హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఆటోమొబైల్ సంస్థ ఎంజీ మోటార్స్ దేశీయంగా తమ కార్యకలాపాలను మరింతగా విస్తరిస్తోంది. ప్రస్తుతం దాదాపు 330 స్టోర్స్ ఉండగా.. ఏడాది ఆఖరు నాటికి వీటిని 400కు పెంచుకోనుంది. తెలంగాణలో 9 స్టోర్స్ ఉండగా.. వీటిని 20కి పెంచుకోనుంది. హైదరాబాద్‌లో కొత్తగా మూడు స్టోర్స్‌ను ప్రారంభించిన సందర్భంగా ఎంజీ మోటార్ ఇండియా డిప్యుటీ ఎండీ గౌరవ్ గుప్తా ఈ విషయాలు తెలిపారు.
తెలంగాణలో 13,000 పైచిలుకు వాహనాలను విక్రయించినట్లు ఆయన వివరించారు. గతేడాది ఇక్కడ 4,000 పైచిలుకు వాహనాలను విక్రయించగా, ఈసారి 5,000 వాహనాలను లక్ష్యంగా పెట్టుకున్నట్లు గుప్తా తెలిపారు. రాష్ట్రంలో విద్యుత్ వాహనాలకు అవసరమైన మౌలిక సదుపాయాలు మెరుగ్గా ఉండటంతో ఎలక్ట్రిక్ కార్ల వినియోగం పుంజుకుంటోందని చెప్పారు.
అటు ఆంధ్రప్రదేశ్‌లోనూ విజయవాడ, విశాఖ, రాజమండ్రి తదితర ప్రాంతాల్లో తమ స్టోర్స్ ఉన్నట్లు తెలిపారు. ఏడాదికో కొత్త మోడల్‌ను ప్రవేశపెట్టాలనే వ్యూహంతో ముందుకెడుతున్నామని.. వచ్చే సంవత్సరం మరో కొత్త వాహనాన్ని ప్రవేశపెట్టే ప్రయత్నాల్లో ఉన్నామని ఆయన వివరించారు. ఎంజీ మోటార్స్ ప్రస్తుతం హెక్టర్, జియస్, కామెట్ తదితర వాహనాలను విక్రయిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment