ఈవీ జోరు.. బీమా లేదంటే బేజారు! | Electric Vehicles Present New Insurance Challenges in 2023 | Sakshi
Sakshi News home page

ఈవీ జోరు.. బీమా లేదంటే బేజారు!

Published Mon, Jul 3 2023 4:35 AM | Last Updated on Mon, Jul 3 2023 4:35 AM

Electric Vehicles Present New Insurance Challenges in 2023 - Sakshi

అతని పేరు శివకుమార్‌ (40). 2022 ఏప్రిల్‌లో ఓ కంపెనీకి చెందిన ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ను ముచ్చటపడి కొనుగోలు చేశాడు. ఆ స్కూటర్‌ డిటాచబుల్‌ బ్యాటరీ ఆప్షన్‌తో ఉంది. దాంతో బ్యాటరీని తీసి తన బెడ్‌రూమ్‌లోనే రాత్రి చార్జింగ్‌ పెట్టాడు. అదే బెడ్‌ రూమ్‌లో శివకుమార్, అతడి భార్యాపిల్లలు నిద్రించారు. అర్ధరాత్రి బ్యాటరీ నుంచి మంటలు వచ్చి గది అంతటా వ్యాపించాయి. ఈ మంటలకు శివకుమార్‌ ప్రాణాలు కోల్పోగా, భార్యా పిల్లలు గాయాలపాలయ్యారు.

ఆ మధ్య ప్రముఖ కంపెనీ ఎలక్ట్రిక్‌ స్కూటర్లు మంటలకు ఆహుతి కావడం తెలిసిందే. అంతెందుకు ముంబైలో ఓ ప్రముఖ కంపెనీ కారు పార్క్‌ చేసి ఉండగా, ఉన్నట్టుండి మంటలు చెలరేగాయి. నిజానికి కంబషన్‌ ఇంజన్‌తో కూడిన వాహనాల్లో అగ్ని ప్రమాదం జరగదని కాదు. కానీ, చాలా చాలా అరుదు. అదే ఎలక్ట్రిక్‌ వాహనాల్లో (ఈవీలు) అయితే బ్యాటరీ సిస్టమ్‌లో లోపాల వల్ల అగ్ని ప్రమాద రిస్క్‌ ఎక్కువగా ఉంటుంది. మరి ఈ అగ్ని ప్రమాదాలకు వాహన బీమాలో కవరేజీ ఉంటుందా? వేటికి అసలు కవరేజీ వస్తుంది? తదితర అంశాలపై అవగాహన కల్పించే కథనమే ఇది.

ప్రస్తుతం మోటారు వాహన చట్టంలోని నిబంధనల ప్రకారం థర్డ్‌ పార్టీ వెహికల్‌ ఇన్సూరెన్స్‌ను తప్పకుండా తీసుకోవాలి. ఎలక్ట్రిక్‌ వాహనాల (ఈవీల)కు సైతం ఇదే నిబంధన వర్తిస్తుంది. ఎలక్ట్రిక్‌ వాహనాలు మార్కెట్‌కు కొత్త. ఇంత కాలం ఇంటర్నల్‌ కంబషన్‌ ఇంజన్‌ (ఐసీఈ) వాహనాలే ఉండడంతో బీమా ఉత్పత్తులు వీటికి అనుగుణంగానే తయారయ్యాయి. వీటినే బీమా సంస్థలు ఎలక్ట్రిక్‌ కార్లు, స్కూటర్లకు సైతం జారీ చేస్తున్నాయి. ఎలక్ట్రిక్‌ వాహనాలకు రెండు రకాల పాలసీలు అందుబాటులో ఉన్నాయి. సంప్రదాయ కాంప్రహెన్సివ్‌ పాలసీలు ఒక రకం. ఓన్‌ డ్యామేజ్‌ తోపాటు థర్డ్‌పార్టీ ఇన్సూరెన్స్‌తో కూడిన సమగ్ర బీమా ఇది.

మోటారు ఇన్సూరెన్స్‌ విభాగంలోకి రాని తక్కువ సామర్థ్యం కలిగిన ఎలక్ట్రిక్‌ వాహనాలకు అస్సెట్‌ ఇన్సూరెన్స్‌ పాలసీలను బీమా సంస్థలు విక్రయిస్తున్నాయి. ఇవి ప్రమాద నష్టాలను భర్తీ చేస్తాయి. ‘‘25 కిలోమీటర్లకు పైగా వేగంతో నడిచే అన్ని రకాల ఈవీలకు థర్డ్‌ పార్టీ ఇన్సూరెన్స్‌ తప్పనిసరి. ఓన్‌ డ్యామేజీ కవరేజీ అనేది కేవలం వాహనదారు ఇష్టం మేరకు తీసుకోవచ్చు. అదే 25 కిలోమీటర్ల కంటే తక్కువ వేగం కలిగిన ఈవీలకు థర్డ్‌ పార్టీ ఇన్సూరెన్స్‌ కూడా తప్పనిసరి కాదు. కానీ, వాహనదారులు తమ వాహనాలకు సరైన రక్షణ కలి్పంచుకునేందుకు వీలుగా సరిపడా బీమా రక్షణను తీసుకోవాలని మేము సూచిస్తాం’’అని డిజిట్‌ ఇన్సూరెన్స్‌ చీఫ్‌ డి్రస్టిబ్యూషన్‌ ఆఫీసర్‌ ఆదర్శ్‌ అగర్వాల్‌ తెలిపారు.
  
అన్నింటికీ కాదు..
బీమా ఉన్నంత మాత్రాన వాహనంలో ఏ నష్టం జరిగినా బీమా వస్తుందని భావించడానికి లేదు. ఈవీకి ఇది సరిగ్గా వర్తిస్తుంది. ఇంటర్నల్‌ కంబషన్‌ ఇంజన్‌ (ఐసీఈ) కంటే ఈవీలు భిన్నంగా తయారవుతాయి. ముఖ్యంగా ఈవీలో ఒక్క బ్యాటరీ ధరే మొత్తం వాహనం ధరలో 40 శాతం మేర ఉంటుంది. ‘‘ఇప్పటికీ మొత్తం వాహన విక్రయాల్లో ఈవీల వాటా చాలా తక్కువ. భారీ సంఖ్యలో అమ్మకాలు పెరిగితే తప్ప వాటికి ఎదురయ్యే నష్టాలను విశ్లేషించలేము. తగినంత డేటా, క్లెయిమ్స్‌ అనుభవం ఉన్నప్పుడే ఈవీలకంటూ ప్రత్యేకమైన పాలసీలను తీసుకురావడం సాధ్యపడుతుంది’’అని బజాజ్‌ అలియాంజ్‌ జనరల్‌ ఇన్సూరెన్స్‌ చీఫ్‌ టెక్నికల్‌ ఆఫీసర్‌ టీఏ రామలింగం తెలిపారు. టాటా ఏఐజీ జనరల్‌ ఇన్సూరెన్స్‌ సంస్థ కొంత కాలం క్రితం ఈవీల కోసమే ప్రత్యేకమైన పాలసీని రూపొందించినట్టు ప్రకటించింది. ‘ఆటో సెక్యూర్‌ ఈ వెహికల్‌ కాంప్రహెన్సివ్‌ పాలసీ’ పేరుతో తీసుకొచ్చిన ప్లాన్‌లో ఓన్‌ డ్యామేజీతోపాటు ఎలక్ట్రిక్‌ బ్యాటరీ కారణంగా అగ్ని ప్రమాదం జరిగినా కవరేజీ అందులో భాగంగా ఉంది. కానీ, ఇప్పటికీ ఇది మార్కెట్లోకి రాలేదు.

బ్యాటరీకి లేదు రక్షణ
ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ఈవీ పాలసీల్లో  పెద్ద లోపం ఉంది. బ్యాటరీ ఒక్కటే డ్యామేజ్‌ అయితే పరిహారం రాదు. మొత్తం వాహనం డ్యామేజ్‌ అయితేనే బీమా సంస్థలు క్లెయిమ్‌లు ఆమోదించి పరిహారం చెల్లిస్తున్నాయి. ‘‘వాహన విడిభాగాలు విఫలమైతే మోటారు ఇన్సూరెన్స్‌ పాలసీల్లో కవరేజీ ఉండదు. సంప్రదాయ పాలసీల్లో అయితే ప్రమాదం వల్ల, అల్లర్లు, దోపిడీలు, వరదల వల్ల వాహనం, దాని విడిభాగాలకు నష్టం జరిగితే పరిహారం వస్తోంది’’అని గల్లాగర్‌ ఇన్సూరెన్స్‌ బ్రోకర్స్‌ ప్రాక్టీస్‌ లీడర్‌ ఎన్‌ భోజరాజన్‌ తెలిపారు. ఎలక్ట్రిక్‌ వాహనంలో ఖరీదైన బ్యాటరీని ఎవరైనా ఎత్తుకుపోయాంటే క్లెయిమ్‌ను బీమా సంస్థలు ఆమోదించకపోవచ్చు.

ఈవీలకు బ్యాటరీ అత్యంత కీలకం కనుక బ్యాటరీ ఒక్కదానికే కవరేజీ ఇచ్చే పాలసీల అవసరం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ‘బ్యాటరీలు, చార్జింగ్‌ ఎక్విప్‌మెంట్‌కు ఉద్దేశించిన ప్రత్యేకమైన పాలసీలు అవసరం. ఈవీ చార్జింగ్‌ సదుపాయాలతో ముడిపడిన రిస్క్‌ల కారణంగా ఈవీలు దెబ్బతినే ప్రమాదం లేకపోలేదు. ప్రమాదాల వల్లే నష్టం జరగాలని లేదు. బ్యాటరీ చార్జింగ్‌ సమయంలో షార్ట్‌ సర్క్యూట్‌తో అగ్ని ప్రమాదం వాటిల్లితే బ్యాటరీతోపాటు, కనెక్టర్‌కూ నష్టం జరుగుతుంది. సంప్రదాయ పాలసీలో బ్యాటరీతోపాటు వాహనం కూడా అగి్నకి ఆహుతి అయితే తప్ప క్లెయిమ్‌ను ఆమోదించవు’ అని భోజరాజన్‌ వివరించారు. అందుకే ఈవీలకే ఉద్దేశించిన ప్రత్యేక పాలసీల అవసరం ఉందని అన్నారు.

మనం ఏమి చేయగలం?
బీమా సంస్థలు పెరుగుతున్న ఈవీ మార్కెట్‌ను అర్థం చేసుకుంటున్నాయి. భవిష్యత్‌ అంతా ఎలక్ట్రిక్‌ వాహనాల తరమే కనుక ఈవీల కోసం ప్రత్యేక పాలసీలకు రూపకల్పన చేస్తున్నాయి. కనుక వాహనదారులు అన్ని బీమా సంస్థలను సంప్రదించిన తర్వాతే పాలసీని ఎంపిక చేసుకోవాలి. బ్యాటరీ కవరేజీతో కూడిన ప్లాన్‌ను ఏదైనా సంస్థ ఆఫర్‌ చేస్తే ఎంపిక చేసుకోవడం మెరుగు. ప్రీమియం కొంచెం ఎక్కువైనా, బ్యాటరీ కవరేజీతో కూడిన ప్లాన్‌ను తప్పక తీసుకోవాలన్నది నిపుణుల సూచన. మార్కెట్‌లో డిమాండ్‌ పెరుగుతున్న కొద్దీ బీమా సంస్థలు కూడా ఈవీల కోసమే ఉద్దేశించిన ఎన్నో ఫీచర్లతో పాలసీలను అందుబాటులోకి తెస్తాయి. కేవలం థర్డ్‌ పార్టీ డ్యామేజ్‌ కాకుండా ఓన్‌ డ్యామేజ్‌ కవరేజీతో కూడిన కాంప్రహెన్సివ్‌ పాలసీకే ప్రాధాన్యం ఇవ్వాలి.

రైడర్లను కూడా యాడ్‌ చేసుకోవడాన్ని పరిశీలించాలి. డిప్రీసియేషన్‌ కవర్, గ్యాప్‌ వ్యాల్యూ కవర్, రోడ్‌సైడ్‌ అసిస్టెన్స్‌ తీసుకోవాలని లిబర్టీ జనరల్‌ ఇన్సూరెన్స్‌ అండర్‌ రైటింగ్‌ ప్రెసిడెంట్‌ ఉదయన్‌ జోషి సూచించారు.  ముఖ్యంగా ఈవీ వాహనదారులు రిటర్న్‌ టు ఇన్వాయిస్‌ రైడర్‌ను తీసుకోవాలని పాలసీబజార్‌ మోటార్‌ రెన్యువల్స్‌ హెడ్‌ అశ్విని దూబే సూచించారు. ఈ రైడర్‌తో వాహనం ఇన్వాయిస్‌ విలువ మేర పరిహారం పొందొచ్చన్నారు. కారు చోరీకి గురైనా లేక రిపేర్‌ చేయడానికి అనుకూలంగా లేని రీతితో దెబ్బతిన్నా లేక అగ్ని ప్రమాదంతో మొత్తం నష్టం వాటిల్లినప్పుడు ఈ రైడర్‌ కింద పరిహారం వస్తుందన్నారు. పాలసీ కొనుగోలుకు ముందే వేటికి కవరేజీ వస్తుంది, వేటికి మినహాయింపు ఉన్నదీ తప్పకుండా అడిగి తెలుసుకోవాలి.
 
ప్రీమియం భారం అనుకోవద్దు..

ఈవీలకు ఇచ్చే బీమా పాలసీల ప్రీమియం ఎక్కువగా ఉంటుందనుకోవడం పొరపాటు. ఇంటర్నల్‌ కంబషన్‌ ఇంజన్‌ వాహనాల కంటే ఈవీలకు థర్డ్‌ పార్టీ కవర్‌ 15% వరకు తక్కువ. ‘‘ఐసీఈ వాహనాలతో పోలిస్తే ఈవీ కార్లు, బైక్‌లకు కాంప్రహెన్సివ్‌ కవరేజీ ప్రీమియం 5–20% వ్యత్యాసంతో ఉంటోంది. ఓన్‌ డ్యామేజ్‌ కవరేజీలోనూ స్వల్ప వ్యత్యాసం ఉంటోంది. ఏడాది కాలానికి 30 కిలోవాట్‌ అవర్‌ ఎలక్ట్రిక్‌ కారుకు థర్డ్‌ పార్టీ ప్రీమియం రూ.2,000 స్థాయిలో ఉంది. అదే ఐఈసీ వాహనాలకు (1,000 సీసీ మించని) ప్రీమియం మరో రూ.200 వరకు అటూ ఇటూగా ఉంటోంది.

‘ఈవీలకు ప్రీమియం, బీమా సంస్థ ధరల విధానంపైనే ఆధారపడి ఉంటుంది. ఈవీ తయారీ, మోడల్, బ్యాటరీ సామర్థ్యం, ప్రాంతం, వాహనం వయసు వంటి అంశాలు ప్రీమియం ధరపై ప్రభావం చూపిస్తాయి’ అని ఉదయన్‌ జోషి వెల్లడించారు. ఈవీలకు సంబంధించి మరిన్ని క్లెయిమ్‌లు వస్తే కానీ, ప్రీమియం మెరుగ్గా మారగలదన్నారు. ఈవీలకు ఉన్న రిస్‌్కల నేపథ్యంలో వాటికంటూ ప్రత్యేకమైన ఉత్పత్తులు తీసుకువచ్చేందుకు ఐఆర్‌డీఏఐ సైతం బీమా సంస్థలకు మార్గదర్శకాలు జారీ చేస్తుందని పరిశీలకులు భావిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement