ్యూనిక్ సంస్థ ఆరోగ్య, ప్రమాద బీమా, ప్రయాణ బీమా పథకాలను అందిస్తోంది. జర్మనీకి చెందిన మ్యూనిక్ ఆర్ఈ గ్రూప్‌లో భాగమైన డీకేవీ ఏజీతో కలిసి దీన్ని ఏర్పాటు చేయడంతో ప్రారంభంలో సంస్థ పేరు అపోలో డీకేవీగా ఉండేది. ఆ తర్వాత 2009లో అపోలో డీకేవీ పేరును అపోలో మ్యూనిక్ హెల్త్ ఇన్సూరెన్స్‌గా మార్చారు. దీన్ని ప్రారంభించినప్పుడు అపోలో హాస్పిటల్, డీకేవీ ఏజీ వాటాలు 74:26 నిష్పత్తిలో ఉండేవి. ఆ తర్వాత 2016 జనవరిలో మ్యూనిక్ ఆర్ఈ.. అపోలో మ్యూనిక్‌లో 23.27 శాతం వాటాలు కొనుగోలు చేసింది. దీంతో సంస్థలో మ్యూనిక్ ఆర్ఈ వాటా 48.75 శాతానికి పెరిగింది. గతేడాది సెప్టెంబర్ నాటికి భారత్‌లో అపోలో మ్యూనిక్‌కు 180 కార్యాలయాలు, 3,200 మంది ఉద్యోగులున్నారు. గతడాది మార్చి ఆఖరు నాటికి అపోలో మ్యూనిక్ సంస్థ స్థూల ప్రీమియం వసూళ్లు రూ. 1,720 కోట్లుగా ఉన్నాయి. బుధవారం బీఎస్ఈలో అపోలో హాస్పిటల్స్ షేరు సుమారు 1 శాతం పెరిగి రూ. 1,146.60 వద్ద క్లోజయ్యింది. -
అపోలో మ్యూనిక్‌తో యాక్సిస్ జట్టు
ఆరోగ్య బీమా సేవలందించే అపోలో మ్యూనిక్‌తో ప్రైవేటు రంగ యాక్సిస్ బ్యాంక్ ఒప్పందం కుదుర్చుకుంది. దీని ప్రకారం అపోలో మ్యూనిక్ చెందిన అన్ని రకాల ఆరోగ్య బీమా పథకాలను యాక్సిస్ బ్యాంక్ విక్రయిస్తుంది. రూ.3 లక్షల నుంచి రూ.50 లక్షల బీమా రక్షణతో పాటు అన్ని రకాల డే-కేర్ చికిత్సలకు కూడా బీమా రక్షణ వంటి ఉన్నాయి. ఇవి కాకుండా యాక్సిస్ బ్యాంక్ ఖాతాదారుల అవసరాలకు అనుగుణంగా కూడా కొత్త పథకాలను ప్రవేశపెట్టనున్నట్లు అపోలో మ్యూనిక్ తెలిపింది. -
కుటుంబానికి ధీమా
35 ఏళ్లలోపు వ్యక్తి రెండు లక్షలకు వైద్య బీమా పాలసీ తీసుకుంటే ఏడాదికి సుమారుగా రూ. 2,500 ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. అదే కుటుంబంలోని నలుగురు సభ్యులకు విడివిడిగా పాలసీ తీసుకుంటే రూ. 10,000 వరకు చెల్లించాల్సి ఉంటుంది. అదే ఇలా వ్యక్తిగతంగానాలుగు పాలసీలు కాకుండా కుటుంబ సభ్యులందరికీ కలిపి 4 లక్షలకు వైద్య బీమా పాలసీ తీసుకుంటే రూ. 7,000 చెల్లిస్తే చాలు. అదే ఫ్యామిలీ ఫ్లోటర్ పాలసీ ప్రత్యేకత. తక్కువ ప్రీమియంతో రెట్టింపు బీమా రక్షణ లభిస్తుండటంతో వైద్య బీమా రంగంలో ఫ్యామిలీ ఫ్లోటర్ పాలసీలకు డిమాండ్ పెరుగుతోంది. అసలు ఫ్యామిలీ ఫ్లోటర్ పాలసీలంటే ఏమిటి? అవి ఎలా పని చేస్తాయి? వాటి ప్రయోజనాలపై అవగాహన పెంచేదే ప్రాఫిట్ ముఖ్య కథనం. ఆరోగ్య బీమాపై ప్రజల్లో అవగాహన పెరుగుతోంది. కేవలం సంపాదించే వ్యక్తే కాకుండా కుటుంబ సభ్యులందరికీ వైద్య బీమా ఉండే విధంగా చూసుకుంటున్నారు. ఇండివిడ్యువల్ హెల్త్ పాలసీల అమ్మకాలు తగ్గి ఫ్యామిలీ ఫ్లోటర్ పాలసీల అమ్మకాలు పెరుగుతుండటమే దీనికి ప్రత్యక్ష నిదర్శనం. దీంతో బీమా కంపెనీలు అత్యధికంగా ఫ్యామిలీ ఫ్లోటర్ పాలసీలపై దృష్టిసారిస్తున్నాయి. పెరుగుతున్న వైద్య చికిత్స వ్యయం కూడా ఈ పాలసీలకు ఆదరణ పెంచుతోంది. మన దేశంలో వైద్య ఖర్చులు ఏటా 20% చొప్పున పెరుగుతున్నట్లు (హెల్త్ ఇన్ఫ్లేషన్) గణాంకాలు పేర్కొంటున్నాయి. ఇలా వ్యయం పెరుగుతుండంటంతో అందరూ వైద్య బీమా పాలసీలపై ఆసక్తి చూపిస్తున్నారు. ఫ్యామిలీ ఫ్లోటర్ అంటే... వ్యక్తిగతంగా అంటే ఒక వ్యక్తి పేరు మీద తీసుకునే పాలసీలను ఇండివిడ్యువల్ పాలసీలుగాను, అదే కొందరు వ్యక్తులు, సంఘాలు కలిపి తీసుకునే వాటిని గ్రూపు పాలసీలుగా పరిగణిస్తారు. ఈ రెండు కాకుండా కేవలం దగ్గరి రక్తసంబంధీకులు ఒక సమూహంగా ఏర్పడి తీసుకునే వాటిని ఫ్యామిలీ ఫ్లోటర్ పాలసీలంటారు. సాధారణంగా ఫ్యామిలీ ఫ్లోట ర్లో భార్య, భర్త, వారి పిల్లలు ఉంటారు. కానీ ఇప్పుడు కొన్ని కంపెనీలు కుటుంబంతో పాటు తల్లిదండ్రులు, అత్తమామలకు కలిపి కూడా పాలసీలను అందిస్తున్నాయి. చాలా బీమా కంపెనీలు ఆరుగురు కుటుంబ సభ్యులకు మించి ఈ ఫ్యామిలీ ఫ్లోటర్ పాలసీని ఇవ్వడం లేదు. అదే మాక్స్‌బూపా వం టి ఒకటి రెండు కంపెనీలు మాత్రం 13 మంది రక్తసంబంధీకుల వరకు పాలసీలను అందిస్తున్నాయి. ప్రయోజనం ఏమిటి?.. కేవలం సంపాదిస్తున్న వ్యక్తికే కాకుండా కుటుంబంలోని ప్రతి ఒక్కరికి ఆరోగ్య బీమా పాలసీ కలిగి ఉండాల్సిందే. ఇలా విడివిడిగా ఒక్కొక్కరి పేరుమీద పాలసీ తీసుకోవడం చాలా వ్యయంతో కూడుకున్నది. ఉదాహరణకు రమేష్ తన పేరు మీద రూ.2 లక్షలు, భార్య పేరు మీద రూ.లక్ష, కూతురు, కొడుకు పేరు మీద చెరో రూ.50,000కి పాలసీ చొప్పున మొత్తం నాలుగు పాలసీలు తీసుకున్నాడనుకుందాం. కానీ అనుకోకుండా కొడుక్కి అనారోగ్యం రావడంతో ఆసుపత్రి బిల్లు రూ.1.30 లక్షలు అయింది. కొడుకు పేరు మీద రూ.50,000 బీమా రక్షణ ఉండటంతో మిగిలిన రూ.80,000 జేబులోంచి పెట్టుకోవాల్సి వచ్చింది. అదే ఇలా విడివిడిగా కాకుండా కుటుంబంలోని అందరికీ వర్తించే విధంగా నాలుగు లక్షలకు వైద్య బీమా తీసుకుంటే ఈ ఇబ్బంది వచ్చేది కాదు. అంతేకాదు, ప్రీమియం భారం కూడా తగ్గుతుంది. 18 నుంచి 35 ఏళ్లలోపు ఉన్న వ్యక్తులకు 5 లక్షల వైద్య బీమాకు రూ.5,355 చెల్లించాలి. కేవలం భార్యాభర్తలకే అనుకున్నా ఇద్దరికీ విడివిడిగా తీసుకుంటే రూ.10,710 చెల్లించాలి. కానీ అదే బీమా కంపెనీ ఫ్యామిలీ ఫ్లోటర్‌ను రూ.7,321కే అందిస్తోంది. అంటే అదే బీమా రక్షణ లభించడమే కాకుండా ప్రీమియం రూ.3,389 తగ్గింది. ఎందుకు తక్కువ? బీమా కంపెనీల పాలసీ రూపకల్పన, ప్రీమియం లెక్కింపు వంటి అంశాల్లో యాక్చువేరియల్దే కీలకపాత్ర. వీరి అంచనాల ప్రకారం ఏడాదిలో ఒక కుటుంబం నుంచి ఇద్దరు వ్యక్తులు అనారోగ్యం పాలయ్యే అవకాశాలు చాలా తక్కువ. సాధారణంగా ఫ్యామిలీ ఫ్లోటర్ పాలసీల్లో నలుగురు సభ్యులు ఉంటున్నారు. అంటే నలుగురులో ఏదైనా జరిగినా ఒకరికంటే ఎక్కువ క్లెయిమ్‌లు రాకపోవచ్చని అంచనా. ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకొనే ఫ్యామిలీ ఫ్లోటర్ పాలసీల ప్రీమియంలు తగ్గిస్తున్నాయి. కొత్త పాలసీలు వ్యక్తిగత పాలసీల విక్రయం తగ్గి ఫ్యామిలీ ఫ్లోటర్‌కి డిమాండ్ పెరుగుతుండటంతో కంపెనీలు ఈ దిశగా కొత్త పథకాలను ప్రవేశ పెడుతున్నాయి. ఈ మధ్యనే న్యూ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ విడుదల చేసిన కొత్త పథకానికి మంచి స్పందన వస్తోంది. దీంతో యునెటైడ్ ఇండియా కూడా ఈ రకమైన పథకాన్ని ప్రారంభించడానికి ఐఆర్డీఏకి దాఖలు చేసింది. ఇవికాకుండా అపోలో మ్యూనిక్, మాక్స్ బూపా, ఐసీఐసీఐ లాంబార్డ్, హెచ్డీఎఫ్సీఎర్గో వంటి కంపెనీలన్నీ ఫ్యామిలీ ఫ్లోటర్లను అందిస్తున్నాయి.