
దిగుమతి సుంకం తగ్గింపు తర్వాత మార్పు
సీబీఐసీ చైర్మన్ సంజయ్ కుమార్ అగర్వాల్
న్యూఢిల్లీ: బంగారం అక్రమ రవాణాకు దిగుమతి సుంకం తగ్గింపు కొంత చెక్ పెట్టింది. గతేడాది జూలైలో బంగారంపై దిగుమతి సుంకాన్ని 15 శాతం నుంచి 6 శాతానికి కేంద్రం తగ్గించడం గమనార్హం. అనంతరం అక్రమ రవాణా (స్మగ్లింగ్/దొంగ రవాణా) గణనీయంగా తగ్గినట్టు పరోక్ష పన్నుల కేంద్ర మండలి (సీబీఐసీ) చైర్మన్ సంజయ్ కుమార్ అగర్వాల్ తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి జూన్ మధ్య దేశవ్యాప్తంగా పలు విమానాశ్రయాల్లో 847 కిలోల బంగారాన్ని (రూ.544 కోట్లు) డీఆర్‌ఐ అధికారులు జప్తు చేసినట్టు ప్రభుత్వ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.
అంతర్జాతీయ ప్రయాణికులు, సరిహద్దులు, దేశంలోకి వచ్చే కార్గోల వద్ద అధికారుల నిఘా పెరిగినట్టు సంజయ్ కుమార్ చెప్పారు. కస్టమ్స్ డ్యూటీ ఎగ్గొట్టేందుకు సరిహద్దుల ద్వారా వస్తు అక్రమ రవాణా జరుగుతుండడం తెలిసిందే. 2023–24 ఆర్థిక సంవత్సరంలో డీఆర్‌ఐ అధికారులు ఈశాన్య సరిహద్దుల వద్ద 1,319 కిలోల బంగారం అక్రమ రవాణాన్ని అడ్డుకుని, ఆ మొత్తాన్ని స్వా«దీనం చేసుకున్నారు.
ముఖ్యంగా బంగ్లాదేశ్, మయన్మార్ సరిహద్దుల వద్ద ఎక్కువ మొత్తం పట్టుబడింది. కస్టమ్స్ విభాగం సహా సీబీఐసీ కలసి గత ఆర్థిక సంవత్సరం మొత్తం మీద జప్తు చేసిన బంగారం 4,870 కిలోలుగా ఉంది. దిగుమతి సుంకం తగ్గింపుతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రిటైల్ బంగారం ఆభరణ వర్తకుల (జ్యుయలర్లు) ఆదాయం 22–25 శాతం పెరుగుతుందని క్రిసిల్ రేటింగ్స్ అంచనా వేయడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment