ఆదుకోని ‘ఆపద్బంధు’ | Apathbandhu scheme can not help for poor families | Sakshi
Sakshi News home page

ఆదుకోని ‘ఆపద్బంధు’

Published Tue, Nov 4 2014 3:01 PM | Last Updated on Sat, Sep 2 2017 3:51 PM

Apathbandhu scheme can not help for poor families

అర్హులకు మొండి చెయ్యి
మండలాల నుంచి అలస్యంగా రిపోర్టులు
కాలపరిమితి ముగియడంతో అందని సహాయం
నిధుల కోసం దరఖాస్తుదారుల నిరీక్షణ
జిల్లాకు ఈ ఏడాది నిధులు వచ్చేనా..?

 
ఖమ్మం జెడ్పీసెంటర్: నిరుపేద కుటుంబాలకు ఆపన్నహస్తం అందించాల్సిన ఆపద్బందు పథకం అందకుండా పోతోంది. ప్రమాదవశాత్తు వ్యక్తి మరణిస్తే ప్రభుత్వం బీమా కంపెనీ సహాయంతో ఆ వ్యక్తి కుటుంబానికి లబ్ధి చేకూర్చాలి. అయితే లేనిపోని నిబంధనల పేరుతో పలు దరఖాస్తులను అధికారులు తిరస్కరిస్తున్నారు. దీనికి తోడు ఇన్సూరెన్స్ కంపెనీలు సవాలక్ష తిరకాసులు పెట్టడం, మండల కార్యాలయాల నుంచి అందాల్సిన నివేదికలు సకాలంలో అందకపోవడంతో లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రమాదవశాత్తు మరణించిన కుటుంబాలను ఆదుకునేందుకు 1998లో రాష్ట్ర ప్రభుత్వం ఆపద్బంధు పథకాన్ని అట్టహాసంగా ప్రారంభించింది.
 
 అయితే ఈ పథకం ప్రారంభం నుంచీ అనేక మంది అర్హులకు అన్యాయం జరిగిందనే చెప్పాలి. ప్రభుత్వ కార్యాలయాల చుట్టు కాళ్లరిగే లా తిరిగినా ఎలాంటి ఫలతం లేకుండా పోయింది. 2012-2013 సంవత్సరానికి సంబంధించి  ఇప్పటి వరకు ఇంకా 22 మంది అర్హులకు సహాయం అందాల్సి ఉంది. ఇన్సూరెన్స్ కంపెనీ లావాదేవీల్లో భాగంగా ఇప్పటి వరకు ఆ నిధులు అందలేదని సమాచారం. ఇటీవల కాలంలో ప్రభుత్వం బీమా కంపెనీతో సంబంధం లేకుండా జిల్లాకు 200 మంది లబ్ధిదారులకు కలెక్టర్ నేరుగా ఈ సహాయం అందించేలా వెసులుబాటు కల్పించింది. 2013 -14కు సంబంధించి ఇప్పటి వరకు 55 మందికిపైగా అర్హులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అయినా ప్రభుత్వం నేటికీ నిధులు విడుదల చేయకపోవడంతో లబ్ధిదారులు కలెక్టరేట్ చుట్టూ ప్రదక్షణలు చేస్తున్నారు.
 
 కదలని ఫైళ్లు...
 పేద కుటుంబాలను ఆర్థికంగా ఆదుకునేందుకు ప్రవేశపెట్టిన ఈ పథకం నిర్లక్ష్యానికి గురవుతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. వివిధ కారణాలతో మరణించిన వ్యక్తులకు సంబంధించి ఎంక్వయిరీ రిపోర్టులు అందించడంలో మండలాధికారులు అలసత్వం వహించడంతో అర్హులకు అన్యాయం జరుగుతోంది. మండలాధికారులు విచారణ జరిపి ఆ నివేదికను రెవెన్యూ డివిజనల్ అధికారికి పంపుతారు. అక్కడ నుంచి కలెక్టరేట్‌కు పంపిస్తారు. మండలాలు, డివిజన్ కార్యాలయాల్లో నెలల తరబడి ఫైళ్లు కదలకపోవడంతో చివరికి అనర్హులుగా మిగలాల్సి వస్తోంది.
 
  పేదలకు రాజకీయ నాయకుల అండ లేకపోవడం, పలుకుబడి గల వారికే ఈ పథకం అందడం, కాసులు సమర్పించనిదే కార్యాలయాల్లో ఫైలు కదలకపోవడంతో అర్హులైన వారికి అన్యాయం జరుగుతోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రోజుల తరబడి కార్యాలయాల చుట్టూ తిరిగినా ఫలితం లేకపోవడంతో సామాన్య ప్రజలు మధ్య దళారులను ఆశ్రయిస్తున్నారు. దీంతో పథకం ఉద్దేశం పక్కదారి పడుతోంది. ప్రభుత్వం నియమ నిబంధనలతో అర్హులందరికీ అందకపోగా, ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ రోజులతరబడి తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. పేదలకు సంబంధించి 16 నుంచి 69 సంవత్సరాల వయస్సు గల వ్యక్తి మరణిస్తే ఆ వ్యక్తిపై ఆధారపడే కుటుంబ సభ్యులకు ఈ పథకం వర్తిస్తుంది. ఈ పథకం ద్వారా మరణించిన వ్యక్తి కుటుంబానికి రూ.50 వేలు ఆర్థిక సహాయం ప్రభుత్వం అందించాలి.
 
 వీరు అర్హులు ..
 ప్రమాదవశాత్తు మరణించినా, వరదల్లో కొట్టుకుపోయినా, పిడుగుపాటుకు గురై మృతి చెందినా, చెట్టు, బిల్డింగ్ పైనుంచి పడి మృతిచెందినా, నక్సలైట్ల చేతిలో మరణించినా, అగ్నిప్రమాదంలో మృతి చెందినా, పాముకాటు, కరెంట్‌షాక్‌తో మృతి చెందినా వారి కుటుంబసభ్యులకు ఈ పథకం ద్వారా ఆర్థిక సహాయం అందించాలి.
 
 కావాల్సిన సర్టిఫికెట్లు...
 ఈ పథకం వర్తించాలంటే దరఖాస్తుతో పాటు తెల్లరేషన్ కార్డు, డెత్ సర్టిఫికెట్, ఎఫ్‌ఐఆర్ కాపీ, పంచనామా రిపోర్టు సమర్పించాల్సి ఉంటుంది. మొదట ఐదు రకాల సర్టిఫికెట్లను 4 సెట్ల జిరాక్స్ కాపీలతోపాటు ఆపద్బంధు దరఖాస్తు పూర్తి చేసి తహశీల్దార్ కార్యాలయంలో అందజేయాలి. అక్కడి నుంచి ఆర్‌డీఓ కార్యాలయానికి పంపిస్తారు. ఆ తర్వాత కలెక్టరేట్‌కు చేరుతుంది.
 
 ఈ ఏడాది నిధులు వచ్చేనా...
 ప్రభుత్వం ప్రతి ఏటా అక్టోబర్ నుంచి ఏడాదిపాటు ఇన్సూరెన్స్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుంటుంది. కానీ ఈ ఏడాది అర్హులకు ప్రభుత్వం నేరుగా స హాయం అందించేలా చర్యలు చేపట్టినట్లు తెలిసింది. ఏడాదికి జిల్లాలో 200 మందికి మాత్రమే ఈ పథకం వర్తింపజేయాలని, అందుకోసం జిల్లాకు రూ.కోటి విడుదల చేస్తామని ప్రభుత్వం పేర్కొంది. ఇటీవల జిల్లాకు రూ.20 లక్షలు విడుదల చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. అయితే అవికూడా ఇప్పటి వరకు జిల్లాకు అందలేదు. ఇలా అయితే తమ పరిస్థితి ఏంటని అర్హులైన పేదలు ఆందోళన చెందుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement