ముంబై: బీమా విస్తరణకు ప్రభుత్వం, బీమా రంగ అభివృద్ధి సంస్థ (ఐఆర్‌డీఏఐ) ఎంతో కృషి చేస్తున్నప్పటికీ, దేశ జనాభాలో 95 శాతం మందికి బీమా రక్షణ లేదని నేషనల్ ఇన్సూరెన్స్ అకాడమీ ఓ నివేదికలో తెలిపింది. ఈ నివేదికను ఐఆర్‌డీఏఐ చైర్మన్ దేవాశిష్ పాండా ఆవిష్కరించారు. యూపీఐ, బ్యాంక్ ఖాతాలు, మొబైల్ ఫోన్ల విస్తరణకు దోహదపడిన చర్యలను అనుసరించాలని బీమా పరిశ్రమకు ఆయన సూచించారు.
ఈ నివేదికలో పేర్కొన్నట్టు అధిక రిస్క్ ఉన్న ప్రాంతాల్లో విపత్తుల ఇన్సూరెన్స్ తీసుకోవడాన్ని తప్పనిసరి చేయాలని అభిప్రాయపడ్డారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి నూరేళ్లు పూర్తి చేసుకునే నాటికి అందరికీ బీమా లక్ష్యాన్ని చేరువ చేసేందుకు ఇది అవసరమన్నారు. దేశ జనాభా 144 కోట్లలో 95 శాతం మందికి బీమా కవరేజీ లేని విషయాన్ని ఈ నివేదిక ప్రధానంగా ప్రస్తావించింది. ప్రకృతి విప్తతులు పెరిగిపోయిన క్రమంలో బీమా కవరేజీ ప్రాధాన్యాన్ని ఈ నివేదిక ఎత్తి చూపించింది.
రుణానికి బీమా లింక్
దిగువ, మధ్యాదాయ వర్గాల్లో 84 శాతం మంది, తీర ప్రాంతాలు, ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లో 77 శాతం మందికి ప్రాపర్టీ ఇన్సూరెన్స్ లేదని ఈ నివేదిక తెలిపింది. బ్యాంకు రుణాలు తీసుకున్న రైతులు క్రాప్ ఇన్సూరెన్స్ తీసుకోవడాన్ని తప్పనిసరి చేయాలని తన నివేదికలో నేషనల్ ఇన్సూరెన్స్ అకాడమీ సూచించింది. నిజానికి బీమా తీసుకున్న వారిలోనూ కవరేజీ సమగ్రంగా లేని అంశాన్ని ప్రస్తావించింది.
ఇదీ చదవండి: LIC Credit Card: ఎల్‌ఐసీ నుంచి క్రెడిట్ కార్డు.. భలే బెనిఫిట్స్!
జీవిత బీమా రక్షణలో 87 శాతం అంతరం (వాస్తవ కవరేజీ–తీసుకున్న దానికి మధ్య) ఉందని, ఇది గణనీయమైన వ్యాపార అవకాశాలు వీలు కల్పిస్తుందని తెలిపింది. అలాగే, 73 శాతం మందికి హెల్త్ ఇన్సూరెన్స్ రక్షణ లేదని వెల్లడించింది. ప్రభుత్వం, ఎన్‌జీవోలు, పరిశ్రమ కలసి సూక్ష్మ ఆరోగ్య బీమా పథకాలను రూపొందించాల్సిన అవసరం ఉందని పేర్కొంది. యాన్యుటీ, పెన్షన్ ప్లాన్లలో కవరేజీ అంతరం 93 శాతంగా ఉందని తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment