పసిడిపై కస్టమ్స్ తగ్గింపుపై సీబీఐసీ చైర్మన్ ఎస్‌కే మల్హోత్రా
2023–24లో 4.8 టన్నుల పసిడిని జప్తు చేసినట్లు వెల్లడి
న్యూఢిల్లీ: బంగారంపై భారీగా కస్టమ్స్ సుంకాన్ని తగ్గించాలనే నిర్ణయం స్మగ్లింగ్‌ను అరికట్టడానికి దోహదపడుతుందని సీబీఐసీ (పరోక్ష పన్నులు, కస్టమ్స్ కేంద్ర బోర్డ్) చైర్మన్ సంజయ్ కుమార్ మల్హోత్రా తెలిపారు. అలాగే దేశంలోని రత్నాలు ఆభరణాల ఎగుమతులు పెరగడానికి, ఉపాధి వృద్ధికి సహాయపడుతుందని ఆయన ఇక్కడ జరిగిన ఒక కార్యక్రమంలో తెలిపారు. గత ఆర్థిక సంవత్సరం (2023–24) కస్టమ్స్ శాఖ, డీఆర్‌ఐ కలిసి 4.8 టన్నుల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. 2022–23లో ఈ పరిమాణం 3.5 టన్నులు కావడం గమనార్హం. యల్లోమెటల్‌సహా పలు విలువైన లోహాల దిగుమతి సుంకాన్ని 15 శాతం నుంచి 6 శాతానికి భారీగా తగ్గిస్తున్నట్లు ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తాజా బడ్జెట్ ప్రకటించిన సంగతి తెలిసిందే.
భారీ ఉపాధి కల్పన
రత్నాలు, ఆభరణాల రంగంలో దాదాపు 50 లక్షల మంది ఉపాధి పొందుతున్నారని, ఎగుమతుల్లో ఈ రంగం వాటా 8 శాతం వరకూ ఉందని కుమార్ మల్హోత్రా తెలిపారు. దేశానికి 2023–24లో 45.54 బిలియన్ డాలర్ల విలువైన పసిడి దిగుమతులు జరిగాయి. వెండి విషయంలో ఈ విలువ 5.44 బిలియన్ డాలర్లుగా ఉంది. అదే సమయంలో ఆభరణాల ఎగుమతులు విలువ 13.23 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. వార్షికంగా భారత్ 800 నుంచి 900 టన్నుల పసిడి దిగుమతులను చేసుకుంటోంది. బంగారం దిగుమతులలో స్విట్జర్లాండ్ అతిపెద్ద వాటాదారుగా ఉంది. మొత్తం దిగుమతుల్లో ఈ దేశం వాటా దాదాపు 40 శాతం. తరువాతి 16 శాతానికిపైగా వాటాతో యూఏఈ రెండవ స్థానంలో ఉంది. 10 శాతం వాటాలో దక్షిణాఫ్రికా మూడవ స్థానంలో నిలుస్తోంది.
2022లో పెరిగిన సుంకాలు
దేశంలోకి వచీ్చ–వెళ్లే విదేశీ మారకద్రవ్యం మధ్య నికర వ్యత్యాసానికి సంబంధించి కరెంట్ అకౌంట్ లోటు (క్యాడ్) భారీ పెరుగుదలను నివారించడానికి 2022 జూలైలో (10.75 శాతం నుంచి 15 శాతానికి) కస్టమ్స్ సుంకాన్ని భారీగా పెంచిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. 2022–23లో స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో 2 శాతంగా ఉన్న క్యాడ్, 2023–24లో ఏకంగా 0.7 శాతానికి తగ్గింది. గత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో ఏకంగా మిగులు
నమోదయ్యింది.
Comments
Please login to add a commentAdd a comment