91 శాతం వాహనాలు బీమాకు దూరం | No Insurance for 91% Vehicles | Sakshi
Sakshi News home page

91 శాతం వాహనాలు బీమాకు దూరం

Published Thu, Sep 12 2024 7:08 AM | Last Updated on Thu, Sep 12 2024 8:59 AM

No Insurance for 91% Vehicles

బీమా నియంత్రణ సంస్థ ఐఆర్‌డీఏఐ 2018లో తీసుకు వచ్చిన నిబంధనల ప్రకారం షోరూం నుంచి కొత్త కారు రోడ్డెక్కాలంటే ఒక ఏడాది ఓన్‌ డ్యామేజ్‌ ఇన్సూరెన్స్, మూడేళ్ల థర్డ్‌ పార్టీ ఇన్సూరెన్స్‌ తప్పనిసరి. ఐఆర్‌డీఏఐ 2019లో తెచ్చిన రూల్స్‌ ప్రకారం ద్విచక్ర వాహనాల విషయంలో ఇది 1+5 ఏళ్లు ఉంది. ఇదంతా సరే. మరి రెన్యువల్స్‌ సంగతి ఏంటి? తొలి పాలసీ గడువు ముగిసిన తర్వాత భారత్‌లో ఎంత మంది తమ వాహనాలను రెన్యువల్‌ చేస్తున్నారో తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే. 19 శాతం టూ వీలర్లు, 47 శాతం కార్లు మాత్రమే రెన్యువల్‌ అవుతున్నాయట. మొత్తంగా దేశంలో అన్ని వాహనాలకు కలిపి బీమా విస్తృతి 9 శాతమే ఉంది. అంటే రోడ్డుమీద తిరుగుతున్న 100 వాహనాల్లో తొమ్మిదికి మాత్రమే ఇన్సూరెన్స్‌ ఉన్నట్టు లెక్క. 2015కు ముందు ఇది కేవలం 3 శాతమే. వాహనానికి ఏమీ కాదు.. అనవసరంగా డబ్బులు ఖర్చు అన్న నిర్లక్ష్యపు భావనే ఇందుకు కారణమని బీమా కంపెనీలు అంటున్నాయి. బీమా లేకుంటే వాహనానికి జరగరానిది జరిగితే జేబులోంచి ఖర్చు చేయాల్సిందే. కొన్ని సందర్భాల్లో తీవ్ర నష్టమూ తప్పదు. సమగ్ర బీమా ఉంటే ప్రకృతి విపత్తుల నుంచీ వాహనానికి రక్షణ లభిస్తుంది.

డిజిటల్‌ పాలసీలదే హవా..  
వ్యయాలను తగ్గించుకోవడానికి, పాలసీల జారీని వేగవంతం చేయడానికి బీమా కంపెనీలు డిజిటల్‌ వైపు మళ్లుతున్నాయి. 10 నిమిషాల్లోనే పాలసీలను కస్టమర్ల చేతుల్లో పెడుతున్నాయి. ఆన్‌లైన్‌లో జారీ అవుతున్న పాలసీల సంఖ్య ఏకంగా 65 శాతం ఉందంటే డిజిటల్‌ వేగాన్ని అర్థం చేసుకోవచ్చు. పాయింట్‌ ఆఫ్‌ సేల్స్‌ పర్సన్స్‌ (పీవోఎస్‌పీ) అడ్వైజర్లు సైతం కస్టమర్లను నేరుగా చేరుకుని డిజిటల్‌ రూపంలో పాలసీలను అందిస్తున్నారు. 2029–30 నాటికి జారీ అవుతున్న పాలసీల్లో డిజిటల్‌ వాటా 75 శాతానికి చేరుతుందని పరిశ్రమ భావిస్తోంది. కస్టమర్లలో 15 శాతం మంది జీరో డిప్రీసియేషన్‌ కోరుకుంటున్నారు. నడిపే దూరానికి బీమా చెల్లించే ‘పే యాజ్‌ యూ డ్రైవ్‌’ ప్లాన్స్‌ను 6 శాతం మంది ఎంచుకుంటున్నారని పాలసీబజార్‌కు చెందిన పీబీపార్ట్‌నర్స్‌ మోటార్‌ ఇన్సూరెన్స్‌ అసోసియేట్‌ డైరెక్టర్, సేల్స్‌ హెడ్‌ అమిత్‌ భడోరియా సాక్షి బిజినెస్‌ బ్యూరోకు తెలిపారు. కంపెనీల మధ్య పోటీ కారణంగానే ప్రీమియంలో వ్యత్యాసం ఉంటోందని అన్నారు.  

రూ.1.60 లక్షల కోట్లకు.. 
దేశంలో వాహన బీమాను 27 సంస్థలు ఆఫర్‌ చేస్తున్నాయి. పాలసీల జారీలో 57 బ్రోకింగ్‌ కంపెనీలు పాలుపంచుకుంటున్నాయి. భారత్‌లో మోటార్‌ ఇన్సూరెన్స్‌ మార్కెట్‌ 2023–24లో 12.9 శాతం దూసుకెళ్లి రూ.91,781 కోట్లు నమోదు చేసింది. 2029 నాటికి ఇది సుమారు రూ.1.6 లక్షల కోట్లకు చేరుకుంటుందని మార్కెట్‌ అంచనా. వాహనాలన్నింటికీ బీమా కలిగి ఉండాలన్నదే ఐఆర్‌డీఏఐ లక్ష్యం. అంతేగాక బీమా ప్రీమియం వినియోగదార్లకు అందుబాటులో ఉంచేందుకు ఐఆర్‌డీఏఐ కృషి చేస్తోంది. బీమా పాలసీలను విస్తృతం చేసే లక్ష్యంతో 2015లో పాయింట్‌ ఆఫ్‌ సేల్స్‌ పర్సన్స్‌ (పీవోఎస్‌పీ) కాన్సెప్ట్‌కు ఐఆర్‌డీఏఐ శ్రీకారం చుట్టడం పరిశ్రమ వృద్ధికి ఆజ్యం పోసింది. జారీ అవుతున్న పాలసీల్లో 60 శాతం బ్రోకింగ్‌ కంపెనీల నుంచే ఉండడం గమనార్హం. 40 శాతం పాలసీలు నేరుగా బీమా కంపెనీల నుంచి జారీ చేస్తున్నారు.  

75 శాతం చౌక ప్రీమియం పాలసీలే..
దేశంలో 2018కి ముందు రెన్యువల్స్‌ ద్విచక్ర వాహనాలకు 31 శాతం, కార్లకు 37 శాతం నమోదైంది. ఐఆర్‌డీఏఐ చొరవతో ఇన్సూరెన్స్‌ విస్తృతి పెరిగింది. పాలసీబజార్‌.కామ్‌ ప్రకారం టాప్‌–20 నగరాల్లో 50 శాతం టూ వీలర్స్, 60 శాతం కార్లకు బీమా ఉంది. తృతీయ, ఆపై తరగతి నగరాలు, పట్టణాలు, గ్రామాల్లో 40 శాతం ద్విచక్ర వాహనాలు, 45 శాతం ఫోర్‌ వీలర్స్‌కు ఇన్సూరెన్స్‌ ఉంది. టాప్‌–20 నగరాల్లో సమగ్ర బీమా (కాంప్రహెన్సివ్‌) పాలసీని 55 శాతం మంది, థర్డ్‌ పార్టీ ఇన్సూరెన్స్‌ 70 శాతం మంది ఎంచుకుంటున్నారు. ఈ నగరాల వెలుపల 30 శాతం మంది సమగ్ర పాలసీ, 50 శాతం థర్డ్‌ పార్టీ ఇన్సూరెన్స్‌ కొనుగోలు చేస్తున్నారు. తక్కువ ప్రీమియంలో లభించే పాలసీలను 75 శాతం మంది తీసుకుంటున్నారు. ఇక ప్రమాదానికి గురైన వాహనాల్లో 40 శాతం వాటికి బీమా ఉండడం లేదట.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement