న్యూఢిల్లీ: ప్రయివేట్ రంగ దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ గతేడాది(2020–21) చివరి త్రైమాసికంలో ఆకర్షణీయ ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన క్యూ4(జనవరి–మార్చి)లో నికర లాభం దాదాపు 16 శాతం ఎగసి రూ. 8,434 కోట్లను తాకింది. ఇందుకు ప్రధానంగా రుణ విడుదల, వడ్డీ ఆదాయం సహకరించింది. అంతక్రితం ఏడాది(2019–20) క్యూ4లో రూ. 7,280 కోట్లు మాత్రమే ఆర్జించింది. తాజా సమీక్షా కాలంలో నికర వడ్డీ ఆదాయం(ఎన్‌ఐఐ) 12.6 శాతం అధికమై రూ. 17,120 కోట్లయ్యింది. నికర వడ్డీ మార్జిన్లు(ఎన్‌ఐఎం) స్వల్ప వెనకడుగుతో 4.2 శాతానికి చేరాయి.
స్థూల మొండిబకాయిలు(ఎన్‌పీఏలు) 1.26 శాతం నుంచి 1.32 శాతానికి పెరిగాయి. నికర ఎన్‌పీఏలు సైతం 0.36 శాతం నుంచి 0.4 శాతానికి పెరిగాయి. ఇక మొండి రుణాలకు కేటాయింపులు రూ. 3784 కోట్ల నుంచి రూ. 4694 కోట్లకు పెరిగాయి. అయితే రుణ మంజూరీ 14 శాతం పుంజుకోగా.. ఇతర ఆదాయం 26 శాతం జంప్‌చేసి రూ. 7,594 కోట్లకు చేరింది. మొత్తం ఆదాయం రూ. 38,287 కోట్ల నుంచి రూ. 40,909 కోట్లకు బలపడింది. కాగా.. నిర్వహణ వ్యయాలు 11% పెరిగి రూ. 9,181 కోట్లను అధిగమించాయి.
పూర్తి ఏడాదికి
మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి నికర లాభం 17 శాతం వృద్ధితో రూ. 31,833 కోట్లకు చేరింది. మొత్తం ఆదాయం రూ. 1,47,068 కోట్ల నుంచి రూ. 1,55,885 కోట్లకు బలపడింది. మొత్తం డిపాజిట్లు 16.3 శాతం వృద్ధితో రూ. 13.35 లక్షల కోట్లకు చేరగా.. కరెంట్, సేవింగ్స్ విభాగాలు 27 శాతం ఎగసి రూ. 6.15 లక్షల కోట్లను అధిగమించాయి. రుణ విడుదల 14 శాతం పెరిగి రూ. 11,32,837 కోట్లకు చేరింది. అనుబంధ సంస్థలలో హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ నికర లాభం 157 కోట్ల నుంచి రూ. 253 కోట్లను దూసుకెళ్లగా.. ఎన్‌బీఎఫ్‌సీ.. హెచ్‌డీబీ ఫైనాన్షియల్ సర్వీసెస్ లాభం రూ. 342 కోట్ల నుంచి రూ. 285 కోట్లకు వెనకడుగు వేసింది.
కోవిడ్–19 నేపథ్యంలో ఆర్‌బీఐ మార్గదర్శకాలకు అనుగుణంగా గతేడాదికి తుది డివిడెండ్‌ను ప్రకటించడంలేదని బ్యాంక్ పేర్కొంది. సెకండ్‌వేవ్‌లో కోవిడ్–19 మరింత తీవ్రతను చూపుతుండటంతో భవిష్యత్‌లో బ్యాంక్ పనితీరు ప్రభావితమయ్యే వీలున్నట్లు అంచనా వేసింది. కనీస మూలధన నిష్పత్తి(సీఏఆర్) 18.8 శాతంగా నమోదైంది. ఫలితాల ప్రభావం షేరుపై సోమ వారం(19న) ప్రతిఫలించవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. వారాంతాన ఎన్‌ఎస్‌ఈలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ షేరు యథాతథంగా రూ. 1,431 వద్ద ముగిసింది.
ఐసీఐసీఐ లంబార్డ్ లాభం జూమ్
ప్రయివేట్ రంగ సాధారణ బీమా కంపెనీ ఐసీఐసీఐ లంబార్డ్ గతేడాది(2020–21) చివరి త్రైమాసికంలో ప్రోత్సాహకర పనితీరు చూపింది. క్యూ4(జనవరి–మార్చి)లో నికర లాభం 23 శాతం జంప్‌చేసి రూ. 346 కోట్లను తాకింది. మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి సైతం నికర లాభం 23 శాతంపైగా పుంజుకుని రూ. 1,473 కోట్లయ్యింది. వాటాదారులకు షేరుకి రూ. 4 చొప్పున తుది డివిడెండ్ ప్రకటించింది. శుక్రవారం నిఫ్టీలో ఐసీఐసీఐ లంబార్డ్ షేరు 2.7% జంప్‌చేసి రూ. 1,423 వద్ద ముగిసింది.
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఫలితాలు గుడ్
Published Mon, Apr 19 2021 12:30 AM | Last Updated on Mon, Apr 19 2021 12:40 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment