వాహన బీమా మరింత భారం
చెన్నై: వాహన బీమా పాలసీలు మరింత భారమయ్యేలా కనిపిస్తున్నాయి. బీమా ప్రీమియంలను పెంచుతూ ఈ మేరకు బీమా రంగ నియంత్రణ సంస్థ (ఐఆర్‌డీఏ) పలు ప్రతిపాదనలు చేసింది. 1,000 సీసీ కన్నా తక్కువ సామర్థ్యం ఉండే చిన్న కార్లపై థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ప్రీమియంను 107.79 శాతం పెంచాలని ప్రతిపాదించింది. దీన్ని బట్టి టాటా బోల్ట్ లాంటి కార్ల యజమానుల కన్నా టాటా నానో వంటి చిన్న కార్ల యజమానులు అదనంగా రూ.426 మేర థర్డ్ పార్టీ ప్రీమియం కట్టాల్సి వచ్చేలా ఉంది. ఇక 75-350 సీసీ ఇంజిన్ సామర్థ్యం గల ద్విచక్ర వాహనాలపై ప్రీమియం పెరుగుదల 14-32 శాతం మేర ఉండనుంది.
350 సీసీ పైబడిన ద్విచక్ర వాహనాలపై మాత్రం 61 శాతం తగ్గనుంది. అలాగే, స్థూలంగా 7,500 కేజీల కన్నా తక్కువ బరువుండే (జీఎంవీ) ట్రక్కులపై 14 శాతం, 7,500-12,000 కేజీల మధ్య జీఎంవీ ఉండే వాటిపై 20 శాతం మేర థర్డ్ పార్టీ ప్రీమియం తగ్గనుంది. ఐఆర్‌డీఏ మంగళవారం ఆవిష్కరించిన ప్రతిపాదనలు ఏప్రిల్ నుంచి అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. మార్చి 20 లోగా దీనికి సంబంధించిన వివిధ వర్గాలు తమ అభిప్రాయాలను ఐఆర్‌డీఏకి తెలియజేయాల్సి ఉంది.
పెరుగుతున్న డెత్ క్లెయిమ్‌లు..: ఐఆర్‌డీఏ గణాంకాల ప్రకారం డెత్ క్లెయిమ్‌లపై బీమా కంపెనీలు చెల్లిస్తున్న పరిహారాలు సగటున ప్రతి ఏటా పెరుగుతున్నాయి. 2012-13లో సగటున రూ.5,45,174 చెల్లించగా, 2013-14లో ఇది రూ.6,09,152కి పెరిగింది. ఇక 2014-15, 2015-16లో జారీ అయ్యి, 8-10 సంవత్సరాల్లో క్లెయిమ్‌కి వచ్చే పాలసీలపై పరిహారాలు మరింతగా పెరిగే అవకాశాలు ఉన్నాయని ఐఆర్‌డీఏ తెలిపింది. చిత్రమేంటంటే డెత్ క్లెయిమ్ సగటు లెక్కించడానికి ఐఆర్‌డీఏ తీసుకున్న లెక్కల్లో రూ.లక్ష కన్నా తక్కువ చెల్లించిన క్లెయిమ్‌లను చేర్చలేదు. పెపైచ్చు థర్డ్ పార్టీ ప్రీమియం రూపంలో వచ్చిన ఇన్వెస్ట్‌మెంట్ ఆదాయాన్ని గానీ, దీర్ఘకాలంగా ఉన్న క్లెయిమ్‌ల కోసమని పక్కనబెట్టిన మొత్తాన్ని గానీ లెక్కలోకి తీసుకోలేదు.