పరోక్ష పన్ను వసూళ్లు 37 శాతం పెరిగాయ్...
న్యూఢిల్లీ: పరోక్ష పన్ను వసూళ్లు ఈ ఆర్థిక సంవత్సరం మొదటి రెండు నెలల్లో 37% పెరిగాయని రెవెన్యూ కార్యదర్శి హశ్‌ముఖ్ అథియా తెలిపారు. పరోక్ష పన్నుల్లో ఎక్సైజ్, కస్టమ్స్, సర్వీస్ ట్యాక్స్‌లు ఉంటాయి. అయితే ఈ పరోక్ష పన్నులు ఎంత వసూలయ్యాయో వివరాలను ఆయన వెల్లడించలేదు. అడిషనల్ రెవెన్యూ మీజర్స్(ఏఆర్‌ఎం) కాని పరోక్ష పన్ను వసూళ్లు 14%, ఏఆర్‌ఎంతో కూడిన పరోక్ష పన్ను వసూళ్లు 37 శాతం చొప్పున పెరిగాయని వివరించారు.
పారిశ్రామిక తయారీ రంగాలపై విధించే ఎక్సైజ్ పన్ను వసూళ్లను ఏఆర్‌ఎం కాని వసూళ్లు గాను, పెట్రోల్, డీజిల్‌లపై ఎక్సైజ్ సుంకం వసూళ్లను ఏఆర్‌ఎం వసూళ్లుగాను పరిగణిస్తారు. కాగా ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.7.78 లక్షల కోట్ల పరోక్ష పన్నులు వసూలు చేయాలని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ లక్ష్యంగా పెట్టుకున్నారు. గత ఆర్థిక సంవత్సరం వసూళ్లు (రూ.7.09 లక్షల కోట్ల)తో పోల్చితే ఇది 10 శాతం అధికం.