indirect tax
-
జీఎస్టీపై ప్రభుత్వం వరుస సమావేశాలు! ఏం మార్పులొస్తాయో..
వస్తు సేవల పన్ను (GST)తో పాటు ఇతర పరోక్ష పన్నులపై కేంద్ర ప్రభుత్వం త్వరలో వరుస సమావేశాలు నిర్వహించనుంది. జీఎస్టీ ఫైలింగ్‌తోపాటు పరోక్ష పన్ను ప్రక్రియల్లో మార్పులు తీసుకొచ్చే అవకాశం ఉందని చర్చ జరుగుతోంది. ఈ మేరకు జీఎస్టీ సహా పరోక్ష పన్నుల ప్రక్రియలను సమీక్షించడానికి, క్రమబద్ధీకరించడానికి ప్రభుత్వం నవంబర్‌లో వరుస సమావేశాలను నిర్వహించే అవకాశం ఉందని ఓ ప్రభుత్వ సీనియర్ అధికారిని ఉటంకిస్తూ ‘మనీ కంట్రోల్’ కథనం ప్రచురించింది. ఈ సమావేశాల్లో జీఎస్టీ పోర్టల్ పనితీరు, పరోక్ష పన్ను ప్రక్రియలు, రిటర్న్‌లను దాఖలు చేయడంలో సౌలభ్యం, సాంకేతిక లోపాలు ఏవైనా ఉంటే వాటిని ఎలా పరిష్కరించాలన్నదానిపై ప్రభుత్వం దృష్టి సారించనున్నట్లు తెలుస్తోంది. రాబోయేది పూర్తి బడ్జెట్ కాదు. వచ్చే ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికల కారణంగా ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ఉంటుంది. కాబట్టి ఈ సమయాన్ని ఉపయోగించుకోవాలని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇన్‌డైరెక్ట్ టాక్సెస్ అండ్ కస్టమ్స్ (CBIC) లక్ష్యంగా పెట్టుకుంది. ఈ సమీక్షా సమావేశాలకు సీబీఐసీ, జీఎస్టీఎన్‌తోపాటు అన్ని ఫీల్డ్ యూనిట్ల ఉన్నతాధికారులు కూడా హాజరు కానున్నారు. ప్రభుత్వ జీఎస్టీ వసూళ్లు అక్టోబర్‌లో ఏడాది ప్రాతిపదికన 13 శాతం పెరిగి రూ. 1.72 లక్షల కోట్లకు చేరుకున్నాయి. ఇవి ఇప్పటివరకు రెండో అత్యధిక జీఎస్టీ వసూళ్లు. కొత్త ఆర్థిక సంవత్సరంలో జీఎస్టీ వసూళ్ల ప్రారంభానికి ముందే కొత్త మార్పులు అమల్లోకి వస్తాయని భావిస్తున్నారు. సవరించిన రిటర్న్‌ల దాఖలుకు డిమాండ్ జీఎస్టీలో సవరించిన రిటర్న్‌ల దాఖలుకు అవకాశం కల్పించాలని వ్యాపారులు, పన్ను కన్సల్టెంట్ల సంఘాలు కోరుతున్నాయి. మధ్యప్రదేశ్ ట్యాక్స్ లా బార్ అసోసియేషన్, కమర్షియల్ ట్యాక్స్ ప్రాక్టీషనర్స్ అసోసియేషన్ పిలుపు మేరకు ఆ రాష్ట్రంలోని ప్రముఖ వ్యాపార, పన్ను సంస్థలు ఇటీవల సమావేశమై ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి. -
ప్రత్యక్ష, పరోక్ష పన్నులు: సీతారామన్‌కు యూఎస్ఐఎస్పీఎఫ్ కీలక సూచనలు
న్యూఢిల్లీ:మరికొన్ని రోజుల్లో 2023-24 వార్షిక బడ్జెట్‌ను పార్లమెంట్లో ప్రవేశ పెట్టేందుకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రడీ అవుతున్నారు. ఈ సందర్భంగా అమెరికాలోని ఇండియా సెంట్రిక్ టాప్ పరిశ్రమ బృందం ఆర్థికమంత్రికి కీలక విజ్ఞప్తి చేసింది. భారత దేశంలోని ప్రత్యక్ష, పరోక్ష పన్నుల విధానాన్ని సరళీకృతం చేయాలని, హేతు బద్ధీకరించాలని భారతదేశం-కేంద్రీకృత అమెరికా వ్యూహాత్మక, వ్యాపార సలహా బృందం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను కోరింది. ఇది ప్రపంచ పెట్టుబడిదారుల విశ్వాసాన్ని పెంచి, భారీగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను తెచ్చి పెడుతుందని తెలిపాయి. విదేశీ కంపెనీల కార్పొరేట్ పన్ను రేట్లను హేతుబద్ధం చేయండి అంటూ యూఎస్ ఇండియా స్ట్రాటజిక్ అండ్ పార్టనర్షిప్ ఫోరమ్ (USISPF) ఫిబ్రవరి 1న వార్షిక బడ్జెట్ సమర్పణలకు ముందు ఆర్థిక మంత్రిత్వ శాఖకు కోరింది. మూలధన లాభం పన్ను సంస్కరణలను సరళీకృతం చేయాలని, వివిధ సాధనాల హోల్డింగ్ కాలాలు, రేట్లను సమన్వయం చేయాలని కోరింది. గ్లోబల్ టాక్స్ డీల్‌కు భారత నిబద్ధతను పునరుద్ఘాటించడంతోపాటు, సెక్యూరిటీలలో పెట్టుబడి నుండి విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్ట్మెంట్ (FPI) వరకు రాయితీ పన్ను విధానాన్ని విస్తరించాలని కేంద్ర ఆర్థిక మంత్రికి సూచించింది. అంతేకాదు హెల్త్ లాంటి నిర్దిష్ట సెక్టార్లలో పునరుత్పాదక శక్తి, ఆర్ అండ్ డీ పెట్టుబడులపై పన్ను రాయితీలను కూడా కోరింది.(Union Budget 2023 ఆ పథకాలకు పెద్ద పీట, వారికి బిగ్ బూస్ట్) స్థిరమైన, ఊహాజనిత పన్ను పర్యావరణం కోసం వాదించడం, ఈజ్ ఆఫ్ డూయింగ్ విధానం సరళీకరణ, వ్యాపారం ఖర్చులను హేతుబద్ధీకరించడం, పన్ను రేట్లు , సుంకాలను హేతుబద్ధీకరించడం వంటివి ఉన్నాయి. చమురు మరియు సహజ వాయువు కంపెనీలకు అందించిన కస్టమ్స్ సుంకం మినహాయింపులపై వివరణ కోరింది. దీంతోపాటు ఎక్స్-రే యంత్రాల కోసం కస్టమ్స్ సుంకం రేట్లను 10 శాతం నుండి 7.5 శాతానికి తగ్గించడం, నిర్దేశిత పరిశోధన ద్వారా దిగుమతి చేసుకునే అన్ని వస్తువులపై కస్టమ్స్ సుంకం మినహాయింపును అందించాలని తెలిపింది. ఉత్పత్తి ప్రాముఖ్యతను పరిగణనలోకి తీసుకుని పోషకాహార ఉత్పత్తులపై కస్టమ్స్ డ్యూటీ పెంపును ఉపసంహరించుకోవాలని కూడా అభిప్రాయపడింది. భారతదేశంలో శాస్త్రీయంగా రూపొందించే పోషకాహారం లభ్యతను ప్రోత్సహించాలని ఆర్థిక మంత్రిని కోరింది. కస్టమ్స్ టారిఫ్‌లు సుంకాలు మరియు కస్టమ్స్ సిఫారసుకు సంబంధించి టెలికాం ఉత్పత్తులపై కస్టమ్స్ టారిఫ్ చట్టంలోని అస్పష్టతలను పరిష్కరించాలని తెలిపింది. అలాగే CAROTAR , ఫేస్‌లెస్ ఎసెస్మెంట్ వంటి వాణిజ్య సులభతర పథకాలను బలోపేతం చేయాలని అధునాతన జీవ ఇంధన ప్రాజెక్టులకు రాయితీ కస్టమ్స్ సుంకం పొడిగింపును యూఎస్ఐఎస్పీఎఫ్ కోరింది. (Union Budget-2023పై కోటి ఆశలు: వెండి, బంగారం ధరలపై గుడ్‌న్యూస్!) -
ఏడాదిన్నరలో రూ 50,000 కోట్ల పన్ను ఎగవేత..
సాక్షి, న్యూఢిల్లీ : గత ఏడాదిన్నరలో దేశవ్యాప్తంగా రూ 50,000 కోట్ల మేర పన్ను ఎగవేతలను కేంద్ర పరోక్ష పన్నుల విభాగం (సీబీఐసీ) గుర్తించింది. మొత్తం పన్ను ఎగవేతలో పది శాతం వరకూ జీఎస్టీ వసూళ్లున్నాయని పేర్కొంది. జులై 2017-18 మధ్య నమోదైన 604 కేసుల్లో రూ 4441 కోట్ల జీఎస్టీ ఎగవేతను అధికారులు కనుగొన్నారని సీబీఐసీ పర్యవేక్షణలో పనిచేసే జీఎస్టీ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ జనరల్ (డీజీజీఐ) డేటా వెల్లడించింది. ఇక పన్ను ఎగవేతల్లో రూ 39,047 కోట్లు సర్వీస్ ట్యాక్స్ ఎగవేతలు కాగా, రూ 6,621 కోట్ల సెంట్రల్ ఎక్సైజ్ ఎగవేతలున్నాయని సీబీఐసీ గుర్తించింది. జీఎస్టీ అమలుకాక ముందు పన్ను ఎగవేతలు అధికంగా ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. జీఎస్టీ హయాంలో పన్ను వసూళ్ల రేటు పుంజుకుందని, గుర్తించిన పన్ను ఎగవేతల్లో 57 శాతం రికవరీ రేటు సాధించామని పేర్కొన్నారు. ఈ ఏడాది నమోదైన పాత కేసుల్లో రికవరీ కేవలం 9 శాతంగానే ఉందని చెప్పారు. -
ఆ రెండు కంపెనీల పన్ను బకాయిలు తెలిస్తే షాక్!
న్యూఢిల్లీ : దేశీయ ప్రతిష్టాత్మకమైన టాటా గ్రూప్‌కు చెందిన టాటా మోటార్స్, లిక్కర్ కింగ్ విజయ్‌మాల్యా ప్రమోటెడ్ కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ ఈ రెండు కంపెనీలే ఏకంగా రెండువేల కోట్లకు పైగా పన్ను బకాయిలను ఖజానాకు చెల్లించకుండా ఎగ్గొట్టినట్టు పార్లమెంట్‌కు కేంద్రం తెలిపింది. పరోక్ష పన్నుల రూపంలో చెల్లించాల్సిన ఈ రెండు కంపెనీలు రూ.2158.81కోట్లను చెల్లించలేదని పేర్కొంది. టాటా మోటార్స్, 91 కేసుల్లో రూ.629.76 కోట్ల అవుట్‌స్టాండింగ్ ఎక్సైజ్ డ్యూటీని, 5 కేసుల్లో రూ.516.09 కోట్ల సర్వీసు ట్యాక్స్‌లను చెల్లించలేదని ఆర్థికశాఖ సహాయమంత్రి సంతోష్ కుమార్ గంగ్వార్ లోక్‌సభకు ఓ లిఖిత పూర్వక పత్రంలో సమర్పించారు. అదేవిధంగా విజయ్ మాల్యా ప్రమోటెడ్ కింగ్‌ఫిషర్ కూడా సర్వీసు ట్యాక్స్, పెనాల్టీల రూపంలో రూ.1,012.96 కోట్లు బకాయి పడ్డట్టు సంతోష్ కుమార్ గంగ్వార్ లోక్‌సభకు తెలిపారు. మరో రెండు సంస్థలు కూడా రూ.1000 కోట్లకు పైగా సర్వీసు ట్యాక్స్‌లను ఖజానాకు బకాయి పడినట్టు వెల్లడించారు. అయితే ఈ సమాచారం బహిర్గతం చేయడం నిషేధమని, 1961 ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 138 కింద వీటిని అందజేస్తున్నామని సంతోష్ కుమార్ గంగ్వార్ తెలిపారు. -
సీబీఈసీ ఇకపై సీబీఐటీ
న్యూఢిల్లీ: పరోక్ష పన్నుల అత్యున్నత విభాగం సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ (సీబీఈసీ) త్వరలో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇన్‌డెరైక్ట్ ట్యాక్స్ (సీబీఐటీ)గా పేరు మార్చుకోనుంది. జీఎస్టీ అమలు గడువు అయిన వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నుంచి ఇది అమల్లోకి రానుంది. జీఎస్టీ వ్యవస్థాగత నిర్మాణానికి సంబంధించిన ముసాయిదాలో ఈ విషయాన్ని పేర్కొన్నట్టు రెవెన్యూ శాఖ వర్గాలు తెలిపాయి. జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయించే నిబంధనలు, మినహాయింపులను సీబీఐటీ అమలు చేస్తుంది. సీబీఐటీలో ఆరుగురు సభ్యులు ఉంటారు. వీరు కస్టమ్స్, ఐటీ, సెంట్రల్ ఎక్సైజ్, న్యాయ పరమైన అంశాలు, శిక్షణ, వివాదాల వంటివి పర్యవేక్షిస్తారు. -
పరోక్ష పన్ను వసూళ్లు 37 శాతం పెరిగాయ్...
న్యూఢిల్లీ: పరోక్ష పన్ను వసూళ్లు ఈ ఆర్థిక సంవత్సరం మొదటి రెండు నెలల్లో 37% పెరిగాయని రెవెన్యూ కార్యదర్శి హశ్‌ముఖ్ అథియా తెలిపారు. పరోక్ష పన్నుల్లో ఎక్సైజ్, కస్టమ్స్, సర్వీస్ ట్యాక్స్‌లు ఉంటాయి. అయితే ఈ పరోక్ష పన్నులు ఎంత వసూలయ్యాయో వివరాలను ఆయన వెల్లడించలేదు. అడిషనల్ రెవెన్యూ మీజర్స్(ఏఆర్ఎం) కాని పరోక్ష పన్ను వసూళ్లు 14%, ఏఆర్ఎంతో కూడిన పరోక్ష పన్ను వసూళ్లు 37 శాతం చొప్పున పెరిగాయని వివరించారు. పారిశ్రామిక తయారీ రంగాలపై విధించే ఎక్సైజ్ పన్ను వసూళ్లను ఏఆర్ఎం కాని వసూళ్లు గాను, పెట్రోల్, డీజిల్‌లపై ఎక్సైజ్ సుంకం వసూళ్లను ఏఆర్ఎం వసూళ్లుగాను పరిగణిస్తారు. కాగా ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.7.78 లక్షల కోట్ల పరోక్ష పన్నులు వసూలు చేయాలని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ లక్ష్యంగా పెట్టుకున్నారు. గత ఆర్థిక సంవత్సరం వసూళ్లు (రూ.7.09 లక్షల కోట్ల)తో పోల్చితే ఇది 10 శాతం అధికం.