30 రోజుల్లో పరిష్కరించాలి
♦ గడువు దాటితే వడ్డీ చెల్లించాలి
♦ హెల్త్ పాలసీ క్లెయిమ్ పరిష్కారంపై ఐఆర్‌డీఏ ఆదేశం
న్యూఢిల్లీ: వైద్య బీమా పాలసీల్లో పరిహారం కోరుతూ వచ్చే క్లెయిమ్ దరఖాస్తులను 30 రోజుల్లోగా పరిష్కరించాలని బీమా నియంత్రణ ప్రాధికార సంస్థ (ఐఆర్‌డీఏ) బీమా కంపెనీలను ఆదేశించింది. జాప్యం చేస్తే క్లెయిమ్ మొత్తంపై బ్యాంకు వడ్డీ రేటుకు అదనంగా 2 శాతం కలిపి చెల్లించాల్సి ఉంటుందని తాజాగా జారీ చేసిన ఆదేశాల్లో స్పష్టం చేసింది. పాలసీదారుల ప్రయోజనాల పరిరక్షణ చట్టం కింద ఐఆర్‌డీఏ ఈ చర్య తీసుకుంది. ‘‘తమకు దరఖాస్తు అందిన (అవసరమైన ప్రతీ పత్రం) చివరి తేదీ నుంచి 30 రోజుల్లోగా బీమా కంపెనీ పరిష్కరించాలి. పరిహారం చెల్లింపులో ఆలస్యం జరిగితే... పాలసీదారుడి నుంచి అవసరమైన అన్ని పత్రాలు తమకు అందిన చివరి తేదీ నుంచి చెల్లింపు జరిగే తేదీ వరకు బ్యాంకు వడ్డీ రేటుపై 2 శాతం ఎక్కువ కలిపి చెల్లించాలి’’ అని ఐఆర్‌డీఏ తన నోటిఫికేషన్‌లో పేర్కొంది.
ఒకవేళ క్లెయిమ్ దరఖాస్తుల విషయమై తమవైపు నుంచి విచారణ అవసరమైన కేసుల్లో పరిహారాన్ని 45 రోజుల్లోగా పరిష్కరించాలని ఆదేశించింది. ఆలస్యం అయితే దరఖాస్తు, రుజువులు అందిన చివరి తేదీ నుంచి చెల్లించే వరకు ఉన్న గడువుకు గాను బ్యాంకు వడ్డీ రేటుకు అదనంగా 2 శాతం కలిపి చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. పాలసీ దారుల ఫిర్యాదులను వేగంగా, సమర్థవంతంగా పరిష్కరించేందుకు ఓ విధానాన్ని ఆచరణలో పెట్టాలని... పాలసీ పత్రాల్లో ప్రయోజనాలు, బీమా కవరేజీ, రైడర్లు, యాడాన్ కవర్ల గురించి స్పష్టంగా తెలియజేయాలని కోరింది. ‘‘హెల్త్ లేదా క్రిటికల్ ఇల్‌నెస్‌కు సంబంధించిన రైడర్ల ప్రీమియం బేసిక్ పాలసీ ప్రీమియంలో 100 శాతం మించకూడదు. ఇతర జీవిత బీమాయేతర పాలసీలలో రైడర్ల ప్రీమియం బేసిక్ పాలసీ ప్రీమియంలో 30 శాతం దాటరాదు’’ అని ఐఆర్‌డీఏ తన నోటిఫికేషన్‌లో స్పష్టం చేసింది.