వాహన బీమాకు యాడ్-ఆన్ కవచం | Common add-on covers in Auto Insurance | Sakshi
Sakshi News home page

వాహన బీమాకు యాడ్-ఆన్ కవచం

Published Mon, Nov 16 2015 12:13 AM | Last Updated on Sun, Sep 3 2017 12:32 PM

వాహన బీమాకు యాడ్-ఆన్ కవచం

వాహన బీమాకు యాడ్-ఆన్ కవచం

అందరికీ వాహనం అవసరమే. కాకపోతే మనుషుల్ని బట్టి వారి అవసరాలు కూడా వేరుగా ఉంటాయి. పెద్ద కుటుంబమైతే విశాలమైన పెద్ద కారు కావాల్సి రావొచ్చు. అదే చిన్న కుటుంబం, సింగిల్‌గా ఉన్న ప్రొఫెషనల్స్ లాంటి వారికయితే ఇటు పార్కింగ్‌కు అటు మెయింటెనెన్స్‌కు సులువుగా ఉండే చిన్న కారు బెటరని అనిపించొచ్చు. ఇక గృహిణులైతే.. చిన్నా, చిత్రకా పనులు చుట్టబెట్టేందుకు తేలికపాటి స్కూటర్‌లాంటి దాన్ని ఇష్టపడొచ్చు. ఇలా ఒకరికి అనువైన వాహనం మరొకరికి అనువైనది కాకపోవచ్చు. అలాగే, వాహన బీమా కూడా!!.

అల్లాటప్పాగా ఏదో ఒక పాలసీ తీసుకోవడం కాకుండా... వాహనం, దాని వాడకాన్ని బట్టి సరైన పాలసీ, తగిన యాడ్-ఆన్‌లు తీసుకుంటేనే బీమా ప్రయోజనాలు పూర్తిగా పొందవచ్చు. అందుకే వివిధ సందర్భాల్లో ఉపయోగపడే యాడ్-ఆన్‌ల గురించి తెలుసుకోవాలి.

 
బంపర్ టు బంపర్ డ్రైవింగ్..
ప్రస్తుతం చాలా చోట్ల ట్రాఫిక్ భారీగా పెరిగిపోతోంది. దాదాపు ఒకదానికి మరొకటి తాకేంత దగ్గరగా బంపర్ టు బంపర్ డ్రైవింగ్ పరిస్థితులు ఉంటున్నాయి. ఇలాంటి ట్రాఫిక్ లో ప్రయాణించేటప్పుడు కారు ఫైబర్ , మెటల్ వగైరా పార్టులు ఇట్టే దెబ్బతినే అవకాశం ఉంది. అయితే, దెబ్బతిన్న ఫైబర్, ప్లాస్టిక్, మెటల్ వంటి భాగాల రిపేర్లకు అయ్యే ఖర్చులో వాహనం తరుగుదలను బట్టి దాదాపు 50 శాతం దాకా మాత్రమే సాధారణ పాలసీల్లో పరిహారం దక్కవచ్చు.

ఇలాంటప్పుడు డిప్రిసియేషన్ కవరేజీ తీసుకుంటే ఉపయోగకరంగా ఉంటుంది. రీప్లేస్ చేసిన భాగాల విలువలో డిడక్ట్ చేసిన తరుగుదల మొత్తాన్ని క్లెయిమ్ చేసుకునేందుకు రెండు పర్యాయాలు అవకాశం లభిస్తుంది. దీనితో ప్లాస్టిక్, ఫైబర్ పార్టులకు మరింత సమగ్ర కవరేజీ ఉన్నట్లవుతుంది.
 
కన్జూమబుల్ కవరేజి..
మీరు పూర్తి బీమా క్లెయిమ్ కోరుకునే వారయితే దీన్ని తీసుకోవచ్చు. వాహనంలో నట్లు, బోల్టులు, బ్రేక్ ఫ్లూయిడ్స్ మొదలైన వాటిని కన్జూమబుల్స్ భాగాలుగా వ్యవహరిస్తారు. చాలా మటుకు పాలసీల్లో ఇలాంటి వాటికి కవరేజీ ఉండదు. కాబట్టి ఇలాంటి కన్జూమబుల్ భాగాలకు కూడా బీమా రక్షణ ఉండేలా యాడ్-ఆన్ కవర్ తీసుకోవచ్చు.
 
తాళం చెవులు పోతే..
మతిమరుపు వల్ల కావొచ్చు మరొకటి కావొచ్చు తరచూ తాళాలు పోగొట్టుకోవడం సమస్యయితే ఇందుకోసం కూడా ప్రత్యేకంగా కార్ కీ రీప్లేస్‌మెంట్ కవరేజీ లభిస్తుంది. కారు తాళం చెవి పోతే డూప్లికేట్ కీ తయారీకి, ఒకవేళ తాళం కూడా పాడైతే దాన్ని కూడా మార్చేందుకు అయ్యే ఖర్చును దీని కింద పొందవచ్చు. ఈ యాడ్-ఆన్ తీసుకుంటే రూ. 50,000 దాకా కవరేజీ ఉంటుంది. పాలసీ వ్యవధిలో ఒకో దఫాకి గరిష్టంగా రూ. 25,000 దాకా క్లెయిమ్‌కు అవకాశముంటుంది.
 
భారీ వర్షాలు, వరదల నుంచి వాహనానికి రక్షణ..
చిన్నదైనా, పెద్దదైనా వర్షమొస్తే చాలు రోడ్లూ, ఇళ్లూ జలమయమైపోతున్న నేపథ్యంలో చాలా చోట్ల వాహనాల్లోకి నీళ్లు వెళ్లిపోయి అవి కదలకుండా మొరాయిస్తుంటాయి. పోనీ అని నిండా నీళ్ల నుంచి దాన్ని బైటికి లాగేందుకు స్టార్ట్ చేసి తీసుకెళ్లే ప్రయత్నంలో ఇంజిన్ దెబ్బతింటే బీమా కంపెనీలు దాన్ని స్వయంకృతం కిందే పరిగణిస్తాయి.

దీనికి ఎలాంటి పరిహారం ఇవ్వవు. పోనీ సొంత డబ్బు పెట్టుకుని ఇంజిన్‌ను రిపేరు చేసుకోవాలనుకుంటే చాలా ఖరీదైన వ్యవహారం. ఇలాంటి సమస్య నుంచి గట్టెక్కేందుకు హైడ్రోస్టాటిక్ లాక్ యాడ్ ఆన్ కవరేజీ ఉపయోగపడుతుంది. నీరు చొరబడటం వల్ల ఇంజిన్ భాగాలు పాడైతే వాటిని రిపేర్ చేసేందుకు లేదా రీప్లేస్ చేసేందుకు అయ్యే ఖర్చును ఈ యాడ్ ఆన్ కవర్ ద్వారా పొందవచ్చు. ఒకవేళ మీరు నివసించే ప్రాంతంలో వర్షమొస్తే మునిగిపోయే పరిస్థితులుంటే ఇలాంటి యాడ్ ఆన్ ఎంచుకోవచ్చు.
 
నో క్లెయిమ్ బోనస్‌కు రక్షణ ..
మీరు జాగ్రత్తగా డ్రైవ్ చేసేవారై ఉండి ఇన్సూరెన్స్‌ను ఇప్పటిదాకా క్లెయిమ్ చేయని పక్షంలో మీకు నో క్లెయిమ్ బోనస్ (ఎన్‌సీబీ) భారీగానే లభించవచ్చు. అయితే, మీ టీనేజీ పిల్లలో లేదా సమీప బంధువులో మీ కారును తీసుకెళ్లి ఏ డ్యామేజీనో చేసి తీసుకొస్తే బీమా పరిహారం తీసుకోవాల్సి రావొచ్చు. ఫలితంగా ఎన్‌సీబీ ప్రయోజనాలను నష్టపోవాల్సి రావొచ్చు.

ఇలాంటి సందర్భం ఎదురు కాకుండా ఎన్‌సీబీ ప్రొటెక్టర్ కవర్ తీసుకుంటే పాలసీ వ్యవధిలో రెండు పర్యాయాల దాకా నో క్లెయిమ్ బోనస్ పర్సంటేజీకి రక్షణ ఉంటుంది. దాదాపు 25 శాతం పైగా ఎన్‌సీబీ జమయిన వాహనదారులకు ఈ కవరేజీ ఉపయోగ కరంగా ఉంటుంది.
 
ప్రయాణించే వారికి అదనపు భద్రత
వాహనంలో ప్రయాణించే వారి వ్యక్తిగత భద్రతకు కూడా మోటార్ ఇన్సూరెన్స్ యాడ్-ఆన్ కవరేజీలు ఉన్నాయి.
పర్సనల్ యాక్సిడెంట్ కవర్: వాహనంలో ప్రయాణిస్తున్న వారు ప్రమాదవశాత్తు పాక్షికంగా లేదా పూర్తిగా వికలాంగులైనా లేదా ప్రమాదంలో మరణించినా .. ఈ కవరేజీతో గరిష్టంగా ఒక్కొక్కరికి రూ. 2 లక్షల దాకా పరిహారం లభిస్తుంది.
 
హాస్పిటల్ క్యాష్: ఈ యాడ్-ఆన్ ఉంటే.. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పక్షంలో రోజుకు రూ. 1,000 దాకా గరిష్టంగా 30 రోజుల వరకు నగదు పరిహారం లభిస్తుంది.
 
అంబులెన్స్ చార్జెస్ కవర్: వాహనంలో ప్రయాణిస్తుండగా గానీ ఎక్కుతుండగా లేదా దిగుతుండగా గానీ ప్రమాదవశాత్తు పాలసీదారుకు తీవ్రగాయాలైతే ఆస్పత్రికి తరలించేటప్పుడు అంబులెన్స్‌కయ్యే ఖర్చులు ఈ యాడ్ ఉంటే పొందవచ్చు.
 
ఇలా..వాహనదారులు తమ అవసరాలకు అనుగుణంగా ఉండే పాలసీలను, యాడ్ ఆన్ కవరేజీలు తీసుకుంటే నిశ్చింతగా.. దూసుకుపోవచ్చు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement