![Eco Warrior: Prasiddhi Singh Planted One Lakh Trees](/styles/webp/s3/article_images/2025/02/15/tree.jpg.webp?itok=sgH8HIOZ)
‘ప్రసిద్ధి సింగ్’ను ‘చెట్ల అమ్మాయి’ అని పిలవొచ్చు. ఎందుకంటే ఎక్కడ ప్రసిద్ధి ఉంటే అక్కడ ఒక చెట్టయినా ఊపిరి పోసుకుంటుంది. తమిళనాడులోని చెంగల్పట్టుకు చెందిన 14 ఏళ్ల ప్రసిద్ధి ఇప్పటికి లక్ష మొక్కలు నాటిందంటే నమ్ముతారా? కాని నిజం. ఇటీవల కేరళలో నిర్వహించిన ‘మాతృభూమి ఇంటర్నేషనల్ ఫెస్టివల్ ఆఫ్ లెటర్స్’ తన లక్ష్యం పది లక్షల మొక్కలు నాటడం అని తెలిపి అందరిలో స్ఫూర్తి నింపింది.
2016లో ప్రసిద్ధికి ఆరేళ్లు ఉన్నప్పుడు తుపాను వారి ప్రాంతాన్ని అతలాకుతలం చేసింది. అనేక చెట్లు నేలకూలాయి. ఆ వయసులోనే ప్రసిద్ధి నేలకూలిన మొక్కలను చూసి బాధపడింది. తర్వాత కొన్ని స్వచ్ఛంద సంస్థలు మొక్కలు నాటే కార్యక్రమం చేపడితే ఉత్సాహంగా తనూ పాల్గొంది. రెండేళ్లపాటు తమిళనాడులోని రకరకాల ప్రాంతాలకు వెళ్లి మొక్కలు నాటింది. నాటే కొద్ది ఆ అమ్మాయికి మొక్కల కోసం పని చేయాలనిపించి లక్ష మొక్కలు నాటాలని నిర్ణయించుకుంది.
ఆ వయసులో అది సాధ్యమా అని ఎవరైనా తనని అడిగితే, ‘చిన్న కొవ్వొత్తి ఇంటికంతా వెలుగు ఇవ్వడం లేదా? ఇది కూడా అంతే. సంకల్పం బలంగా ఉంటే తప్పక సాధ్యమవుతుంది’ అని చెప్పేది. ఆ తర్వాత అనేక కార్యక్రమాల్లో పాల్గొని మరికొంతమందిని కలుపుకొని ‘ప్రసిద్ధ ఫారెస్ట్ ఫౌండేషన్’ ప్రారంభించింది.
అందులో కార్యక్రమాలు నిర్వహించేందుకు నిధుల కోసం తోటి పిల్లలకు పెయింటింగ్, యోగా నేర్పేంది. అలా వచ్చిన డబ్బుతో కార్యక్రమాలు నిర్వహించేది. ఈ క్రమంలో ఎన్నో పాఠశాలలకు వెళ్లి, అక్కడి పరిసరాల్లో మొక్కలు నాటేందుకు అనుమతి కోరింది. ఇంత చిన్నపిల్ల ఏం చేస్తుందా అని వారు ఆశ్చర్యపోయినా, తనకు అవకాశం ఇచ్చేవారు. అలా అనేక పాఠశాలల్లో మొక్కలు నాటింది. మెల్లగా తన గురించి అందరికీ తెలిసింది. తన సంకల్పానికి మరికొందరు తోడయ్యారు. అలా ఇప్పటికి 110 ప్రాంతాల్లో 1.3 లక్షల కంటే ఎక్కువ మొక్కలు నాటింది.
పర్యావరణం కోసం, అడవుల సంరక్షణ కోసం ఆమె చేస్తున్న పనికి మెచ్చుకుంటూ 2021లో పీఎం రాష్ట్రీయ బాల్ పురస్కార్ అందించారు. తమిళనాడు వాతావరణ సదస్సు 3.0లో ఆమెను చైల్డ్ ఛాంపియన్ స్పీకర్‌గా యునిసెఫ్ గుర్తించింది. త్వరలో తమిళనాడులోని 200 పాఠశాలల్లో ’Green Brigade’ కార్యక్రమం మొదలుపెట్టి, విద్యార్థులకు అటవీ సంరక్షణ, పర్యావరణ పరిరక్షణ గురించి వివరించి, వారిని అందులో భాగస్వాములను చేయనుంది.
Comments
Please login to add a commentAdd a comment