గత కొన్ని సంవత్సరాలుగా మోటార్ ఇన్సూరెన్స్‌లో అనేక సరికొత్త బీమా పథకాలు వినియోగదారులకు అందుబాటులోకి వచ్చాయి. కాని వీటిపై సరైన అవగాహన లేకపోవడంతో ఇవి పూర్తిస్థాయిలో వినియోగదారులను చేరువ కాలేదు. ఏదైనా కారు కొనగానే చట్టప్రకారం తీసుకోవాల్సిన థర్డ్ పార్టీ కాంప్రహెన్సివ్ పాలసీ తీసుకుంటున్నారు. కాని ఈ ఒక్క పాలసీయే అన్ని రకాల బీమా రక్షణను అందించలేదు. అందుకనే ఇప్పుడు బీమా కంపెనీలు ‘యాడ్ ఆన్’ పేరుతో వివిధ రైడర్లను అందుబాటులోకి తీసుకొచ్చాయి. ప్రధాన పాలసీకి మరికొంత అదనపు ప్రీమియం చెల్లించడం ద్వారా వీటిని పొందవచ్చు. యాడ్ ఆన్ కవర్లు, వాటి ప్రయోజనాలను తెలుసుకుందాం...
ఫోన్ ద్వారా సాంకేతిక సహాయం: కార్లపై దూర ప్రయాణాలు చేసేవారికి ఇంజిన్లో వచ్చే సాంకేతిక లోపంతో బ్రేక్ డౌన్ అవడం వంటి సంఘటనలు తరుచుగా చూస్తూనే ఉంటాం. తెలియని ప్రాంతంలో కారు బ్రేక్‌డౌన్ అయ్యి, దగ్గర్లో మెకానిక్ లేకపోతే... పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. చిన్న సాంకేతిక సమస్యలైతే మనం చేసుకోవచ్చు.. కాని అదే తెలియనిది అయితే... ఇలాంటి సమయంలో ఈ యాడ్ ఆన్ కవర్ అక్కరకు వస్తుంది. ఇలాంటి సమస్య తలెత్తినప్పుడు ఒక్క ఫోన్ కాల్ చేస్తే ఇలాంటి చిన్న సమస్యలను ఎలా పరిష్కరించుకోవాలన్నది ఫోన్ ద్వారా సూచనలు అందించడం జరుగుతుంది.
తక్షణం రిపేర్లు: ఒకవేళ బ్యాటరీ అయిపోయి కారు ఆగిపోయిందనుకుందాం. అలాంటి సందర్భాల్లో బ్యాటరీ లేకుండా కారును స్టార్ట్ చేయాలంటే శిక్షణ పొందిన సాంకేతిక నిపుణులు అవసరం. ఇలాంటప్పుడు కావల్సిన ఎక్స్‌టర్నల్ పవర్‌ను బీమా కంపెనీ తక్షణమే ఏర్పాటు చేస్తుంది.
అవసరమైతే అద్దె కారు: ఒకవేళ కారును తక్షణం రిపేరు చేసే పరిస్థితి లేకపోతే బీమా కంపెనీ అద్దె కారును ఏర్పాటు చేసి గమ్యానికి క్షేమంగా చేరుస్తుంది.
టోయింగ్ వెహికల్: ఇలా కారు మధ్యలో ఆగిపోతే దాన్ని షెడ్డుకు చేర్చడమన్నది అన్నిటికంటే చాలా క్లిష్టమైన, వ్యయంతో కూడిన పని. ఇందుకు టోయింగ్ మెషిన్ అవసరం. అదే యాడ్ ఆన్ రైడర్ తీసుకుంటే ఈ ఏర్పాట్లను బీమా కంపెనీ ఉచితంగా అందిస్తుంది.
వసతి ఏర్పాటు: అవసరమైన పక్షంలో సమీప ప్రాంతంలో వసతిని కూడా ఏర్పాటు చేస్తుంది.
వాన నీటిలో ఆగిపోతే: ఇంజిన్లోకి నీరు వెళ్లి కారు ఆగిపోతే... అటువంటి వాటికి సాధారణ పాలసీలో కవరేజ్ ఉండదు. అదే యాడ్ ఆన్ కవర్ తీసుకుంటే ఇలాంటి సమస్యలకి కూడా బీమా రక్షణ కల్పిస్తుంది. ముఖ్యంగా వర్షాకాలంలో ఇది అక్కరకు వస్తుంది.
మారు తాళం: ఒకవేళ కారు తాళాలు పోగొట్టుకుంటే... మీరున్న చోటుకు బీమా కంపెనీ డూప్లికేట్ తాళాలను పంపించడం లేదా, నిపుణులతో అన్‌లాక్ చేసి కారును తెరిపించే వెసులుబాటు చేస్తుంది.
బండికి... ఉండాలివి...
Published Sun, Oct 27 2013 2:09 AM | Last Updated on Sat, Sep 2 2017 12:00 AM
Advertisement