No claim bonus
-
నో క్లెయిమ్ బోనస్.. విలువైన బహుమానం
హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలు ఎన్నో రకాల ప్రయోజనాలతో వస్తుంటాయి. పాలసీదారులు పాలసీ తీసుకున్న తర్వాత కూడా తమ ఆరోగ్యంపై శ్రద్ధ చూపించినట్టయితే.. ప్రత్యేక రాయితీలతో ప్రోత్సహించేందుకు కంపెనీలు ముందుకు వస్తున్నాయి. ప్రీమియంలో తగ్గింపులు, ఔట్ పెషెంట్‌గా తీసుకునే చికిత్సల సమయంలో వినియోగానికి వీలైన రివార్డు పాయింట్లు ఇందులో భాగమే. బీమా కంపెనీలు అందించే ఆఫర్లలో.. ముఖ్యంగా నో క్లెయిమ్ బోనస్‌ను అమూల్యమైనదనే చెప్పుకోవాలి. నో క్లెయిమ్ అంటే.. ఒక పాలసీ ఏడాదిలో ఎటువంటి క్లెయిమ్‌లు చేయకపోవడం. దీనివల్ల బీమా కంపెనీలకు కొంత ఆదా అవుతుంది. దాంతో నో క్లెయిమ్ బోనస్ రూపంలో కొంత ప్రయోజనాన్ని తిరిగి పాలసీదారులకు అందిస్తుంటాయి. ఎక్కువ సంస్థలు బీమా మొత్తాన్ని నిర్ణీత శాతం మేర పెంచుతుంటే.. కొన్ని మాత్రం ప్రీమియంలో రాయితీ ఇస్తున్నాయి. బీమా కవరేజీని బోనస్ గా ఇచ్చినా ఇందుకు అదనపు ప్రీమియం వసూలు చేయవు. కనుక ఆరోగ్య బీమా తీసుకున్నప్పటికీ.. ఆరోగ్యాన్ని చక్కగా చూసుకోవడం వల్ల ఆస్పత్రిలో చేరాల్సిన అవస్థ తప్పుతుంది. బీమా రక్షణ మొత్తం పెరుగుతుంది. ఈ నో క్లెయిమ్ బోనస్ (ఎన్సీబీ)ను దాదాపు అన్ని బీమా సంస్థలు అందిస్తున్నాయి. వివిధ బీమా సంస్థలు ఆఫర్ చేస్తున్న ఈ ప్రయోజనం విషయంలో వైరుధ్యాలను తెలియజేసే కథనమే ఇది. ఎలా పనిచేస్తుంది..? అన్ని రకాల ఇండెమ్నిటీ హెల్త్ పాలసీలు (ఆస్పత్రిలో చేరడం వల్ల అయిన వైద్య ఖర్చులు చెల్లించేవి) నో క్లెయిమ్ బోనస్ (ఎన్సీబీ) ఫీచర్‌తో వస్తున్నాయి. ఉదాహరణకు బజాజ్ అలియాంజ్ జనరల్ ఇన్సూరెన్స్ హెల్త్‌గార్డ్ (గోల్డ్ ప్లాన్)లో క్లెయిమ్‌లు లేని ప్రతీ సంవత్సరం తర్వాత బీమా మొత్తం 10 శాతం పెరుగుతుంది. అంటే రూ.5 లక్షల కవరేజీకి పాలసీ తీసుకుని క్లెయిమ్ చేసుకోకపోతే రెన్యువల్ అనంతరం 10 శాతం పెరిగి కవరేజీ రూ.5.50 లక్షలకు చేరుతుంది. ఇలా బేస్ సమ్ ఇన్సూర్డ్ (ఎస్ఐ)కు గరిష్టంగా నూరు శాతం వరకు కవరేజీని ఎన్సీబీ కింద అందుకోవచ్చు. రూ.5 లక్షలను బేసిక్ సమ్ ఇన్సూర్డ్‌గా ఎంచుకున్నారనుకుంటే.. వరుసగా పదేళ్లపాటు ఎటువంటి క్లెయిమ్ చేసుకోని సందర్భాల్లో కవరేజీ రూ.5 లక్షల మేర పెరిగి రూ.10లక్షలు అవుతుంది. అయితే, ఇలా ఎన్సీబీ రూపంలో బీమా కవరేజీ పెరగడం అన్నది అన్ని బీమా సంస్థల్లోనూ ఒకే మాదిరిగా ఉండదు. ఉదాహరణకు ఆదిత్య బిర్లా హెల్త్ ఇన్సూరెన్స్‌కు చెందిన ‘యాక్టివ్ అష్యూర్డ్ పాలసీ’లో ఎన్సీబీ కింద గరిష్టంగా 50 శాతం వరకే బీమా పెరుగుతుంది. అదే మణిపాల్ సిగ్నా ప్రో హెల్త్ పాలసీలో బేసిక్ ఎస్ఐకు గరిష్టంగా 200 శాతం వరకు అదనపు బీమా కవరేజీని నో క్లెయిమ్ బోనస్ కింద అందుకోవచ్చు. ఎటువంటి క్లెయిమ్ చేసుకోకుండా, సకాలంలో ప్రీమియం చెల్లించి రెన్యువల్ చేసుకున్న వారికి ఎన్సీబీ కింద సమ్ ఇన్సూర్డ్ పెంపును బీమా సంస్థలు హామీ పూర్వకంగా అందిస్తున్నాయి. క్లెయిమ్ చేసుకుంటే.. ఒకవేళ పాలసీ సంవత్సరంలో క్లెయిమ్ చేసుకుంటే బోనస్‌గా పెరిగిన సమ్ ఇన్సూర్డ్ నిర్ణీ త శాతం మేర తగ్గిపోతుందని గుర్తించాలి. క్లెయిమ్ చేసుకున్నా కానీ, అప్పటి వరకు బోనస్‌గా పొందిన బీమా కవరేజీని తగ్గించని పాలసీలు కూడా మార్కెట్లో ఉన్నాయి. ఉదాహరణకు ఆదిత్య బిర్లా హెల్త్ ఇన్సూరెన్స్ యాక్టివ్ అష్యూర్ పాలసీలో క్లెయిమ్ చేసుకుంటే.. తదుపరి పాలసీ సంవత్సరంలో ఎన్సీబీ 10% మేర తగ్గిపోతుంది. అంటే బేస్ సమ్ ఇన్సూర్డ్ రూ.10 లక్షలు తీసుకున్నారనుకుంటే.. అప్పటి వరకు ఎన్సీబీ రూపంలో ఏటా 10% చొప్పున రూ.3లక్షల కవరేజీ అదనంగా లభించి ఉంటే.. తర్వాతి సంవత్సరంలో క్లెయిమ్ చేసుకుంటే బేసిక్ కవరేజీ రూ.10లక్షలు అలాగే ఉంటుంది. ఎన్సీబీ మాత్రం రూ.లక్ష తగ్గి రూ.2లక్షలకు చేరుతుంది. ఎన్సీబీని బేసిక్ ఎస్ఐ ఆధారంగానే పెంచుతారు కనుక.. తగ్గించేటప్పుడూ అదే సూత్రం అమలవుతుంది. క్లెయిమ్‌లు చేసుకున్నా కానీ.. ఎన్సీబీని తగ్గించని పాలసీల్లో మణిపాల్ సిగ్నా ప్రోహెల్త్ ఇన్సూరెన్స్ ఒకటి. ప్రస్తుతం కోవిడ్–19 వల్ల ఆర్థిక ఇబ్బందులు, హెల్త్రిస్క్ను దృష్టిలో ఉంచుకుని కొన్ని బీమా సంస్థలు పాలసీదారులు క్లెయిమ్ చేసుకున్నా కానీ.. ఎన్సీబీని తగ్గించడం లేదు. ఇందుకు ఉదాహరణ హెచ్డీఎఫ్సీ ఎర్గో. ఈ ఏడాది జూలై 1 నుంచి సెప్టెంబర్ 30 మధ్య కోవిడ్–19 చికిత్స కోసం క్లెయిమ్ చేసుకున్నా కానీ పాలసీదారుల క్యుములేటివ్ బోనస్ కవరేజీని తగ్గించకూడదని హెచ్డీఎఫ్సీ ఎర్గో నిర్ణయం తీసుకుంది. ఇదే విధమైన నిర్ణయాన్ని ఐసీఐసీఐ లాంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్కూడా తీసుకుంది. అదనపు ఎన్సీబీ నో క్లెయిమ్ బోనస్ రూపంలో బీమా కవరేజీ పెంపు ప్రయోజనం ఉచితంగానే లభిస్తుంది. ఇందుకు ఎటువంటి ప్రీమియంను అదనంగా చెల్లించాల్సిన అవసరం ఉండదు. అయితే, అదనంగా ప్రీమియం చెల్లించడం ద్వారా క్యుములేటివ్ బోనస్ కవరేజీని మరింత పెంచుకునేందుకు కొన్ని బీమా సంస్థలు అవకాశం కల్పిస్తున్నాయి. నో క్లెయిమ్ బోనస్‌కు అదనంగా కొంత ప్రీమియం చెల్లించి ఎన్సీబీని ఏటా అదనంగా 5–10 శాతం మేర పెంచుకోవచ్చు. ఉదాహరణకు మణిపాల్ సిగ్నా ప్రోహెల్త్ ప్లాన్‌లో క్యుములేటివ్ బోనస్ బూస్టర్‌ను కొనుగోలు చేసుకోవచ్చు. సమ్ ఇన్సూర్డ్‌పై కచ్చితంగా 25 శాతం పెంపును, గరిష్టంగా 200 శాతం వరకు పెంపును ఆఫర్ చేస్తోంది. హెచ్డీఎఫ్సీ ఎర్గో సైతం అదనపు ప్రీమియంతో క్యుములేటివ్ బోనస్‌ను పెంచుకునేందుకు అనుమతిస్తోంది. పోర్టింగ్ పెట్టుకుంటే ఏంటి పరిస్థితి? మొబైల్ నంబర్ పోర్టబులిటీ మాదిరిగానే హెల్త్ ఇన్సూరెన్స్‌ను కూడా ఒక సంస్థ నుంచి మరో సంస్థకు మార్చుకోవచ్చు. బీమా నియంత్రణ, అభివృద్ధి సంస్థ మార్గదర్శకాల మేరకు.. ఒక సంస్థ నుంచి మరో సంస్థకు హెల్త్ ప్లాన్‌ను పోర్ట్ చేసుకుంటే.. గత సంస్థలో పోగు చేసుకున్న క్యుములేటివ్ బోనస్‌ను కొత్త సంస్థ కూడా ఎటువంటి అదనపు ప్రీమియం లేకుండానే అందించాల్సి ఉంటుంది. దీని గురించి బజాజ్ అలియాంజ్ జనరల్ ఇన్సూరెన్స్ సంస్థ హెల్త్ క్లెయిమ్స్ విభాగం హెడ్ భాస్కర్ నేరుర్కర్ వివరిస్తూ.. ‘‘పోర్టింగ్ సమయంలో బేస్ సమ్ ఇన్సూర్డ్‌తోపాటు క్యుములేటివ్ బోనస్ కూడా నూతన పాలసీకి బదిలీ అవుతుంది. ప్రీమియం మాత్రం బేసిక్ సమ్ ఇన్సూర్డ్కే వసూలు చేస్తారు. అయితే, ఆ తర్వాత నుంచి నూతన సంస్థ నియమ, నిబంధనల మేరకే క్యుములేటివ్ బోనస్ ప్రయోజనం లభిస్తుంది’’ అని తెలిపారు. అంటే ఒక వ్యక్తి ఏ అనే బీమా కంపెనీ నుంచి రూ.5 లక్షల సమ్ ఇన్సూర్డ్‌కు హెల్త్ ప్లాన్ తీసుకుని, రూ.లక్ష సమ్ ఇన్సూర్డ్‌ను ఎన్సీబీ కింద పొంది ఉన్నారనుకుంటే.. మరో సంస్థకు పోర్టింగ్ చేసుకునేట్టయితే నూతన సంస్థ సైతం మొత్తం రూ.6లక్షలకు కవరేజీని (రూ.5 లక్షలు బేసిక్, రూ.లక్ష బోనస్) ఆఫర్ చేస్తుందని అర్థం చేసుకోవాలి. దీనికి అదనంగా సమ్ ఇన్సూర్డ్‌ను పెంచుకోవాలంటే ప్రత్యేకంగా అండర్రిటన్ చేయాల్సి ఉంటుందని మణిపాల్ సిగ్నా హెల్త్ ఇన్సూరెన్స్ ఎండీ, సీఈవో ప్రసూన్ సిక్దర్ తెలిపారు. అంటే నూతన సంస్థలో బేస్ సమ్ ఇన్సూర్డ్‌ను పెంచుకోవాలంటే అదనపు ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. -
కారు బీమా తగ్గించుకుందామా!!
ఏటా ఏప్రిల్ వచ్చిందంటే చాలు. ఇంట్లో ఉండే కారు గానీ, మోటార్ సైకిల్ గానీ ఓ పెద్ద భారంలా కనిపిస్తుంది. ఎందుకంటే బీమా రెన్యువల్ చేయించాలి మరి. ఇక గోరుచుట్టుపై రోకలిపోటు మాదిరి ఈ మధ్యే బీమా నియంత్రణ సంస్థ (ఐఆర్డీ) థర్డ్ పార్టీ బీమా ప్రీమియంను కూడా బాగా పెంచేసింది. మీ కారు ఇంజిన్ సామర్థ్యాన్ని బట్టి ఇవి ఏకంగా 25 నుంచి 40 శాతం వరకూ పెరుగుతున్నాయి. మామూలుగా చూస్తే ఇంజిన్ సామర్థ్యం 1,500 సీసీ వరకూ ఉన్న వాహనాలకు ప్రీమియం 5 నుంచి 6 శాతం పెరుగుతోంది. ఇక 1,500 సీసీ సామర్థ్యం దాటితే పెరుగుదల 15 నుంచి 20 శాతం వరకూ ఉంది. ఇవి ఐఆర్డీఏ నిర్దేశించిన రేట్లు గనక మనమేమీ చేయలేం. కాకపోతే కొన్ని చిట్కాలు పాటించటం ద్వారా కొంతలో కొంత ప్రీమియంను ఈజీగా తగ్గించుకోవచ్చు. ఆ చిట్కాలు మీకోసం... -సాక్షి, పర్సనల్ ఫైనాన్స్ విభాగం * ఎన్సీబీ పెంచుకోవటానికీ మార్గాలు * సొంత చెల్లింపు కాస్త పెంచుకుంటే మేలు * కొన్ని సంఘాల్లో సభ్యత్వంతోనూ చక్కని రాయితీ స్వచ్ఛంద చెల్లింపు ఎక్కువ పెట్టండి... స్వచ్ఛంద చెల్లింపు అంటే... క్లెయిమ్ చేసేటపుడు మీరు సొంతగా చెల్లించే మొత్తం. మిగిలిన మొత్తాన్ని బీమా కంపెనీ చెల్లిస్తుంది. ఈ స్వచ్ఛంద మొత్తాన్ని పెంచుకోవటం ద్వారా మీ ప్రీమియం తగ్గుతుంది. అత్యధిక ఎన్సీబీ ఉన్నవాళ్లు ఎక్కువ స్వచ్ఛంద మొత్తాన్ని ఎంచుకోవటం ఉత్తమం. అయితే నిజానికి 50 శాతం వరకూ ఎన్సీబీ ఉన్న వ్యక్తి... తన వాహనం డ్యామేజ్ కోసం రూ.5,000కు క్లెయిమ్ చేస్తాడని ఊహించలేం కదా!!. అంతేకాదు. ఈ స్వచ్ఛంద మొత్తమనేది మీరు ఎంత చెల్లించగలరు? ఎంత రిస్క్‌ను భరించగలరు? కారు ఎలాంటిది? అనేదానిపై కూడా ఆధారపడి ఉంటుంది. ‘‘కొన్ని కార్లకు డ్యామేజీ జరిగితే దానికయ్యే ఖర్చును భరించటం వ్యక్తులకు చాలా కష్టం. అలాంటివాళ్లు స్వచ్ఛంద మొత్తాన్ని కాస్త ఎక్కువగానే ఉంచుకోవటం బెటర్. అలాగే తక్కువ ఖర్చుతోనే రిపేర్లు జరిగే పక్షంలో వారు తక్కువ స్వచ్ఛంద మొత్తాన్ని ఎంచుకోవటం మంచిది’’ అని బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్‌లో వాహన బీమా విభాగానికి చీఫ్ టెక్నికల్ ఆఫీసర్‌గా వ్యవహరిస్తున్న విజయ్ కుమార్ చెప్పారు. ఆన్లైన్లో ప్రీమియం రేట్లను పోల్చిచూడటం... ఇపుడు ప్రతీదీ ఆన్లైన్లోనే. అలాగే చాలా వెబ్సైట్లు బీమా ప్రీమియం ఏ కంపెనీ వద్ద ఎంత ఉందో పోల్చిచూసుకునే అవకాశం ఇస్తున్నాయి. ఒకే వాహనానికి, ఒకే విభాగమైనా.. కంపెనీని బట్టి రేట్లలో బాగా తేడాలుండొచ్చు. దీనిక్కారణం ఆయా కంపెనీలకు వచ్చిన క్లెయిమ్‌ల సంఖ్యే. అందుకే వీటిని ఆయా వెబ్సైట్లలో పోల్చిచూడాలి. దీంతో పాటు కొన్ని సందర్భాల్లో సదరు బీమా కంపెనీ లేదా పోర్టల్‌తో బేరసారాలు కూడా సాగించవచ్చు. వ్యాపారాన్ని పోగొట్టుకోరాదన్న ఉద్దేశంతో వారు కాస్త ఎక్కువ డిస్కౌంటే ఆఫర్ చేసే అవకాశముంటుంది. దీంతో పాటు కార్లకు యాంటీ-థె ఫ్ట్ డివైజ్‌ను పెట్టుకోవటం, ఆటోమొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా వంటి సంఘాల్లో సభ్యత్వం తీసుకోవటం వల్ల కూడా కొంత మేర డిస్కౌంట్ పొందే అవకాశం ఉంటుంది. నో క్లెయిమ్ బోనస్‌ను పెంచుకోవాలి... బీమా కట్టేది వాహనానికి ఏదైనా జరిగినపుడు క్లెయిమ్ చెయ్యడానికే. అందులో సందేహం లేదు. కాకపోతే క్లెయిమ్ చేసేముందు కాస్త విశ్లేషణ అవసరం. ప్రతి సంస్థా ఆ ఏడాది గనక క్లెయిమ్ చెయ్యకపోతే నోక్లెయిమ్ బోనస్ కింద మరుసటి ఏడాది ప్రీమియంలో కొంత మొత్తం తగ్గిస్తుంది. అదెంతో ముందు తెలుసుకోవాలి. ఒకవేళ మీరు క్లెయిమ్ చేస్తున్న మొత్తం గనక నో క్లెయిమ్ బోనస్కన్నా తక్కువ ఉంటే... క్లెయిమ్ మానేయటమే బెటర్. దీంతో పాటు మీ కారు గనక ఐదేళ్లకు మించి పాతబడిపోతే... ‘నోక్లెయిమ్ బోనస్ ప్రొటెక్టర్’ అనే యాడ్ ఆన్ కవర్‌ను తీసుకోవటం మంచిది. దీంతో మీరు క్లెయిమ్ చేసినా కూడా మీ నోక్లెయిమ్ బోనస్ మీకు తిరిగొస్తుంది. ఉదాహరణకు మీ పాలసీపై 40 శాతం వరకూ నోక్లెయిమ్ బోనస్ ఉంది. కానీ మీరు క్లెయిమ్ చేశారు. నిజానికి క్లెయిమ్ చేశారు గనక మీ ఎన్సీబీ మొత్తం పోవాలి. కానీ ప్రొటెక్టర్ ఉండటం వల్ల 40 కన్నా 10 శాతం తక్కువగా... అంటే 30 శాతం నోక్లెయిమ్ బోనస్ అలాగే ఉంటుంది. ఒకవేళ మీరు గనక క్లెయిమ్ చెయ్యకపోతే... ప్రొటెక్టర్ కారణంగా మీ ఎన్సీబీ మరో 10 శాతం పెరుగుతుంది. అంటే 50 శాతానికి చేరుతుంది. అంతేకాదు! మీ పాలసీ రెన్యువల్ సమయంలో మీ నోక్లెయిమ్ బోనస్ ఎంత ఉందో అంత వేశారా లేదా? అన్నది కూడా మీరే చూసుకోవాల్సి ఉంటుంది. అంతేకాదు! మీ వాహనాన్ని విక్రయిస్తున్నపుడు మీ బీమా కంపెనీ నుంచి ఎన్ సీబీ సర్టిఫికెట్‌ను కూడా తీసుకోవాల్సి ఉంటుంది. దీనిద్వారా మీకు అప్పటిదాకా ఎంత ఎన్సీబీ జతపడిందో తెలుస్తుంది. -
వాహన బీమాకు యాడ్-ఆన్ కవచం
అందరికీ వాహనం అవసరమే. కాకపోతే మనుషుల్ని బట్టి వారి అవసరాలు కూడా వేరుగా ఉంటాయి. పెద్ద కుటుంబమైతే విశాలమైన పెద్ద కారు కావాల్సి రావొచ్చు. అదే చిన్న కుటుంబం, సింగిల్‌గా ఉన్న ప్రొఫెషనల్స్ లాంటి వారికయితే ఇటు పార్కింగ్‌కు అటు మెయింటెనెన్స్‌కు సులువుగా ఉండే చిన్న కారు బెటరని అనిపించొచ్చు. ఇక గృహిణులైతే.. చిన్నా, చిత్రకా పనులు చుట్టబెట్టేందుకు తేలికపాటి స్కూటర్‌లాంటి దాన్ని ఇష్టపడొచ్చు. ఇలా ఒకరికి అనువైన వాహనం మరొకరికి అనువైనది కాకపోవచ్చు. అలాగే, వాహన బీమా కూడా!!. అల్లాటప్పాగా ఏదో ఒక పాలసీ తీసుకోవడం కాకుండా... వాహనం, దాని వాడకాన్ని బట్టి సరైన పాలసీ, తగిన యాడ్-ఆన్లు తీసుకుంటేనే బీమా ప్రయోజనాలు పూర్తిగా పొందవచ్చు. అందుకే వివిధ సందర్భాల్లో ఉపయోగపడే యాడ్-ఆన్ల గురించి తెలుసుకోవాలి. బంపర్ టు బంపర్ డ్రైవింగ్.. ప్రస్తుతం చాలా చోట్ల ట్రాఫిక్ భారీగా పెరిగిపోతోంది. దాదాపు ఒకదానికి మరొకటి తాకేంత దగ్గరగా బంపర్ టు బంపర్ డ్రైవింగ్ పరిస్థితులు ఉంటున్నాయి. ఇలాంటి ట్రాఫిక్ లో ప్రయాణించేటప్పుడు కారు ఫైబర్ , మెటల్ వగైరా పార్టులు ఇట్టే దెబ్బతినే అవకాశం ఉంది. అయితే, దెబ్బతిన్న ఫైబర్, ప్లాస్టిక్, మెటల్ వంటి భాగాల రిపేర్లకు అయ్యే ఖర్చులో వాహనం తరుగుదలను బట్టి దాదాపు 50 శాతం దాకా మాత్రమే సాధారణ పాలసీల్లో పరిహారం దక్కవచ్చు. ఇలాంటప్పుడు డిప్రిసియేషన్ కవరేజీ తీసుకుంటే ఉపయోగకరంగా ఉంటుంది. రీప్లేస్ చేసిన భాగాల విలువలో డిడక్ట్ చేసిన తరుగుదల మొత్తాన్ని క్లెయిమ్ చేసుకునేందుకు రెండు పర్యాయాలు అవకాశం లభిస్తుంది. దీనితో ప్లాస్టిక్, ఫైబర్ పార్టులకు మరింత సమగ్ర కవరేజీ ఉన్నట్లవుతుంది. కన్జూమబుల్ కవరేజి.. మీరు పూర్తి బీమా క్లెయిమ్ కోరుకునే వారయితే దీన్ని తీసుకోవచ్చు. వాహనంలో నట్లు, బోల్టులు, బ్రేక్ ఫ్లూయిడ్స్ మొదలైన వాటిని కన్జూమబుల్స్ భాగాలుగా వ్యవహరిస్తారు. చాలా మటుకు పాలసీల్లో ఇలాంటి వాటికి కవరేజీ ఉండదు. కాబట్టి ఇలాంటి కన్జూమబుల్ భాగాలకు కూడా బీమా రక్షణ ఉండేలా యాడ్-ఆన్ కవర్ తీసుకోవచ్చు. తాళం చెవులు పోతే.. మతిమరుపు వల్ల కావొచ్చు మరొకటి కావొచ్చు తరచూ తాళాలు పోగొట్టుకోవడం సమస్యయితే ఇందుకోసం కూడా ప్రత్యేకంగా కార్ కీ రీప్లేస్మెంట్ కవరేజీ లభిస్తుంది. కారు తాళం చెవి పోతే డూప్లికేట్ కీ తయారీకి, ఒకవేళ తాళం కూడా పాడైతే దాన్ని కూడా మార్చేందుకు అయ్యే ఖర్చును దీని కింద పొందవచ్చు. ఈ యాడ్-ఆన్ తీసుకుంటే రూ. 50,000 దాకా కవరేజీ ఉంటుంది. పాలసీ వ్యవధిలో ఒకో దఫాకి గరిష్టంగా రూ. 25,000 దాకా క్లెయిమ్‌కు అవకాశముంటుంది. భారీ వర్షాలు, వరదల నుంచి వాహనానికి రక్షణ.. చిన్నదైనా, పెద్దదైనా వర్షమొస్తే చాలు రోడ్లూ, ఇళ్లూ జలమయమైపోతున్న నేపథ్యంలో చాలా చోట్ల వాహనాల్లోకి నీళ్లు వెళ్లిపోయి అవి కదలకుండా మొరాయిస్తుంటాయి. పోనీ అని నిండా నీళ్ల నుంచి దాన్ని బైటికి లాగేందుకు స్టార్ట్ చేసి తీసుకెళ్లే ప్రయత్నంలో ఇంజిన్ దెబ్బతింటే బీమా కంపెనీలు దాన్ని స్వయంకృతం కిందే పరిగణిస్తాయి. దీనికి ఎలాంటి పరిహారం ఇవ్వవు. పోనీ సొంత డబ్బు పెట్టుకుని ఇంజిన్‌ను రిపేరు చేసుకోవాలనుకుంటే చాలా ఖరీదైన వ్యవహారం. ఇలాంటి సమస్య నుంచి గట్టెక్కేందుకు హైడ్రోస్టాటిక్ లాక్ యాడ్ ఆన్ కవరేజీ ఉపయోగపడుతుంది. నీరు చొరబడటం వల్ల ఇంజిన్ భాగాలు పాడైతే వాటిని రిపేర్ చేసేందుకు లేదా రీప్లేస్ చేసేందుకు అయ్యే ఖర్చును ఈ యాడ్ ఆన్ కవర్ ద్వారా పొందవచ్చు. ఒకవేళ మీరు నివసించే ప్రాంతంలో వర్షమొస్తే మునిగిపోయే పరిస్థితులుంటే ఇలాంటి యాడ్ ఆన్ ఎంచుకోవచ్చు. నో క్లెయిమ్ బోనస్‌కు రక్షణ .. మీరు జాగ్రత్తగా డ్రైవ్ చేసేవారై ఉండి ఇన్సూరెన్స్‌ను ఇప్పటిదాకా క్లెయిమ్ చేయని పక్షంలో మీకు నో క్లెయిమ్ బోనస్ (ఎన్సీబీ) భారీగానే లభించవచ్చు. అయితే, మీ టీనేజీ పిల్లలో లేదా సమీప బంధువులో మీ కారును తీసుకెళ్లి ఏ డ్యామేజీనో చేసి తీసుకొస్తే బీమా పరిహారం తీసుకోవాల్సి రావొచ్చు. ఫలితంగా ఎన్సీబీ ప్రయోజనాలను నష్టపోవాల్సి రావొచ్చు. ఇలాంటి సందర్భం ఎదురు కాకుండా ఎన్సీబీ ప్రొటెక్టర్ కవర్ తీసుకుంటే పాలసీ వ్యవధిలో రెండు పర్యాయాల దాకా నో క్లెయిమ్ బోనస్ పర్సంటేజీకి రక్షణ ఉంటుంది. దాదాపు 25 శాతం పైగా ఎన్సీబీ జమయిన వాహనదారులకు ఈ కవరేజీ ఉపయోగ కరంగా ఉంటుంది. ప్రయాణించే వారికి అదనపు భద్రత వాహనంలో ప్రయాణించే వారి వ్యక్తిగత భద్రతకు కూడా మోటార్ ఇన్సూరెన్స్ యాడ్-ఆన్ కవరేజీలు ఉన్నాయి. పర్సనల్ యాక్సిడెంట్ కవర్: వాహనంలో ప్రయాణిస్తున్న వారు ప్రమాదవశాత్తు పాక్షికంగా లేదా పూర్తిగా వికలాంగులైనా లేదా ప్రమాదంలో మరణించినా .. ఈ కవరేజీతో గరిష్టంగా ఒక్కొక్కరికి రూ. 2 లక్షల దాకా పరిహారం లభిస్తుంది. హాస్పిటల్ క్యాష్: ఈ యాడ్-ఆన్ ఉంటే.. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పక్షంలో రోజుకు రూ. 1,000 దాకా గరిష్టంగా 30 రోజుల వరకు నగదు పరిహారం లభిస్తుంది. అంబులెన్స్ చార్జెస్ కవర్: వాహనంలో ప్రయాణిస్తుండగా గానీ ఎక్కుతుండగా లేదా దిగుతుండగా గానీ ప్రమాదవశాత్తు పాలసీదారుకు తీవ్రగాయాలైతే ఆస్పత్రికి తరలించేటప్పుడు అంబులెన్స్కయ్యే ఖర్చులు ఈ యాడ్ ఉంటే పొందవచ్చు. ఇలా..వాహనదారులు తమ అవసరాలకు అనుగుణంగా ఉండే పాలసీలను, యాడ్ ఆన్ కవరేజీలు తీసుకుంటే నిశ్చింతగా.. దూసుకుపోవచ్చు. -
ఆరోగ్య బీమా అందరికీ అవసరం
ఆరోగ్య పరిరక్షణలో సరైన పోషకాహారం, తగిన వ్యాయామాలది కీలక పాత్ర. అయితే జీవన లక్ష్యాలను చేరుకునే వేగంలో ఎక్కువ మంది వీటిని పట్టించుకోవడం లేదు. ఒకవేళ ఒక కుటుంబంలో ఒక వ్యక్తి ఆయా అంశాల పట్ల జాగ్రత్తలు తీసుకున్నా... కుటుంబంలోని సభ్యులు మొత్తం ఇదే జాగ్రత్తలు తీసుకోని పరిస్థితీ ఉంటుంది. ఒక్కొక్కసారి ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా... ఆరోగ్యానికి సంబంధించి అనుకోని ఇబ్బందులూ తలెత్తుతుండే విషయం మనకు తెలిసిందే. ఇప్పుడు ప్రతి చిన్న వ్యాధికీ చేయాల్సిన వ్యయం- జేబుకు ఎంత పెద్ద చిల్లు పెడుతోందో వేరే చెప్పనక్కర్లేదు. ఇలాంటి పరిస్థితుల్లో అనుకోని ఆరోగ్య వ్యయ భారాల నుంచి రక్షించుకోడానికి కుటుంబంలోని ప్రతి ఒక్కరికీ ఆరోగ్య బీమా ఎంతో అవసరం. పలు రకాలు... ప్రాథమిక స్థాయి నుంచి అపరిమిత ప్రయోజనాలు అందించే స్థాయి వరకూ వివిధ ఆరోగ్య బీమా ప్రొడక్టులు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. ఆసుపత్రిలో చేరడానికి ముందు-తరువాత వ్యయాలు, పాలసీ తీసుకునే నాటికే ఉన్న వ్యాధికి సంబంధించి తదుపరి కవర్‌కు వేచి ఉండాల్సిన కాలపరిమతి, పాలసీ కాలంలో ఎటువంటి క్లెయిమ్‌లూ చేయకపోతే, తదుపరి లభించే బోనస్‌లు (నో క్లెయిమ్ బోనస్) ఇలా పలు ప్రయోజనాలు ‘బేసిక్ హెల్త్ కవర్’ పాలసీల్లోనే అందుబాటులో ఉన్నాయి. వీటితోపాటే కొంత అదనపు ప్రీమియం చెల్లింపుల ద్వారా ‘క్రిటికల్ ఇల్నెస్ ప్లాన్’ను రైడర్‌గా ఎంచుకోవడం వల్ల అదనపు ప్రయోజనాలు లభిస్తాయి. రైడర్‌గా కాకుండా ‘క్రిటికల్ ఇల్నెస్ ప్లాన్’ను ప్రత్యేకంగా కూడా తీసుకోవచ్చు. కేన్సర్, గుండెపోటు, కిడ్నీ వైఫల్యం, ఇతర ప్రధాన అవయవాలు పనిచేయకపోవడం వంటి తీవ్ర వ్యాధుల చికిత్సలకు వ్యయ భారం నుంచి సామాన్యుడికి ఆర్థిక రక్షణ, భరోసాను కల్పించేదే ఈ క్రిటికల్ ఇల్నెస్ ప్రణాళిక. నిర్దిష్ట వ్యాధి అవసరానికి తగిన ఆరోగ్య పాలసీలు (కస్టమైజ్డ్) అందుబాటులో ఉండవన్న విషయం ఇక్కడ గమనించాలి. నిర్దిష్ట జాబితాలో ఉన్న వ్యాధులకు ‘పాలసీ కవర్’నే మనం ఎంపికచేసుకోవాల్సి ఉంటుంది. పూర్తి వ్యయాలను బీమా సంస్థలే భరించే పాలసీలు కొన్ని ఉంటే, వ్యయం మొత్తంలో కొంత మొత్తం పాలసీదారు, మరికొంత బీమా సంస్థ భరించే ప్రొడక్టులూ ఉంటాయి. కొన్ని పాలసీల ప్రీమియం అంశాల్లో పన్ను ప్రయోజనాలతో పాటు, వయస్సును బట్టి ప్రీమియం సౌలభ్యతలు సైతం లభిస్తాయి. ఎంపిక కీలకం తగిన ఆరోగ్య బీమా ప్రొడక్ట్‌ను ఎంపిక చేసుకోవడం ముఖ్యమైన అంశం. కవరేజ్ ఎంత? తీసుకున్న కవరేజ్‌లో హాస్పిటల్ వ్యయాలకు లభించేది ఎంత? ఫీజులు, మందులకు లభించే ప్రయోజనం,ఆపరేషన్ కవరేజ్,నో క్లెయిమ్ బోనస్ అం శాలను ముందు పరిశీలించాలి. తక్కువ ప్రీమియం, అధిక బీమా కవరేజ్ ఉన్న పాలసీ ఎంచుకోవాలి. -
నో క్లెయిమ్ బోనస్ సంగతులు
బీమా కంపెనీలు మెడికల్, వాహనాల పాలసీలపై నో క్లెయిమ్ బోనస్‌లు (ఎన్సీబీ) ఇస్తుంటాయి. అంటే.. ఏదైనా సంవత్సరం క్లెయిమ్‌లు చేయకపోయిన పక్షంలో.. అందుకు ప్రతిగా బీమా కంపెనీ ఇచ్చే గిఫ్ట్ లాంటిదన్నమాట. ఇది ప్రీమియం తగ్గింపు రూపంలో ఉండొచ్చు లేదా సమ్ అష్యూర్డ్‌ను పెంచడం రూపంలోనైనా ఉండొచ్చు. వాహనాల పాలసీల విషయానికొస్తే.. .. ఎన్సీబీ గానీ ఉన్న పక్షంలో పాలసీని రెన్యువల్ చేసుకునేటప్పుడు ఓన్ డ్యామేజ్ అంశానికి సంబంధించి చెల్లించాల్సిన ప్రీమియంలో కొంత డిస్కౌంటు లభించేందుకు ఉపయోగపడుతుంది. అంటే సాధారణంగా కట్టాల్సిన దాని కన్నా ప్రీమియం ఇంకాస్త తగ్గుతుంది. ఈ ఎన్సీబీను అలా జమ చేసుకుంటూ కూడా పోవచ్చు. తద్వారా ప్రీమియంలో గరిష్టంగా యాభై శాతం దాకా డిస్కౌంటు పొందడానికి అవకాశముంది. అయితే, ఎన్సీబీ ఎంత పోగుపడినా.. ఒక్కసారి క్లెయిమ్ చేశారంటే.. అప్పటిదాకా వచ్చిన బోనస్ అంతా పోయినట్లే. ఎన్సీబీని బదలాయించుకునే అవకాశమూ ఉంది. వాహనదారు పాత వాహనం స్థానంలో కొత్తది తీసుకుంటే.. తన ఖాతాలో ఉన్న బోనస్‌ను కొత్త వాహనం ఓనర్ కింద బదలాయించుకోవచ్చు.