Hasmukh athiya
-
పరోక్ష పన్ను వసూళ్లు 37 శాతం పెరిగాయ్...
న్యూఢిల్లీ: పరోక్ష పన్ను వసూళ్లు ఈ ఆర్థిక సంవత్సరం మొదటి రెండు నెలల్లో 37% పెరిగాయని రెవెన్యూ కార్యదర్శి హశ్‌ముఖ్ అథియా తెలిపారు. పరోక్ష పన్నుల్లో ఎక్సైజ్, కస్టమ్స్, సర్వీస్ ట్యాక్స్‌లు ఉంటాయి. అయితే ఈ పరోక్ష పన్నులు ఎంత వసూలయ్యాయో వివరాలను ఆయన వెల్లడించలేదు. అడిషనల్ రెవెన్యూ మీజర్స్(ఏఆర్ఎం) కాని పరోక్ష పన్ను వసూళ్లు 14%, ఏఆర్ఎంతో కూడిన పరోక్ష పన్ను వసూళ్లు 37 శాతం చొప్పున పెరిగాయని వివరించారు. పారిశ్రామిక తయారీ రంగాలపై విధించే ఎక్సైజ్ పన్ను వసూళ్లను ఏఆర్ఎం కాని వసూళ్లు గాను, పెట్రోల్, డీజిల్‌లపై ఎక్సైజ్ సుంకం వసూళ్లను ఏఆర్ఎం వసూళ్లుగాను పరిగణిస్తారు. కాగా ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.7.78 లక్షల కోట్ల పరోక్ష పన్నులు వసూలు చేయాలని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ లక్ష్యంగా పెట్టుకున్నారు. గత ఆర్థిక సంవత్సరం వసూళ్లు (రూ.7.09 లక్షల కోట్ల)తో పోల్చితే ఇది 10 శాతం అధికం. -
లక్ష కోట్లకు ‘ముద్రా’ రుణాలు!
- 2015-16లో లక్ష్యంగా ప్రణాళికలు - 10 రోజుల భారీ ప్రచారం త్వరలో న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి ముద్రా యోజనా (పీఎంఎంవై)కు విస్తృత ప్రాతిపదికన ప్రాచుర్యం కల్పించాలని కేంద్రం భావిస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2015-16) ముగిసేనాటికి ఈ పథకం కింద రుణ పంపిణీ రూ. లక్ష కోట్లకు చేరాలన్నది కేంద్రం లక్ష్యంగా కనిపిస్తోంది. ఇందులో భాగంగా రానున్న 10 రోజులు ఈ పథకంపై విస్తృత స్థాయిలో ప్రచార కార్యక్రమం చేపట్టడానికి ఆర్థిక మంత్రిత్వశాఖ ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు ఫైనాన్షియల్ సేవల కార్యదర్శి హాస్ముఖ్ ఆథియా బుధవారం తెలిపారు. ఈ పథకానికి సంబంధించి బ్యాంకులకు ఇప్పటికే లక్ష్యాలను నిర్దేశించినట్లు ఆయన పేర్కొన్నారు. లఘు పరిశ్రమల విభాగానికి రుణ సౌలభ్యం లక్ష్యంగా పీఎంఎంవైను రూపొందించిన సంగతి తెలిసిందే. ఏప్రిల్‌లో ప్రధాని నరేంద్రమోదీ ఈ పథకాన్ని ప్రారంభించారు. చిరు వ్యాపారులు, పారిశ్రామికవేత్తలకు రూ.50,000-రూ. 10 లక్షల వరకూ రుణ సౌలభ్యతను కల్పించడం ముద్రా యోజన లక్ష్యం. ఆథియా తెలిపిన సమాచారం ప్రకారం... - ప్రారంభించిన నాటినుంచీ 20 లక్షల మంది ప్రజలకు ఈ స్కీమ్ ద్వారా రూ.14,000 కోట్ల రుణ పంపిణీలు జరిగాయి. - ఒక్క సెప్టెంబర్‌లోనే 20 నుంచి 25 లక్షల మంది కొత్త రుణాలు తీసుకునేట్లు ప్రచార కార్యక్రమం నిర్వహించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. - రూ.11 లక్షల కోట్ల నిధిని వినియోగించుకుని 5.75 కోట్ల మంది స్వయం ఉపాధి పొందడంపై ముద్రా దృష్టి పెడుతోంది.