కారు బీమా తగ్గించుకుందామా!! | How to Cut Your Car Insurance Premiums | Sakshi
Sakshi News home page

కారు బీమా తగ్గించుకుందామా!!

Published Mon, Apr 11 2016 1:05 AM | Last Updated on Sun, Sep 3 2017 9:38 PM

కారు బీమా తగ్గించుకుందామా!!

కారు బీమా తగ్గించుకుందామా!!

ఏటా ఏప్రిల్ వచ్చిందంటే చాలు. ఇంట్లో ఉండే కారు గానీ, మోటార్ సైకిల్ గానీ ఓ పెద్ద భారంలా కనిపిస్తుంది. ఎందుకంటే బీమా రెన్యువల్ చేయించాలి మరి. ఇక గోరుచుట్టుపై రోకలిపోటు మాదిరి ఈ మధ్యే బీమా నియంత్రణ సంస్థ (ఐఆర్‌డీ) థర్డ్ పార్టీ బీమా ప్రీమియంను కూడా బాగా పెంచేసింది. మీ కారు ఇంజిన్ సామర్థ్యాన్ని బట్టి ఇవి ఏకంగా 25 నుంచి 40 శాతం వరకూ పెరుగుతున్నాయి.
 
మామూలుగా చూస్తే ఇంజిన్ సామర్థ్యం 1,500 సీసీ వరకూ ఉన్న వాహనాలకు ప్రీమియం 5 నుంచి 6 శాతం పెరుగుతోంది. ఇక 1,500 సీసీ సామర్థ్యం దాటితే పెరుగుదల 15 నుంచి 20 శాతం వరకూ ఉంది. ఇవి ఐఆర్‌డీఏ నిర్దేశించిన రేట్లు గనక మనమేమీ చేయలేం. కాకపోతే కొన్ని చిట్కాలు పాటించటం ద్వారా కొంతలో కొంత ప్రీమియంను ఈజీగా తగ్గించుకోవచ్చు. ఆ చిట్కాలు మీకోసం...     
-సాక్షి, పర్సనల్ ఫైనాన్స్ విభాగం

 
* ఎన్‌సీబీ పెంచుకోవటానికీ మార్గాలు   
* సొంత చెల్లింపు కాస్త పెంచుకుంటే మేలు
* కొన్ని సంఘాల్లో సభ్యత్వంతోనూ చక్కని రాయితీ

 
స్వచ్ఛంద చెల్లింపు ఎక్కువ పెట్టండి...

స్వచ్ఛంద చెల్లింపు అంటే...  క్లెయిమ్ చేసేటపుడు మీరు సొంతగా చెల్లించే మొత్తం. మిగిలిన మొత్తాన్ని బీమా కంపెనీ చెల్లిస్తుంది. ఈ స్వచ్ఛంద మొత్తాన్ని పెంచుకోవటం ద్వారా మీ ప్రీమియం తగ్గుతుంది. అత్యధిక ఎన్‌సీబీ ఉన్నవాళ్లు ఎక్కువ స్వచ్ఛంద మొత్తాన్ని ఎంచుకోవటం ఉత్తమం. అయితే నిజానికి 50 శాతం వరకూ ఎన్‌సీబీ ఉన్న వ్యక్తి... తన వాహనం డ్యామేజ్ కోసం రూ.5,000కు క్లెయిమ్ చేస్తాడని ఊహించలేం కదా!!.
 
అంతేకాదు. ఈ స్వచ్ఛంద మొత్తమనేది మీరు ఎంత చెల్లించగలరు? ఎంత రిస్క్‌ను భరించగలరు? కారు ఎలాంటిది? అనేదానిపై కూడా ఆధారపడి ఉంటుంది. ‘‘కొన్ని కార్లకు డ్యామేజీ జరిగితే దానికయ్యే ఖర్చును భరించటం వ్యక్తులకు చాలా కష్టం. అలాంటివాళ్లు స్వచ్ఛంద మొత్తాన్ని కాస్త ఎక్కువగానే ఉంచుకోవటం బెటర్. అలాగే తక్కువ ఖర్చుతోనే రిపేర్లు జరిగే పక్షంలో వారు తక్కువ స్వచ్ఛంద మొత్తాన్ని ఎంచుకోవటం మంచిది’’ అని బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్‌లో వాహన బీమా విభాగానికి చీఫ్ టెక్నికల్ ఆఫీసర్‌గా వ్యవహరిస్తున్న విజయ్ కుమార్ చెప్పారు.
 
ఆన్‌లైన్లో ప్రీమియం రేట్లను పోల్చిచూడటం...
ఇపుడు ప్రతీదీ ఆన్‌లైన్లోనే. అలాగే చాలా వెబ్‌సైట్లు బీమా ప్రీమియం ఏ కంపెనీ వద్ద ఎంత ఉందో పోల్చిచూసుకునే అవకాశం ఇస్తున్నాయి. ఒకే వాహనానికి, ఒకే విభాగమైనా.. కంపెనీని బట్టి రేట్లలో బాగా తేడాలుండొచ్చు. దీనిక్కారణం ఆయా కంపెనీలకు వచ్చిన క్లెయిమ్‌ల సంఖ్యే. అందుకే వీటిని ఆయా వెబ్‌సైట్లలో పోల్చిచూడాలి. దీంతో పాటు కొన్ని సందర్భాల్లో సదరు బీమా కంపెనీ లేదా పోర్టల్‌తో బేరసారాలు కూడా సాగించవచ్చు.

వ్యాపారాన్ని పోగొట్టుకోరాదన్న ఉద్దేశంతో వారు కాస్త ఎక్కువ డిస్కౌంటే ఆఫర్ చేసే అవకాశముంటుంది. దీంతో పాటు కార్లకు యాంటీ-థె ఫ్ట్ డివైజ్‌ను పెట్టుకోవటం, ఆటోమొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా వంటి సంఘాల్లో సభ్యత్వం తీసుకోవటం వల్ల కూడా కొంత మేర డిస్కౌంట్ పొందే అవకాశం ఉంటుంది.
 
నో క్లెయిమ్ బోనస్‌ను పెంచుకోవాలి...
బీమా కట్టేది వాహనానికి ఏదైనా జరిగినపుడు క్లెయిమ్ చెయ్యడానికే. అందులో సందేహం లేదు. కాకపోతే క్లెయిమ్ చేసేముందు కాస్త విశ్లేషణ అవసరం. ప్రతి సంస్థా ఆ ఏడాది గనక క్లెయిమ్ చెయ్యకపోతే నోక్లెయిమ్ బోనస్ కింద మరుసటి ఏడాది ప్రీమియంలో కొంత మొత్తం తగ్గిస్తుంది. అదెంతో ముందు తెలుసుకోవాలి. ఒకవేళ మీరు క్లెయిమ్ చేస్తున్న మొత్తం గనక నో క్లెయిమ్ బోనస్‌కన్నా తక్కువ ఉంటే... క్లెయిమ్ మానేయటమే బెటర్. దీంతో పాటు మీ కారు గనక ఐదేళ్లకు మించి పాతబడిపోతే... ‘నోక్లెయిమ్ బోనస్ ప్రొటెక్టర్’ అనే యాడ్ ఆన్ కవర్‌ను తీసుకోవటం మంచిది.

దీంతో మీరు క్లెయిమ్ చేసినా కూడా మీ నోక్లెయిమ్ బోనస్ మీకు తిరిగొస్తుంది. ఉదాహరణకు మీ పాలసీపై 40 శాతం వరకూ నోక్లెయిమ్ బోనస్ ఉంది. కానీ మీరు క్లెయిమ్ చేశారు. నిజానికి క్లెయిమ్ చేశారు గనక మీ ఎన్‌సీబీ మొత్తం పోవాలి. కానీ ప్రొటెక్టర్ ఉండటం వల్ల 40 కన్నా 10 శాతం తక్కువగా... అంటే 30 శాతం నోక్లెయిమ్ బోనస్ అలాగే ఉంటుంది. ఒకవేళ మీరు గనక క్లెయిమ్ చెయ్యకపోతే... ప్రొటెక్టర్ కారణంగా మీ ఎన్‌సీబీ మరో 10 శాతం పెరుగుతుంది.

అంటే 50 శాతానికి చేరుతుంది. అంతేకాదు! మీ పాలసీ రెన్యువల్ సమయంలో మీ నోక్లెయిమ్ బోనస్ ఎంత ఉందో అంత వేశారా లేదా? అన్నది కూడా మీరే చూసుకోవాల్సి ఉంటుంది. అంతేకాదు! మీ వాహనాన్ని విక్రయిస్తున్నపుడు మీ బీమా కంపెనీ నుంచి ఎన్ సీబీ సర్టిఫికెట్‌ను కూడా తీసుకోవాల్సి ఉంటుంది. దీనిద్వారా మీకు అప్పటిదాకా ఎంత ఎన్‌సీబీ జతపడిందో తెలుస్తుంది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement