మీకు ‘ఈ-వాహన బీమా’ ఉందా? | we have e-Vehicle insurance? | Sakshi
Sakshi News home page

మీకు ‘ఈ-వాహన బీమా’ ఉందా?

Published Sun, Feb 7 2016 11:59 PM | Last Updated on Sun, Sep 3 2017 5:08 PM

మీకు ‘ఈ-వాహన బీమా’ ఉందా?

మీకు ‘ఈ-వాహన బీమా’ ఉందా?

ఇక డిజిటల్ రూపంలోనే వాహన బీమా పాలసీ
గతనెల నుంచే తొలిసారి అమల్లోకి తెచ్చిన తెలంగాణ
వచ్చే ఏడాదికల్లా మిగిలిన రాష్ట్రాలూ చేయాలన్న ఐఆర్‌డీఏ
డిజిటల్ కాపీని మొబైల్‌లో స్టోర్ చేసుకుంటే చాలు
ట్రాఫిక్ పోలీసులు అడిగితే మొబైల్‌లోనే చూపించొచ్చు
వారు ధ్రువీకరించుకోవటానికి వీలుగా దాన్లోనే క్యూ.ఆర్. కోడ్
అంతటా అమల్లోకి వస్తే బీమా ప్రీమియంలోనూ తగ్గుదల

 
సాక్షి పర్సనల్ ఫైనాన్స్ విభాగం: స్నేహితుడిని ఆసుపత్రిలో చేర్చటంతో సుధీర్ హడావుడిగా తన కార్లో బయల్దేరాడు. దార్లో ప్రతి వాహనాన్నీ తనిఖీ చేస్తున్న పోలీసులు సుధీర్ వాహనాన్ని కూడా ఆపారు. డ్రైవింగ్ లెసైన్స్.. ఆర్‌సీ రెండూ చూపించటంతో పోలీసులు ఇన్సూరెన్స్ పత్రాలడిగారు. సుధీర్ ఈ ఏడాది వాహన బీమా రెన్యువల్ చేయించాడు గానీ... ఆ పత్రాల్ని కార్లో ఉంచుకోవటం మర్చిపోయాడు. అంతే! కారు ఆపి కిందికి దిగాల్సిందిగా పోలీసులు చెప్పారు.

ఇంటికి ఫోన్‌చేసి మొబైల్ ఫోన్లో వాట్సాప్ ద్వారా తెప్పించుకుంటానని, చూపిస్తానని సుధీర్ చెప్పినా వాళ్లు వినలేదు. తమకు ఒరిజినల్ బీమా పాలసీ పత్రాన్ని చూపించాలని, జిరాక్స్ కూడా పనికిరాదని కచ్చితంగా చెప్పేశారు. అసలే అర్జంటుగా వెళదామనుకున్న సుధీర్‌కు ఈ సంఘటన చాలా చికాకు తెప్పించింది. చివరకు పోలీసులు చెప్పిన జరిమానా చెల్లించి బతుకు జీవుడా... అనుకుంటూ బయటపడ్డాడు.
 
అదండీ సుధీర్ కథ. అయినా సుధీర్ ఒక్కడికే కాదు. మనలో చాలామందికి ఇలాంటి సంఘటనలు ఎప్పుడో ఒకప్పుడు ఎదురయ్యే ఉంటాయి. అయితే ఫైన్ చెల్లించటమో... లేకపోతే పోలీసుల్ని బతిమాలుకొని వారికే ఎంతో కొంత చెల్లించటమో చేసి ఉంటాం. అయినా! బీమా పాలసీ లేనివారైతే ఇలాంటివి చెయ్యొచ్చు. ఉండి కూడా కేవలం ఆ సమయానికి తన వద్ద ఉంచుకోకపోవటం వల్ల జరిమానా కట్టడమంటే చాలా ఇబ్బందే. అందుకే..!!

ఇలాంటి ఇబ్బందులు ఇకపై ఎదురు కాకుండా ఉండేందుకు బీమా నియంత్రణ, అభివృద్ధి సంస్థ (ఐఆర్‌డీఏ) కొత్తగా డిజిటల్ రూపంలో ఉండే ‘ఈ-వాహన బీమా’ పాలసీలను అమల్లోకి తెచ్చింది. ఇంకో విశేషం ఏంటంటే... గతనెల 2 నుంచి అమల్లోకి వచ్చిన ఈ-వాహన బీమా పాలసీల్ని మొట్టమొదట జారీ చేసింది, గుర్తిస్తున్నది తెలంగాణ రాష్ట్రం కావటం. ప్రస్తుతానికి ఈ రాష్ట్రం ఒక్కటే వీటిని జారీ చేయటం, గుర్తించటం చేస్తుండగా... 2017 నాటికి అన్ని రాష్ట్రాలూ తెలంగాణను అనుసరించాలని ఐఆర్‌డీఏ ఇప్పటికే ఆదేశాలిచ్చింది.
 
ఈ-వాహన బీమా అర్థమేంటి?
1988 నాటి మోటారు వాహనాల చట్టం ప్రకారం ప్రతి వాహనానికీ కనీసం థర్డ్ పార్టీ బీమా తప్పనిసరిగా ఉండి తీరాలి. థర్డ్ పార్టీ పాలసీ అంటే... మీ వాహనం వల్ల ఏదైనా యాక్సిడెంట్ జరిగినపుడు మీ వల్ల ఎదుటి వాహ నానికో, వ్యక్తులకో ప్రమాదం జరగొచ్చు. అపుడు ఆ వాహనానికో, వ్యక్తులకో అయ్యే ఖర్చు మీరు భరించలేని పరిస్థితి ఉండొచ్చు. దాన్ని థర్డ్ పార్టీ పాలసీ జారీ చేసిన బీమా కంపెనీ చెల్లిస్తుందన్న మాట.

మీరు డ్రైవింగ్ చేస్తూ ఏదైనా చెట్టుకో, మరోదానికో యాక్సిడెంట్ చేసినా, లేక మీ వాహనంలోని భాగాలో, వాహనమో దొంగతనానికి గురైనా ఈ థర్డ్ పార్టీ బీమా వర్తించదు. అలాంటివాటికి కూడా కవరేజీ ఉండాలంటే సమగ్ర (కాంప్రిహెన్సివ్) పాలసీ ఉండాలి. ఇపుడు దీన్ని కూడా ఐఆర్‌డీఏ తప్పనిసరి చేసింది. నిజానికి చట్టం ప్రకారం బీమా తప్పనిసరి. అయినా సరే తీసుకుంటున్న వారు మాత్రం తక్కువే ఉంటున్నారన్నది ఐఆర్‌డీఏ ఉద్దేశం. ‘‘ఇటీవల భారత బీమా సమాచార బ్యూరో (ఐఐబీ), బీమా పరిశ్రమ కలసి ఓ సర్వే చేశాయి.

దీని ప్రకారం 45-55 శాతం వాహనాలకు మాత్రమే బీమా ఉంది. ప్రయివేటు కార్లలో 50 శాతం వరకూ మొదటి ఏడాది తరవాత బీమా చేయించటం లేదు. చట్టప్రకారం బీమా లేని వాహనాలు రోడ్లపై తిరక్కూడదు. కానీ కొన్ని అక్రమ మార్గాల వల్ల, బీమా తేదీల్ని మార్చి ఫోర్జరీ చేసిన పత్రాలను పోలీసులకు చూపించటం వల్ల ఇలాంటి వాహనాలు స్వేచ్ఛగా రోడ్లపై తిరగ్గలుగుతున్నాయి.

వీటిని పట్టుకోవటానికి పోలీసుల దగ్గర కూడా తగిన యంత్రాంగం లేదు’’ అని కామ్స్.. రిపాజిటరీ సర్వీసెస్ సీఈఓ ఎస్.వి.రమణన్ చెప్పారు. బీమా రిపాజిటరీ సర్వీసులంటే పాలసీదారుల పేరిట ఈ-ఖాతాలు తెరిచి అన్ని పాలసీలనూ డిజిటలైజ్ చేసి భద్రంగా దాచే సంస్థలు, ఖాతాదారులు కూడా ఆన్‌లైన్లో వీటిని ఎప్పుడు కావాలంటే అప్పుడు చూసుకోవచ్చు.
 
ప్రస్తుతానికి తెలంగాణలో మాత్రమే!
గత నెల 2 నుంచి ఎలక్ట్రానిక్ రూపంలో ఉండే ఈ-వాహన బీమా పాలసీలను తెలంగాణ రాష్ట్రంలో బీమా కంపెనీలు అమల్లోకి తెచ్చాయి. ప్రస్తుతానికి వీటిని గుర్తిస్తున్నది తెలంగాణ ఒక్కటే.  దీనివల్ల స్మార్ట్‌ఫోన్లలో సాఫ్ట్ కాపీ ఉంటే చాలు. పోలీసులు ఒకవేళ బీమా పాలసీ అడిగితే దాన్ని చూపించాలి. అవసరమనుకుంటే వాళ్లే క్యు.ఆర్. కోడ్ ద్వారా ధ్రువీకరణ చేసుకుంటారు. ‘‘ప్రత్యేకించి తెలంగాణలో ఇకపై కొత్త పాలసీలకు గానీ, రెన్యువల్ చేసుకున్న పాత పాలసీలకు గానీ డాక్యుమెంట్లను డిజిటల్ రూపంలో జారీ చేస్తాం.

పాలసీదారుకు భౌతికంగా పాలసీ డాక్యుమెంట్లను పంపటంతో పాటు తన మెయిల్ ఐడీకి పీడీఎఫ్ ఫార్మాట్‌లో డిజిటల్ కాపీనీ పంపిస్తాం. ధ్రువీకరణకు వీలుగా వాటిపై క్యు.ఆర్. కోడ్ కూడా ఉంటుంది’’ అని రాయల్ సుందరం జనరల్ ఇన్సూరెన్స్ సంస్థ సీఐఓ టి.ఎం.శ్యాంసుందర్ చెప్పారు.
 
‘‘ఒకవేళ ఈ-బీమా ఖాతా ఉన్నట్లయితే అన్ని పాలసీలూ అందులోనే స్టోర్ అయి ఉంటాయి. అయితే ఇందుకు ఇన్సూరెన్స్ రిపాజిటరీలతో సదరు బీమా సంస్థ ఒప్పందం చేసుకుని ఉండాలి. ఇలాంటి ఖాతా ఉన్నవారికి బీమా కంపెనీలు భౌతిక పాలసీలను పంపించవు’’ అని ఆయన వివరించారు. మిగతా రాష్ట్రాలింకా దీన్ని అమల్లోకి తేలేదు కనక తెలంగాణ వాసులు ఇతర రాష్ట్రాలకు వెళ్లేటపుడు తప్పనిసరిగా భౌతిక రూపంలో పాలసీలను వెంట తీసుకెళ్లాల్సి ఉంటుందని చెప్పారు.
 
ఈ-వాహన బీమా పనిచేసేదిలా...
కొత్త పాలసీ తీసుకున్నా, పాత బీమా పాలసీని రెన్యువల్ చేయించుకున్నా కంపెనీలు పాలసీదారు మెయిల్‌కు పీడీఎఫ్ రూపంలో ఒక పాలసీని పంపిస్తాయి. దాన్ని డౌన్‌లోడ్ చేసుకుని మొబైల్ ఫోన్లో స్టోర్ చేసుకుంటే చాలు.
ఎక్కడైనా పోలీసులు ఆపి బీమా పత్రాలను చూపించమని అడిగినపుడు మొబైల్‌లో స్టోర్ చేసిన డిజిటల్ పాలసీని చూపించాల్సి ఉంటుంది. ఆ పాలసీపై ఉన్న క్విక్ రెస్పాన్స్ (క్యు.ఆర్.) కోడ్‌ను పోలీసులు తమ మొబైల్ ఫోన్ ద్వారా కూడా స్కాన్ చేస్తారు.
ఇపుడు క్యు.ఆర్. కోడ్‌ను స్కాన్ చేసే సాఫ్ట్‌వేర్ అప్లికేషన్లు చాలా వచ్చాయి. ఆండ్రాయిడ్ ఫోన్లు వాడేవారైతే గూగుల్ ప్లేస్టోర్ నుంచి, యాపిల్ ఫోన్లు వాడేవారైతే యాపిల్ స్టోర్ నుంచి వీటిని ఉచితంగానే డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
పోలీసులు ఈ క్యు.ఆర్. కోడ్‌ను స్కాన్ చేసిన వెంటనే మొబైల్ తెరపై ఆ పాలసీకి సంబంధించిన వివరాలన్నీ ప్రత్యక్షమవుతాయి. ఆ పాలసీ ఎప్పటిదాకా అమల్లో ఉంటుంది? పాలసీదారు పేరు... అది అసలైనదా? నకిలీదా? తదితర వివరాలన్నీ కనిపిస్తాయి.
ఈ వివరాలన్నీ నిజానికి బీమా సమాచార బ్యూరో డేటా బేస్ నుంచి గానీ, బీమా కంపెనీ డాటాబేస్ నుంచి గానీ వివరాలన్నీ మొబైల్ తెరపై ప్రత్యక్షమవుతాయి. ఈ క్యూ.ఆర్. కోడ్ ను స్కాన్ చేసే అప్లికేషన్లను మొబైల్ ఫోన్లలోకి సులువుగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇప్పటికే ట్రాఫిక్ పోలీసులందరూ తమ మొబైల్ ఫోన్లలో వీటిని డౌన్‌లోడ్ చేసుకున్నారు కూడా’’ అని రమణన్ చెప్పారు.
వాటి ఆధారంగా పోలీసులు ఆ పాలసీ సరైనదో కాదో అక్కడికక్కడే ఆన్‌లైన్లోనే పరిశీలించి  ధ్రువీకరించుకునే వీలుంటుంది.
 
డిజిటల్ పాలసీ లాభాలివీ...
వాహనదారులు పాలసీ పత్రాన్ని స్టోర్ చేసుకున్న మొబైల్‌ను వెంట తీసుకెళితే చాలు.
అధికారులు వాహనాల్ని ఆపితే... బీమా పత్రాల్ని ఎక్కడికక్కడ పరిశీలించి ధ్రువీకరించుకోవచ్చు.
డిజిటల్ పాలసీ వల్ల పాలసీదారులకు ఖర్చు కూడా తగ్గుతుంది. ఈ తగ్గుదల థర్డ్ పార్టీ పాలసీల్లో ఉండకపోవచ్చు. ఎందుకంటే వాటి ప్రీమియంను ఏటా ఐఆర్‌డీఏ నిర్ణయిస్తూ ఉంటుంది.
కాంప్రిహెన్సివ్ పాలసీల రేట్లను బీమా కంపెనీలే నిర్ణయిస్తాయి. డిజిటల్ వల్ల ఖర్చులు తగ్గుతాయి కనుక ఆ తగ్గుదలను పాలసీదారులకు బదలాయించే అవకాశం ఉంది.
ప్రస్తుతం బీమా సంస్థలు డిజిటల్‌తో పాటు భౌతిక పాలసీలనూ జారీ చేయాల్సి వస్తోంది కనుక కంపెనీలకు ఖర్చుల్లో తగ్గుదల ఉండదు. మున్ముందు అన్ని రాష్ట్రాలూ దీన్ని అమల్లోకి తెచ్చి... డిజిటల్‌ను మాత్రమే తప్పనిసరి చేస్తే తగ్గుదల ప్రయోజనం అందుతుంది.
 
ఐఆర్‌డీఏ ఉత్తర్వుల్లో ఏముంది?
2015 డిసెంబర్ 1 తరవాత జారీ చేసిన వాహన బీమా పాలసీలన్నిటికీ క్యూ.ఆర్. కోడ్ తప్పనిసరిగా ఉండాలని, పాలసీ అధికారికమైనదో, కాదో ధ్రువీకరించుకోవటానికి ఈ కోడ్ ఉపయోగపడుతుందని ఐఆర్‌డీఏ తన ఉత్తర్వుల్లో పేర్కొంది. దీనివల్ల ఎక్కువ మంది వాహన బీమా పాలసీలు తీసుకుంటారని, అవినీతి కూడా తగ్గుతుందని బీమా అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం భౌతికంగా పాలసీలున్న వారందరికీ క్యూ.ఆర్. కోడ్ ఉన్న డిజిటల్ పాలసీలు జారీ చేయాలని బీమా కంపెనీలకు కూడా సూచించినట్లు ఐఆర్‌డీఏ తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement