సాక్షి, హైదరాబాద్: వాహన బీమాలో కొన్ని సంస్థలు మాయాజాలం చేస్తున్నాయి. ఏకంగా ఆర్టీఏ అధికారులనే బురిడీ కొట్టిస్తున్నాయి. సదరు సంస్థల బీమాకు వాహన్ పోర్టల్‌లోనూ ఆమోదం లభించడం గమనార్హం. సాధారణంగా ఎలాంటి వాహనాలకైనా ఏడాదికోసారి బీమాను తప్పనిసరిగా పునరుద్ధరించుకోవాలి. బీమా సంస్థలు కనీసం ఏడాది ప్రీమియాన్ని కలిగి ఉంటాయి. ప్రస్తుతం కొన్ని బీమా సంస్థలు నెల రోజుల వ్యవధితో పత్రాలను అందజేస్తున్నాయి. వీటి ఆధారంగానే కొందరు అధికారులు వాహనాలకు అన్ని రకాల పౌరసేవలను అందజేస్తున్నారు.
వాహనాల ఫిట్‌నెస్, బదిలీ, అమ్మకాలు, చిరునామా మార్పు వంటి అంశాల్లో అన్ని రకాల డాక్యుమెంట్‌లతో పాటు సదరు వాహనానికి ఉన్న బీమా కాలపరిమితిని కూడా అధికారులు పరిగణనలోకి తీసుకోవాలి. కనీసం ఏడాది పాటు బీమా గడువు ఉన్న వాహనాలకే ఫిట్‌నెస్ పరీక్షలను నిర్వహించి వాహన సామర్థ్యాన్ని ధృవీకరించవలసి ఉంటుంది. కానీ కొన్ని ప్రాంతీయ రవాణా కేంద్రాల్లో ఈ నిబంధనలు అమలుకు నోచుకోవడం లేదు. ముఖ్యంగా ఆటో రిక్షాలు, క్యాబ్‌లు వంటి ప్రజా రవాణా వాహనాల్లో ఇది బేఖాతరు అవుతోంది. ప్రయాణికులు, వాహనాల భద్రతను దృష్టిలో ఉంచుకొని ఎంతో కీలకంగా భావించే బీమాపత్రాల్లో ఎలాంటి పారదర్శకతను పాటించడం లేదని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ‘ఇలాంటి బీమా పత్రాలకు వాహన్ పోర్టల్‌లో సైతం ఆమోదం లభించడం విచిత్రంగా ఉంది’ అని ఇబ్రహీంపట్నానికి చెందిన మోహన్ అనే వాహన యజమాని విస్మయం వ్యక్తం చేశారు.
తప్పించుకొనేందుకే...
నెల రోజుల గడువుతో ఇస్తున్న బీమా పత్రాలు ఇటు వాహనదారులకు, అటు సదరు బీమా సంస్థలకు ఉభయ తారకంగా మారాయి. కొందరు వాహన యజమానులు బీమా భారాన్ని తప్పించుకొనేందుకు కేవలం రూ.1500 చెల్లించి నెల గడువు కలిగిన బీమాను పొందుతున్నారు. ఇది ఆ సంస్థలకు చక్కటి ఆదాయ మార్గంగా మారింది. నిజానికి ఆటోరిక్షాలు, క్యాబ్‌లు, తదితర వాహనాలకు ఏడాది ప్రీమియం కలిగిన థర్డ్‌పార్టీ బీమా పొందాలంటే రూ.7000 నుంచి రూ.10వేల వరకు ఖర్చవుతుంది. వ్యక్తిగత కార్లకు ఇంకా ఎక్కువే ఉంటుంది. ఈ భారాన్ని తప్పించుకొనేందుకే బీమా సంస్థలు, వాహనదారులు కొత్త ఎత్తుగడను ఎంచుకొన్నాయి. బీమా ప్రీమియం గడువును ఏ మాత్రం పరిగణనలోకి తీసుకోకుండా ఆర్టీఏ అధికారులు వాహనాలకు ఫిట్‌నెస్ ఇచ్చేస్తున్నారు. యాజమాన్య మార్పిడి, చిరునామా మార్పు, తదితర రవాణా సేవలను అందజేస్తూ తమ వంతు సహకారాన్ని అందజేస్తున్నారు.
నకిలీల వెల్లువ..
మరోవైపు వాహన బీమాలో నకిలీ పత్రాలు సైతం వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా ఆటోరిక్షాలు, ద్విచక్ర వాహనాల రెన్యువల్స్‌లో ఎక్కువగా దర్శనమిస్తున్నాయి. కొందరు ఏజెంట్‌లు ఏడాది విలువ కలిగిన నకిలీ పత్రాలను సృష్టించి రూ.1000 నుంచి రూ.2000 వరకు విక్రయిస్తున్నారు. దీంతో ఇలాంటి పత్రాల ఆధారంగానే వాహనదారులు అధికారులను సంప్రదిస్తున్నారు. కొన్ని చోట్ల అవి నకిలీవో, అసలువో నిర్ధారించుకోకుండానే ఏజెంట్లపై ఆధారపడి అన్ని రకాల అనుమతులు ఇవ్వడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment