వాహన బీమాలకు 'నకిలీ' మకిలి | Vehicle insurance being Fake 25 percent Andhra Pradesh | Sakshi
Sakshi News home page

వాహన బీమాలకు 'నకిలీ' మకిలి

Published Fri, Aug 6 2021 4:03 AM | Last Updated on Fri, Aug 6 2021 4:04 AM

Vehicle insurance being Fake 25 percent Andhra Pradesh - Sakshi

రోడ్డుపై పరుగులు తీసే వాహనాలకు బీమా తప్పనిసరి. బీమా ఉంటే అదో ధీమా. ఊహించని ప్రమాదం జరిగి ఎవరైనా మరణించినా, గాయపడినా బాధిత కుటుంబానికి బీమా ఆర్థిక భరోసా ఇస్తుంది. వాహనాలకు ఇంతటి అవసరమైన బీమాలను కూడా నకిలీవి తయారు చేస్తున్నాయి. ప్రముఖ బీమా కంపెనీల పేరిట నకిలీ పాలసీలు విచ్చలవిడిగా చేస్తూ అటు ప్రజలకు..ఇటు ప్రభుత్వ జీఎస్టీ ఆదాయానికి గండి కొడుతున్నాయి.  

సాక్షి, అమరావతి: విజయవాడ–హనుమాన్‌ జంక్షన్‌ జాతీయ రహదారిపై ఐదేళ్ల క్రితం జరిగిన ఓ లారీ ప్రమాదంలో ఒకరు దుర్మరణం చెందారు. ఆ లారీకి వాహన బీమా ఉండటంతో థర్డ్‌పార్టీ పరిహారం కోసం దరఖాస్తు చేశారు. కానీ సదరు బీమా కంపెనీ తాము అసలు ఆ లారీకి బీమానే చేయలేదని చెప్పడంతో అటు లారీ యజమాని, ఇటు బాధిత కుటుంబం అవాక్కయ్యారు. తాము బీమా చేశాము కదా అని సంబంధిత పత్రాలు చూపిస్తే అసలు అవి తమ కంపెనీవే కావని ఆ సంస్థ తేల్చిచెప్పింది. లారీ యజమాని, బాధిత కుటుంబం కోర్టుని ఆశ్రయించినా ఫలితం లేకపోయింది. ఈ ఘటనతో తమ కంపెనీ పేరిట నకిలీ బీమా దందా సాగుతోందని గ్రహించిన ఆ సంస్థ అప్పట్లో టీడీపీ ప్రభుత్వంలో రవాణా శాఖ దృష్టికి తీసుకువెళ్లింది. కానీ అప్పటి టీడీపీ ప్రభుత్వం దీనిపై ఎలాంటి చర్యలూ తీసుకోలేదు.

ఆ తరువాత ఆ విషయాన్ని ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. ఫలితంగా రాష్ట్రంలో నకిలీ వాహన బీమా రాకెట్‌ దర్జాగా విస్తరించింది. ఏకంగా 12 కంపెనీల పేరిట నకిలీ వాహన బీమాలు చేయిస్తూ యథేచ్ఛగా మోసం చేస్తోంది. ఇదీ రాష్ట్రంలో నకిలీ వాహన బీమా దందా బాగోతం. అటు ప్రజలను నష్టపరుస్తూ ఇటు ప్రభుత్వానికి జీఎస్టీ ఆదాయానికి గండి కొడుతున్న ఈ దందాపై తాజాగా డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ (డీఆర్‌ఐ) వర్గాలు దృష్టి సారించాయి. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం విశ్వాసం కల్పించడంతో ఈ వ్యవహారంపై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు బీమా కంపెనీలు సమాయత్తమవుతున్నాయి.  

దాదాపు 25% నకిలీ పాలసీలే.. 
రాష్ట్రంలో నకిలీ బీమా పాలసీల దందాపై డీఆర్‌ఐ అధికారులు దృష్టి సారించారు. ఈ బాగోతాన్ని అరికట్టేందుకు కార్యాచరణకు ఉపక్రమించారు. ర్యాండమ్‌గా 12 బీమా కంపెనీలకు చెందిన 3 లక్షల వాహన పాలసీలను పరిశీలించారు. వాటిలో 25 శాతం బీమా పాలసీలు నకిలివేనని ప్రాథమికంగా నిర్ధారించారు. రాష్ట్రంలో కోట్ల సంఖ్యలో ఉన్న పాలసీలను పరిశీలిస్తే మరెన్ని నకిలీ బీమా పాలసీలు బయటపడతాయో అంతుచిక్కడం లేదని అధికారులు భావిస్తున్నారు. దీనిపై సమగ్ర దర్యాప్తు చేపట్టి కట్టడికి తగిన విధివిధానాలను అమలు చేయాలని నిర్ణయించారు. మరోవైపు బీమా కంపెనీల ప్రతినిధులు కూడా ఈ వ్యవహారంపై డీఆర్‌ఐ అధికారులను కలిసి పరిస్థితిని వివరించారు. ఇది క్రిమినల్‌ చర్య కూడా కావడంతో దీనిపై పోలీసు అధికారులకు కూడా ఫిర్యాదు చేయాలని డీఆర్‌ఐ అధికారులు వారికి సూచించారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని బీమా కంపెనీలు కూడా నిర్ణయించాయి.  

పోలీసులకు ఫిర్యాదు చేస్తాం 
‘మా కంపెనీ పేరిట నకిలీ బీమా పాలసీలు చేస్తున్నట్లుగా గుర్తించాం. దీనిపై మా కంపెనీ ప్రతినిధులు పోలీసులకు ఫిర్యాదు చేయనున్నారు. ఈ విషయంలో దర్యాప్తునకు డీఆర్‌ఐ, పోలీసు అధికారులకు సహకరిస్తాం. 
– జితేంద్ర సాహూ, జనరల్‌ మేనేజర్, మాగ్మా ఇన్సూరెన్స్‌ కంపెనీ, ముంబై 

కాలుష్య తనిఖీ వాహనాలు, సెకండ్‌ హ్యాండ్‌ వాహన షోరూమ్‌లే కేంద్రంగా... 
రాష్ట్రంలో దాదాపు ఏడేళ్లుగా నకిలీ వాహన బీమా రాకెట్‌ వేళ్లూనుకున్నట్టుగా తెలుస్తోంది. ప్రధానంగా టీడీపీ ప్రభుత్వంలో నిబంధనలకు విరుద్ధంగా అనుమతినిచ్చిన కాలుష్య తనిఖీ వాహనాలు కేంద్రంగా ఈ దందా కేంద్రీకృతమైంది. మరోవైపు సెకండ్‌ హ్యాండ్‌ వాహనాలు విక్రయించే షోరూమ్‌ల నుంచి కూడా ఈ బాగోతం సాగుతోంది. టీడీపీ ప్రభుత్వంలో కీలక మంత్రిగా వ్యవహరించిన శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఓ సీనియర్‌ నేత అండదండలతో ఈ రాకెట్‌ బలోపేతమైంది.

వాహన బీమాలు అందించే అధీకృత ఏజెంట్ల కంటే ఈ కాలుష్య నియంత్రణ తనిఖీ వాహనాలు, సెకండ్‌ హ్యాండ్‌ వాహనాల విక్రయ షోరూమ్‌లలో తక్కువ మొత్తానికే బీమా పాలసీలు అందుబాటులో ఉంచారు. కాలుష్య తనిఖీల కోసం తమ వాహనాలను తీసుకువచ్చిన వాహనదారులకు అదే పనిగా బీమా పాలసీలు చేయిస్తారు. ఆ విధంగా అధీకృత ఏజంట్‌ వద్ద కంటే 50% తక్కువకే అందిస్తుండటంతో వాహనదారులు ఆకర్షితులై నకిలీ బీమా పాలసీలు చేసుకుంటున్నారు. ఆ విధంగా ఒక్కో నకిలీ బీమా పాలసీ చేసే కాలుష్య పరీక్షలు/సెకండ్‌ హ్యాండ్‌ షోరూమ్‌ సిబ్బందికి రూ.500వరకు కమీషన్‌ ముట్టజెబుతారు. దాంతో ఈ నకిలీ వాహన బీమా పాలసీల దందా అడ్డూఅదుపు లేకుండా సాగిపోయింది.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement