car insurance
-
బీమా ప్రీమియం తగ్గించుకోవాలా.. ఈ టిప్స్ ఫాలో అవ్వండి!
ఆధునిక కాలంలో ప్రతి ఒక్కరూ కారు కలిగి ఉండాలని అనుకుంటారు. కార్లను కొంత మంది నిత్యావసరాల కోసం వినియోగిస్తే, మరి కొందరు లగ్జరీ కోసం ఉపయోగించుకుంటారు. ఎవరు ఎలా ఉపయోగించుకున్నా.. ఆ కారుకి బీమా (ఇన్సూరెన్స్) చేయించుకోవడం తప్పనిసరి. అయితే కొంతమంది కారుకి బీమా చేయించుకోవడం ఖర్చుతో కూడుకున్న పని అని మిన్నకుండిపోతారు. కానీ ఖరీదైన బీమాలు మాత్రమే కాకుండా ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండే కొన్ని ప్రీమియం పాలసీలు కూడా అందుబాటులో ఉన్నాయి. అలాంటి వాటిని గురించి మనం ఈ కథనంలో తెలుసుకుందాం. మీ పాత కార్ల కోసం థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఎంచుకోండి: మీరు పాత కారు కోసం థర్డ్ పార్టీ లేదా సమగ్ర బీమా తీసుకోవచ్చు. థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్‌లో మీ కారుకు ఎలాంటి కవరేజీ అందించినప్పటికీ.. సమగ్ర బీమాలో కంపెనీ థర్డ్ పార్టీతో పాటు సొంత డ్యామేజ్ కవరేజీని అందిస్తుంది. ఈ కారణంగా, థర్డ్ పార్టీ బీమా ప్రీమియం కంటే సమగ్ర బీమా ప్రీమియం ఎక్కువగా ఉంటుంది. మీరు సమగ్ర బీమాకు బదులుగా థర్డ్ పార్టీ బీమాను ఎంచుకుంటే ఎక్కువ డబ్బుని ఆదా చేసుకోవచ్చు. కారులో యాంటీ థెఫ్ట్ డివైజెస్ ఇన్స్టాల్ చేయండి: కారులో యాంటీ థెఫ్ట్ డివైజెస్ ఇన్స్టాల్ చేసుకోవడం ప్రస్తుత కాలంలో చాలా అవసరమని. ఎందుకంటే దానిపై కూడా కారు బీమా ఆధారపడి ఉంటుంది. అప్డేటెడ్ యాంటీ థెఫ్ట్ డివైజెస్ ఉండటం వల్ల దొంగతనాలు జరిగే అవకాశాలు చాలా తక్కువగా ఉంటుంది. కావున కారు సేఫ్టీ ఫీచర్స్ పరిగణనలోకి తీసుకుంటే, బీమా కంపెనీ మీ నుంచి తక్కువ ప్రీమియం వసూలు చేస్తుంది. అనవసరమైన కార్ మోడిఫికేషన్స్ నివారించండి: ఆధునిక కాలంలో వాహన ప్రేమికులు తమ వాహనాలను తమకు నచ్చిన విధంగా మోడిఫై చేసుకోవాలనుకుంటారు. అయితే మోడిఫైడ్ కార్ల విలువ సాధారణ కార్ల కంటే ఎక్కువగా ఉంటుంది. కావున కారు విలువ పెరిగే కొద్దీ భీమా ప్రీమియం కూడా పెరుగుతుంది. దీనిని దృష్టిలో ఉంచుకుని వినియోగదారుడు అవసరమైతే తప్పా కారు మోడిఫికేషన్ చేయకూడదు. కార్ ఇన్సూరెన్స్ ప్రీమియం కంపార్ చేసుకోండి: ఒక కారుకి బీమా పాలసీ తీసుకునే ముందు మార్కెట్లో ఉన్న భీమా పాలసీలు ఏవి, వాటి వల్ల వచ్చే ప్రయోజనాలు ఏమిటి అని ఒకసారి కంపార్ చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మార్కెట్లో భీమా పాలసీలను విక్రయిస్తున్న కంపెనీలు లెక్కకు మించి ఉన్నాయి. ఇందులో కూడా మీరు ఆఫ్‌లైన్ లేదా ఆన్లైన్ భీమా పాలసీలను ఎంచుకోవచ్చు. మీరు భీమాలను సరిపోల్చుకుంటే తక్కువ ప్రీమియంతో మెరుగైన భీమా పొందే అవకాశం ఉంటుంది. స్వచ్ఛంద మినహాయింపు చెల్లించండి (Voluntary Deductibles): కారు కోసం బీమా పాలసీ తీసుకునేటప్పుడు స్వచ్ఛందంగా మినహాయించదగిన మొత్తాన్ని చెల్లిస్తే తక్కువ ప్రీమియం చెల్లించే అవకాశాన్ని కంపెనీ మీకు అందించే అవకాశం ఉంటుంది. మీరు మీ సామర్థ్యాన్ని బట్టి స్వచ్ఛందంగా మినహాయించదగిన మొత్తాన్ని చెల్లించవచ్చు. అవసరం లేని యాడ్-ఆన్‌లను అవైడ్ చేయండి: మీ కారు కోసం బీమా పాలసీ తీసుకునేటప్పుడు.. మీ పాలసీకి యాడ్ ఆన్ కవర్లను యాడ్ చేసుకునే సదుపాయం ఉంటుంది. ఆ సమయంలో మీరు ఎంచుకునే యాడ్ ఆన్ కవర్లను బట్టి ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. ఇందులో జీరో డిప్రిసియేషన్ కవర్, టైర్ ప్రొటెక్ట్ కవర్, ఇంజిన్ ప్రొటెక్ట్ కవర్, గ్యారేజ్ క్యాష్ వంటివి ఉన్నాయి. నిజానికి మీరు ఎన్ని యాడ్-ఆన్ కవర్లను జోడిస్తే, మీ ప్రీమియం అంత ఖరీదైనదిగా మారుతుంది, కావున మీకు తప్పనిసరి అనుకున్నవి కాకుండా మిగిలినవి తొలగించుకోవచ్చు. మైనర్ క్లెయిమ్స్ అవైడ్ చేయండి: కారుకోసం ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు చిన్న నష్టాల కోసం క్లెయిమ్ చేయడం మానుకోవాలి. ఎందుకంటే చిన్న చిన్న రిపేరీలకు ఎక్కువ డబ్బు ఖర్చు అయ్యే అవకాశం ఉండదు. కావున ఆలాంటి వాటిని మీరే పరిష్కరించుకోవచ్చు. మీరు చిన్న చిన్న నష్టాలకు క్లెయిమ్ చేస్తే మీ నో క్లెయిమ్ బోనస్ కోల్పోవచ్చు, అది మాత్రమే కాకుండా తర్వాత ప్రీమియంపై తగ్గింపును కోల్పోయే అవకాశం కూడా ఉంటుంది. (ఇదీ చదవండి: ఉత్పత్తిలో కనివిని ఎరుగని రికార్డ్ - 70 లక్షల యూనిట్‌గా ఆ బైక్) మీరు డ్రైవ్ చేసినంత ప్రీమియం చెల్లించండి (Pay As You Drive Car Insurance): సాధారణంగా కార్లు ఉపయోగించే అందరూ ప్రతి రోజూ ఉపయోగించే అవకాశం ఉండదు. కాబట్టి మీరు కారుని ఎక్కువగా ఉపయోగించని సమయంలో ఎక్కువ ప్రీమియం చెల్లించడం మంచిది కాదు. ఎక్కువ ప్రీమియం పొందాలంటే ఎక్కువ ఉపయోగించాలి. ఈ పాలసీ ప్రకారం మీరు మీ కారుని ఎన్ని కిలోమీటర్లు డ్రైవ్ చేస్తారో దానికి తగిన ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. (ఇదీ చదవండి: కంప్యూటర్ వద్దనుకున్నారు.. వంకాయ సాగు మొదలెట్టాడు - ఇప్పుడు సంపాదన చూస్తే..) పాలసీ ల్యాప్స్ అవైడ్ చేయండి: కారు వినియోగదారుడు ఏదైనా ఒక వెహికల్ ఇన్సూరెన్స్ తీసుకున్నప్పుడు, దానిని చెల్లించడానికి ఒక నిర్దిష్ట గడువు ఉంటుంది. కావున ఆ గడువు లోపల మీరు తప్పకుండా పాలసీ చెల్లించాల్సి ఉంటుంది. మీ గడువు ముగిసేవరకు వేచి ఉండటం మంచిది కాదు, ఇది తప్పకుండా గుర్తుంచుకోవాలి. -
కారు బీమా తగ్గించుకుందామా!!
ఏటా ఏప్రిల్ వచ్చిందంటే చాలు. ఇంట్లో ఉండే కారు గానీ, మోటార్ సైకిల్ గానీ ఓ పెద్ద భారంలా కనిపిస్తుంది. ఎందుకంటే బీమా రెన్యువల్ చేయించాలి మరి. ఇక గోరుచుట్టుపై రోకలిపోటు మాదిరి ఈ మధ్యే బీమా నియంత్రణ సంస్థ (ఐఆర్డీ) థర్డ్ పార్టీ బీమా ప్రీమియంను కూడా బాగా పెంచేసింది. మీ కారు ఇంజిన్ సామర్థ్యాన్ని బట్టి ఇవి ఏకంగా 25 నుంచి 40 శాతం వరకూ పెరుగుతున్నాయి. మామూలుగా చూస్తే ఇంజిన్ సామర్థ్యం 1,500 సీసీ వరకూ ఉన్న వాహనాలకు ప్రీమియం 5 నుంచి 6 శాతం పెరుగుతోంది. ఇక 1,500 సీసీ సామర్థ్యం దాటితే పెరుగుదల 15 నుంచి 20 శాతం వరకూ ఉంది. ఇవి ఐఆర్డీఏ నిర్దేశించిన రేట్లు గనక మనమేమీ చేయలేం. కాకపోతే కొన్ని చిట్కాలు పాటించటం ద్వారా కొంతలో కొంత ప్రీమియంను ఈజీగా తగ్గించుకోవచ్చు. ఆ చిట్కాలు మీకోసం... -సాక్షి, పర్సనల్ ఫైనాన్స్ విభాగం * ఎన్సీబీ పెంచుకోవటానికీ మార్గాలు * సొంత చెల్లింపు కాస్త పెంచుకుంటే మేలు * కొన్ని సంఘాల్లో సభ్యత్వంతోనూ చక్కని రాయితీ స్వచ్ఛంద చెల్లింపు ఎక్కువ పెట్టండి... స్వచ్ఛంద చెల్లింపు అంటే... క్లెయిమ్ చేసేటపుడు మీరు సొంతగా చెల్లించే మొత్తం. మిగిలిన మొత్తాన్ని బీమా కంపెనీ చెల్లిస్తుంది. ఈ స్వచ్ఛంద మొత్తాన్ని పెంచుకోవటం ద్వారా మీ ప్రీమియం తగ్గుతుంది. అత్యధిక ఎన్సీబీ ఉన్నవాళ్లు ఎక్కువ స్వచ్ఛంద మొత్తాన్ని ఎంచుకోవటం ఉత్తమం. అయితే నిజానికి 50 శాతం వరకూ ఎన్సీబీ ఉన్న వ్యక్తి... తన వాహనం డ్యామేజ్ కోసం రూ.5,000కు క్లెయిమ్ చేస్తాడని ఊహించలేం కదా!!. అంతేకాదు. ఈ స్వచ్ఛంద మొత్తమనేది మీరు ఎంత చెల్లించగలరు? ఎంత రిస్క్‌ను భరించగలరు? కారు ఎలాంటిది? అనేదానిపై కూడా ఆధారపడి ఉంటుంది. ‘‘కొన్ని కార్లకు డ్యామేజీ జరిగితే దానికయ్యే ఖర్చును భరించటం వ్యక్తులకు చాలా కష్టం. అలాంటివాళ్లు స్వచ్ఛంద మొత్తాన్ని కాస్త ఎక్కువగానే ఉంచుకోవటం బెటర్. అలాగే తక్కువ ఖర్చుతోనే రిపేర్లు జరిగే పక్షంలో వారు తక్కువ స్వచ్ఛంద మొత్తాన్ని ఎంచుకోవటం మంచిది’’ అని బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్‌లో వాహన బీమా విభాగానికి చీఫ్ టెక్నికల్ ఆఫీసర్‌గా వ్యవహరిస్తున్న విజయ్ కుమార్ చెప్పారు. ఆన్లైన్లో ప్రీమియం రేట్లను పోల్చిచూడటం... ఇపుడు ప్రతీదీ ఆన్లైన్లోనే. అలాగే చాలా వెబ్సైట్లు బీమా ప్రీమియం ఏ కంపెనీ వద్ద ఎంత ఉందో పోల్చిచూసుకునే అవకాశం ఇస్తున్నాయి. ఒకే వాహనానికి, ఒకే విభాగమైనా.. కంపెనీని బట్టి రేట్లలో బాగా తేడాలుండొచ్చు. దీనిక్కారణం ఆయా కంపెనీలకు వచ్చిన క్లెయిమ్‌ల సంఖ్యే. అందుకే వీటిని ఆయా వెబ్సైట్లలో పోల్చిచూడాలి. దీంతో పాటు కొన్ని సందర్భాల్లో సదరు బీమా కంపెనీ లేదా పోర్టల్‌తో బేరసారాలు కూడా సాగించవచ్చు. వ్యాపారాన్ని పోగొట్టుకోరాదన్న ఉద్దేశంతో వారు కాస్త ఎక్కువ డిస్కౌంటే ఆఫర్ చేసే అవకాశముంటుంది. దీంతో పాటు కార్లకు యాంటీ-థె ఫ్ట్ డివైజ్‌ను పెట్టుకోవటం, ఆటోమొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా వంటి సంఘాల్లో సభ్యత్వం తీసుకోవటం వల్ల కూడా కొంత మేర డిస్కౌంట్ పొందే అవకాశం ఉంటుంది. నో క్లెయిమ్ బోనస్‌ను పెంచుకోవాలి... బీమా కట్టేది వాహనానికి ఏదైనా జరిగినపుడు క్లెయిమ్ చెయ్యడానికే. అందులో సందేహం లేదు. కాకపోతే క్లెయిమ్ చేసేముందు కాస్త విశ్లేషణ అవసరం. ప్రతి సంస్థా ఆ ఏడాది గనక క్లెయిమ్ చెయ్యకపోతే నోక్లెయిమ్ బోనస్ కింద మరుసటి ఏడాది ప్రీమియంలో కొంత మొత్తం తగ్గిస్తుంది. అదెంతో ముందు తెలుసుకోవాలి. ఒకవేళ మీరు క్లెయిమ్ చేస్తున్న మొత్తం గనక నో క్లెయిమ్ బోనస్కన్నా తక్కువ ఉంటే... క్లెయిమ్ మానేయటమే బెటర్. దీంతో పాటు మీ కారు గనక ఐదేళ్లకు మించి పాతబడిపోతే... ‘నోక్లెయిమ్ బోనస్ ప్రొటెక్టర్’ అనే యాడ్ ఆన్ కవర్‌ను తీసుకోవటం మంచిది. దీంతో మీరు క్లెయిమ్ చేసినా కూడా మీ నోక్లెయిమ్ బోనస్ మీకు తిరిగొస్తుంది. ఉదాహరణకు మీ పాలసీపై 40 శాతం వరకూ నోక్లెయిమ్ బోనస్ ఉంది. కానీ మీరు క్లెయిమ్ చేశారు. నిజానికి క్లెయిమ్ చేశారు గనక మీ ఎన్సీబీ మొత్తం పోవాలి. కానీ ప్రొటెక్టర్ ఉండటం వల్ల 40 కన్నా 10 శాతం తక్కువగా... అంటే 30 శాతం నోక్లెయిమ్ బోనస్ అలాగే ఉంటుంది. ఒకవేళ మీరు గనక క్లెయిమ్ చెయ్యకపోతే... ప్రొటెక్టర్ కారణంగా మీ ఎన్సీబీ మరో 10 శాతం పెరుగుతుంది. అంటే 50 శాతానికి చేరుతుంది. అంతేకాదు! మీ పాలసీ రెన్యువల్ సమయంలో మీ నోక్లెయిమ్ బోనస్ ఎంత ఉందో అంత వేశారా లేదా? అన్నది కూడా మీరే చూసుకోవాల్సి ఉంటుంది. అంతేకాదు! మీ వాహనాన్ని విక్రయిస్తున్నపుడు మీ బీమా కంపెనీ నుంచి ఎన్ సీబీ సర్టిఫికెట్‌ను కూడా తీసుకోవాల్సి ఉంటుంది. దీనిద్వారా మీకు అప్పటిదాకా ఎంత ఎన్సీబీ జతపడిందో తెలుస్తుంది. -
మీ కారు బీమా మారుస్తారా..?
కారు కొనుక్కునేటప్పుడు అనేక విషయాలు ఆలోచిస్తాం. బోలెడంత రీసెర్చ్ చేస్తాం. మన లైఫ్‌స్టయిల్‌కి, బడ్జెట్‌కి తగినట్లుగా ఉంటుందా లేదా అనేది చూసుకుని కొంటాం. ఇలా లక్షలు పోసి కొనుక్కున్న కారు నుంచి పూర్తి స్థాయిలో ప్రయోజనాలు పొందాలంటే .. దాని మెయింటెనెన్స్ కూడా ముఖ్యమే. అలాగే, ఎలాంటి దుర్ఘటనా జరగకుండా.. కారు రోడ్డెక్కడానికి ముందే బీమా రక్షణ ఉండటమూ అవసరమే. మరి బీమా పాలసీ తీసుకునే ముందు పాటించాల్సిన జాగ్రత్తలేంటి? ఒకసారి చూద్దాం... చాలామటుకు పాలసీలు ఒకే విధంగా కనిపిస్తాయి. ఒకోసారి ఏది తీసుకోవాలో అర్థం కాని పరిస్థితి తలెత్తుతుంటుంది. ఇలాంటప్పుడు అయిదు అంశాలను కొలమానంగా పెట్టుకుంటే పాలసీ ఎంపిక కొంత సులువవుతుంది. అవేంటంటే.. బ్రాండు, పాలసీ కవరేజీ, కస్టమర్ సర్వీసు, సేవల లభ్యత, ప్రీమియం. బ్రాండు.. కంపెనీ (బ్రాండు) ఎంత పెద్దదైనా కావొచ్చు. క్లెయిముల చెల్లింపులు తదితర అంశాల్లో దాని రికార్డు ఎలా ఉందో చూడాలి. ఎన్ని క్లెయిములు సెటిల్ చేసింది? క్లెయిమ్ సెటిల్మెంట్కు ఎంత సమయం తీసుకుంటోంది? ఇవన్నీ ఆయా బీమా కంపెనీల వెబ్సైట్లలో సాధారణంగా పొందుపర్చి ఉంటాయి. ఈ విషయాల్లో మెరుగైన ట్రాక్ రికార్డున్న సంస్థల పాలసీలు తీసుకుంటే మంచిది. ఒకవేళ ఇప్పటికే వేరే కంపెనీల నుంచి తీసుకున్నా.. మరొక కంపెనీకి బదలాయించుకునేందుకు మోటార్ ఇన్సూరెన్స్ పోర్టబిలిటీ సదుపాయం కూడా ఉంది. ఇలాంటి సందర్భాల్లో క్రితం పాలసీ ప్రయోజనాలేమీ నష్టపోనక్కర్లేదు. కవరేజీ... ఏ కంపెనీ నుంచి పాలసీ తీసుకోవాలన్నది నిర్ణయించుకున్నాక.. కవరేజీ గురించి చూసుకోవాలి. సాధారణంగా కారు ఇన్సూరెన్స్ పాలసీలో థర్డ్ పార్టీ లయబిలిటీ, ఓన్ డ్యామేజి అని రెండు కవరేజీలుంటాయి. మోటార్ వాహనాల చట్టం ప్రకారం ప్రతి వాహనానికి థర్డ్ పార్టీ లయబిలిటీ కవరేజీ తప్పనిసరి. ఓన్ డ్యామేజి అన్నది ఐచ్ఛికం. కానీ, ఈ రెండు కవరేజీలు ఉండేలా తీసుకుంటే అటు థర్డ్ పార్టీ రిస్కులతో పాటు ప్రమాదవశాత్తు కారుకేమైనా జరిగినా బీమా రక్షణ ఉంటుంది. కారు ప్రమాదానికి గురైనా, మంటలు.. తుపాను, భూకంపం వంటి ప్రకృతి వైపరీత్యాల్లోనూ, ఉగ్రవాద దుశ్చేష్టల్లో ధ్వంసమైనా బీమా రక్షణ లభిస్తుంది. ఇక, కారు ఢీకొనడం వల్ల వేరొకరు గాయపడినా, మరణించినా థర్డ్ పార్టీ లయబిలిటీ కింద కవరేజీ లభిస్తుంది. ప్రస్తుతం పాలసీల్లో పలు యాడ్-ఆన్ ఫీచర్లు కూడా వస్తున్నాయి. క్లెయిమ్ కారణంగా కారు రిపేర్ల కోసం గ్యారేజిలో ఉన్నంత కాలం పాలసీదారు రోజువారీ ప్రయాణ ఖర్చులను కూడా చెల్లించేలా యాడ్ ఆన్ కవరేజీ తీసుకోవచ్చు. ఇలాగే, నిల్ డెప్రిసియేషన్, నో క్లెయిమ్ బోనస్ ప్రొటెక్ట్ లాంటి యాడ్ ఆన్ కవరేజీలు కూడా ఉన్నాయి. అవసరాలకు అనుగుణమైన కవరేజీలను పాలసీదారు ఎంచుకుని తీసుకోవచ్చు. కస్టమర్ సర్వీసులు... మోటార్ ఇన్సూరెన్స్‌లో కస్టమర్ సర్వీసుల విషయానికొస్తే.. ముఖ్యంగా మూడంశాలుంటాయి. అవేంటంటే, పాలసీ జారీ చేయడం, క్లెయిమ్స్‌ని డీల్ చేయడం, ఫిర్యాదులను పరిష్కరించడం. గతంలోలా రోజుల తరబడి నిరీక్షించాల్సిన పని లేకుండా ప్రస్తుతం చాలా బీమా కంపెనీలు అప్పటికప్పుడు పాలసీలను జారీ చేస్తున్నాయి. మార్పులు, చేర్పులూ ఏమైనా చేయాల్సి వచ్చినా సత్వరమే చేస్తున్నాయి. ఇక క్లెయిమ్‌ల విషయానికొస్తే.. పలు కంపెనీలు క్యాష్‌లెస్ సెటిల్మెంట్ కోసం చాలా చోట్ల గ్యారేజీలతో ఒప్పందాలు కుదుర్చుకుంటున్నాయి. తద్వారా పాలసీదారుకు శ్రమ తగ్గుతోంది. కాబట్టి, విస్తృతంగా గ్యారేజీలతో ఒప్పందాలు ఉండటంతో పాటు క్లెయిములను వేగంగా సెటిల్ చేసే బీమా కంపెనీలను ఎంచుకోవాలి. సేవల లభ్యత.. కొన్ని సందర్భాల్లో, కొన్ని సమస్యల పరిష్కారం కోసం ఎవర్ని సంప్రదించాలో అర్థం కాని పరిస్థితి నెలకొనొచ్చు. ఇలాంటి సమస్యల్లో చిక్కుకోకుండా .. పాలసీదారు అవసరాలకు అనుగుణంగా సత్వరమే స్పందించగలిగే కంపెనీని ఎంచుకోవాలి. పలు కంపెనీలు కస్టమర్లకు ఎల్లవేళలా అందుబాటులో ఉండేలా ఇరవై నాలుగ్గంటలూ పనిచేసే కాల్ సెంటర్లను నిర్వహిస్తున్నాయి. ఆన్‌లైన్‌లోనూ సేవలు అందిస్తున్నాయి. ప్రీమియం.. పాలసీ తీసుకోవడంలో.. ఎంత ప్రీమియం చెల్లిస్తున్నామన్నది ముఖ్యమే అయినా, ఇదే ప్రామాణికం కాకూడదు. అన్నింటికన్నా తక్కువ ప్రీమియం ఉందనే కారణంతో కంపెనీని ఎంచుకోకూడదు. పై అంశాలన్నీ చూసి మరీ సంస్థను ఎంచుకోవాలి. సాధారణంగా ప్రమాదాలు ఎంత ఎక్కువ జరిగే అవకాశం ఉంటే.. ప్రీమియాలూ అంత ఎక్కువ ఉంటాయి. ప్రధానంగా కారు మోడల్, దాన్ని ఉపయోగించే ప్రాంతాన్ని బట్టి ప్రీమియం రేటు ఆధారపడి ఉంటుంది. వీటితో పాటు కారు ఎంత పాతది, ఎందుకోసం ఉపయోగిస్తున్నారు, రోజువారీ ఎన్ని కిలోమీటర్లు తిరుగుతుంది వంటివికూడా ప్రీమియం రేటు నిర్ధారణలో పరిగణనలోకి తీసుకుంటారు.