ధీమా ఇవ్వని బీమా | insurance not compensate on damaged crops | Sakshi
Sakshi News home page

ధీమా ఇవ్వని బీమా

Published Wed, Jul 16 2014 3:27 AM | Last Updated on Mon, Oct 1 2018 2:03 PM

insurance not compensate on damaged crops

 సత్తుపల్లి : ప్రకృతి వైపరీత్యాలతో పంటలు దెబ్బతింటే రైతులు నష్టపోకుండా ఉండేందుకు బ్యాంకర్లు ‘ పంటల బీమా- రైతుకు ధీమా’ నినాదంతో కొంత మొత్తాన్ని ఇన్సూరెన్స్ కింద వసూలు చేశారు. అయితే పరిహారం ఇవ్వడం మాత్రం మరిచారు. దీంతో దిక్కుతోచని రైతులు తమ పరిస్థితి ఏంటని ఆందోళన చెందుతున్నారు.

 గతేడాది ఖరీఫ్‌లో జిల్లాలో మూడు లక్షల ఎకరాలలో వరిసాగు చేశారు. ఇందులో సుమారు 30 వేల ఎకరాలలో
బెరుకులు(తాలు) వచ్చి అన్నదాత కుదేలయ్యాడు. పంట నష్టం వాటిల్లిన ఆ పొలాలను అప్పటి మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వ్యవసాయశాఖ శాస్త్రవేత్తలు, జిల్లా అధికారులు పరిశీలించారు. పంటల బీమా పథకం కింద రైతులకు నష్ట పరిహారం ఇప్పిస్తామని హామీలు గుప్పించారు. నష్టపోయిన పంట వివరాలను నమోదు చేయించుకోవాలని, రైతుల పట్ల అధికారులు సానుభూతితో వ్యవహరించాలని అధికారులకు సూచించారు.

అయితే ఏడాది కావస్తున్నా.. ఇప్పటి వరకు ఎటువంటి సహాయం అందక పోవటం పట్ల రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తుపాను, తెగుళ్ల దెబ్బకు పంటలకు నష్టం వాటిల్లితే ఇన్సూరెన్స్ ఇస్తామని ప్రకటించిన అధికారులు ఇప్పుడు తమను పట్టించుకోవడం లేదని ఆవేదన చెందుతున్నారు. రుణాలు ఇచ్చే సమయంలో రూ.100కు రూ.2.50 పైసలు ఇన్సూరెన్స్ కింద బ్యాంకర్లు  వసూలు చేశారు. వీటిని జాతీయ వ్యవసాయ పథకం కింద ఇన్సూరెన్స్‌కు పంపిస్తామని, పంటలు నష్టపోయినప్పుడు ఇన్సూరెన్స్ వర్తింస్తుందని చెప్పారు. కానీ ఏడాది గడిచినా ఎలాంటి పరిహారమూ చెల్లించకపోవడంతో దానికోసం  రైతులు ఆశగా ఎదురుచూస్తున్నారు.  

 నష్ట పరిహారం అంచనాలిలా..
 ప్రతి ఏడాది 500 ఎకరాల్లో ఎనిమిది చోట్ల రెవెన్యూ శాఖకు చెందిన సహాయ గణాంక అధికారి (ఎఎస్‌వో) పంటకోత ప్రయోగాలు చేపట్టి నమూనాలను సేకరిస్తారు. ఒక ఎకరంలో ఐదు సెంట్ల పంట కుప్పనూర్చి ఎంత దిగుబడి వచ్చిందో ఎకరంతో కలిపి లెక్కిస్తారు. 6 కేజీల పైనవస్తే పంట బాగా పండినట్లే.. లోపు వస్తే పంట దిగుబడి తగ్గినట్లుగా భావిస్తారు. ఆ నివేదికను చీఫ్ డ్రాయింగ్ అధికారి ద్వారా హైదరాబాద్‌కు పంపిస్తారు. అక్కడి నుంచి సంబంధిత ఇన్సూరెన్స్ కంపెనీలకు పంపిస్తే.. అక్కడ నుంచి నేరుగా నష్టపరిహారం రైతుల ఖాతాలో చేరుతుంది. అయితే ఇన్సూరెన్స్ చెల్లించేటప్పడు రెండేళ్ల నుంచి పంటల పరిస్థితిని పరిశీలిస్తారు. వరికి గ్రామాన్ని యూనిట్‌గా తీసుకుంటే మొక్కజొన్నకు మండలాన్ని యూనిట్‌గా తీసుకొని పంట కోత ప్రయోగాలను చేపడతారు.

 మామిడి పంటలకూ అతీగతీ లేదు..
 జిల్లాలో 48 వేల హెక్టార్లలో మామిడి తోటలు విస్తరించి ఉన్నాయి. మూడేళ్ల నుంచి వరుసగా పంటలు దెబ్బతింటున్నా.. అధికారులు తమను పట్టించుకోవటం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. పెద్ద మామిడి చెట్టుకు రూ.46, చిన్న చెట్టుకు రూ.36 చొప్పున ఇన్సూరెన్స్ వసూలు చేశారని, ఎకరాకు 40 చెట్లకు రూ.1800 చెల్లించామని వారు చెపుతున్నారు. అయితే 45 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తేనే నష్ట పరిహారం వస్తుందని, ఇది రిఫరల్ వెదర్ స్టేషన్‌లో నమోదు కావాలని, అప్పుడే కేంద్ర ప్రభుత్వం నష్ట పరిహారం అందిస్తుందని అధికారులు అంటున్నారు. ఇలా అనేక నిబంధనలు విధించి ప్రభుత్వం, బ్యాంకు అధికారులు తమకు మొండిచేయి చూపుతున్నారని రైతులు ఆరోపిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement