హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: గడువు ముగిసిన వాహన బీమాలను పునరుద్దరించాలంటే వ్యయ ప్రయాసలు తప్పవు. వ్యక్తిగత పరీక్షలు, తనిఖీ ఇతరత్రా వాటికి 5–7 రోజుల సమయం పడుతుండటంతో చాలా మంది కస్టమర్లు వెనకాడుతున్నారు. దీనికి పరిష్కారం చూపించేందుకు పాలసీ బజార్ ‘సెల్ఫ్ ఇన్స్‌పెక్షన్’ యాప్‌ను తెచ్చింది.
ఇదేంటంటే.. స్వయంగా పాలసీదారే బీమాను పునరుద్ధరించుకోవచ్చు. యాప్ ద్వారా పాలసీ చేయాల్సిన వాహనాన్ని వీడియో తీసి, కావాల్సిన పత్రాలను జత చేసి అప్‌లోడ్ చేస్తే చాలు.. జస్ట్ 2 గంటల్లో పాలసీ చేతికొచ్చేస్తుంది. ప్రస్తుతం ఈ యాప్ సేవల కోసం ఓరియంటల్, జనరల్, బజాజ్, టాటా, రాయల్ సుందరం వంటి 12 బీమా కంపెనీలతో ఒప్పందం చేసుకున్నామని పాలసీ బజార్ మోటార్ ఇన్సూరెన్స్ హెడ్ సజ్జ ప్రవీణ్ చౌదరి తెలిపారు.
రూ.1,100 కోట్లకు ఆన్‌లైన్ ప్రీమియంలు..
దేశంలో 2017–18 ఆర్థిక సంవత్సరంలో 12 కోట్ల ప్రైవేట్ కారు పాలసీలు తీసుకున్నారు. వీటి ప్రీమియం రూ.18 వేల కోట్లు. ఇందులో ఆన్‌లైన్ వాటా 12 లక్షలు. వీటి ప్రీమియం రూ.1,100 కోట్లుగా ఉంటుందని ప్రవీణ్ తెలిపారు. మొత్తం ఆన్‌లైన్ వ్యాపారంలో పాలసీ బజార్ వాటా 50 శాతంగా ఉంటుందని పేర్కొన్నారు.
‘‘మా మొత్తం వ్యాపారంలో దక్షిణాది వాటా 19.5 శాతం. తెలంగాణ వాటా 3.2 శాతం, ఆంధ్రప్రదేశ్ వాటా 1.2 శాతం ఉన్నాయి. తెలంగాణలో ఏటా 40 వేల పాలసీలు తీసుకుంటారు. ఏపీలో 15 వేలు తీసుకుంటున్నారు’’ అని చెప్పారాయన.
దక్షిణాదిలో ఆఫీస్..: ప్రస్తుతం పాలసీ బజార్‌కు గుర్గావ్‌లో కార్యాలయం ఉంది. ఇందులో 4 వేల మంది పనిచేస్తున్నారు. ‘‘ఈ ఏడాది దక్షిణాదిలోని ఒక రాష్ట్రంలో కార్యాలయాన్ని ఏర్పాటు చేయనున్నాం. ఎక్కడనేది ఇంకా ఖరారు కాలేదు. తెలుగుతో పాటు తమిళం, కర్ణాటక భాషలకు సేవలందించే ప్రాంతాన్ని ఎంచుకుంటాం. తొలి దశలో 400 మంది ఉద్యోగులను నియమించుకోనున్నాం. ఏడాదిలో ఈ సంఖ్యను 2 వేలకు చేరుస్తాం’’ అని చెప్పారాయన.
Comments
Please login to add a commentAdd a comment