ఆరోగ్య బీమా అందరికీ అవసరం
ఆరోగ్య పరిరక్షణలో సరైన పోషకాహారం, తగిన వ్యాయామాలది కీలక పాత్ర. అయితే జీవన లక్ష్యాలను చేరుకునే వేగంలో ఎక్కువ మంది వీటిని పట్టించుకోవడం లేదు. ఒకవేళ ఒక కుటుంబంలో ఒక వ్యక్తి ఆయా అంశాల పట్ల జాగ్రత్తలు తీసుకున్నా... కుటుంబంలోని సభ్యులు మొత్తం ఇదే జాగ్రత్తలు తీసుకోని పరిస్థితీ ఉంటుంది. ఒక్కొక్కసారి ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా... ఆరోగ్యానికి సంబంధించి అనుకోని ఇబ్బందులూ తలెత్తుతుండే విషయం మనకు తెలిసిందే. ఇప్పుడు ప్రతి చిన్న వ్యాధికీ చేయాల్సిన వ్యయం- జేబుకు ఎంత పెద్ద చిల్లు పెడుతోందో వేరే చెప్పనక్కర్లేదు. ఇలాంటి పరిస్థితుల్లో అనుకోని ఆరోగ్య వ్యయ భారాల నుంచి రక్షించుకోడానికి కుటుంబంలోని ప్రతి ఒక్కరికీ ఆరోగ్య బీమా ఎంతో అవసరం.
పలు రకాలు...
ప్రాథమిక స్థాయి నుంచి అపరిమిత ప్రయోజనాలు అందించే స్థాయి వరకూ వివిధ ఆరోగ్య బీమా ప్రొడక్టులు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. ఆసుపత్రిలో చేరడానికి ముందు-తరువాత వ్యయాలు, పాలసీ తీసుకునే నాటికే ఉన్న వ్యాధికి సంబంధించి తదుపరి కవర్‌కు వేచి ఉండాల్సిన కాలపరిమతి, పాలసీ కాలంలో ఎటువంటి క్లెయిమ్‌లూ చేయకపోతే, తదుపరి లభించే బోనస్‌లు (నో క్లెయిమ్ బోనస్) ఇలా పలు ప్రయోజనాలు ‘బేసిక్ హెల్త్ కవర్’ పాలసీల్లోనే అందుబాటులో ఉన్నాయి. వీటితోపాటే కొంత అదనపు ప్రీమియం చెల్లింపుల ద్వారా ‘క్రిటికల్ ఇల్‌నెస్ ప్లాన్’ను రైడర్‌గా ఎంచుకోవడం వల్ల అదనపు ప్రయోజనాలు లభిస్తాయి. రైడర్‌గా కాకుండా ‘క్రిటికల్ ఇల్‌నెస్ ప్లాన్’ను ప్రత్యేకంగా కూడా తీసుకోవచ్చు.
కేన్సర్, గుండెపోటు, కిడ్నీ వైఫల్యం, ఇతర ప్రధాన అవయవాలు పనిచేయకపోవడం వంటి తీవ్ర వ్యాధుల చికిత్సలకు వ్యయ భారం నుంచి సామాన్యుడికి ఆర్థిక రక్షణ, భరోసాను కల్పించేదే ఈ క్రిటికల్ ఇల్‌నెస్ ప్రణాళిక. నిర్దిష్ట వ్యాధి అవసరానికి తగిన ఆరోగ్య పాలసీలు (కస్టమైజ్డ్) అందుబాటులో ఉండవన్న విషయం ఇక్కడ గమనించాలి. నిర్దిష్ట జాబితాలో ఉన్న వ్యాధులకు ‘పాలసీ కవర్’నే మనం ఎంపికచేసుకోవాల్సి ఉంటుంది. పూర్తి వ్యయాలను బీమా సంస్థలే భరించే పాలసీలు కొన్ని ఉంటే, వ్యయం మొత్తంలో కొంత మొత్తం పాలసీదారు, మరికొంత బీమా సంస్థ భరించే ప్రొడక్టులూ ఉంటాయి. కొన్ని పాలసీల ప్రీమియం అంశాల్లో పన్ను ప్రయోజనాలతో పాటు, వయస్సును బట్టి ప్రీమియం సౌలభ్యతలు సైతం లభిస్తాయి.
ఎంపిక కీలకం
తగిన ఆరోగ్య బీమా ప్రొడక్ట్‌ను ఎంపిక చేసుకోవడం ముఖ్యమైన అంశం. కవరేజ్ ఎంత? తీసుకున్న కవరేజ్‌లో హాస్పిటల్ వ్యయాలకు లభించేది ఎంత? ఫీజులు, మందులకు లభించే ప్రయోజనం,ఆపరేషన్ కవరేజ్,నో క్లెయిమ్ బోనస్ అం శాలను ముందు పరిశీలించాలి. తక్కువ ప్రీమియం, అధిక బీమా కవరేజ్ ఉన్న పాలసీ ఎంచుకోవాలి.